రోగులపై ప్రత్యక్ష ప్రయోగాలొద్దు | NMC Releases Guidelines For Post Graduate Training Programs | Sakshi
Sakshi News home page

రోగులపై ప్రత్యక్ష ప్రయోగాలొద్దు

Published Sat, Jun 25 2022 11:17 AM | Last Updated on Sat, Jun 25 2022 11:21 AM

NMC Releases Guidelines For Post Graduate Training Programs - Sakshi

పీజీ వైద్య విద్యలో జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మరిన్ని సంస్కరణలను తీసుకొచ్చింది. 23 సంవత్సరాల తర్వాత పీజీ వైద్యవిద్యలో మార్పులకు శ్రీకారం చుట్టిన ఎన్‌ఎంసీ... 2022–23 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా తీసుకొచ్చిన విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పీజీ కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థులు పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలను నేర్చుకోవడంతోపాటు కోర్సు చివర్లో పరీక్షలు రాస్తున్నారు. దీంతో వైద్యులంతా ఒకే తరహా వైఖరికి అలవాటుపడుతున్నట్లు గుర్తించిన ఎన్‌ఎంసీ... తాజాగా ఆ విధానాలను సంస్కరించింది. పలు రకాల మార్పులు చేస్తూ సరికొత్త విధానాలను ప్రవేశపెట్టింది. కొత్తగా అమల్లో్లకి తెచ్చిన విధానంతో పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలే కాకుండా రోగితో మెలిగే తీరు, కేసులను నిర్వహించే పద్ధతులు, ప్రయోగాలు తదితరాలన్నింటా నూతన విధానాలను తీసుకొచ్చింది.    
– సాక్షి, హైదరాబాద్‌

వైద్యవిద్యలో చివరగా 1998 సంవత్సరంలో అప్పటి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో సంస్కరణలు వచ్చాయి. ఆ తర్వాత 2018లో మరిన్ని సంస్కరణలను ప్రభుత్వం తీసుకురాగా... వాటిని 2022’–23 సంవత్సరం నుంచి ఎన్‌ఎంసీ అమలు చేస్తోంది. పుస్తకాల్లోని సిలబస్‌ ఆధారంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకున్నప్పటికీ... అభ్యసన కార్యక్రమాలన్నీ నైపుణ్యంఆధారంగా చేపట్టేలా వైద్య విద్య సాగాలని ఎన్‌ఎంసీ ఆదేశించింది. ఈ మేరకు నైపుణ్య ఆధారిత పీజీ వైద్య విద్యను ప్రవేశపెట్టింది. ఆ మేరకు నిబంధనలు పొందుపరిచి అందుకు సంబంధించిన మార్గదర్శకాలను వైద్య విద్యాసంస్థలకు జారీ చేసింది.

ఇప్పటివరకు పీజీ వైద్య విద్యార్థులు పాఠ్యాంశాన్ని వినడం (థియరీ), నిపుణుల సమక్షంలో రోగులపై ప్రయోగాలు చేయడం జరిగేది. థియరీ క్లాస్‌లో విజ్ఞానాన్ని సంపాదించడం, ప్రయోగాత్మకంగా చికిత్స అందించడం, పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించడం లాంటి మూడు పద్ధతులుండేవి.

ఇకపై పీజీ వైద్య విద్యార్థి తాను చదువుతున్న స్పెషలైజేషన్‌ కోర్సుకు సంబంధించి పాఠ్యాంశాలను వినడంతోపాటు నేరుగా రోగులపై శిక్షణలో భాగంగా ప్రయోగాలు చేసే వీలు లేదు. ఎందుకంటే వైద్య విద్యార్థులు చేస్తున్న ప్రత్యక్ష ప్రయోగాలతో రోగులకు ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవి వికటించడంతో ప్రాణాలు సైతం కోల్పోతున్న ఉదాహరణలున్నాయి. ఈ క్రమంలో ఇకపై విద్యార్థులు పాఠ్యాంశాన్ని అర్థం చేసుకున్నాక మనుషులను పోలిన మోడల్స్‌ (నమూనా)పై నిర్దిష్ట పద్ధతిలో ప్రయోగాలు జరపాలి. ఉదాహరణకు గైనకాలజిస్ట్‌ నేరుగా డెలివరీ చేయకుండా గర్భిణిగా ఉన్న మహిళ రూపాన్ని పోలిన బొమ్మపై నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ డెలివరీ చేయాల్సి ఉంటుంది. 

ప్రతి మెడికల్‌ కాలేజీలో స్కిల్‌ ల్యాబ్స్‌ తప్పకుండా ఉండాలని జాతీయ మెడికల్‌ కమిషన్‌ స్పష్టం చేసింది. స్కిల్‌ ల్యాబ్‌ నిర్వహణ ఆధారంగా కాలేజీలకు ర్యాంకింగ్‌ లు సైతం ఇవ్వనున్నట్లు తాజా మార్గదర్శకాల్లో పొందుప ర్చింది. స్కిల్‌ ల్యాబ్స్‌లో వైద్య విద్యార్థులు నైపుణ్యం ఆధారిత విజ్ఞానాన్ని పెంచుకుంటారు. ఇందులో అన్ని వైద్యశాస్త్రాలకు సంబం ధించిన అన్ని నమూనాలు, ఉదాహరణలతో సహా అందుబాటులో ఉంటాయి. స్కిల్‌ ల్యాబ్స్‌ ఆధారంగానే పీజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. Ü పీజీ వైద్య విద్యా ర్థులు రోగితో ఎలా మాట్లాడాలి... వారితో ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి తదితర అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా ప్రతి మూడు నెలలకోసారి ప్రతి అంశంపైనా ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. పాఠ్యాంశ పరిజ్ఞానం, రోగితో మాట్లాడటం, ప్రయోగ పరీక్షలు చేసి చూపడంపై ఎగ్జామ్స్‌ ఉంటాయి. 

ప్రతి మూడు నెలలకోసారి ప్రతి సబ్జెక్ట్‌పై కొన్ని లక్ష్యాలను చేరుకుంటూ కోర్సును ముందుకు తీసుకెళ్లాలి.

పీజీ వైద్యవిద్యలో ప్రస్తుతం 77 సబ్జెక్టులు ఉన్నాయి. అందులో 30 ఎండీలు, 6 ఎంఎస్‌లు, 19 డిప్లొమాలు, 15 డీఎంలు, 7 ఎంసీహెచ్‌ల విభాగాలు ఉంటాయి. ప్రతి కోర్సుకు మూడు నెలలకోసారి ఏం సాధించాలో లక్ష్యాలు ఉంటాయి. 

రోగితో ఎలా వ్యవహరిస్తారన్న దానిపై ప్రతి మూడు నెలలకోసారి పరీక్ష ఉంటుంది. రోగితో ఎలా మాట్లాడాలన్న దానిపై శిక్షణ ఇస్తారు. కఠినంగా ఉంటే మార్పులు చేపట్టే అవకాశం ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement