special force
-
రానున్న పూర్వవైభవం.. ఏసీబీ మళ్లీ దాడులకు సిద్ధం!
సాక్షి, ఆసిఫాబాద్: ఎన్నికల నియమావళి అమల్లో ఉండటం.. సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడం.. తదితర కారణాలతో ప్రభుత్వ శాఖల్లో పనులు నత్తనడకన జరగడంతో ఇటీవల అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) జోరు తగ్గింది. ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు కూడా లేకపోవడంతో కేసుల కోసం తడుముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి.. కొత్త సర్కారు కొలువుదీరింది. పరిపాలన మళ్లీ గాడిన పడింది. ఏసీబీ బాస్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టాక.. ఏసీబీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఏసీబీ అధికారులు మళ్లీ దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులతోపాటు సొంతంగా దాడులు చేసేందుకు అవకాశమున్న ‘ఆదాయానికి మించి ఆస్తులు’ కేసులపై ఈ విభాగం దృష్టి సారిస్తోంది. ఎన్నికలతో విరామం.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రెండు ఏసీబీ దాడులు జరిగాయి. రెబ్బెన మండల సర్వేయర్, చైన్‌మెన్ రూ.10 వేలు, రూ.20 వేల లంచం తీసుకొంటూ చింతలమానెపల్లి ఎస్సై ఏసీబీకి దొరికిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఏసీబీ దాడులు నమోదు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల పర్వంతో రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు తదితర కీలక శాఖల సిబ్బంది ఆ విధుల్లో మునిగిపోయారు. పింఛన్లు, భూముల పట్టాల మంజూరు, వివిధ రకాల అనుమతుల ప్రక్రియలు మందగించాయి. ప్రజలకు సంబంధించిన ప్రభు త్వ కార్యాలయాల్లో పనులన్నీ దాదాపు స్తంభించాయి. దీని వల్ల ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా చాలా తగ్గాయని ఏసీబీ సిబ్బంది చెబుతున్నారు. ఫిర్యాదుల ఆధారంగానే ఉద్యోగులపై నిఘా పెట్టి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వీలవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, లంచాల కోసం ఎవరైనా డిమాండ్ చేసినా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ‘వారి’పై ప్రత్యేక దృష్టి.. ప్రస్తుతం ఫిర్యాదులు(ట్రాప్)లతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు(డీఏ) కలిగి ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ భావిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో లెక్కకు మిక్కిలిగా సంపాదించుకుంటున్న సిబ్బంది, బినామీ పేర్లతో ఆస్తులు వెనకేసుకున్న ఉద్యోగులు, ఇక్కడే ఏళ్ల తరబడి తిష్టవేసి, పాడి ఆవుల్లాంటి విభాగాల్లో పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులపై ఈ విభాగం దృష్టి సారిస్తోంది. అవినీతికి బానిసలైన అధికారుల అక్రమ ఆస్తులపై, బినామీలపై ఏసీబీ రహస్యంగా నిఘా వేయనున్నట్లు సమాచారం. ఇవి చదవండి: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం -
పోలింగ్‌పై పోలీసుల నిఘా
సాక్షి, వేములవాడ: పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించి ప్రతీ ఓటరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, ప్రతీ గ్రామంలో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారుల సూచనల మేరకు వేములవాడ డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బృందాలు గ్రామగ్రామాన కవాతులు నిర్వహిస్తూ పోలీసులు ప్రజల రక్షణ కోసం ఉన్నారన్న సంకేతాలు అందజేస్తున్నారు. ఎవరి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలీసులు ప్రజలకు రక్షణగా ఉంటారన్న భరోసాను ఇస్తున్నారు. ప్రత్యేక పోలీసుల బలగాలతో కవాతులు నిర్వహించి ప్రజలకు మరింత ధైర్యాన్ని ఇస్తున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ప్రత్యేక బలగాల రాక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ ప్రాంతానికి ప్రత్యేక బలగాలు వచ్చేశాయి. వీరితో నిత్యం కూడళ్ల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోడ్ అమల్లో ఉండటంతో అందుకు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లోనూ తనిఖీలు నిర్వహిస్తూ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వాహనాల తనిఖీలు, బస్సులు తనిఖీలు, ముల్లెమూటల తనిఖీలు, నగదు తరలింపు అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల వేములవాడ శివారులో రూ.4 లక్షలు తరలిస్తున్న ఓ వ్యక్తిని సోదా చేసి పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు తరలించవద్దన్న ఎన్నికల సంఘం నిబంధనలను ఇక్కడి పోలీసులు పాటిస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు మరింత ముమ్మరం చేస్తున్నారు. మద్యం పట్టివేత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేరచరిత గల వ్యక్తులను పట్టుకుని తహసీల్దారు ముందు బైండోవర్ చేయడంతోపాటు ఎలాంటి చర్యలకు దిగినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన మ ద్యాన్ని పట్టుకుని సీజ్ చేస్తున్నారు. ఎన్నికల నియమావళికి లోబడి డబ్బుల తరలింపు అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న డబ్బులను సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేస్తున్నారు. 103 మందిని బైండోవర్ చేశారు. 58 లీటర్ల మద్యం పట్టుకున్నారు. 96 పోలింగ్ స్టేషన్లలో 70 నార్మల్ పోలింగ్ స్టేషన్లు, 26 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. 141 లొకేషన్లలో 255 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్, 1 స్టాటిస్టిక్స్ అసెస్మెంట్ టీం గస్తీ తిరుగుతున్నారు. -
అ'దృశ్యం' కాదిక
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడంపై మూడు కమిషనరేట్ల పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూసేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అధికారులు రాజకీయ పార్టీలు, నేతలపై డేగకన్ను వేస్తున్నారు. నోటిఫికేషన్ సైతం విడుదలై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకావడంతో ఎలాంటి ఏమరుపాటుకు తావులేకుండా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. పాతబస్తీతో పాటు కొన్ని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై నగర పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు, గొడవలు జరిగే అవకాశం ఉందని అనుమానిస్తూ పలు ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క స్పెషల్ బ్రాంచ్‌లకు చెందిన సిబ్బంది సైతం ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేసి, నివేదికలు తయారు చేస్తున్నారు. వీటన్నింటినీ బేరీజు వేసిన యంత్రాంగం పక్కా రక్షణ చర్యలకు సన్నాహాలు ప్రారంభించింది. వీటిలో భాగంగా అత్యంత సున్నిత, సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. వీటిలో పోలింగ్ పూర్తయ్యే వరకు అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ప్రతి ఘట్టమూ ‘రికార్డు’.. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) పరిజ్ఞానం కలిగిన వాహనాలను విస్తృతంగా వినియోగించాలని నిర్ణయించారు. మరోపక్క ప్రస్తుతం పోలీసు, కమ్యూనిటీల అధీనంలో ఉన్న సీసీ కెమెరాలను ఎన్నికల నిఘా కోసమూ వాడాలని పోలీసులు నిర్ణయించారు. ఈ కెమెరాలను వినియోగించి కార్యకర్తలు, అభ్యర్థుల కదలికలను గమనించడానికి సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. ఈ తతంగాలను ప్రధాన కమిషరేట్లలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లలో రికార్డు చేస్తున్నారు. ప్రచార సరళి ప్రభావంతో ట్రాఫిక్ జామ్‌లకు తావులేకుండా తీసుకోవాల్సిన చర్యలనూ నిర్ణయించారు. మూడు కమిషనరేట్లలో ఉన్న శాంతి భద్రతల, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలో డిజిటల్, వీడియో కెమెరాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు ఎన్నికల నేపథ్యంలో మరికొన్ని ప్రైవేటు కెమెరాలను అద్దెకు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. వీటిని వినియోగించి ఎన్నికల్లోని ప్రతి ఘట్టాన్నీ రికార్డు చేయాలని నిర్ణయించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచారం మెుదలుకొని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏ దశలోనూ ఉల్లంఘనలకు తావు లేకుండా, అలాంటి వాటిని పాల్పడిన వారిని గుర్తించడం, చర్యలు తీసుకోవడానికి ఆధారాలుగా వినియోగించడానికి ఈ ఫీడ్‌ను వాడనున్నారు. బూత్‌ల ‘హద్దులు’ తేలుస్తున్న ఎలక్షన్ సెల్స్.. మూడు కమిషరేట్లలో పని చేస్తున్న ప్రత్యేక ఎలక్షన్ సెల్స్‌కు ఇప్పుడు ఓ చిక్కు వచ్చిపడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని పోలింగ్ బూత్‌ల్లో బందోబస్తు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ఎలక్షన్ సెల్ కసరత్తు చేస్తోంది. వివిధ పోలీసుస్టేషన్ల పరిధుల సరిహద్దుల్లోని పోలింగ్ బూత్‌లతోనే ఇప్పుడు సమస్య వచ్చిపడింది. ఇవి ఎవరి పరిధిలోని వస్తాయనేది తేల్చనున్నారు. సమస్యాత్మక బూత్‌లు ఉన్న చోట్ల మరింత పక్కాగా వ్యవహరించనున్నారు. ఆయా ఎలక్షన్ సెల్స్ జోన్ల వారీగా పోలీసుస్టేషన్ల పరిధులు, వాటిలోని పోలింగ్ బూత్‌లను గుర్తించే పనిలో పడ్డాయి. దీనికోసం పోలీసు అధికారులను పోలీసుస్టేషన్ల సరిహద్దుల్లో ఉన్న పోలింగ్ బూత్‌లకు పంపిస్తూ అవి ఏ స్టేషన్ కిందికి వస్తాయో తేలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాతే పూర్తిస్థాయి బందోబస్తు స్కీమ్‌లు రూపొందించనున్నారు. ప్రింటింగ్‌పై ‘ముద్ర’లుండాల్సిందే.. ఈసీ నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రింటింగ్ ప్రెస్‌లపైనా దృష్టి పెట్టనున్నారు. జోన్లు, డివిజన్ల వారీగా ఆయా ప్రెస్‌ల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ సమావేశాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీల ముద్రణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దృష్టి పెట్టాల్సిన అంశాలను వారికి వివరించనున్నారు. ముద్రించే ప్రతిదానిపైనా ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ పేరు, ఏ పార్టీ/అభ్యర్థి కోసం ముద్రిస్తున్నారో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తప్పక ముద్రించాలని స్పష్టం చేయనున్నారు. ప్రతి ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఓ రికార్డు ఏర్పాటు చేసి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని స్పష్టం చేయనున్నారు. వీటిని ఉల్లంఘించే ప్రింటింగ్ ప్రెస్ యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
అనంతలో అద్భుతమైన నిఘా వ్యవస్థ
అనంతపురం సెంట్రల్ : నేరాల నియంత్రణకు అనంతపురంలో అద్భుతమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎస్.వి. రాజశేఖరబాబు తెలిపారు. మంగళవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్లో ఈ – సర్వెయిలెన్స్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలో విజయవాడ తరువాత అత్యాధునిక టెక్నాలజీని అనంత పోలీసులు వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ నగరంలో దాదాపు 200 పైచిలుకు సీసీ కెమెరాల ద్వారా నిఘా పటిష్టం చేస్తున్నట్లు వివరించారు. వీటి వినియోగం వలన నగరంలో నేరాలను పూర్తిగా తగ్గిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేరం చేసిన వ్యక్తి ఎక్కడో ఒక చోట సీసీ కెమారాకు చిక్కాల్సిందేనని వివరించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో రాంగ్పార్కింగ్చేసినా, రాంగ్రూట్లో ప్రయాణించినా, పరిమితికి మించి వాహనాలు నడిపినా నేరుగా వారి ఇళ్లకే జరిమానాలు పంపుతున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారానే ఇది సాధ్యమవుతోందన్నారు. రాబోయే కాలంలో టెక్నాలజీని వినియోగించి నేరాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ముఖ్యంగా ఇళ్లల్లో దొంగతనాలు అరికట్టేందుకు ప్రత్యేక యాప్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు నగరంలో లాడ్జీల్లోకి ఎవరు వస్తున్నది, ఎవరు వెళుతున్నది ఈ సర్వే లెన్స్ ద్వారా నిఘా పెట్టేలా త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో వన్‌టౌన్ సీఐ రాఘవన్ కృషి అభినందనీయమన్నారు. సీసీ కెమెరాలు, ఎల్ఈడీ టీవీలు విరాళంగా ఇచ్చిన దాతలను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ మల్లికార్జున, సీసీఎస్ డీఎస్పీ నాగసుబ్బన్న, సీఐలు శివనారాయణస్వామి, శుభకుమార్, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు.