
విశాఖ లీగల్: ముక్కు పచ్చలారని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరూ రూ.10 వేల చొప్పున జరిమానా చెల్లించాలని విశాఖపట్నంలోని మహిళ కోర్టు కమ్ 6వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి మోకా సువర్ణరాజు గురువారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు.
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మామిదురి శైలజ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిందితులు మహమ్మద్ అమీర్ ఆలమ్, పోటేలు రంజీ, మహమ్మద్ అషరఫ్ న్యూపోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదగంట్యాడ సమీప భానోజీతోట బాపూజీ కాలనీ నివాసులు. బాధిత చిన్నారి (10) కూడా కుటుంబ సభ్యులతో కలిసి అదే ప్రాంతంలో నివసించేది. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదివేది.
2011వ సంవత్సరం నవంబర్ 28న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో బాలిక తన సోదరికి జ్వరంగా ఉండడంతో రొట్టె కొనడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇదే అదునుగా భావించిన మహమ్మద్ అమీర్ ఆలమ్, పోటేలు రంజీ, మహమ్మద్ అషరఫ్ బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా ముగ్గురూ లైంగిక దాడికి పాల్పడ్డారు.
చిన్నారి ఇంట్లో కనిపించకపోవడంతో బాలిక సోదరుడు ఆలమ్ గిర్ చుట్టుపక్కల వెతకగా సమీపంలోని పొదల వద్ద అత్యంత దయనీయ స్థితిలో కన్పించింది. వెంటనే బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి దక్షిణ ఏసీపీ పి.త్రినాథ్ కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ 26 మంది సాక్షులను విచారించింది. 11 ఏళ్లపాటు సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి గురువారం తీర్పు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment