అగమ్యగోచరం! ఒక్కమాటలో ఉక్రెయిన్ నుంచి భారత్ తిరిగొచ్చిన మన వైద్య విద్యార్థుల ప్రస్తుత పరిస్థితి ఇదే! రష్యా దాడితో యుద్ధంలో చిక్కిన ఉక్రెయిన్ నుంచి నాలుగు నెలల క్రితం, నానా కష్టాలు పడి స్వదేశానికి తిరిగొచ్చిన దాదాపు 20 వేల మంది భారతీయ వైద్య విద్యార్థులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రాణాలు అరచేత పట్టుకొని భారత్‌కు తిరిగొచ్చిన ఆ విద్యార్థులు అటు మళ్ళీ ఉక్రెయిన్‌కు పోలేక, ఇటు స్వదేశీ విద్యాలయాల్లో మెడికల్ కోర్సును కొనసాగించేందుకు అనుమతి రాక తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నారు. విదేశీ వైద్య సంస్థల విద్యార్థులను భారతీయ వైద్య సంస్థల్లోకి బదలీ చేసేందుకు, సర్దుబాటు చేసేందుకు 1956 నాటి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టంలో కానీ, 2019 నాటి నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంలో కానీ నిబంధనలు లేవంటూ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఇటీవల తేల్చిచెప్పడం విద్యార్థులకు అశనిపాతమే. అమూల్యమైన కాలం, చదువు నష్టపోకుండా కాపాడతామంటూ ‘ఆపరేషన్ గంగ’ ద్వారా వారిని స్వదేశానికి తెస్తున్నప్పుడు వాగ్దానం చేసిన కేంద్రం ఇప్పుడిలా చేతులు దులుపుకోవడం దారుణం.
నెలలు గడుస్తున్నప్పటికీ దేశంలో వైద్య విద్యనూ, వైద్య నిపుణులనూ నియంత్రించే ‘జాతీయ వైద్య కమిషన్’ (ఎన్‌ఎంసీ) నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లి తండ్రులు ఏమీ పాలుపోని స్థితిలో ఉన్నారు. ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఈ ఒక్కసారికి తమకు ఎలా గైనా భారత వైద్యవిద్యా సంస్థల్లో చోటిచ్చి, కోర్సు కొనసాగించే వీలు కల్పించాలని ప్రధాని మోదీని వేడుకుంటున్నారు. నిజానికి, దేశంలోని ఫిజిషియన్ల స్వచ్ఛంద సంఘమైన ‘భారతీయ వైద్య సంఘం’ (ఐఎంఏ) సైతం విద్యార్థులను భారతీయ వైద్యసంస్థల్లో సర్దుబాటు చేయాల్సిందిగా నాలుగు నెలల క్రితమే కేంద్రాన్ని అభ్యర్థించింది. ‘ఉక్రెయిన్‌లో పరిస్థితులు చక్కబడే వరకు వారిని త్రిశంకు స్వర్గంలో ఉంచడం సరికాదు’ అంటూ ప్రధానికి లేఖ కూడా రాసింది. సుప్రీమ్ కోర్ట్ సైతం ఉక్రెయిన్ నుంచి వచ్చేసిన మన విద్యార్థులు ఇక్కడి కాలేజీల్లో క్లినికల్ శిక్షణ పూర్తి చేసుకొనేలాగా రెండు నెలల్లో ఒక కార్యాచరణ పథకాన్ని తయారు చేయమంటూ ఏప్రిల్ 29న ఎన్‌ఎంసీకి ఆదేశాలి చ్చింది. కానీ, నెలలు గడిచినా ఎన్‌ఎంసీ నిర్ణయం వాయిదాలు వేస్తూ వచ్చింది. తీరా ఇప్పుడు స్టూడెంట్లకు అనుమతి నిరాకరించినట్టు ప్రభుత్వం పార్లమెంట్‌లో తాపీగా బయటపెట్టింది.
ఏ రకంగా చూసినా ఈ నిర్ణయం సమర్థనీయం కాదు. ఇప్పటికే సమస్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళేందుకు విద్యార్థుల బృందం అయిదు రోజుల నిరాహార దీక్షకూ దిగింది. అయినా పాలకుల మనసు కరగట్లేదు. అధికారిక అంచనాల ప్రకారం ఉక్రెయిన్, చైనాల్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న 40 వేల మందికి పైగా భారతీయులు యుద్ధం, కరోనాల కారణంగా ఇంటికి తిరిగొచ్చారు. రష్యా, ఫిలిప్పైన్స్, జార్జియాలను కలుపుకొంటే 60 వేల మంది దాకా ఉన్నారు. వారందరికీ ఇప్పుడిదే సమస్య. కాలం వృథా అయినా, చివరకు ఆయా కేసులను బట్టి విద్యార్థులను తిరిగి చేర్చుకోవడానికి చైనా అంగీకరించింది. ఇక, ఉక్రెయిన్ నుంచి వచ్చినవారు ఇప్పటికైతే ఆన్‌లైన్ క్లాసులు హాజరవుతున్నారు. నేరుగా హాజరై చేయాల్సినవి కాబట్టి సహజంగానే ప్రాక్టికల్స్‌పై దెబ్బపడింది. ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధానికి ఇప్పుడప్పుడే తెర పడేలా లేదు. ప్రాక్టికల్స్ లేకుండా పరిపూర్ణత అసాధ్యం గనక విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.
యుద్ధం వల్ల చదువు వదిలేసి మధ్యలో వచ్చేసిన మన వైద్య విద్యార్థులు మిగిలిన ఇంటర్న్ షిప్‌ను భారత్‌లో పూర్తి చేసుకోవచ్చంటూ ఎన్‌ఎంసీ మార్చిలో సర్క్యులర్ జారీ చేసింది. కాకపోతే విదేశీ వైద్య విద్యార్హత ఉన్న భారతీయ స్టూడెంట్స్ అందరి లాగానే వాళ్ళు కూడా తప్పకుండా స్క్రీనింగ్ పరీక్ష ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్’ (ఎఫ్‌ఎంజీఈ)లో పాస్ కావాలని షరతు పెట్టింది. అలాంటి షరతులు మరిన్ని కావాలంటే పెట్టి, మిగతా విద్యార్థులకు కూడా ఎన్‌ఎంసీ సాంత్వన కలిగించవచ్చు. కానీ, ఆ పని ఎందుకు చేయట్లేదో అర్థం కాదు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక లాంటి కొన్ని రాష్ట్రాలు మన ఉక్రెయినీ విద్యార్థలు ‘పరిశీలకుల’ లాగా స్థానిక కళాశాలలకు ఆన్ లైన్‌లో హాజరు కావచ్చని అనుమతి ఇచ్చాయి. అయితే, ప్రాక్టికల్ క్లాసులు లేని ఈ అబ్జర్వర్‌షిప్ తాత్కాలిక పరిష్కారమే. శాశ్వత పరిష్కారం కేంద్రం చేతుల్లోనే ఉంది.
సర్కారు ఇప్పటికైనా దీన్ని స్పెషల్ కేసుగా పరిగణించాలి. చట్టంలో అవకాశం లేదంటూ పిల్లల భవిష్యత్తును చీకటిలోకి నెట్టే కన్నా, మనం చేసుకున్న చట్టమే గనక వెసులుబాటిస్తూ మార్పు చేసుకో వడం విజ్ఞత. ఉక్రెయిన్ సమస్య ఒక రకంగా మేలుకొలుపు. పాలకులు ఇకనైనా కళ్ళు తెరిచి, మన వాళ్ళు వైద్యవిద్య కోసం విదేశాలకు ఎందుకు ఎగబడుతున్నారో ఆలోచించాలి. ఉక్రెయిన్‌లో రూ. 4 లక్షల్లో వైద్యవిద్య చదవచ్చనీ, జర్మనీ లాంటి ఇతర ఐరోపా దేశాలతో పోలిస్తే అక్కడ జీవనవ్యయం తక్కువనీ భావన. రోగులతో పోలిస్తే వైద్యుల సంఖ్య చాలా తక్కువున్న మన దేశంలోనూ ప్రభుత్వం ఇకనైనా తక్కువ ఫీజులతో, నాణ్యమైన వైద్యవిద్యను అందుబాటులో ఉంచాలి. మరింతమంది వైద్యుల్ని దేశంలోనే తయారు చేయాలి. అందుకు తొలి అడుగు ఇప్పుడే వేయాలి. యుద్ధంతో ఇంటిదారి పట్టి, ఇప్పటికే బోలెడంత మానసిక్ష క్షోభతో తాము చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఈ పిల్లల గోడు వినకపోతే అది మహాపాపం. వారి జీవితాలను కాపాడాల్సింది పాలకులే! ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక చర్యలు అవసరం. ప్రభుత్వానికి మనసుంటే మార్గం లేదా!
మనసుంటే మార్గం లేదా!
Published Thu, Jul 28 2022 1:02 AM | Last Updated on Thu, Jul 28 2022 1:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment