అనుకోకుండా ఎదురైన పరిణామాలతో అంతర్గతంగా ఉన్న లోపాలు బయటపడడమంటే ఇదే. ఉక్రెయిన్‌లో తలెత్తిన సంక్షోభం, మన విద్యార్థుల ఇక్కట్లు హఠాత్పరిణామాలు. కానీ, ఆ దెబ్బతో ఒక్కసారిగా మన దేశంలో వైద్య విద్యావ్యవస్థలోని లోటుపాట్లు చర్చకు వచ్చాయి. మన దేశం నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు విదేశాలకు వెళ్ళి మరీ వైద్యవిద్యను అభ్యసించాల్సిన అగత్యం ఎందుకు వస్తోందనే అంశంపై దృష్టి పడేలా చేశాయి. సరైన చదువు కోసం మన విద్యార్థులు అంతంత దూరాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలనే దానిపై చర్చను ముందుకు తెచ్చాయి. ప్రాణాలు అరచేత పట్టుకొని ఉక్రెయిన్ నుంచి బయటపడ్డ వేలాది విద్యార్థుల చదువులు కొనసాగే మార్గమేమిటో చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం మీద పెట్టాయి.
బోలెడన్ని వైద్య కళాశాలలతో ఐరోపాలో నాలుగో స్థానం ఉక్రెయిన్‌ది. 2020లో దాదాపు 158 దేశాల నుంచి 75 వేల మంది ఉక్రెయిన్‌కు చదువుకోవడానికి వెళితే, వారిలో 24 శాతం మంది మనవాళ్ళే. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఫలితంగా అక్కడ చదువుతున్న దాదాపు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఇక్కట్ల పాలయ్యారు. మన దేశంలో వైద్యవిద్య పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో తెలిసొచ్చింది. ఆ మాటకొస్తే, ప్రతి ఏటా మన దేశం నుంచి 20 నుంచి 25 వేల మంది విద్యార్థులు మెడిసిన్ చదువు కోసం విదేశాలకు వెళ్ళాల్సి వస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. మన దేశంలో డాక్టర్ చదువులు చదువుదామని కోరుకుంటున్నవారితో పోలిస్తే, కాలేజీలు, వాటిలో సీట్లు చాలా తక్కువ. ఎంబీబీఎస్ చదువుకోవాలంటే 286 ప్రభుత్వ కళాశాలలు, వాటికి దాదాపు సమానంగా 276 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 562 కాలేజీల్లో కలిపినా ఉండే సీట్లు 90 వేలు. కానీ, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో వైద్యవిద్యను అభ్యసించడానికి అర్హత కోసం ఒక్క 2021లోనే 16.1 లక్షల మంది ‘నేషనల్ ఎలిజబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్’ (నీట్)కు దరఖాస్తు చేసుకున్నారు. అంటే గిరాకీ, సరఫరాల మధ్య ఎంత అంతరముందో అర్థమవుతోంది.
ఇక, ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల మధ్య ఫీజుల్లో తేడా – హస్తిమశకాంతరం. విద్యార్థులకు అదో పెద్ద అడ్డంకి. మన ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఫీజు రూ. 67 వేల దగ్గర మొదలై 3 లక్షల దాకా ఉంటుంది. ప్రైవేట్ కాలేజీల్లో నాలుగున్నరేళ్ళ ఎంబీబీఎస్‌కి 80 లక్షల నుంచి కోటి రూపాయలు అవుతుంది. చైనా, రష్యా, ఉక్రెయిన్, బెలారుస్ లాంటి దేశాల్లో ఇవే కోర్సులు చౌకగా రూ. 20 నుంచి 40 లక్షల్లో అందుబాటులో ఉంటాయి. కొన్నిచోట్ల 25 లక్షలకే కోర్సు పూర్తయిపోతుంది. మన దగ్గరి సీట్ల కొరత, ఫీజుల మోత, అక్కడి తక్కువ ఫీజుల రీత్యా వేల మంది ఏటా విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. విదేశాలకు వెళ్ళే 25 వేల మంది భారతీయ వైద్య విద్యార్థుల్లో దాదాపు 60 శాతం చైనా, రష్యా, ఉక్రెయిన్‌లకే వెళుతున్నారు. అక్కడ చదువుకోవాలంటే, స్థానిక భాషలు నేర్చుకోవాలి. తీరా చదువుకొని ఇండియాకు తిరిగొచ్చాక, ఇక్కడ డాక్టర్‌గా ప్రాక్టీస్ చెయ్యాలంటే కఠినమైన స్క్రీనింగ్ పరీక్షలో పాసవ్వాల్సి ఉంటుంది. 18 నుంచి 20 శాతమే ఆ పరీక్షలో గట్టెక్కుతున్నారు. ఇన్ని ఇబ్బందులున్నా సరే, మనవాళ్ళు సదరు విదేశీ వైద్యవిద్యకే ఓటేస్తున్నారు.
మన దగ్గర ప్రతిభావంతులైన పిల్లలకూ సీట్లు దొరకని పరిస్థితి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో అన్యాయంగా ప్రాణం పోయిన భారతీయ వైద్య విద్యార్థి నవీన్ సైతం అత్యధిక మార్కులొచ్చినా, ఇక్కడ ప్రభుత్వ సీటు రాకనే తక్కువ డబ్బుతో చదువుకోవచ్చని అక్కడకు వెళ్ళారన్నది గమనార్హం. కొత్తగా 16 ప్రభుత్వ వైద్య కళాశాలలతో ప్రతిభావంతులకు వైద్యవిద్యను అందుబాటులోకి తీసుకు రావడానికి ఏపీ సర్కారు లాంటివి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఇలాంటివి జరిగితే తప్ప సమస్య పరిష్కారం కాదు. నిజానికి, చిన్నాచితకా దేశాలకు వెళ్ళే పని లేకుండా, ఇక్కడే వైద్యవిద్యను అభ్యసించడానికి వీలుగా క్రియాశీలక పాత్ర పోషించాలంటూ ప్రధానమంత్రి మోదీ గత వారం మన కార్పొరేట్ సంస్థలను అభ్యర్థించారు. అలాగే, వైద్యవిద్యలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేలా విధానాలు రూపొందించాల్సిందిగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మధ్యతరగతి తల్లితండ్రులు కడుపుకట్టుకొని దాచిన కష్టార్జి తంతో, ఎన్నో ఆశలు మూటగట్టుగొని ఉక్రెయిన్‌లో చదువు కోసం వెళ్ళి, మరికొద్ది నెలల్లో కోర్సు పూర్తి కావాల్సిన విద్యార్థులు తాజాగా తిరిగొచ్చిన కథలు చదువుతుంటే గుండె చెరువవుతుంది. ఎప్పటికైనా వారు మళ్ళీ అక్కడకెళ్ళి కోర్సు పూర్తి చేయగలుగుతారా? భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన అలాంటి భారతీయ విద్యార్థులకు ఇక్కడ ఏదైనా టెస్ట్ పెట్టి, లేదంటే అక్కడి క్రెడిట్స్‌ను ఇక్కడకు బదలీ చేసి మెడికల్ కోర్స్ పూర్తి చేసే అవకాశాన్ని కేంద్ర సర్కారు పరిశీలించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్య మధ్య భారీ అంతరాన్ని పూడ్చే పని తక్షణం మొదలుపెట్టాలి. జీడీపీలో 6 శాతం విద్యారంగానికి పెట్టాలని జాతీయ విద్యా విధానమే చెబుతున్నా, వర్తమాన ఆర్థిక వత్సరంలో అది 3.1 శాతమేనని ఆర్థిక సర్వే చెబుతున్న చేదు నిజాన్ని గుర్తించాలి. దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టాలి. ప్రైవేట్ కళాశాలల ఏర్పాటుకు వెసులుబాట్లు కల్పించవచ్చు. జబ్బలు చరుచుకొనే ‘ఆత్మ నిర్భర భారత్’ను విద్యారంగానికీ వర్తింపజేయాలని గ్రహించాలి. భారత్‌లోనే అంతర్జాతీయ నాణ్యతతో డాక్టర్లు తయారయ్యేలా చూడాలి. ఉక్రెయిన్ సంక్షోభం మన ఉన్నత విద్యా వ్యవస్థకు మేలుకొలుపు. ఇకనైనా పాలకులు నిద్ర లేస్తే మంచిది. కళ్ళు మూసుకొని, నిద్ర నటిస్తేనే కష్టం!
వ్యవస్థకు వైద్యం అవసరం!
Published Fri, Mar 4 2022 12:39 AM | Last Updated on Fri, Mar 4 2022 12:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment