బ్లూమింగ్టన్లో ఘనంగా కైట్ ఫెస్టివల్!
ఇల్లినాయిస్ రాష్ట్రంలోని బ్లూమింగ్టన్లో ఆదివారం కైట్ ఫెస్టివల్ ఘనం గా జరిగింది. 'ఫర్ ఏ బెటర్ టుమారో' అనే స్వచ్చంద సంస్థ, మెక్లీన్ కౌంటీ ఇండియన్ అసోసియేషన్(ఎంసిఐఏ) సంయుక్తంగా గ్రోవ్ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లల కోసం ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. "ఆకాశానికి రంగులు వేద్దాం-చిన్నారులకు చేయూత నిద్దాం" అన్న భావనతో ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన ఈ పతంగుల పండుగలో పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై గాలి పటాలు ఎగుర వేశారు. ఆటలతో పాటలతో పసందైన భోజన ఏర్పాట్లతో ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకొన్నారు. 300 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పండుగ ద్వారా వచ్చిన మిగులు నిధులను వివిధ పథకాల ద్వారా అనాధ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగిస్తారు .
ఈ సందర్బంగా ఫెస్టివల్ డైరెక్టర్ మండవ రావు మాట్లాడుతూ సంఘ సేవపై ఆసక్తి గల దేశ విదేశాల్లో వున్న ప్రవాస భారతీయులను ఒక త్రాటిపై తీసుకు వచ్చి వారి ద్వారా అనాధ పిల్లలకు చేయూత నిచ్చే సంస్థలకు ఆర్దికంగా సహాయం చేయడమే బెటర్ టుమారో సంస్థ లక్ష్యం అన్నారు.