Medical Council of India (MCI)
-
నకిలీ వైద్యులపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉక్కుపాదం మోపుతోంది. మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేశ్ ఆధ్వర్యంలోని బృందం విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. ఎంబీబీఎస్ డిగ్రీ లేకపోయినా నకిలీ సర్టిఫికెట్లతో ఆసుపత్రులు ప్రారంభించి వైద్యం చేస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకుంటోంది. మెడికల్ కౌన్సిల్ లోని యాంటీ క్వాకరీ కమిటీ క్రియాశీలకంగా పనిచేస్తూ ఇప్పటివరకు ఏకంగా 400 ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. హైదరాబాద్‌లోనే 150కిపైగా ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. పదో తరగతితో డాక్టర్.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పదో తరగతి మాత్రమే అర్హత ఉన్నవాళ్లు కూడా వైద్యం చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. వీరు ఎలాంటి భయం లేకుండా దర్జాగా ఆసుపత్రులను నడుపుతూ.. రోగులకు చికిత్స అందించడం చూసి మెడికల్ కౌన్సిల్ సభ్యులే ఖంగుతింటున్నారు. పైగా నిపుణులైన వైద్యులు సూచించే యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు (అమికాసిన్), కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్లు (ప్రొజెస్టిరాన్, సెట్రోరెలిక్స్) వంటివి కూడా వీరి వద్ద పెద్దసంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. పలువురు ఆర్ఎంపీలు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకే విచ్చలవిడిగా హై ఎండ్ యాంటీబయాటిక్స్‌ను రోగులకు ఇస్తున్నారు. దీంతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరుగుతుందని మెడికల్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. కరోనాకన్నా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. వీటిని అధికంగా వాడితే భవిష్యత్తులో పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి యాంటీబయాటిక్స్ పనిచేయవని, దాంతో రోగి ప్రాణాల మీదికి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఉంటేనే ప్రాక్టీస్ చేయాలి.. ఎంబీబీఎస్ పట్టా పొంది, మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే అల్లోపతి వైద్యం చేయాల్సి ఉంటుంది. బీఏఎంఎస్, బీహెచ్ఎంస్, వేరే ఏ ఆయుష్ కోర్సులు చేసినవారు కూడా అల్లోపతి వైద్యం చేయడం చట్టరీత్యా నేరం. అలాగే ఒక రకం స్పెషలైజేషన్ చేసినవారు వేరే స్పెషలైజేషన్ ప్రాక్టీస్ చేసినా నేరమే అవుతుందని మెడికల్ కౌన్సిల్ అధికారులు చెబుతున్నారు. కొందరు కార్పొరేట్ ఆసుపత్రుల వాళ్లు బిజినెస్ పెంచుకునేందుకు స్థానిక ఆర్ఎంపీలకు కమీషన్లు ఇచ్చి పేషెంట్లను రిఫర్ చేయించుకుంటున్నారని, ఈ విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎంబీబీఎస్ పట్టా లేకుండా.. మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వైద్యం చేస్తూ పట్టుబడితే ఏడాది జైలు శిక్ష.. రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన చికిత్స రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 4,600 సబ్‌సెంటర్లు ఉన్నాయి. ప్రతి రెండు గ్రామాలకు ఒక సబ్‌సెంటర్ అందుబాటులో ఉంది. 890 పీహెచ్‌సీలు ఉన్నాయి. పల్లె దవాఖానలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆర్ఎంపీలపై ఆధారపడకుండా ఈ ఆసుపత్రులకు వెళ్లాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నకిలీ వైద్యులను సంప్రదించి లేనిపోని ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవద్దు. – డాక్టర్ గుండగాని శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ -
ఆందోళనలో ‘విదేశీ’ వైద్య విద్యార్థులు
లబ్బీపేట (విజయవాడతూర్పు): విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి సర్టిఫికెట్స్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు పాటిస్తున్నట్లు మెడికల్ కౌన్సిల్ అధికారులు చెబుతుండగా, రిజిస్ట్రేషన్లను జాప్యం చేయడం వలన తమ కాలం వృధా అవుతుందని విదేశీ వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్ ఏమిటో అర్ధం కావడం లేదంటూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఇటీవల ఆందోళనకు దిగారు. తమ పీఆర్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో విదేశాల్లో విద్యనభ్యసించామంటూ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు వచ్చిన వారి సర్టిఫికెట్స్ నకిలీవనీ నిర్ధారణ అయింది. ఈ విషయంపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పందించింది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు వస్తే, వారు చదువుకున్న యూనివర్సిటీల నుంచి జెన్యునిటీ నిర్ధారణ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన సుమారు 400 మంది విద్యార్థుల సర్టీఫికెట్స్‌ను ధ్రువీకరణ కోసం ఆయా దేశాల ఎంబసీకి పంపించారు. ఇప్పటి వరకూ వాటి విషయంలో ఎలాంటి ధ్రువీకరణ రాలేదు. ర్యాంకులొచ్చినా పీజీ చేయలేం.. విదేశాల్లో వైద్య విద్యనభ్యసించి, ఇక్కడ ఎన్ఎంసీ నిర్వహించే నీట్లో మెరిట్ ర్యాంకులు వచ్చినా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో పీజీలు చేయలేక పోతున్నట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు నీట్ నోటిఫికేట్ వచ్చిందని, తమ పరిస్థితి ఏమిటో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్ఎంసీ ఆదేశాల మేరకే..విదేశాల్లో వైద్య విద్య చదివిన వారి సర్టీఫికెట్లను జన్యునిటీ నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే పీఆర్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. వారి సూచనల మేరకు తమ వద్దకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి సర్టీఫికెట్స్‌ను ఆయా దేశాల ఎంబసీకి పంపిస్తున్నాం. యూనివర్సిటీల నుంచి జెన్యూన్ అని నిర్ధారిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇప్పటి వరకూ 400 సర్టీఫికెట్స్‌ను అలా పంపించాం. – డాక్టర్ ఐ.రమేష్, రిజి్రస్టార్, ఏపీ మెడికల్ కౌన్సిల్ -
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్‌పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్‌ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్‌పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్‌లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: గతంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి పొందిన, 2022 అక్టోబరు 21వ తేదీ లోపు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) గుర్తించిన విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆయా దేశాల్లోనే ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేస్తే దాన్ని ఈ ఒక్క ఏడాది వరకు గుర్తిస్తామని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏ దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా భారత్‌లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అనంతరం ఒక ఏడాది పాటు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంది. ఈ నిబంధన తాజాగా అమల్లోకి రావడంతో 2022 అక్టోబర్‌కు ముందే ఇంటర్న్‌షిప్ విదేశాల్లో పూర్తి చేసిన వారు మళ్లీ ఇక్కడ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అలాంటి అభ్యర్థులు ఈ నిబంధనను సడలించాలని ఎన్ఎంసీని కోరారు. దీన్ని పరిశీలించిన ఎన్ఎంసీ తాజాగా వెసులుబాటు కల్పించింది. తాము అనుమతించిన కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో గతేడాది అక్టోబర్ 21కు ముందు ఎంబీబీఎస్, తత్సమాన అర్హతతో వైద్య విద్య పూర్తి చేసి, ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేసినట్లయితే వారికి ఈ ఒక్క ఏడాదికి సడలింపిస్తామని ఉత్తర్వులు జారీచేశారు. (క్లిక్ చేయండి: 20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
మెడికల్ రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ రిజిస్ట్రేషన్ల ఫీజులను మెడికల్ కౌన్సిల్ భారీగా పెంచింది. వైద్య విద్య పూర్తి చేసినవారు కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే డాక్టర్‌గా పనిచేసేందుకు అర్హులు. అలాంటి వివిధ రకాల రిజిస్ట్రేషన్ల ఫీజులను సవరించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచే సవరించిన ఫీజులు అమలులోకి వస్తాయని కౌన్సిల్ వెల్లడించింది. అయితే 65 ఏళ్లు దాటినవారు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ తమ మెడికల్ పట్టా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఏడాది కాలానికి రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ ఫీజుకు జీఎస్టీ వసూలు విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. ఒకవేళ ఉండేట్లయితే 18 శాతం జీఎస్టీని అభ్యర్థులు చెల్లించాలి. కాగా, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పటివరకు రూ. వెయ్యి ఉండగా, దాన్ని రెట్టింపు చేస్తూ రూ. 2 వేలకు పెంచింది. అలాగే ఇతర దేశాల్లో చదివి వచ్చిన వారికి ప్రొవిజనల్ ఫీజును రూ. వెయ్యి నుంచి ఏకంగా రూ.5 వేలకు పెంచింది. డూప్లికేట్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్‌ను రూ. వెయ్యి నుంచి రూ. రెండు వేలకు పెంచారు. ఇక ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచారు. ఇతర దేశాల్లో చదివి వచ్చిన వారి ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. డూప్లికేట్ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు. కాగా, ఫీజుల పెంపును హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.మహేశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండగాని శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.కిరణ్‌కుమార్, బాలరాజు నాయుడు, సన్నీ దావిస్, మహ్మద్ జహంగీర్ ఒక ప్రకటనలో ఖండించారు. పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని వారు కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేశారు. -
రోగులపై ప్రత్యక్ష ప్రయోగాలొద్దు
పీజీ వైద్య విద్యలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మరిన్ని సంస్కరణలను తీసుకొచ్చింది. 23 సంవత్సరాల తర్వాత పీజీ వైద్యవిద్యలో మార్పులకు శ్రీకారం చుట్టిన ఎన్ఎంసీ... 2022–23 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా తీసుకొచ్చిన విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పీజీ కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థులు పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలను నేర్చుకోవడంతోపాటు కోర్సు చివర్లో పరీక్షలు రాస్తున్నారు. దీంతో వైద్యులంతా ఒకే తరహా వైఖరికి అలవాటుపడుతున్నట్లు గుర్తించిన ఎన్ఎంసీ... తాజాగా ఆ విధానాలను సంస్కరించింది. పలు రకాల మార్పులు చేస్తూ సరికొత్త విధానాలను ప్రవేశపెట్టింది. కొత్తగా అమల్లో్లకి తెచ్చిన విధానంతో పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలే కాకుండా రోగితో మెలిగే తీరు, కేసులను నిర్వహించే పద్ధతులు, ప్రయోగాలు తదితరాలన్నింటా నూతన విధానాలను తీసుకొచ్చింది. – సాక్షి, హైదరాబాద్ వైద్యవిద్యలో చివరగా 1998 సంవత్సరంలో అప్పటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంస్కరణలు వచ్చాయి. ఆ తర్వాత 2018లో మరిన్ని సంస్కరణలను ప్రభుత్వం తీసుకురాగా... వాటిని 2022’–23 సంవత్సరం నుంచి ఎన్ఎంసీ అమలు చేస్తోంది. పుస్తకాల్లోని సిలబస్ ఆధారంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకున్నప్పటికీ... అభ్యసన కార్యక్రమాలన్నీ నైపుణ్యంఆధారంగా చేపట్టేలా వైద్య విద్య సాగాలని ఎన్ఎంసీ ఆదేశించింది. ఈ మేరకు నైపుణ్య ఆధారిత పీజీ వైద్య విద్యను ప్రవేశపెట్టింది. ఆ మేరకు నిబంధనలు పొందుపరిచి అందుకు సంబంధించిన మార్గదర్శకాలను వైద్య విద్యాసంస్థలకు జారీ చేసింది. ఇప్పటివరకు పీజీ వైద్య విద్యార్థులు పాఠ్యాంశాన్ని వినడం (థియరీ), నిపుణుల సమక్షంలో రోగులపై ప్రయోగాలు చేయడం జరిగేది. థియరీ క్లాస్‌లో విజ్ఞానాన్ని సంపాదించడం, ప్రయోగాత్మకంగా చికిత్స అందించడం, పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించడం లాంటి మూడు పద్ధతులుండేవి. ఇకపై పీజీ వైద్య విద్యార్థి తాను చదువుతున్న స్పెషలైజేషన్ కోర్సుకు సంబంధించి పాఠ్యాంశాలను వినడంతోపాటు నేరుగా రోగులపై శిక్షణలో భాగంగా ప్రయోగాలు చేసే వీలు లేదు. ఎందుకంటే వైద్య విద్యార్థులు చేస్తున్న ప్రత్యక్ష ప్రయోగాలతో రోగులకు ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవి వికటించడంతో ప్రాణాలు సైతం కోల్పోతున్న ఉదాహరణలున్నాయి. ఈ క్రమంలో ఇకపై విద్యార్థులు పాఠ్యాంశాన్ని అర్థం చేసుకున్నాక మనుషులను పోలిన మోడల్స్ (నమూనా)పై నిర్దిష్ట పద్ధతిలో ప్రయోగాలు జరపాలి. ఉదాహరణకు గైనకాలజిస్ట్ నేరుగా డెలివరీ చేయకుండా గర్భిణిగా ఉన్న మహిళ రూపాన్ని పోలిన బొమ్మపై నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రతి మెడికల్ కాలేజీలో స్కిల్ ల్యాబ్స్ తప్పకుండా ఉండాలని జాతీయ మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది. స్కిల్ ల్యాబ్ నిర్వహణ ఆధారంగా కాలేజీలకు ర్యాంకింగ్ లు సైతం ఇవ్వనున్నట్లు తాజా మార్గదర్శకాల్లో పొందుప ర్చింది. స్కిల్ ల్యాబ్స్‌లో వైద్య విద్యార్థులు నైపుణ్యం ఆధారిత విజ్ఞానాన్ని పెంచుకుంటారు. ఇందులో అన్ని వైద్యశాస్త్రాలకు సంబం ధించిన అన్ని నమూనాలు, ఉదాహరణలతో సహా అందుబాటులో ఉంటాయి. స్కిల్ ల్యాబ్స్ ఆధారంగానే పీజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. Ü పీజీ వైద్య విద్యా ర్థులు రోగితో ఎలా మాట్లాడాలి... వారితో ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి తదితర అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా ప్రతి మూడు నెలలకోసారి ప్రతి అంశంపైనా ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. పాఠ్యాంశ పరిజ్ఞానం, రోగితో మాట్లాడటం, ప్రయోగ పరీక్షలు చేసి చూపడంపై ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి మూడు నెలలకోసారి ప్రతి సబ్జెక్ట్‌పై కొన్ని లక్ష్యాలను చేరుకుంటూ కోర్సును ముందుకు తీసుకెళ్లాలి. పీజీ వైద్యవిద్యలో ప్రస్తుతం 77 సబ్జెక్టులు ఉన్నాయి. అందులో 30 ఎండీలు, 6 ఎంఎస్‌లు, 19 డిప్లొమాలు, 15 డీఎంలు, 7 ఎంసీహెచ్‌ల విభాగాలు ఉంటాయి. ప్రతి కోర్సుకు మూడు నెలలకోసారి ఏం సాధించాలో లక్ష్యాలు ఉంటాయి. రోగితో ఎలా వ్యవహరిస్తారన్న దానిపై ప్రతి మూడు నెలలకోసారి పరీక్ష ఉంటుంది. రోగితో ఎలా మాట్లాడాలన్న దానిపై శిక్షణ ఇస్తారు. కఠినంగా ఉంటే మార్పులు చేపట్టే అవకాశం ఉంటుంది. -
జగిత్యాల మెడికల్ కాలేజీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా వాసులకు తీపి కబురు అందింది. జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కల సాకారం కాబోతోంది. వచ్చే వైద్య విద్యా సంవత్సరానికి 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభించబోయే జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌కు లేఖ రాసింది. లేబొరేటరీ, లైబ్రరీ, ఫ్యాకల్టీ, నర్సింగ్, పారామెడికల్ స్టాఫ్, హాస్టళ్లు తదితర వసతి సౌకర్యాలు ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా వాసులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. (క్లిక్: పూర్తి కావొచ్చిన సూర్యాపేట–ఖమ్మం రహదారి) -
వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా?: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: నీట్ పీజీ–21 కౌన్సిలింగ్లో ఏకంగా 1456 సీట్లు ఖాళీగా మిగిలిపోవడంపై సుప్రీంకోర్టు విస్మయం వెలిబుచ్చింది. దేశమంతా డాక్టర్ల కొరతతో అల్లాడుతుంటే ఇదేం నిర్వాకమంటూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) తీరును తూర్పారబట్టింది. మెడికల్ పీజీ ఖాళీల భర్తీకి ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, అనిరుద్ధ బోస్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ బుధవారం విచారించింది. ‘‘ఒక్క సీటు మిగిలినా దాన్ని ఖాళీగా పోనీయొద్దు. అది మెడికల్ కౌన్సిల్ బాధ్యత. కానీ ఏటా ఇదే సమస్య పునరావృతమవుతోంది. ఇన్ని సీట్లు ఖాళీగా మిగిలిపోతే ఎలా?’’ అంటూ తూర్పారబట్టింది. సీట్ల సంఖ్య, అడ్మిషన్ల సంఖ్య వెల్లడికి కటాఫ్ డేట్ ఉండాలని మేం గతంలోనే తీర్పు ఇచ్చాం. అయినా కౌన్సెలింగ్ మధ్యలో సీట్లను ఎందుకు జోడిస్తున్నారు? ఇలాంటి చర్యలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎంతటి ఒత్తిడి పడుతుందో ఆలోచించారా? స్టూడెంట్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయమిది. అహర్నిశలూ పట్టుదలగా చదివి పరీక్ష రాయాలి. 99 శాతం తెచ్చుకున్నా చివరికిలా అడ్మిషన్ సమస్యలు! ఇలాంటి పరిస్థితి వారినెంతటి నరకంలోకి నెడుతుందో మీకు అర్థమవుతోందా?’’ అని ప్రశ్నించింది. కేంద్రం తరఫున వాదించాల్సిన అదనపు సొలిసిటర్ జనరల్ బల్బీర్‌సింగ్ వ్యక్తిగత సమస్యతో రాలేకపోయినందున వాయిదా ఇవ్వాలన్న విజ్ఞప్తికి తిరస్కరించింది. ‘‘ఇది వైద్య విద్యార్థుల హక్కులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం. పైగా సుప్రీంకోర్టులో కేంద్రానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఒక్క ఏఎస్జీ మాత్రమే లేరుగా!’’ అని పేర్కొంది. మొత్తం సీట్లు, ఖాళీలు, అందుకు కారణాలతో 24 గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఎంసీసీని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. అడ్మిషన్ల వ్యవహారాలు చూసే డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ గురువారం హాజరవాలని ఆదేశించింది. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకుంటే వారికి పరిహారమివ్వాల్సిందిగా ఆదేశాలిస్తామని పేర్కొంది. చదవండి: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆహుతైన కార్లు, బైక్‌లు, రిక్షాలు, ఫొటోలు వైరల్ -
మెడికల్ కౌన్సిల్’ కేసులో ముగ్గురి అరెస్ట్
సాక్షి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్ ట్యాంపరింగ్ చేసి, అనర్హులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ కందుకూరి అనంతకుమార్ సూత్రధారిగా తేలింది. చైనాలో మెడిసిన్ పూర్తి చేసిన వారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పరీక్ష పాస్ అయితేనే రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం ఉంటుందని, పాస్ కాని వారి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన కుమార్ సర్టిఫికెట్లు జారీ చేశాడని అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇబ్రహీంపట్నానికి చెందిన కసరమోని శివానంద్, కర్మన్‌ఘాట్ వాసి తోట దిలీప్ కుమార్ స్నేహితులు. వీరు చైనాలో ఎంబీబీఎస్ చదివారు. 2012లో సర్టిఫికెట్ పొంది తిరిగి వచ్చారు. ఇలా విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారు ఇక్కడ ప్రాక్టీసు చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) ఉత్తీర్ణులు కావాలి. అత్యంత కఠినంగా ఉండే ఈ పరీక్షను ఎంసీఐ ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తుంది. ఈ ద్వయం 2012–14 మధ్య రెండుసార్లు పరీక్షకు హాజరైనా ఉత్తీర్ణులు కాలేదు. పాస్ అయితే కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు. దీంతో వీళ్లిద్దరూ ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేషించారు. వీరికి ఓ స్నేహితుడు (ప్రస్తుతం దుబాయ్‌లో) ద్వారా టీఎస్‌ఎంసీలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అనంతకుమార్‌తో పరిచయమైంది. 2017లో అతడిని కలిసి తమ అవసరాన్ని చెప్పారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన అనంతకుమార్ 2016లో రిజిస్టర్ చేసుకున్న వైద్యుల రిజిస్ట్రేషన్ నంబర్లు వీరికి కేటాయించాడు. ఈ మేరకు టీఎస్ఎంసీ డేటాబేస్‌లో మార్పుచేర్పులు చేసి, వీరిద్దరికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించాడు. ఇటీవల అసలు వైద్యులు రెన్యువల్, అర్హతలు అప్డేట్ కోసం టీఎస్ఎంసీకి రావడంతో విషయం తెలిసింది. టీఎస్ఎంసీ ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుల కోసం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని టీమ్ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుంది. వీరి వద్ద నకిలీ టీఎస్ఎంసీ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ... ఎంసీఐ సర్వర్‌లో మాత్రం ఎంటర్ కాలేదు. దీంతో అందులో అసలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలే కనిపిస్తున్నాయి. చిక్కుతామని భయపడిన వీరు ప్రాక్టీసు చేయకుండా వైద్య సంబంధ ఉద్యోగాలు చేస్తున్నారు. అనంతకుమార్ వీరిద్దరితో పాటు శ్రీనివాస్, నాగమణిలకు ఈ తరహాలో సహకరించినట్లు అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న వారి వివరాలు ఆరా తీస్తున్నామన్నారు. శివానందం 2012–16 మధ్య, దిలీప్ 2016 –18 మధ్య సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో డ్యూ టీ డాక్టర్లుగా పని చేశారు. టీఎస్ఎంసీ సర్టిఫికెట్ లేని శివానందంకు ఉద్యోగం ఎలా వచ్చిందనేది ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వీరిలో ఒకరు మెడికల్ కంపెనీలో, మరొకరు వైద్యులకు అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. (చదవండి: తమ్ముడి ఇంట్లో తుపాకీ పెట్టాడు!) -
వేరియంట్లు కావవి..స్కేరియంట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రతి ఇంటా వినిపిస్తున్న మాట ‘వేరియంట్’. శాస్త్రీయంగా దీని గురించి ప్రజలకు తెలియకపోయినా.. వారిని తీవ్రంగా భయపెడుతోంది. అందుకే దీన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు ‘స్కేరియంట్స్’ (భయపెట్టేవి)గా కొట్టిపారేస్తున్నారు. భారతీయ వైద్య నిపుణులు సైతం వేరియంట్స్ గురించి అతిగా ఆలోచించొద్దని సూచిస్తున్నారు. ప్రధాన వైరస్ రూపాంతరం వల్ల మారే వివిధ ఆకృతులన్నీ విభిన్న ప్రభావాలు చూపిస్తాయనే ఆందోళనకు శాస్త్రీయత లేదని చెబుతున్నారు. ఉదాహరణకు కర్నూలు కేంద్రంగా పుట్టిందని ప్రచారం చేస్తున్న ‘ఎన్–440కే’ వేరియంట్ ప్రమాదకరమైనదని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవు. దీనిపై పరిశోధనలు చేసేలోపే ఆ వేరియంట్ మాయమైంది. చాలా వేరియంట్స్ ఇలాగే ఉంటాయని వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ వైద్య కళాశాల క్లినికల్ వైరాలజీ ప్రొఫెసర్ టి.జాకబ్‌జాన్ తెలిపారు. ఒకే వైరస్.. రూపాలే వేరు ఏ వైరస్ అయినా విస్తరించే కొద్దీ రకరకాలుగా ఉత్పరివర్తనం చెందుతుంది. ప్రతి పరిణామాన్ని గుర్తించి.. దానికి ఓ కోడ్ ఇవ్వడం జన్యు శాస్త్ర పరిశీలనలో భాగమంటున్నారు నిపుణులు. నిజానికి కరోనాకు సంబంధించి ఇంతవరకూ విస్తృతంగా ల్యాబొరేటరీ పరిశోధనలు పూర్తి చేసుకున్నవి మూడే. యూకేలో 2020 సెప్టెంబర్‌లో బ్రెజిల్ వేరియంట్ పి–1 గుర్తించారు. అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా, డిసెంబర్లో బ్రెజిల్ వేరియంట్స్‌పై శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. వీటినుంచి పుట్టుకొచ్చిన వేరియంట్స్‌కు అనేక రకాలుగా కోడింగ్ ఇచ్చారు. వేరియంట్స్ ఎన్నయినా మూలం ఒకటే. యూకే వేరియంట్స్ శాఖోపశాఖలే వేరియంట్స్‌గా భారత్‌ను వణికిస్తోందని వైద్యులంటున్నారు. మూలం ఒకటే కాబట్టి, వేరియంట్ ఏదైనా వ్యాక్సిన్ అన్నింటినీ అడ్డుకుంటుందని భారత వైద్యమండలి స్పష్టం చేస్తోంది. ఏ వేషం వేసినా డీఎన్ఏ ద్వారా వ్యక్తిని గుర్తించి మందు ఇచ్చినట్టే కరోనాకు చెక్ పెట్టేందుకు వైద్య పరిశోధనలు సరిపోతాయని తెలిపారు. ఈ దిశగానే ఇప్పటికే అనేక మందులు అందుబాటులోకి వస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా స్పష్టం చేస్తోంది. ఆందోళన అనవసరం జన్యు మార్పిడి వల్ల పుట్టుకొచ్చే రూపాంతరాల గురించి ప్రజలు అతిగా ఆలోచించకపోవడమే మంచిది. ప్రధాన వైరస్‌ను గుర్తించి వైద్యం చేస్తున్నప్పుడు, కట్టడికి వ్యాక్సిన్‌పై విస్తృత పరిశోధనలతో ముందుకెళ్తున్నప్పుడు ఏ శాస్త్రీయతా లేని వేరియంట్స్ గురించి ఆందోళన అనవసరం. – ముఖర్జీ, హృద్రోగ నిపుణులు అనవసర భయమే వేరియంట్స్ అంటే అసలు వైరస్ బిడ్డలే. కాకపోతే వీటి వేషం మారుతుందంతే. వైరస్ మ్యుటేషన్ చెంది, స్పైక్స్ బయటకు కన్పిస్తాయి. ఈ స్పైక్స్ ప్రొటీన్సే. అమినో ఆమ్లాన్నే ప్రొటీన్ అంటారు. ఏది ఉండకూడదు.. ఏది ఉండాలనేది జెనెటిక్ కోడ్ నిర్దేశిస్తుంది. కోడ్ మారితే అమినో ఆమ్లం మారుతుంది. ఫలితంగా ప్రోటీన్ ఆకృతి మారుతుంది. వైరస్ రకరకాల ఆకృతి తీసుకుంటుంది. ఇది ఏ రూపంలో ఉన్నా గుర్తించే ల్యా»ొరేటరీలు అభివృద్ధి చెబుతున్నాయి. కాబట్టి ఇదంతా అనవసర భయమే. – ప్రవీణ్‌కుమార్, మైక్రో బయాలజిస్ట్, విజయవాడ -
నెల్లూరు వైద్యకళాశాలకు ఎంసీఐ గుర్తింపు
సాక్షి, ఢిల్లీ : ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చొరవతో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నుంచి అనుమతులు లభించాయి. తాజాగా కేంద్రం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఫలితంగా ఐదేళ్ళ నిరీక్షణకు తెరపడినట్లయ్యింది. దీంతో కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రి వసతులు కూడా మెరుగుపడనున్నాయి.ఎంసీఐ అనుమతుల గురించి వెంకయ్యనాయుడు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రి హర్షవర్ధన్ సహా సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు దీనికి సంబంధించి మార్గం సుగమం అయింది. ఎంసీఐ అనుమతుల నేపథ్యంలో లాంఛనాలను త్వరితగతిన పూర్తిచేసి అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యేలా చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి కేంద్రమంత్రికి సూచించారు. (భారత్ బంద్ : 20 రైతు సంఘాల మద్దతు) డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల.. 2014-15 సంవత్సరంలో ప్రారంభమైనప్పటికీ వివిధ కారణాలతో భారతీయ వైద్యమండలి అనుమతులు ఆలస్యం అయ్యాయి. అయితే మొదటి బ్యాచ్ విద్యార్థుల శిక్షణాకాలం ముగుస్తున్న సమయంలో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు చొరవతీసుకొని వివిధ శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. కాలేజీలో మౌలిక వసతులకు సంబంధించి కళాశాల యాజమాన్యం గతంలో ఇచ్చిన నివేదికలు, నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంటూ భారతీయ వైద్య మండలి అనుమతులు నిరాకరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి చొరవతో మరోసారి జనవరి 30, 2020న ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో వసతులకు సంబంధించి ఎంసీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కేంద్ర బృందం పరిశీలించింది. సంతృప్తికరమైన నివేదిక ఇవ్వడంతో.. కాలేజీకి ఎంసీఐ గుర్తింపు లభించింది. (రెండేళ్ల బాలుడి మీద నుంచి వెళ్లిన రైలు.. అయినా!) -
సర్కార్ దవాఖానాకు మహర్దశ..
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆధ్వర్యంలోని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ పీజీలో ఎండీ, ఎంఎస్ చేసే విద్యార్థులు రెండో ఏడాది నుంచి జిల్లా ఆసుపత్రుల్లో శిక్షణ పొందాలని తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ (సవరణ) నిబంధనలు–2020’ విడుదల చేసింది. తద్వారా వీరికి క్షేత్రస్థాయి వ్యాధులపై అవగాహన వస్తుందని, శిక్షణ కూడా పొందుతారని తెలిపింది. మరోవైపు జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్టుల వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది. 100 పడకలకు తక్కువ కాకుండా ఉన్న జిల్లా ఆసుపత్రుల్లో వీరికి శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది పీజీలో చేరిన వారికి వచ్చే సంవత్సరం నుంచి ఈ శిక్షణ అమలుకానుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు పీజీ పూర్తయిన విద్యార్థులు బోధనాసుపత్రుల్లో శిక్షణ పొందుతున్నారు. జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్: ఎండీ లేదా ఎంఎస్ చేసే పీజీ మెడికల్ విద్యార్థులంతా 3 నెలలకోసారి రొటేషన్ పద్ధతిలో జిల్లా ఆసుపత్రుల్లో లేదా జిల్లా ఆరోగ్య వ్యవస్థల్లో పని చేయాలి. వారి కోర్సులో భాగంగా ఇది ఉం టుంది. 3, 4, 5 సెమిస్టర్లలో ఉన్న పీజీ విద్యార్థులు రొటేషన్ పద్ధతిలో పనిచేస్తారు. దాన్ని జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్(డీఆర్పీ) అంటా రు. సదరు విద్యార్థులను జిల్లా రెసిడెంట్లుగా పిలుస్తారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో వచ్చే వివిధ అనారోగ్య సమస్యలను తెలుసుకోవడం దీని ఉద్దేశాలు. విభిన్నమైన శిక్షణ పొందడం. అలాగే ప్రస్తుతమున్న స్పెషాలిటీ వైద్యులకు తోడుగా పీజీ వైద్య విద్యార్థులతో జిల్లా ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కానుంది. ఇన్ పేషెంట్.. ఔట్‌పేషెంట్ సేవల్లోనూ.. ► జిల్లా రెసిడెంట్లుగా వెళ్లిన పీజీ విద్యార్థులు జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ (డీఆర్పీసీ) పర్యవేక్షణలో పని చేస్తారు. ► ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్, క్యాజువాలిటీ తదితర చోట్ల పనిచేస్తారు. నైట్ డ్యూటీలూ చేయాలి. ► అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీకి చెందిన పీజీ మెడికల్ విద్యార్థులు జిల్లా ఆరోగ్య అధికారి లేదా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతారు. లేబొరేటరీ, ఫార్మసీ, ఫోరెన్సిక్ విద్యార్థులు సాధారణ క్లినికల్ విధుల్లో పనిచేస్తారు. ► జిల్లా రెసిడెంట్లకు స్టైఫెండ్ ఇస్తారు. వారానికో సెలవుతోపాటు ఇతర సెలవులు ఉంటాయి. ► రాష్ట్రస్థాయిలోనూ స్టీరింగ్ కమిటీ ఉంటుంది. వివిధ కేసులపై చర్చలు, సెమినార్లు వంటి వాటిల్లో పాల్గొనేలా చేయాలి. ► జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ జిల్లా రెసిడెంట్ల శిక్షణకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. వారి పనితీరుపై మెడికల్ కాలేజీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ► జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాంను సమన్వయం లేదా పర్యవేక్షణ చేసేందుకు ప్రతి మెడికల్ కాలేజీ అకడమిక్ సెల్ కమిటీని ఏర్పాటు చేయాలి. ► జిల్లా రెసిడెన్సీ కార్యక్రమం అమలు మొదలైన ఏడాదికి సంబంధిత మెడికల్ కాలేజీ అదనపు పీజీ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని ఎంసీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ► జిల్లా రెసిడెన్సీ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు రాష్ట్రస్థాయిలో నోడల్ ఆఫీసర్‌ను నియమించాలి. -
మాస్క్‌తో రిస్క్
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న కొద్దీ మాస్కుల వినియోగం భారీగా పెరుగుతోంది. కరోనా కట్టడికి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ అధికారవర్గాలతోపాటు సాధారణ ప్రజలుమాస్కులను తప్పనిసరిగా ధరిస్తున్నారు. వీటిల్లో మెడికల్ మాస్కులు అయిన ఎన్95 మాస్కులు, సర్జికల్ మాస్కులతోపాటు పలు రకాలున్నాయి. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నెలకు దాదాపు 10 కోట్ల మాస్కులు వాడుతున్నారు. ► దేశంలో సగటున రోజుకు దాదాపు 25 లక్షల మెడికల్ మాస్కులు వినియోగిస్తున్నట్లు భారత వైద్య మండలి(ఎంసీఐ) అంచనా వేసింది. ► మన రాష్ట్రంలో రోజుకు దాదాపు 1.20 లక్షల మెడికల్ మాస్కులు వాడుతున్నారు. వందేళ్ల వరకు మట్టిలోనే.. ► మెడికల్ మాస్కులు సింథటిక్ రేసిన్‌తో తయారవుతాయి. వాటిలో పాలిస్టిరిన్, పాలికార్బనేట్, పాలిథిలియన్ వంటివి ఉంటాయి. ఆ మాస్కులు మట్టిలో కలసిపోకుండా వందేళ్ల వరకూ భూమిలోనే ఉంటాయి. పర్యావరణానికి తీవ్ర హానికరంగా మారతాయి. ► ఈ ఏడాది 130 బిలియన్ల మాస్కుల వ్యర్థాలు సముద్రంలో చేరతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండటం పరిస్థితి తీవ్రతకునిదర్శనం. అదే జరిగితే సముద్ర జలాల్లోజెల్లీఫిష్‌ల కంటే మాస్కుల వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ► 2030నాటికి సముద్ర జలాల్లోచేరతాయని అంచనా వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు పదేళ్లు ముందుగానే 2020లోనే పోగుపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యర్థాల నిర్వహణ ఇలా.. ► మాస్కుల వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకుంటే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర ప్రభుత్వ సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు విధానాలు నిర్దేశించాయి. ► ఎన్95, సర్జికల్ మాస్కులను ఒకసారి మాత్రమే వాడాలి. ► వైద్యులు, వైద్య సిబ్బంది వాడిన మాస్కులను 850 డిగ్రీల సెల్సియస్ నుంచి 1100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్రత్యేక గ్యాస్ క్లీనింగ్ ఎక్విప్మెంట్తో కాల్చివేయాలి. ► సాధారణ ప్రజల వాడేసిన మాస్కులను ఇతర వ్యర్థ పదార్థాలతో కలపకూడదు. పారిశుధ్య సిబ్బంది వాటిని సేకరించి బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీతో కాల్చివేయాలి. లేదా పదడుగుల లోతున భూమిలో పాతిపెట్టాలి. కత్తిమీద సాము.. ► మాస్కుల వ్యర్థాల నిర్వహణ ప్రపంచవ్యాప్తంగా కత్తిమీద సాముగా మారింది. ఇంతగా మాస్కులు, మెడికల్ వ్యర్థాలు రోజూ పోగవుతాయని ఎవరూ ఊహించలేదు. వాడిన మాస్కులను ఎక్కడపడితే అక్కడ పారేస్తుండటంతో పరిస్థితి దిగజారుతోంది. ► ఢిల్లీలో ఆసుపత్రుల నుంచి సేకరించిన మెడికల్ వ్యర్థాలలో 70శాతం మాత్రమే శాస్త్రీయంగా నిర్వహిస్తుండగా 30 శాతం రోడ్లపక్కన, నీటివనరుల్లో పడి ఉంటున్నాయి. ఇతర దేశాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ► కరోనా వైరస్ జన్మస్థలం చైనాలోని వూహాన్లో 1.10 కోట్ల జనాభా ఉంది. ఆ నగరంలో సగటున రోజుకు 200టన్నుల మెడికల్ వ్యర్థాలు పోగయ్యాయి. అందులో నాలుగో వంతు వ్యర్థాల నిర్వహణకు మాత్రమే అవసరమైన మౌలిక సదుపాయాలు అక్కడ ఉన్నాయి. చేపల్లో చేరి మళ్లీ మనుషుల్లోకి.. ► ఒక్కో మెడికల్ మాస్కులో దాదాపు 25 గ్రాముల వరకు పోలిపాలిథిన్ ఉంటుంది. దీనివల్ల చేపలతోపాటు 600 రకాల జీవజాతులకు ప్రమాదం పొంచి ఉంది. ఆ చేపలను తినడంతో మనుషులుకూడా అనారోగ్యసమస్యలకు గురవుతారు. ► జర్మనీలో నెలకు 1.70కోట్ల మాస్కులు వాడుతుండటంతో పర్యావరణంలోకి 850 టన్నుల కార్బన్ డయాక్సైడ్వదులుతున్నట్లేనని నిపుణులు అంచనా వేశారు. ఒక కారులో ప్రపంచం చుట్టూ 1,060సార్లు తిరిగితే విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్కు ఇది సమానమని తెలిపారు. రీసైక్లింగ్ సాధ్యమా? భారీ సంఖ్యలో వాడుతున్న మెడికల్ మాస్కులను రీసైక్లింగ్ చేయడం ఆచరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. వాడేసిన మాస్కులను సేకరించి వేరుచేసి రీసైకిల్ చేసి కొత్త మాస్కు తయారు చేయాలి. కానీ అందుకు అయ్యే ఖర్చు ఆ మాస్కు ధర కంటే ఎక్కువగా ఉంటుంది. మాస్కుల రీసైక్లింగ్ అచరణ సాధ్యంకాదని యూనివర్సిటీ ఆఫ్ లండన్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ► మెడికల్ మాస్కులతో పొంచి ఉన్న పర్యావరణ ముప్పును తప్పించాలంటే ప్రత్యామ్నాయ మాస్కుల వాడకాన్ని ప్రోత్సహించాలని, వైద్య సిబ్బంది మినహా మిగిలిన వర్గాలు కాటన్ మాస్కులను వాడాలని సూచిస్తున్నారు. ► కాటన్మాస్కులు డిటర్జెంట్/ డెట్టాల్‌తో ఉతికి ఎండలో ఆరవేసి మళ్లీ వాడుకోవచ్చు. పలు కంపెనీలు, కుటీర పరిశ్రమలు కాటన్‌తో చేసిన మాస్కులను తయారీ చేసి విక్రయిస్తున్నాయి. ఇళ్లల్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ► ఫైబర్‌తో తయారైన రీయూజబుల్ మాస్కులు కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. -
ప్రతీ డాక్టర్‌కు ‘టెలిమెడిసిన్’!
సాక్షి, హైదరాబాద్: వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ఉపక్రమించింది. సాధారణంగా ఆరోగ్య సమస్యలొస్తే డాక్టర్‌ను నేరుగా సంప్రదించి సలహా తీ సుకోవాలి. కానీ డాక్టర్‌ను నేరుగా కలిసే అంశంలో ఎంసీఐ భారీ మార్పులు తీసుకువచ్చింది. డాక్టర్‌తో నేరుగా కాకుండా ఫోన్లో లేదా వీడియో లేదా చాట్ ఆధారంగా ఓపీ సేవలు పొందే వీలు కల్పిస్తోంది. ఈ మేరకు టెలిమెడిసిన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ విధానం ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. పెద్దగా ప్రాచుర్యంలో లేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి డాక్టర్‌కు టెలిమెడిసిన్ సర్టిఫికెట్ కోర్సు ను తప్పనిసరి చేస్తూ ఎంసీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. నీతి ఆయోగ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలను ఎంïసీఐ రూ పొందించగా.. కేంద్రం దీన్ని ఆమోదిస్తూ గెజిట్ విడుదల చేసింది. సులువుగా వైద్య సేవలు.. దేశంలో జనాభా నిష్పత్తికి తగినట్లు వైద్యులు అందుబాటులో లేరు. ఈక్రమంలో వైద్య సేవలను సామాన్యులకు అందించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ కేంద్రం టెలిమెడిసిన్‌ను ప్రవేశపెట్టింది. కరోనా వైరస్ ప్ర భావంతో గత 3 నెలలుగా మెజారిటీ క్లినిక్‌లు మూతపడ్డాయి. కొన్నిచోట్ల డాక్టర్లు ఓపీ చూస్తున్నా.. పరిమితంగా సేవలు అందించడంతో చాలా మంది అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం టెలీమెడిసిన్ విధానాన్ని ప్రతి ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్)కి తప్పనిసరి చేసింది. వైద్య విద్య పూర్తి చేసి ప్రాక్టీస్ పెట్టుకున్న ప్రతి డాక్టర్ ఈ సర్టిఫికెట్ కోర్సు చేయాల్సిందే. ఈ సర్టిఫికెట్ ఆధారంగా రోగితో ఫోన్లో, వీడియోకాల్ ద్వారా లేదా సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ పద్ధతిలో కూడా వైద్య సేవ లు అందించొచ్చు. అలాగే ఆరోగ్య స్థితిని క్రమం తప్ప కుండా ఫాలోఅప్ చేయొచ్చు. ఈ పద్ధ తితో తక్కువ సమ యంలో ఎక్కువ మంది పేషంట్లను చూసే వీలుంటుంది. ఈ టెలిమెడిసిన్ కోర్సుకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ ఇస్తుంది. దాని ఆధారం గా ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహించి అర్హత ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో.. టెలిమెడిసిన్ సర్టిఫికెట్ కోర్సు పర్యవేక్షణకు సంబంధించి ఎంసీఐ ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీ ఏర్పాటుచేసింది. ఆరుగురు సభ్యులు న్న ఈ కమిటీకి డాక్టర్ బీఎన్ గంగాధర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. డాక్టర్ నిఖిల్ థండన్ ఉపాధ్యక్షుడిగా, డాక్టర్ మాధురి కనిత్కర్, డాక్టర్ కేఎస్ శర్మ, డాక్టర్ రాజీవ్ గార్డ్ సభ్యులుగా, డాక్టర్ ఆర్కే వాట్స్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ఈ టెలిమెడిసిన్ కోర్సు అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మరో 12 మంది నిపుణులను కూడా నియమించనుంది. ఈ దిశగా ఎంసీఐ ఆన్లైన్ కోర్సును అభివృద్ధి చేస్తోంది. టెలిమెడిసిన్ చికిత్స, నిర్వహణకు సంబంధించి ఎంసీఐ పలు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నో మార్గాలు.. టెలిమెడిసిన్ విధానంలో రోగులకు సౌకర్యాన్ని బట్టి చికిత్స, సమాచారం ఇవ్వొచ్చని కేంద్ర మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఫోన్, వీడియో, ఆడియో కాల్, వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ హ్యాంగౌట్, స్కైప్, ఈ–మెయిల్ తదితర మాధ్యమాలతో టెలిమెడిసిన్ చికిత్స అందించొచ్చు. టెలిమెడిసిన్ విధానానికి సాధారణ వైద్య సేవలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. -
జూలైలో ‘నీట్’?
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్’పరీక్షను వచ్చే జూలైలో నిర్వహించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల అర్హత పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇటు ఈ నెల 3న జరగాల్సిన నీట్ పరీక్ష కూడా వాయిదా పడింది. దీంతో నీట్ ఎప్పుడు నిర్వహిస్తారా అన్న దానిపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జూలై నాటికి పరిస్థితులు కుదుటపడితే ఆ నెలలో నీట్ నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల 16 రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో ఎంసీఐ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. మరోవైపు కరోనా నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ (ఏఐహెచ్‌ఎస్‌యూ) లేఖ రాసింది. చదవండి: ఈ ఏడాది చివరికల్లా టీకా! ఆన్లైన్ తరగతులు.. హాజరు సమస్య బోర్డు ఆఫ్ గవర్నర్‌కు రాసిన లేఖలో ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు, పరీక్షల నిర్వహణ కష్టతరంగా మారిందని ఏఐహెచ్‌ఎస్‌యూ తెలి పింది. విద్యా సంవత్సరం ప్రారం భం కాబోతుండటం, పరీక్షలు, తరగతుల నిర్వహణ ఎలా చేపట్టాలన్న దానిపై లేఖలో ప్రస్తావించారు. ప్రధానంగా ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నా హాజరు శాతాన్ని పర్యవేక్షించడం కష్టతరం అవుతోందని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్లో ఆన్లైన్ హాజరును కూడా పరి గణనలోకి తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఇది సుదీర్ఘకాలం సాగే ప్రక్రియ కాబట్టి క్లాసు రూం తరగతుల నిర్వహణలోని నిబంధనల్లో మార్పులు తెచ్చే విధంగా చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ కారణంగా యూజీ, పీజీ మెడికల్ పరీక్షల నిర్వహణకు అంతరాయం కలిగింది. దీంతో కొన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులు తమకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపాలని డిమాండ్ చేస్తున్నారని ఎంసీఐ దృష్టికి తీసుకొచ్చారు. ఇక పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే పరిశీలకులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదని పేర్కొన్నారు. వీలైతే ఇతర యూనివర్సిటీల నుంచి, లేకుంటే యూనివర్సిటీ అనుబంధ కాలేజీల నుంచి, అది సాధ్యం కాకుంటే యూనివర్సిటీలోని ఇంటర్నల్ ఎగ్జామినర్లను అనుమతించాలని లేఖలో కోరారు. -
తెలంగాణకు కొత్తగా 54 పీజీ మెడికల్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి 54 పీజీ మెడికల్ సీట్లను మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఉత్తర్వులిచ్చింది. ఈ సీట్లన్నీ నిజామాబాద్ మెడికల్ కాలేజీకే దక్కడం విశేషం. ఎంసీఐ నుంచి నిజామాబాద్ వైద్య విద్య కళాశాలకు శాశ్వత గుర్తింపు లభించిన ఏడాదికి ఒకేసారి 54 పీజీ సీట్లు మంజూరు కావడంపై వైద్య విద్య ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీకి మంజూరైన పీజీ సీట్లలో జనరల్ మెడిసిన్ – 10, అనస్థీషియా – 6, గైనకాలజీ – 6, ఆర్థోపెడిక్స్ – 4, అనాటమీ – 4, ఈఎన్టీ – 3, ఫోరెన్సిక్ మెడిసిన్ – 3, ఫిజియాలజీ – 2, పీడియాట్రిక్ – 3, సైకియాట్రీ – 2, అప్తామాలజీ – 3, పాథాలజీ – 3, మైక్రోబయాలజీ – 3, బయో కెమిస్ట్రీ – 2 ఉన్నాయి. ఇదే కాలేజీకి గతేడాది 3 పీజీ ఫార్మాకాలజీ సీట్లను ఎంసీఐ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నీట్ పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ ఏడాది మార్చి – ఏప్రిల్ నెలలో నిజామాబాద్ కాలేజీలో పీజీ అడ్మిషన్లు ఇస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 706 పీజీ సీట్లుండగా, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 917 సీట్లున్నాయి. మొత్తం అన్నీ కలిపి 1,623 పీజీ సీట్లున్నాయి. కొత్తగా వచ్చిన 54 సీట్లతో కలపి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే 760 సీట్లు అవుతాయి. -
‘మెడికల్’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైద్య విద్యకు సంబంధించి అతిపెద్ద సంస్కరణగా ప్రభుత్వం అభివర్ణిస్తున్న ఈ బిల్లులో.. అవినీతికి ఆలవాలంగా మారిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పొందుపర్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు. ఈ బిల్లును ‘ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956’కు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా మూజువాణి ఓటుతో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభలో ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. తాజాగా రెండు సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ బిల్లు లోక్‌సభకు వెళ్లనుంది. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.. ‘నకిలీ వైద్యులకు అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లు ఉంది. తప్పుడు వైద్య విధానాలకు పాల్పడేవారికి సంవత్సరం జైలుశిక్షతో పాటు, రూ. 5 లక్షల జరిమానా విధించే ప్రతిపాదన బిల్లులో ఉంది. ఇప్పటివరకు అలాంటివారికి ఎంసీఐ నామమాత్రపు జరిమానా మాత్రమే విధించేది’ అని తెలిపారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చిన మూడేళ్లలో నెక్ట్స్(నేషనల్ ఎగ్జిట్ టెస్ట్)ను నిర్వహించడం ప్రారంభిస్తామన్నారు. ఎన్ఎంసీలో రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం లేదన్న ఎంపీల విమర్శలపై స్పందిస్తూ.. మొత్తం 25 మంది సభ్యుల్లో 11 మంది రాష్ట్రాల ప్రతినిధులేనన్నారు. నెక్ట్స్గ్ పరీక్షను మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షగా, అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసినవారికి స్క్రీనింగ్ పరీక్షగా పరిగణిస్తామన్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ల(సీహెచ్‌పీ) వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిందని, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆ వ్యవస్థను అమలు చేస్తున్నాయని, భారత్ కూడా ఆ దిశగా వెళ్తోందని చెప్పారు. ఎన్‌ఎంసీలోని 25 మంది సభ్యుల్లో 21 మంది వైద్యులేనని, వారు సీహెచ్పీల అర్హతలను నిర్ణయిస్తారని హర్షవర్ధన్ వివరించారు. బిల్లును స్థాయీసంఘానికి పంపాలని తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. వైద్య విద్య అభ్యసించని 3.5 లక్షలమంది నాన్ మెడికల్ సిబ్బందికి ఆధునిక వైద్యం అందించే వైద్యులుగా లైసెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ వ్యతిరేకించారు. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎంసీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. వందమందికిపైగా సభ్యులు ఉండే ఇందులో 70 శాతం మందిని ఎన్నుకుంటారు. ఇక కొత్తగా వచ్చిన ఎన్ఎంసీలో 25 మందే సభ్యులుగా ఉంటారు. వారిలో అత్యధికుల్ని కేంద్రమే నామినేట్ చేస్తుంది. ► కేంద్రం నియమించిన ఏడుగురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఎన్ఎంసీ చైర్ పర్సన్ పేరుని, తాత్కాలిక సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది. ► కొత్త కమిషన్‌లో 8 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో నలుగురు వైద్య విద్యకు సంబంధించిన వివిధ బోర్డుల అధ్యక్షులు ఉంటారు. మరో ముగ్గురిని ఆరోగ్యం, ఫా ర్మా, హెచ్ఆర్డీ శాఖలే సిఫారసు చేస్తాయి. ► ఎంసీఐ సమావేశం కావాలంటే వందమందికిపైగా ఉన్న సభ్యుల్లో 15 మంది హాజరైతే సరిపోయేది. వారు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేవి. జాతీయ వైద్య కమిషన్‌కు సంబంధించి 25 మందిలో 13 మంది హాజరైతేనే కీలక నిర్ణయాలు తీసుకోగలరు. ► ఎన్ఎంసీ సభ్యులందరూ విధిగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాలి. ► ఎంసీఐ కాలపరిమితి అయిదేళ్లయితే ఎన్ఎంసీ కాలపరిమితి నాలుగేళ్లు. తాత్కాలిక సభ్యులు రెండేళ్లకి ఒకసారి మారతారు. ► కమిషన్ చైర్మన్‌ను, అందులో సభ్యుల్ని తొలగించే అధికారం పూర్తిగా కేంద్రానిదే. ► ఎంబీబీఎస్, మెడికల్ పీజీకి సంబంధించి అన్ని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిట్లీ 50 శాతం సీట్లలో ఫీజుల నియంత్రణ కమిషన్ చేతుల్లోనే ఉంటుంది. ► వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి, మెడికల్ ప్రాక్టీస్ అనుమతికి సంబంధించి ఎంబీబీఎస్ చివరి ఏడాది నిర్వహించే పరీక్షనే అర్హతగా పరిగణిస్తారు. దీనిని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) పేరుతో నిర్వహిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు భారత్‌లో ప్రాక్టీస్ చేయాలంటే స్క్రీనింగ్ టెస్ట్‌కి హాజరుకావాలి. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వైద్యవిద్యనభ్యసించాలంటే ఇకపై నీట్‌తో పాటు గా నెక్ట్స్ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. ► దేశంలోని హోమియో, యునాని, ఆయుర్వేదం కోర్సులు చదివిన వారు కూడా ఒక బ్రిడ్జ్ కోర్సు ద్వారా అల్లోపతి వైద్యాన్ని చేయవచ్చు. -
58 పురాతన చట్టాల రద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో 58 పురాతన, వాడుకలోలేని చట్టాలను రద్దు చేసింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని రెండు (గత, ప్రస్తుత) ప్రభుత్వాలు కలిసి రద్దు చేసిన పురాతన చట్టాల సంఖ్య 1,824కు చేరింది. చట్టాల రద్దు, సవరణ బిల్లు–2019కు పార్లమెంటు ఆమోదం లభించడంతో త్వరలోనే మరో 137 పురాతన చట్టాలు రద్దు కానున్నాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులకు, ఈ పురాతన చట్టాలకు అసలు సంబంధమే లేదనీ, ఈ కాలానికి అవి పనికిరావని కేంద్రం చెబుతోంది. తాజాగా రద్దు అయిన 58 చట్టాలేవో ఇంకా తెలియరాలేదు. అయితే అవన్నీ ప్రధాన చట్టాలకు సవరణలు చేసేందుకు తీసుకొచ్చినవేనని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. వైద్య విద్యలో ‘నెక్ట్స్’కు ఆమోదం భారత వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) స్థానంలో కొత్తగా జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ–నేషనల్ మెడికల్ కౌన్సిల్)ని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును కేంద్రం 2017 డిసెంబర్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ 16వ లోక్‌సభ గడువు ముగిసే నాటికి అది ఆమోదం పొందకపోవడం కారణంగా రద్దయింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షను అందరికీ ఉమ్మడిగా జాతీయ నిష్క్రమణ పరీక్ష (నెక్ట్స్–నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) పేరిట నిర్వహించేలా బిల్లులో నిబంధనలున్నాయి. ఠి 15వ ఆర్థిక సంఘం తన నివేదికను సమర్పించేందుకు గడువును కేంద్రం మరో నెల రోజులు పొడిగించి నవంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. ఠి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ డిజైన్ చట్టం–2014ను సవరించేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును కేబినెట్ ఆమోదించింది. మరో నాలుగు ఎన్ఐడీలను ఈ చట్టం పరిధిలోకి తెచ్చి, వాటిని జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థలుగా ప్రకటించేందుకు ఈ సవరణను చేపడుతున్నారు. అమరావతి, భోపాల్, జొర్హాత్, కురుక్షేత్రల్లోని ఎన్ఐడీలను కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తేనున్నారు. -
బయోమెట్రిక్ వేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యను మెరుగుపర్చేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఇకపై ప్రతి మెడికల్ కాలేజీ విధిగా బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. కాలేజీ సిబ్బంది అంతా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిందేనని స్పష్టం చేసింది. బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలను ప్రతి రోజూ కాలేజ్ వెబ్సైట్లో పొందుపర్చాలని పేర్కొంది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్‌కు సవరణలు చేసి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నూతన నిబంధనల ప్రకారం, ఎంసీఐ ఎప్పుడు అడిగినా మెడికల్ కాలేజీలు బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ప్రతి కాలేజీ సొంతగా వెబ్‌సైట్‌ను కలిగి ఉండాలి. ‘ఇన్ఫర్మేషన్ అండర్ మినిమమ్ స్టాండర్ట్ రిక్వైర్మెంట్స్ క్లాజ్’పేరిట కాలేజీకి సంబంధించిన వివరాలను ప్రతి నెలా మొదటి వారం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. -
ఎంసీఐ, ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌లు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గురువారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. కుంభకోణాలతో అప్రతిష్ట మూట గట్టుకున్న భారత వైద్య మండలి (ఎంసీఐ – మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) పాలనా వ్యవహారాలు చూసేందుకు కమిటీని నియమిస్తూ గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్‌ను కేంద్రం మరోసారి ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ చట్టం రూపం దాల్చాల్సి ఉండగా, అది పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఎంసీఐ స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటవుతుంది. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆర్డినెన్స్ గడువు మరో పది రోజుల్లో తీరిపోనుండటంతో, ఆ ఆర్డినెన్స్‌ను కేంద్రం మరోసారి ఇచ్చింది. -
దృష్టిలోపం ఉన్నవారికీ ఎంబీబీఎస్ చాన్స్
న్యూఢిల్లీ: దృష్టిలోపం ఉన్న అర్హులైన అభ్యర్థులు వైద్యవిద్య (ఎంబీబీఎస్)ను అభ్యసించేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2018 నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)లో పాసైనప్పటికీ దృష్టిలోపం ఉండటంతో అడ్మిషన్ కోల్పోయిన అశుతోశ్ అనే ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం.. దివ్యాంగుల కోటాలో అశుతోశ్‌కు అడ్మిషన్ ఇవ్వాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)ను ఆదేశించింది. 2018–19 విద్యాసంవత్సరంలోనే ఆయనకు ఎంబీబీఎస్ చేసేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై సీనియర్ కంటివైద్యులతో ఓ కమిటీని ఏర్పాటుచేసిన సుప్రీంకోర్టు వారిచ్చిన సూచనల ఆధారంగానే ఈ తీర్పునిచ్చింది. దివ్యాంగుల కోటా కింద అభ్యర్థి ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందేందుకు అర్హుడంది. గతేడాది ఇద్దరు వర్ణ అంధత్వం ఉన్న విద్యార్థులకు ఎంబీబీఎస్ సీటు నిరాకరించిన కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే తీర్పును వెలువరించింది. కంటిచూపు సరిగాలేదనే కారణంతో అడ్మిషన్లను నిరాకరించలేమని స్పష్టం చేసింది. -
‘రిమ్స్’ అప్రతిష్టపాలు
సాక్షి, ఆదిలాబాద్: వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు వైద్య సదుపాయం కల్పించాలనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆదిలాబాద్‌లో రిమ్స్ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. 2008లో ఈ వైద్య కళాశాల ప్రా రంభమైంది. అప్పట్లో మొదటి బ్యాచ్ పూర్తయ్యే వరకు ఎంసీఐ ప్రతి సంవత్సరం అనుమతులు ఇచ్చేందుకు రిమ్స్‌లో తనిఖీలు నిర్వహించింది. 2008 నుంచి 2013 మధ్యలో ప్రతి సంవత్సరం జరిగిన తనిఖీల్లో పలు ఏడాదిల్లో ఎంసీఐ అనుమతి నిరాకరించడం, దానికి సంబంధించి లోపాలను తెలియజేస్తూ వాటిని సరిదిద్దుకుంటే మళ్లీ అనుమతినివ్వడం జరుగుతూ వచ్చాయి. ఇలా అనేక ఒడిదుడుకులను దాటుతూ మొదటి బ్యాచ్ బయటకు వచ్చిన తర్వాత దీనికి పూర్తిస్థాయి గుర్తింపు లభించింది. ప్రతీ ఐదేళ్లకోసారి ఎంసీఐ బృందం వైద్య కళాశాలలో ఆయా ప్రమాణాలను కొనసాగిస్తున్నారా లేదా అనే పరిశీలన జరిపి మళ్లీ గుర్తింపునిస్తుంది. ఇప్పటికే రిమ్స్ నుంచి ఐదు ఎంబీబీఎస్ బ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. కాగా 2018 జూన్ 5న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం మరోసారి రిమ్స్‌లో ప్రమాణాలను పరిశీలించేందుకు వచ్చింది. దీంట్లో 22 లోపాలను గుర్తించి మరోసారి రిమ్స్‌కు అనుమతి నిరాకరించడంతో వైద్య కళాశాలలో విద్యార్థులు తమ భవితవ్యంపై ఆందోళనలో పడ్డారు. ప్రధానంగా ప్రస్తుతం హౌజ్‌సర్జన్ పూర్తిచేసిన వారు త్వరలో జరిగే పీజీ పరీక్షలు రాయాలంటే రిమ్స్‌కు ఎంసీఐ అనుమతినిస్తేనే సాధ్యమయ్యే పరిస్థితి. 2019లో రిమ్స్‌లో కొత్తగా ప్రవేశాలకు ఈ అనుమతితోనే ముడిపడి ఉంది. ఈ దృష్ట్యా విద్యార్థుల్లో డోలయామానం నెలకొంది. అనుమతి నిరాకరణ తర్వాత పలువురు హౌజ్సర్జన్లు రిమ్స్ డైరెక్టర్ అశోక్‌ను కలిసి ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతర్గత లోపాలు బహిర్గతం.. రిమ్స్‌లో అంతర్గత లోపాలు మరోసారి బహిర్గ తం అయ్యాయి. ప్రధానంగా ఎంసీఐ ఎత్తిచూపిన 22 అంశాల్లో కీలక పదవుల్లో ఉన్న లోపాలు, దాం తోపాటు ప్రొఫెసర్లు, ట్యూటర్ల పోస్టుల ఖాళీలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ అశోక్ ఆస్పత్రికి సంబంధించి కీలకమైన మెడికల్ సూపరింటెండెంట్ పోస్టు, వై ద్య కళాశాలకు సంబంధించి డైరెక్టర్ పోస్టును తన ఆదీనంలో ఉంచుకున్నారని నివేదికలు స్పష్టం చేయడం రిమ్స్‌లో ప్రధానంగా ఉన్నటువంటి లోపాన్ని ఎత్తిచూపింది. అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆయన తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు లేదని స్పష్టం చేయడం గమనార్హం. డాక్టర్ అశోక్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన ఈ పదవికి అర్హులు కాదని పలువురు ఈ విషయంలో ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయినా ఇటు అధికార యంత్రాంగం కాని, అటు పాలకులు కానీ పట్టించుకున్న పాపాన పోకపోవడంతో ఈ వ్యవహారం అలాగే కొనసాగుతూ వస్తోంది. కీలకమైన మెడికల్ సూపరింటెండెంట్ బాధ్యతలు నిర్వర్తిస్తూ అటు డైరెక్టర్‌గా కొనసాగుతూ ఇటు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు న్యాయం చేయడం లేదన్న అపవాదును ఆయన మూటగట్టుకున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా ఉలుకూపలుకు లేకపోవడం చోద్యమే. డీన్ పోస్టులో ఒకరున్నారని.. రిమ్స్ వైద్య కళాశాలలో డీన్ పోస్టు ప్రిన్సిపాల్ పోస్టువంటిది.. అలాంటి పోస్టులో ఓ మహిళా ప్రొఫెసర్ కొనసాగుతున్నారన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎంసీఐ నివేదికలో ఈ రహస్యాన్ని బట్టబయలు చేసింది. తమ తనిఖీలో డీన్ రెగ్యులర్‌గా డ్యూటీలకు అటెండ్ కావడం లేదని వారు పేర్కొన్నారు. అదే సమయంలో జూన్ 5న తాము తనిఖీకి వచ్చినప్పుడు మధ్యాహ్నం 3గంటల వరకు ఆమె అందుబాటులో లేరని తెలిపారు. డీన్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తే హైదరాబాద్ డీఎంఈఆర్ ఆఫీసులో మీటింగ్‌కు వెళ్లారని చెప్పారని, ఆ సమయంలో డీఎంఈఆర్ రిమ్స్‌లో 12గంటలకు తమతో ఉన్నారని ఎంసీఐ సభ్యులు తెలపడం రిమ్స్‌లో రహస్యంగా జరుగుతున్న అనేక వ్యవహారాలను తేటతెల్లం చేస్తోంది. అనేక డిక్లరేషన్ ఫారాలపై డీన్ సంతకం చేయాల్సి ఉండగా, వాటిపై సంతకాలు లేవని పేర్కొన్నారు. బయోకెమిస్ట్రి విభాగంలో ఆమె ప్రొఫెసర్‌గా కొనసాగుతున్న విషయం పలువురికి తెలియదని తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆదిలాబాద్ రిమ్స్‌లో మెడికల్ సూపరింటెండెంట్‌గా, డైరెక్టర్‌గా, డీన్‌గా ఒక్కరే ఉన్నారనే ప్రచారం ఉంది. దీంతో ఈ పోస్టులో మరొకరు ఉన్నారనే విషయం ఎంసీఐ నివేదికతోనే తేటతెల్లమైంది. ఓ ప్రొఫెసర్ పోస్టులో ఇంతటి రహస్యాలు దాచిపెట్టడం వెనుక ఆంతర్యమేమిటో వారికే తెలియాలి. ఫ్యాకల్టీలో ఖాళీలు.. రిమ్స్‌లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి 35.84 శాతం ఖాళీలు ఉన్నట్లు ఎంసీఐ తన నివేదికలో పేర్కొంది. ప్రధానంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం వెనుక కొందరి ప్రయోజనం దాగివుందన్న విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్లో సీనియర్ వ్యక్తులు వచ్చిన పక్షంలో డైరెక్టర్‌గా వారికి అవకాశం దక్కే పరిస్థితి ఉంటుంది. దీంతోనే ఆ పోస్టుల భర్తీలో ఏదో కోణం దాగివుందన్న ఆరోపణలు ఉన్నాయి. ట్యూటర్ పోస్టులు 80.64 శాతం ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఎంసీఐ తనిఖీకి వచ్చిన రోజు ఆస్పత్రిలో పనిచేసే 14 మంది రెగ్యులర్ వైద్యులు హాజరుకాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రెసిడెంట్ డాక్టర్ల విషయంలో పోస్టుల ఖాళీలు అధికంగా ఉన్నట్లు ఎంసీఐ నివేదిక చూపిస్తోంది. కీలక బాధ్యతలో ఉన్న వ్యక్తితో ఈ రెగ్యులర్ డాక్టర్లకు కొంతమందికి పొసగకపోవడంతోనే వారు ఆరోజు హాజరుకాలేదనే ప్రచారం లేకపోలేదు. వీటితోపాటు అనేక లోపాలు.. రిమ్స్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తుల లోపాలు, ఫ్యాకల్టీ ఖాళీలతోపాటు ఇతర లోపాలను కూడా ఎంసీఐ ఎత్తిచూపింది. ప్రధానంగా ఎంసీఐ తనిఖీకి బెడ్ ఆక్యుపెన్సి కేవలం 52.97 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఓపీడీ రిజిస్ట్రేషన్ కౌంటర్ కంప్యూటరైజ్డ్ చేయలేదని స్పష్టం చేశారు. ఓజీ కోసం ప్రత్యేక క్యాజువాలిటీ లేదని తెలిపారు. సెంట్రల్ ఆక్సిజన్‌తోపాటు వాటిని పీల్చే పరికరాలు పనిచేయడం లేదని పేర్కొన్నారు. అనాటమిలో రెండు మృతదేహాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇతర విభాగాల్లోనూ లోపాలను చూపించారు. వీటన్నిటిని నెలరోజుల్లో రెక్టిఫికేషన్ చేసుకోవాలి స్పష్టం చేశారు. కాగా కేవలం ఫ్యాకల్టీ విషయంలోనే ఎంసీఐ లోపం ఎత్తిచూపుతూ మళ్లీ వచ్చేసరికి దీన్ని సరిచేస్తామని తేలికగా చెబుతూ ఎంసీఐ తనిఖీలు నిరంతరం కొనసాగేవే అన్నట్లు రిమ్స్ వర్గాలు వ్యవహరించడం నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. మళ్లీ తనిఖీ ఉంటుంది.. రిమ్స్‌లో మళ్లీ ఎంసీఐ తనిఖీ ఉంటుంది. ప్రధానంగా ఫ్యాకల్టీ లేరని ఎంసీఐ నివేదికలో చూపించింది. ఈ లోపాలను సరిచేసుకుంటాం. మళ్లీ రూ.3లక్షల ఫీజు చెల్లిస్తాం. తద్వారా మళ్లీ తనిఖీలకు బృందం వస్తుంది. ప్రధానంగా ప్రొఫెసర్ 14, అసోసియేట్ ప్రొఫెసర్ 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10శాతం కంటే తక్కువ పోస్టులు ఖాళీగా ఉంటే ఎంసీఐ పెద్దగా ప్రాధాన్యత తీసుకోదు. రిమ్స్‌లో 18 శాతం ఖాళీలు ఉండడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. వాటిని సరిదిద్దుతాం. గతంలో పోస్టులను భర్తీ చేసినప్పటికీ పలువురు సెలవుల్లో ఉన్నారు. మరికొంతమంది బదిలీపై వెళ్లడం జరిగింది. – రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ -
మరోసారి మొండి చేయి!
ఇందూరు నగరంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని ఇక్కడి అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదు. ఎక్కడ చూసినా సమస్యల కుప్పలే. అన్ని విభాగాల్లోనూ లోపాలే. ఫలితంగా ఎంసీఐ గుర్తింపునకు నోచుకోలేకపోయింది. ఐదేళ్ల బోధనకు అనుమతులున్నా చివరగా వచ్చే గుర్తింపు సాధించలేకపోయింది. ఈఏడాది మూడుసార్లు పరిశీలించిన ఎంసీఐ అన్నింట్లోనూ వైఫల్యమేనంటూ అనుమతికి నిరాకరించింది. దీంతో మెడికోలు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మరోసారి ఎంసీఐ షాక్ ఇచ్చింది. కళాశాలకు గుర్తింపు ఇవ్వలేదు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేస్తూ ఎంసీఐ వెబ్సైట్లో పేర్కొంది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడమే ప్రధాన లోపం. కళాశాలకు గుర్తింపు కూడా చాలా ముఖ్యం. గుర్తింపు ఉంటేనే కళాశాల వైద్య విద్యకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటి వరకు కళాశాలకు ఐదేళ్ల వరకు అనుమతి లభించింది. ప్రస్తుతం కళాశాలకు పూర్తిస్థాయి గుర్తింపు ఇవ్వాలి. దీని కోసం ఎంసీఐ మూడుసార్లు పరిశీలించింది. అయినా సమస్యల కారణంతో మరోసారి అనుమతికి నిరాకరించింది. ఇప్పటికే మూడుసార్లు పరిశీలన.. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఎంసీఐ బృందం గుర్తింపు కోసం మూడుసార్లు పరిశీలించింది. ఈ యేడాది ఫిబ్రవరి 21, మార్చి 18, జూన్ 18వ తేదీల్లో ముగ్గురు సభ్యుల బృందం పరిశీలించింది. మూడుసార్లు పరిశీలన అనంతరం కూడా గుర్తింపునకు అనుమతి లభించలేదు. రెండుసార్లు పరిశీలన జరిగితే అనుమతి నిరాకరించినప్పుడు లోపాలను సరిదిద్ది మూడోసారి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉంది. అయితే మూడోసారి సైతం ఇదే పరిస్థితి ఏర్పడింది. ఎంసీఐ గుర్తింపును సాధించలేకపోయింది. పట్టాలకు గుర్తింపు తప్పనిసరి.. వైద్య విద్యకు ఎంసీఐ గుర్తింపు తప్పనిసరి. ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఐదేళ్ల వరకు అడ్మిషన్లకు వైద్య విద్య బోధనకు అనుమతి ఉంది. అయితే తర్వాత దీనికి ఎంసీఐ గుర్తింపు తప్పనిసరి. ఎంసీఐ గుర్తింపు ఉంటేనే వైద్యుల పట్టాలు చెల్లుబాటు అవుతాయి. కళాశాలకు అధికారిక గుర్తింపు ఉంటుంది. ఎంసీఐ మొదటి రెండు అనుమతుల అనంతరం గుర్తింపు కోసం పరిశీలన చేసి అనుమతులు ఇస్తుంది. ప్రస్తుతం ఈ అనుమతి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు రావాల్సి ఉంది. ఎంసీఐ లేవనెత్తిన లోపాలు.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పడక గదుల ఆక్యుపెన్సీ రేటు వందకుగాను కేవలం 60శాతమే ఉంది. 40శాతం ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉందని ఎంసీఐ పేర్కొంది. జనరల్ ఆస్పత్రిలో ఇస్టోపాథోలాజికల్ ల్యా బ్ పనిచేయడం లేదు. అత్యవసర వి భాగం ఆపరేషన్ థియేటర్లు పని చేయడం లేదు. ఆస్పత్రిలో ఎక్స్ రే మిషన్లు పని చేయడం లే దు. మెడికల్ కళాశాలలో లైబ్రరీలో ఏసీ అం దుబాటులో లేదు. కళాశాలలో ఎస్ఆర్ వైద్యులు అవసరమైన మేరకు అందుబాటులో లేరు. గైనిక్, చిన్న పిల్లల విభాగంలో రోగుల కేటా యింపు విధానం సక్రమంగా లేదు. ఇదే వి భాగంలో వైద్య సిబ్బంది కేటాయింపు సరిగ్గా లేదు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక కిందిస్థాయి వరకు అదనపు బాధ్యతలు అప్పగిం చి కొనసాగిస్తున్నారు. దీంతో వైద్య విద్య బో ధన వీలు కాదని పేర్కొంది. వైద్య సిబ్బంది కేటాయింపు, రోగులకు అసౌకర్యాలు, అవుట్ పేషెంట్ విభాగంలో అసౌకర్యాలు ప్రధానంగా పేర్కొన్నారు. సిటీ స్కాన్, స్కానింగ్ సెంటర్ నిర్వహణ సక్రమంగా లేదు. అర్హులైన వైద్య సిబ్బంది పనిచేయడం లేదని పేర్కొంది. మెడికల్ కళాశాలలో వసతి కొరత సమస్యగా పేర్కొన్నారు. లోపాలను సవరిస్తాం.. మెడికల్ కళాశాలకు గుర్తింపు అనుమతి లభించకపోవడంపై ఉన్న లోపాలను సవరిస్తాం. సమస్యలు పరిష్కరించేందకు ప్రధానంగా దృష్టి సారిస్తాం. ఎంసీఐకి మరోసారి విన్నవిస్తాం. చిన్న చిన్న లోపాలను పూర్తిస్థాయిలో నివారిస్తాం. –రాములు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఎంబీబీఎస్ సీట్లు.. 3,500
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య డిగ్రీ కోర్సుల భర్తీ ప్రక్రియకు కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఏర్పాట్లు మొదలుపెట్టింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు వచ్చే వారంలో వెల్లడి అవుతాయని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియను చేపట్టేలా కాళోజీ వర్సిటీ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని వైద్య విద్య సీట్ల విషయంలో ఈ ఏడాది మిశ్రమంగా ఉంది. కొత్తగా మూడు కాలేజీలకు అనుమతి వచ్చిందనేది విద్యార్థులకు సంతోషం కలిగిస్తుండగా... గత ఏడాది ఉన్న వాటిలో 150 సీట్లకు కోత పడటం ఆందోళన కలిగిస్తోంది. వైద్య విద్య కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు భారత వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి తప్పనిసరి. కాలేజీల్లోని వసతులు, బోధన సిబ్బంది, కాలేజీకి అనుబంధంగా ఉండే ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య వివరాలను పరిశీలించిన తర్వాతే ఈ అనుమతులు ఇస్తుంది. 2018–19 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి మొత్తం 3,500 ఎంబీబీఎస్, 1,140 బీడీఎస్ సీట్లున్నాయి. ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి 8 ప్రభుత్వ కాలేజీల్లో 1,250 సీట్లు... 16 ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో 2,250 సీట్లు ఉన్నాయి. బీడీఎస్ సీట్లకు సంబంధించి ఏకైక ప్రభుత్వ కాలేజీలో వంద సీట్లు, 12 ప్రైవేట్ కాలేజీల్లో 1,040 సీట్లున్నాయి. కొత్తగా 450 సీట్లు... సిద్దిపేటలో ప్రభుత్వ వైద్య కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు, రంగారెడ్డి జిల్లా కనకమామిడిలో అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ కాలేజీలో 150 సీట్లకు ఎంసీఐ కొత్తగా అనుమతి ఇచ్చింది. సరైన వసతులు లేని కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆర్వీఎం కాలేజీకి వరుసగా రెండేళ్లు అనుమతి రద్దు చేస్తున్నట్లు ఎంసీఐ గత ఏడాది ప్రకటించింది. అయితే కాలేజీ యాజమాన్యం అనుమతి కోసం చేసిన ప్రయత్నం ఫలించడంతో ప్రస్తుత ఏడాదిలో 150 సీట్ల భర్తీకి ఎంసీఐ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 450 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 150 సీట్ల కోత... ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం వసతులు లేకపోవడం, బోధన సిబ్బంది, ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య నమోదులో లోపాల కారణంగా 3 కాలేజీలకు ఈ ఏడాది అనుమతి రాలేదు. 150 సీట్లున్న మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో 2018–19, 2019–20 విద్యా సంవత్సరాల్లో సీట్ల భర్తీకి అనుమతిని నిరాకరించింది. అలాగే గత సంవత్సరం అనుమతి నిరాకరించిన మల్లారెడ్డి మహిళా వైద్య కాలేజీ, మహావీర్ వైద్య కాలేజీలకు ఈ ఏడాది కూడా సీట్ల భర్తీకి అవకాశం రాలేదు. ఈ రెండు కాలేజీల్లో కలిపి మొత్తం 300 సీట్లున్నాయి. -
ఉరుకులు..పరుగులు
అనంతపురం న్యూసిటీ: ప్రీ పీజీ సీట్ల మంజూరులో భాగంగా భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందం మంగళవారం అనంతపురం సర్వజనాస్పత్రి – వైద్య కళాశాలతోపాటు బుక్కరాయసముద్రం, ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసింది. లోపాలు బయటపడకుండా చూసుకునేందుకు వైద్యులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఎంసీఐ బృందంలో అనాటమీ ప్రొఫెసర్ (గౌహతి), ఫోరెన్సిక్ ప్రొఫెసర్ (సూరత్), సర్జరీ ప్రొఫెసర్ (బెంగళూరు) ఉన్నారు. సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఉండగానే ఆయన సీటులో అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ నవీన్ కుమార్ కూర్చుని ఉండటంతో వైద్యులు కంగుతిన్నారు. అనంతరం ఎంసీఐ బృందం ఆస్పత్రిలోని మెడిసిన్, చిన్నపిల్లలు, గైనిక్, సైకియాట్రీ తదితర ఓపీలను పరిశీలించారు. ఓపీ, ఐపీ పేషెంట్లు, డిజిటల్ రికార్డుల గురించి ప్రశ్నించారు. ఓపీ 1800 నుంచి 2000 మంది, ఐపీ వెయ్యి మంది ఉన్నారని అధికారులు సమాధానమిచ్చారు. గైనిక్ విభాగంలో గర్భిణులకు అందుతున్న సేవల గురించి ఎంసీఐ బృందం సభ్యులు డాక్టర్ నాగరాజు ఆరా తీశారు. రోజూ 25 నుంచి 30 దాకా ప్రసవాలు జరుగుతున్నాయని హెచ్ఓడీ డాక్టర్ శంషాద్‌బేగం వివరించారు. మెయిన్ ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించి పరికరాలు, సిబ్బంది కొరతకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వాలని బృందం సభ్యులు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, అకడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జేసీ రెడ్డి, సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రామస్వామి నాయక్‌ను కోరారు. 43 రోజులుగా ఒక్క స్కాన్ చేయలేదా? సర్వజనాస్పత్రి రేడియాలజీ విభాగంలోని ఆల్ట్రాసౌండ్ స్కాన్ సెంటర్లోకి వెళ్లిన బృందం సభ్యులకు అక్కడ వైద్యులు కన్పించలేదు. రికార్డులను పరిశీలించగా గత నెల తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు ఒక్క స్కానింగ్ కూడా తీసినట్టు నమోదు కాలేదు. 43 రోజులుగా ఒక్కసానింగ్ కూడా చేయలేదా అని ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అందుబాటులో ఉన్న ఒక్క వైద్యురాలు కంపల్సరీ సెలవులో వెళ్లిందని డాక్టర్ జేసీ రెడ్డి తెలియజేశారు. స్కాన్లు ఏవిధంగా చేస్తున్నారని డాక్టర్ నాగరాజ్ ఆరా తీస్తే అన్నీ ప్రైవేట్‌గా చేయిస్తున్నామని సమాధానం ఇచ్చారు. రేడియాలజీ బోర్డులో 15 మంది వైద్యులుండాల్సిన చోట ముగ్గురు మాత్రమే ఉన్నారని ఆయన నోట్ చేసుకున్నారు. సీటీ స్కాన్ సెంటర్లో ఎన్ని స్కాన్లు చేశారని ఆరా తీశారు. అందుకు అక్కడి సిబ్బంది 37 చేశామని చెప్పగా, రికార్డులో 20 మాత్రమే నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అనంతరం వైద్య కళాశాలలోని వివిధ విభాగాలతో పాటు, మైక్రోబయాలజీ, పెథాలజీ, ఫార్మకాలజీ ల్యాచ్లు, ఈ సెంటర్, లైబ్రరీ తదితర వాటిని పరిశీలించారు. వైద్య కళాశాలలో హెడ్‌కౌంట్ వైద్య కళాశాలలో మెడిసిన్, చిన్నపిల్లల విభాగం, ఆర్థో, సర్జరీ, గైనిక్, ఫోరెన్సిక్, ఆప్తమాలజీ, డర్మటాలజీ, అనస్తీషియా, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఈఎన్టీ, రేడియాలజీ, పెథాలజీ, ఎస్పీఎం, తదితర విభాగాలలో ఎంసీఐ బృందం హెడ్ కౌంట్ చేసింది. వైద్యుల ఆధార్‌తో పాటు వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను నిశితంగా పరిశీలించారు. ఎంసీఐ బృందం వెంట వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, హెచ్ఓడీలు డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ పల్లా శ్రీనివాసులు, డాక్టర్ శంషాద్‌బేగం తదితరులు ఉన్నారు.