అనంతలో అద్భుతమైన నిఘా వ్యవస్థ
అనంతపురం సెంట్రల్ : నేరాల నియంత్రణకు అనంతపురంలో అద్భుతమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎస్.వి. రాజశేఖరబాబు తెలిపారు. మంగళవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్‌లో ఈ – సర్వెయిలెన్స్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలో విజయవాడ తరువాత అత్యాధునిక టెక్నాలజీని అనంత పోలీసులు వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ నగరంలో దాదాపు 200 పైచిలుకు సీసీ కెమెరాల ద్వారా నిఘా పటిష్టం చేస్తున్నట్లు వివరించారు. వీటి వినియోగం వలన నగరంలో నేరాలను పూర్తిగా తగ్గిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేరం చేసిన వ్యక్తి ఎక్కడో ఒక చోట సీసీ కెమారాకు చిక్కాల్సిందేనని వివరించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు తెలిపారు.
నగరంలో రాంగ్‌పార్కింగ్‌చేసినా, రాంగ్‌రూట్లో ప్రయాణించినా, పరిమితికి మించి వాహనాలు నడిపినా నేరుగా వారి ఇళ్లకే జరిమానాలు పంపుతున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారానే ఇది సాధ్యమవుతోందన్నారు. రాబోయే కాలంలో టెక్నాలజీని వినియోగించి నేరాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ముఖ్యంగా ఇళ్లల్లో దొంగతనాలు అరికట్టేందుకు ప్రత్యేక యాప్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు నగరంలో లాడ్జీల్లోకి ఎవరు వస్తున్నది, ఎవరు వెళుతున్నది ఈ సర్వే లెన్స్ ద్వారా నిఘా పెట్టేలా త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో వన్‌టౌన్ సీఐ రాఘవన్ కృషి అభినందనీయమన్నారు. సీసీ కెమెరాలు, ఎల్‌ఈడీ టీవీలు విరాళంగా ఇచ్చిన దాతలను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ మల్లికార్జున, సీసీఎస్ డీఎస్పీ నాగసుబ్బన్న, సీఐలు శివనారాయణస్వామి, శుభకుమార్, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.