మెరిట్ లిస్ట్ విడుదల చేసిన కాళోజీ వర్సిటీ.. రేపట్నుంచి వెబ్ ఆప్షన్లు
స్థానికతపై కోర్టుకెక్కిన 132 పిటిషనర్లకు అనుమతి.. మరో 9 మందికి ఏపీలోనూ స్థానికత ఉన్నందున తిరస్కృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ మొదలైంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థుల వివరాలతో ప్రొవిజినల్ మెరిట్ లిస్టును కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా అన్ని సాక్షా్య లతో వర్సిటీ ఈ–మెయిల్ knrugadmission@gmail.comకు పంపించాలని వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం గురువారం తుది మెరిట్ లిస్టును విడుదల చేస్తామన్నారు.
అదేరోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు.. వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. గతేడాదికి సంబంధించిన కాలేజీలవారీ సీట్ల కేటాయింపు వివరాలు వర్సిటీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయని.. వాటిని పరిశీలించి వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
జీవో 33 ప్రకారమే కౌన్సెలింగ్...
స్థానికతకు సంబంధించిన జీవో–33ని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లడం.. కోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం వల్ల ఈసారి కౌన్సెలింగ్ ఆలస్యమైంది. జీవోను సవాల్ చేసిన పిటిషనర్లలో అర్హత ఉన్న వాళ్లను కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని.. సమయం లేనందున ఈ ఒక్కసారికి జీవో–33 నుంచి పిటిషనర్లకు మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ వాదనను అంగీకరించిన కోర్టు.. జీవో 33 ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహణకు అనుమతినిస్తూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది.
తుది తీర్పును మూడు వారాలపాటు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం విడుదల చేసిన మెరిట్ జాబితాలో కోర్టుకు వెళ్లిన 132 మంది పిటిషనర్లకు కూడా చోటు కల్పించింది. మరోవైపు తెలంగాణలో దరఖాస్తు చేసుకున్న పిటిషనర్లలో మరో 9 మందికి ఏపీలోనూ స్థానికత ఉన్నట్లు తేలింది. దీంతో వారిని తెలంగాణ జాబితా నుంచి తిరస్కరించినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
కాగా, అఖిల భారత స్థాయిలో ఎస్టీ విభాగంలో టాప్ ర్యాంకు సాధించిన గుగులోత్ వెంకట నృపేష్ కాళోజి వర్సిటీ విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఎల్లు శ్రీశాంత్‌రెడ్డి, మూడో స్థానంలో మహమ్మద్ ఆజాద్ సాద్, నాలుగో స్థానంలో లావుడ్య శ్రీరాం నాయక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment