ప్రైవేట్‌ వైద్య‘మిథ్య’ | No faculty and No facilities in private medical colleges | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ వైద్య‘మిథ్య’

Published Thu, Sep 26 2024 1:23 AM | Last Updated on Thu, Sep 26 2024 1:25 AM

No faculty and No facilities in private medical colleges

అధ్యాపకులు లేరు.. సదుపాయాల్లేవు!

ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో సీట్ల సంఖ్యకు అనుగుణంగా లేని ఫ్యాకల్టీ, సిబ్బంది 

కొన్ని కాలేజీలు సగం మంది బోధనా సిబ్బందితోనే నడిపిస్తున్న వైనం 

విద్యార్థులకు సదుపాయాల కల్పనలోనూ నిర్లక్ష్యం

ఫలితంగా రాణించని విద్యార్థులు  

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ తనిఖీల్లో బయటపడిన వాస్తవాలు

తనిఖీల్లో ఏం తేలింది..? 
పలు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 50% వరకు అధ్యాపకులు లేరు. ఓ కాలేజీలో 50.47%, మరో కాలేజీలో 59.3% మేరకు కొరత ఉంది. ఒక కాలేజీలో రెసిడెంట్లు, ట్యూటర్ల కొరత 66.31% వరకు ఉంది. 150 మంది విద్యార్థులుండే కాలేజీ అనుబంధ ఆసు పత్రిలో రోజూ 1,200 మంది ఓపీ ఉండాలి. ఒక చోట 849, మరో చోట 650 మందే వస్తున్నారు. ఓ కాలేజీ ఆసుపత్రిలో 650కి 542 పడకలే ఉన్నాయి. రెండు కాలేజీల ఆసుపత్రుల్లో బెడ్‌ ఆక్యుపెన్సీ 9.38%, 11.97% చొప్పునే ఉంది. పలుచోట్ల లెక్చర్‌ హాళ్లు, పరీక్షా కేంద్రాలు సరిపడా లేవు. ఒకే ప్రొఫెసర్‌ను రెండు కాలేజీల్లో చూపించారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని కళాశాలల్లో ఉండాల్సిన సంఖ్యలో సగం మంది కూడా లేరు. మరోవైపు విద్యార్థులకు అవసరమైన స్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా లేవు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఇటీవలి తనిఖీల్లో ఈ అంశాలు బహిర్గతమయ్యాయి. ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫె సర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తగిన సంఖ్యలో లేకపోవడం, ల్యాబ్‌ల వంటి మౌలిక వసతుల కొరతతో అనేక ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా తయారవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. 

ఆయా కాలేజీల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న చాలామంది తగిన సామర్థ్యం, నైపుణ్యం లేక వృత్తిలో రాణించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం మూడు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేనందుకు విద్యార్థుల అడ్మిషన్లను కమిషన్‌ రద్దు చేసింది. తర్వాత వారిని ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసింది. 

ఎన్‌ఎంసీ కఠిన చర్యలు తీసుకుంటున్నా, చాలా మెడికల్‌ కాలేజీలు ఇప్పటికీ అధ్యాపకులను నియమించుకోవడంలో, మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడే ఉంటున్నాయని, వైద్య విద్యపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆసక్తిని సొమ్ము చేసుకుంటున్న కాలేజీలు నాణ్యమైన విద్య అందించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 

ఏ కాలేజీ..ఎలా ఉండాలి: ఎంబీబీఎస్‌ సీట్లు 150 ఉన్న మెడికల్‌ కాలేజీలో 600 పడకలు ఉండాలి. 116 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 76 మంది రెసిడెంట్లు ఉండాలి. ఐదు పడకల ఐసీయూ, పీఐసీయూ వేర్వేరుగా ఉండాలి. ఫిజికల్‌ మెడికల్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. స్కిల్‌ లేబొరేటరీ ఉండాలి. ఇలా ఉన్న సీట్లను బట్టి బోధనా సిబ్బంది, వసతులు ఉండాలి. 

అన్ని మెడికల్‌ కాలేజీల్లో తప్పనిసరిగా ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు చేసే లేబొరేటరీ ఉండాలి. లైబ్రరీలో 4,500 పుస్తకాలుండాలి. అదే 100 సీట్లున్న మెడికల్‌ కాలేజీ అయితే 3 వేల పుస్తకాలు, 200 సీట్లుంటే 6 వేలు, 250 సీట్లయితే 7 వేల పుస్తకాలు ఉండాలి. లైబ్రరీ వైశాల్యం కూడా సీట్ల సంఖ్యకు అనుగుణంగా ఉండాలి. 

150 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు చదివే మెడికల్‌ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి రోజుకు 1,200 మంది ఔట్‌ పేషెంట్లు అవసరం. ఆ మేరకు తప్పనిసరిగా రోగులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ చాలా ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఇలాంటి అనేక వసతులు సరిగ్గా లేకుండానే, బోధనా సిబ్బంది తగిన సంఖ్యలో లేకుండానే నడుస్తున్నట్లు తేలింది.  

తనిఖీల సమయంలో ‘సర్దుబాట్లు’ 
రాష్ట్రంలో మొత్తం 64 మెడికల్‌ కాలేజీలున్నాయి. అందులో 29 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు కాగా, 35 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 4,700 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. కాగా ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, రోగుల వివరాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. 

వసతులు లేవని విద్యార్థులు బయటకు చెప్పలేని పరిస్థితి ఉందని, ఒకవేళ అలా చెబితే, నిరసన వ్యక్తం చేస్తే ప్రాక్టికల్స్‌లో తక్కువ మార్కులు వేస్తారన్న భయం వారిలో ఉంటోందని చెబుతున్నారు. కాగా ఎన్‌ఎంసీ తనిఖీలకు వచ్చే సమయానికి కాలేజీలు సర్దుబాట్లు చేస్తున్నాయి. నకిలీ బోధనా సిబ్బందితో ప్రైవేటు యాజమాన్యాలు నెట్టుకొస్తున్నాయి. అనేక కాలేజీలు సింథటిక్‌ బయోమెట్రిక్‌ ద్వారా ఒకరికి బదులు మరొకరితో హాజరు నమోదు చేయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement