
మానస(ఫైల్)
సాక్షి, రామారెడ్డి(ఎల్లారెడ్డి): లంచం తీసుకుంటూ ఇన్‌చార్జి తహసీల్దార్, ధరణి ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాలు.. రామారెడ్డి ఇన్‌చార్జి తహసీల్దార్ మానస, ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ద్వారా అన్నారం గ్రామానికి చెందిన రైతు బన్నం బలరాం నుంచి రూ. 4వేలు లంచం తీసుకుంటుండగా గురువారం మధ్యాహ్నం ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు నగేశ్, శ్రీనివాస్‌లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రైతు బలరాం తన పెద్దమ్మ పేరున ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చాలని రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్‌ను కలిశాడు. తన పెద్దమ్మకు ఎవరూ లేకపోవడంతో బాగోగులు తనే చూసుకునేవాడినని రెండేళ్ల క్రితం ఆమె మరణించడంతో ఆమె పేరిట ఉన్న 37 గుంటల భూమిని తన పేరు మీదకు మార్చాలని అర్జీ పెట్టుకున్నాడు. దీంతో ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ఆన్‌లైన్ ఫీజు రూ. 3వేలు, దాని తర్వాత లంచం రూపంలో రూ. 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వలేనని రైతు ఇన్‌చార్జి తహసీల్దార్ మానసను కలవగా.. రూ. 4వేలు ఇవ్వాలని ఆమె సూచించారు.
ఆ డబ్బులు కూడా ఇవ్వడం ఇష్టంలేక బలరాం నిజామాబాద్‌లోని ఏసీబీ అధికారుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం బలరాం రూ. 4వేలు లంచం డబ్బులను ధరణి ఆపరేటర్ లక్ష్మణ్‌కు ఇస్తుండగా అధికారులు రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. తదుపరి విచారణ చేస్తున్నామని ఇన్‌చార్జి తహసీల్దార్, ధరణి ఆపరేటర్‌పై చర్యలు ఉంటాయని డీఎస్పీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment