ఈ జరిమానా తప్పించుకోలేరు!
– సీసీ పుటేజీల ద్వారా ట్రాఫిక్ రూల్స్ పరిశీలన
– రూల్స్ అతిక్రమిస్తే నేరుగా ఇంటి వద్దకే నోటీసులు
– జరిమానా వసూళ్లకు కొత్త మార్గం
అనంతపురం సెంట్రల్ : ముంబాయి, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు తదితర మహానగరాలకే పరిమితమైన ఈ – జరిమానా త్వరలో అనంతపురంలోనూ అమలు చేయనున్నారు. ఇకపై నగరంలో ట్రాఫిక్ రూల్స్‌కు వ్యతిరేకంగా వాహనాలు నడిపే వారి ఇళ్లకు నేరుగా జరిమానా చెల్లించాలంటూ నోటీసులు పంపనున్నట్లు జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు.
జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు లేరని ఇష్టానుసారంగా వాహనాలపై దూసుకెళ్లడం, త్రిబుల్ రైడింగ్, సీట్ బెల్టు లేకుండా కార్లు, జీపులు నడపడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రయ్‌మంటూ దూసుకెళ్లడం చేసేవారిపై పోలీసులు దృష్టి సారించారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు నగరంలో ఏర్పాటు చేసిన 150 సీసీ కెమెరాల ఫుటేజీలను ఉపయోగించనున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారు ఎంతటివారైనా... సీసీ ఫుటేజీల్లో పట్టుపడితే వారు నడుపుతున్న వాహనం యొక్క నంబర్ ఆధారంగా ఈ జరిమానా చలానాను వాహన యజమాని ఇంటికి పంపుతారు. చలానా అందుకున్న వారం లోపు అపరాధ రుసుంను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే తదుపరి చర్యలన్నీ యాంత్రికంగా జరిగిపోయి, వాహనదారు ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది.