ఇన్‌సర్విస్‌ డాక్టర్ల ‘పీజీ’ ఆశలు అడియాసలేనా? | Telangana medical candidates not eligible for PG: Telangana High Court | Sakshi
Sakshi News home page

ఇన్‌సర్విస్‌ డాక్టర్ల ‘పీజీ’ ఆశలు అడియాసలేనా?

Published Fri, Dec 27 2024 4:29 AM | Last Updated on Fri, Dec 27 2024 4:29 AM

Telangana medical candidates not eligible for PG: Telangana High Court

ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ చదివి తెలంగాణలో ఇన్‌సర్విస్‌ డాక్టర్లుగా ఉన్న వారి పరిస్థితి డోలాయమానంలో..  

148, 149 జీవోలపై హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టులో అప్పీళ్లతో వారిలో ఆందోళన... తెలంగాణలో వైద్య విద్య  అభ్యసించిన వారంతా పీజీకి అర్హులన్న హైకోర్టు 

ఇతర రాష్ట్రాల్లో వైద్య విద్య చదివిన తెలంగాణ వాళ్లు అనర్హులని వెల్లడి...  న్యాయం చేయాలని సర్కార్‌ను కోరిన ఇన్‌ సర్విస్‌ కోటా వైద్యులు

సాక్షి, హైదరాబాద్‌: నీట్‌– పీజీ వైద్య ప్రవేశాలకు సంబంధించిన గందరగోళానికి తెరపడడం లేదు. స్టేట్‌పూల్‌ కోటాలోని పీజీ సీట్లు పూర్తిస్థాయిలో తెలంగాణ వాళ్లకే చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెచ్చిన జీవోలు 148, 149పై మొదలైన అలజడి ఆగడం లేదు. జీవో 148(అల్లోపతి), 149 (ఆయుర్వేదం, హోమియోపతి) ద్వారా మెడికల్‌ పీజీలో అడ్మిషన్లు పొందేందుకు నిర్ణయించిన స్థానికత అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ‘తెలంగాణలో ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్‌ చదివిన వారంతా ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌–1974 ప్రకారం ‘లోకల్‌ ఏరియా’ పరిధిలోకి వస్తారని, వారు పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అర్హులేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా, జనవరి 7న విచారణకు రానుంది.

ఈ వివాదం కొనసాగుతుండగానే... తెలంగాణ స్థానికులుగా ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ చదివి... ఇన్‌సర్వీస్‌ డాక్టర్లుగా రాష్ట్రంలో సేవలందిస్తున్న డాక్టర్ల అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణలో పుట్టి పెరిగి ఇంటర్మీడియెట్‌ వరకు సొంత ప్రాంతంలో చదివినప్పటికీ... ఎంసెట్‌ ర్యాంకు ద్వారా ఇతర రాష్ట్రాల్లోనో, వేరే దేశంలోనో వైద్యవిద్య అభ్యసించి, సొంత రాష్ట్రంలో పనిచేస్తున్న డాక్టర్లు పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అనర్హులుగా మారడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు వరుసగా నాలుగేళ్లు చదివి, అనంతరం రాష్ట్రంలోనే ఎంబీబీఎస్‌/ బీఏఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌ చదివిన వారే పీజీ అడ్మిషన్లలో స్టేట్‌ పూల్‌లో రాష్ట్రంలో చదివేందుకు అర్హులని ప్రభుత్వం 148, 149 జీవోల్లో స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించలేదు.

దీంతో ఇంటర్‌ వరకు ఏపీ లేదా ఇతర రాష్ట్రాల్లో చదివి తెలంగాణలో ఎంబీబీఎస్‌ చేసిన వారు ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌–1974 ప్రకారం ‘లోకల్‌ ఏరియా’ కిందికి వచ్చి పీజీ కోర్సులకు అర్హులవుతుండగా... ఇంటర్‌ వరకు తెలంగాణలో చదివినప్పటికీ... వైద్య విద్యను ఇతర రాష్ట్రాల్లో అభ్యసించి సొంత రాష్ట్రంలో పనిచేస్తున్న వారు అనర్హులుగా మారారు. ప్రభుత్వం ఎంబీబీఎస్‌ తెలంగాణలో చదివిన వారంతా స్థానికులే అన్న హైకోర్టు తీర్పును మాత్రమే సవాల్‌ చేసిన నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ చదివి ఇన్‌సర్విస్‌ డాక్టర్లుగా ఉన్న వారి పరిస్థితి ఎటూ తేలకుండా పోతోంది. దీంతో వారు తమ స్థానికత అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  
బలయ్యేది ఇన్‌సర్విస్‌ డాక్టర్లే.. 
తెలంగాణ ఏర్పాటయ్యేంత వరకు ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకును బట్టి నాన్‌లోకల్‌ కేటగిరీలో మెరిట్‌ ఆధారంగా ఆంధ్ర, రాయలసీమలోని కళాశాలల్లో ఎంబీబీఎస్‌ విద్యనభ్యసించిన రాష్ట్రానికి చెందిన వారు వందలాది మంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణేతర ప్రాంతాల్లో వైద్యవిద్య పూర్తి చేసినప్పటికీ... ప్రభుత్వ సర్విసులో చేరి గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసి, స్టేట్‌ పూల్‌ కింద 15 శాతం నాన్‌లోకల్‌ కోటాలో పీజీ అడ్మిషన్లు పొందేవారు.

148, 149 జీవోల ప్రకారం తెలంగాణలో వైద్యవిద్య అభ్యసించిన స్థానికులకే స్టేట్‌పూల్‌లో పీజీలో అడ్మిషన్లకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేయడంతో... ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, ఇతర కోర్సులు చదివి ఇన్‌సర్విస్‌లో ఉన్న వైద్యులకు పీజీకి అర్హత లేకుండా పోయింది. ఈ సంవత్సరం కాళోజీ యూనివర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లోనూ వీరికి దరఖాస్తు చేసుకునే ఆప్షన్‌ కూడా ఇవ్వలేదు.  
పట్టించుకోని ప్రభుత్వం 
ఇన్‌సర్విస్‌ కోటాలో తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న వైద్యులు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఇచ్చిన 106 పేజీల తీర్పులో ఇన్‌సర్విస్‌ డాక్టర్ల అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో తమకు సర్వీస్‌ మొత్తం ఎంబీబీఎస్‌ అర్హతతోనే పదవీ విరమణ వరకు ఉద్యోగం చేసే పరిస్థితి తలెత్తిందని వైద్యులు వాపోతున్నారు. ఇన్‌సర్విస్‌ డాక్టర్లకు న్యాయం జరిగేలా పీజీ అడ్మిషన్లలో అవకాశం లభించేలా కృషి చేయాలని, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ కత్తి జనార్ధన్, డాక్టర్‌ పూర్ణచందర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement