ఎన్‌ఎంసీని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రాస్తారోకోలో పాల్గొన్న వైద్యులు
న్యూఢిల్లీ: వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైద్య విద్యకు సంబంధించి అతిపెద్ద సంస్కరణగా ప్రభుత్వం అభివర్ణిస్తున్న ఈ బిల్లులో.. అవినీతికి ఆలవాలంగా మారిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పొందుపర్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు. ఈ బిల్లును ‘ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956’కు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు.
అన్నాడీఎంకే వాకౌట్ చేయగా మూజువాణి ఓటుతో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభలో ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. తాజాగా రెండు సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ బిల్లు లోక్‌సభకు వెళ్లనుంది. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.. ‘నకిలీ వైద్యులకు అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లు ఉంది. తప్పుడు వైద్య విధానాలకు పాల్పడేవారికి సంవత్సరం జైలుశిక్షతో పాటు, రూ. 5 లక్షల జరిమానా విధించే ప్రతిపాదన బిల్లులో ఉంది.
ఇప్పటివరకు అలాంటివారికి ఎంసీఐ నామమాత్రపు జరిమానా మాత్రమే విధించేది’ అని తెలిపారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చిన మూడేళ్లలో నెక్ట్స్(నేషనల్ ఎగ్జిట్ టెస్ట్)ను నిర్వహించడం ప్రారంభిస్తామన్నారు. ఎన్‌ఎంసీలో రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం లేదన్న ఎంపీల విమర్శలపై స్పందిస్తూ.. మొత్తం 25 మంది సభ్యుల్లో 11 మంది రాష్ట్రాల ప్రతినిధులేనన్నారు. నెక్ట్స్గ్ పరీక్షను మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షగా, అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసినవారికి స్క్రీనింగ్ పరీక్షగా పరిగణిస్తామన్నారు.
కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ల(సీహెచ్‌పీ) వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిందని, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆ వ్యవస్థను అమలు చేస్తున్నాయని, భారత్ కూడా ఆ దిశగా వెళ్తోందని చెప్పారు. ఎన్‌ఎంసీలోని 25 మంది సభ్యుల్లో 21 మంది వైద్యులేనని, వారు సీహెచ్‌పీల అర్హతలను నిర్ణయిస్తారని హర్షవర్ధన్ వివరించారు. బిల్లును స్థాయీసంఘానికి పంపాలని తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. వైద్య విద్య అభ్యసించని 3.5 లక్షలమంది నాన్ మెడికల్ సిబ్బందికి ఆధునిక వైద్యం అందించే వైద్యులుగా లైసెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ వ్యతిరేకించారు.
బిల్లులోని ముఖ్యాంశాలు
► ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎంసీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. వందమందికిపైగా సభ్యులు ఉండే ఇందులో 70 శాతం మందిని ఎన్నుకుంటారు. ఇక కొత్తగా వచ్చిన ఎన్‌ఎంసీలో 25 మందే సభ్యులుగా ఉంటారు. వారిలో అత్యధికుల్ని కేంద్రమే నామినేట్ చేస్తుంది.
► కేంద్రం నియమించిన ఏడుగురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఎన్‌ఎంసీ చైర్ పర్సన్ పేరుని, తాత్కాలిక సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది.
► కొత్త కమిషన్‌లో 8 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో నలుగురు వైద్య విద్యకు సంబంధించిన వివిధ బోర్డుల అధ్యక్షులు ఉంటారు. మరో ముగ్గురిని ఆరోగ్యం, ఫా ర్మా, హెచ్‌ఆర్‌డీ శాఖలే సిఫారసు చేస్తాయి.
► ఎంసీఐ సమావేశం కావాలంటే వందమందికిపైగా ఉన్న సభ్యుల్లో 15 మంది హాజరైతే సరిపోయేది. వారు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేవి. జాతీయ వైద్య కమిషన్‌కు సంబంధించి 25 మందిలో 13 మంది హాజరైతేనే కీలక నిర్ణయాలు తీసుకోగలరు.
► ఎన్‌ఎంసీ సభ్యులందరూ విధిగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాలి.
► ఎంసీఐ కాలపరిమితి అయిదేళ్లయితే ఎన్‌ఎంసీ కాలపరిమితి నాలుగేళ్లు. తాత్కాలిక సభ్యులు రెండేళ్లకి ఒకసారి మారతారు.
► కమిషన్ చైర్మన్‌ను, అందులో సభ్యుల్ని తొలగించే అధికారం పూర్తిగా కేంద్రానిదే.
► ఎంబీబీఎస్, మెడికల్ పీజీకి సంబంధించి అన్ని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిట్లీ 50 శాతం సీట్లలో ఫీజుల నియంత్రణ కమిషన్ చేతుల్లోనే ఉంటుంది.
► వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి, మెడికల్ ప్రాక్టీస్ అనుమతికి సంబంధించి ఎంబీబీఎస్ చివరి ఏడాది నిర్వహించే పరీక్షనే అర్హతగా పరిగణిస్తారు. దీనిని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) పేరుతో నిర్వహిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు భారత్‌లో ప్రాక్టీస్ చేయాలంటే స్క్రీనింగ్ టెస్ట్‌కి హాజరుకావాలి. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వైద్యవిద్యనభ్యసించాలంటే ఇకపై నీట్‌తో పాటు గా నెక్ట్స్ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది.
► దేశంలోని హోమియో, యునాని, ఆయుర్వేదం కోర్సులు చదివిన వారు కూడా ఒక బ్రిడ్జ్ కోర్సు ద్వారా అల్లోపతి వైద్యాన్ని చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment