సాక్షి, ఆసిఫాబాద్: ఎన్నికల నియమావళి అమల్లో ఉండటం.. సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడం.. తదితర కారణాలతో ప్రభుత్వ శాఖల్లో పనులు నత్తనడకన జరగడంతో ఇటీవల అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) జోరు తగ్గింది. ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు కూడా లేకపోవడంతో కేసుల కోసం తడుముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి.. కొత్త సర్కారు కొలువుదీరింది. పరిపాలన మళ్లీ గాడిన పడింది. ఏసీబీ బాస్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టాక.. ఏసీబీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఏసీబీ అధికారులు మళ్లీ దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులతోపాటు సొంతంగా దాడులు చేసేందుకు అవకాశమున్న ‘ఆదాయానికి మించి ఆస్తులు’ కేసులపై ఈ విభాగం దృష్టి సారిస్తోంది.
ఎన్నికలతో విరామం..
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రెండు ఏసీబీ దాడులు జరిగాయి. రెబ్బెన మండల సర్వేయర్, చైన్‌మెన్ రూ.10 వేలు, రూ.20 వేల లంచం తీసుకొంటూ చింతలమానెపల్లి ఎస్సై ఏసీబీకి దొరికిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఏసీబీ దాడులు నమోదు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల పర్వంతో రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు తదితర కీలక శాఖల సిబ్బంది ఆ విధుల్లో మునిగిపోయారు.
పింఛన్లు, భూముల పట్టాల మంజూరు, వివిధ రకాల అనుమతుల ప్రక్రియలు మందగించాయి. ప్రజలకు సంబంధించిన ప్రభు త్వ కార్యాలయాల్లో పనులన్నీ దాదాపు స్తంభించాయి. దీని వల్ల ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా చాలా తగ్గాయని ఏసీబీ సిబ్బంది చెబుతున్నారు. ఫిర్యాదుల ఆధారంగానే ఉద్యోగులపై నిఘా పెట్టి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వీలవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, లంచాల కోసం ఎవరైనా డిమాండ్ చేసినా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు.
‘వారి’పై ప్రత్యేక దృష్టి..
ప్రస్తుతం ఫిర్యాదులు(ట్రాప్)లతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు(డీఏ) కలిగి ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ భావిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో లెక్కకు మిక్కిలిగా సంపాదించుకుంటున్న సిబ్బంది, బినామీ పేర్లతో ఆస్తులు వెనకేసుకున్న ఉద్యోగులు, ఇక్కడే ఏళ్ల తరబడి తిష్టవేసి, పాడి ఆవుల్లాంటి విభాగాల్లో పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులపై ఈ విభాగం దృష్టి సారిస్తోంది. అవినీతికి బానిసలైన అధికారుల అక్రమ ఆస్తులపై, బినామీలపై ఏసీబీ రహస్యంగా నిఘా వేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment