ఎన్‌ఎంసీ తీరు మారాలి | sakshi editorial National Medical Commission | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంసీ తీరు మారాలి

Published Sat, Jun 10 2023 12:25 AM | Last Updated on Sat, Jun 10 2023 12:26 AM

sakshi editorial National Medical Commission - Sakshi

దేశంలో వైద్య విద్య పర్యవేక్షణకు నెలకొల్పిన భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) భ్రష్టుపట్టిందనీ, దాని ప్రక్షాళన అసాధ్యమనీ పదమూడేళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆ తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు చట్టమై జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఆవిర్భవించింది. 2020 సెప్టెంబర్‌ నుంచి కొత్త సంస్థ పనిచేయటం ప్రారంభమైంది.

పాత వ్యవస్థలోని లోపాలనూ, దోషాలనూ పరిహరించి కొత్త వ్యవస్థ వస్తున్నదంటే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ ఈ మూడేళ్లలో ఎన్‌ఎంసీ ఆచరణ సరిగా ఉందా లేదా అన్నదే ప్రశ్న. కొత్త చట్టం వచ్చినప్పుడూ, కొత్త వ్యవస్థలు రూపుదిద్దుకున్నప్పుడూ సంబంధిత రంగాల్లోనివారు నిశితంగా గమనిస్తారు. అవి తమ ఆశలకూ, ఆకాంక్షలకూ అనుగుణంగా ఉన్నాయో లేదో తరచి చూస్తారు. ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక వైద్య వృత్తిలో ప్రవేశించేందుకైనా, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోరడానికైనా నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌(నెక్ట్స్‌) పేరిట జరిగే ఉమ్మడి ప్రవేశపరీక్ష రాయాల్సిందేనన్న నిబంధనను బిల్లుపై పార్లమెంటు చర్చిస్తున్న సమయంలోనే వైద్యరంగ నిపుణులు, వైద్య విద్యార్థులు గట్టిగా వ్యతిరేకించారు. అలాగే ఫీజుల నిర్ణయం విషయంలోనూ ఆందోళన వ్యక్తమైంది. వారి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ అది చట్టంగా మారింది. దాని సంగతలావుంచి కొత్త వ్యవస్థ అయినా పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదా?

దేశవ్యాప్తంగా 38 వైద్య కళాశాలల గుర్తింపు రద్దు చేస్తున్నట్టు ఈమధ్యే ఎన్‌ఎంసీ ప్రకటించింది. మరో వందకు పైగా వైద్య కళాశాలల్లో అనేక లోటుపాట్లను గుర్తించి వాటిని సరిచేసుకోనట్టయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిజానికి గతంలో ఎంసీఐ సైతం ఇలాంటి తనిఖీలే చేస్తుండేది. చర్యలు తీసుకునేది. అయినా దానిపై ఎందుకు ఆరోపణలొచ్చేవో, అది ఎందుకు భ్రష్టుపట్టిపోయిందో కొత్త వ్యవస్థ సారథులు సరిగా అర్థం చేసుకున్నట్టు లేరు. వచ్చే నెలలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ ప్రవేశాలుంటాయి గనుక ఎన్‌ఎంసీ ముందుగానే వైద్య కళాశాలలను తనిఖీ చేయటం మెచ్చదగింది.

గుర్తింపు రద్దు చేసినంత మాత్రాన వెంటనే ఆ కళాశాలలకు కేటాయించిన సీట్లన్నీ రద్దుకావు. అవి సకాలంలో మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకుని, తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఎన్‌ఎంసీ పరిశీలించి అనుమతులు పునరుద్ధరిస్తుంది. అలాగే ఎన్‌ఎంసీ సంతృప్తి చెందని పక్షంలో సంబంధిత కళాశాల కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను కూడా ఆశ్రయించే వెసులుబాటుంది. వైద్య కళాశాలలపై ప్రధానంగా బోధనా సిబ్బంది కొరత విషయంలోనే ఆరోపణలొస్తున్నాయి. రెసిడెంట్‌ డాక్టర్ల సమస్య సరేసరి. ఇక ఇత రేతర మౌలిక సదుపాయాల లేమి సైతం ఎన్‌ఎంసీ కన్నెర్రకు కారణమవుతోంది. వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాల తీరుతెన్నులనూ, అక్కడి మౌలిక సదుపాయాల కల్పననూ మదింపు వేయటం చాలా అవసరం.

అయితే ఆ ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే మాత్రం ప్రయోజనం శూన్యం. వాస్త వానికి ఎన్‌ఎంసీ చట్టం–2019లోని సెక్షన్‌ 26(ఈ) ప్రకారం సంస్థకు చెందిన మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డ్‌ (మార్బ్‌) కళాశాల తీరుతెన్నులపై ఇచ్చే మదింపు, ఆ కళాశాలకిచ్చే రేటింగ్‌ అందరికీ అందుబాటులో ఉంచాలి. కానీ ఈ నెల మొదట్లో జారీ చేసిన కళాశాలల ఏర్పాటు, మదింపు, రేటింగ్‌ నిబంధనల్లోని సెక్షన్‌ 25 దీన్ని నీరుగారుస్తోంది. నిజానికి ఎన్‌ఎంసీ ఏర్పడింది మొదలు కళాశాలల మదింపు నివేదికల జాడే లేదు. సరిగదా అంతక్రితం ఎంసీఐ ఉన్నప్పుడు పొందుపరిచిన మదింపు నివేదికలు, రేటింగ్‌లు సైతం మాయమయ్యాయి. ఫలానా కళాశాలలో ఏ సదుపాయాలు లోపించాయో, దానిపై ఎందుకు చర్యలు తీసుకోవలసి వచ్చిందో, కాలక్రమంలో అది ఏయే అంశాల్లో మెరుగుపడిందో అందరికీ తెలియకపోతే ఎట్లా?

ఇక ఆ తనిఖీల వల్ల సాధారణ విద్యార్థులకు ఒరిగేదేముంటుంది? విద్యార్థులు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకునే సమయంలో ఎన్‌ఎంసీ మదింపు నివేదికలు అందుబాటులో ఉంటే, కళాశాల పూర్వ చరిత్ర తెలిస్తే వారు మెరుగైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అంతేతప్ప కేవలం అది ప్రకటించిన ఫలితాన్నీ, దాని రేటింగ్‌నూ చూసి ఎలా సరిపెట్టుకుంటారు? ఈ చిన్న విషయం ఎన్‌ఎంసీకి తెలియదా? ఇలాంటి ధోరణి అటు కళాశాలలకు సైతం నష్టం కలిగిస్తుంది. రేటింగ్‌ సరిగా లేని కళాశాలలో స్వల్ప లోటుపాట్లు మాత్రమే ఉండొచ్చు. అవి సరిచేసుకునే స్థాయిలోనే ఉండొచ్చు. కానీ ప్రత్యర్థి కళాశాలకు చెందినవారు మాత్రం ఆ లోపాలను భూతద్దంలో చూపి తప్పుడు ప్రచారానికి దిగొచ్చు. విద్యార్థులకు తగిన సమాచారం అందుబాటులో లేకపోవటంతో ఆ కళాశాలపై అనాసక్తి ప్రదర్శిస్తారు.  

ఎన్‌ఎంసీ తీరుపై కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ)కి చాన్నాళ్ల క్రితమే ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఆ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సీఐసీ మొన్న మార్చిలో ఆదేశాలు కూడా ఇచ్చింది. తీరా ఈ నెల మొదట్లో నోటిఫై చేసిన నిబంధనలు గమనిస్తే సీఐసీ ఆదేశాలు బేఖాతరైనట్టు అర్థమవుతుంది. గతంలో పనిచేసిన ఎంసీఐ అవినీతిమయం అయిందని రద్దు చేస్తే, దాని స్థానంలో వచ్చిన ఎన్‌ఎంసీ కూడా అదే బాటలో సాగుతున్నదన్న అభిప్రాయం కలిగిస్తే, పారదర్శకతకు పాతరేస్తే ఏమనాలి? ఇది సరికాదు. దేశంలోని ప్రతి వైద్య కళాశాలకు సంబంధించి ఎంసీఐ కాలంనాటి మదింపు నివేదికలు, రేటింగ్‌లతోపాటు ఎన్‌ఎంసీ గత మూడేళ్ల అంచనాలు సైతం అందరికీ అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు మెరుగైన నిర్ణయం తీసుకొనేందుకు తోడ్పడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement