న్యూఢిల్లీ: జాతీయ వైద్య మండలి (ఎంసీఐ)లో ‘రిజిస్ట్రేషన్’ కుంభకోణం బయటపడింది. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించినవారికి దేశంలో ప్రాక్టీసు చేయడానికి అనుమతికోసం రిజిస్ట్రేషన్ నెంబర్లను సృష్టించిన అధికారులు.. వాటితో నకిలీ పత్రాలను సృష్టించి అభ్యర్థులకు అందజేశారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ. 20 లక్షలు వసూలు చేశారు. మీరట్‌కు చెందిన ఒక వైద్యుడు ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించాడు.
ఈ అక్రమాలపై సమాచారం అందుకున్న సీబీఐ.. ఒక ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టింది. గురువారం దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు చేసి... తప్పుడు సర్టిఫికెట్లతో వైద్యులుగా చెలామణీ అవుతున్న ఆరుగురిని అరెస్టు చేసింది. పలువురు ఎంసీఐ అధికారులు, వైద్యులపై కేసులు నమోదు చేసింది. కాగా, మరోవారం రోజుల్లో పెళ్లి జరుగనున్న నేపథ్యంలో తను అరెస్టు కావడంతో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌కు చెందిన వైద్యుడు ఆత్మహత్యాయత్నం చేశారు. తప్పుడు మార్గంలో ఎంసీఐ రిజిస్ట్రేషన్ పొందిన అభ్యర్థుల నివాసాలపై.. ఎంసీఐ అధికారులకు, అభ్యర్థులకు మధ్యవర్తిగా వ్యవహరించిన మీరట్‌కు చెందిన వైద్యుడి నివాసంలో సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఈ ఆపరేషన్‌లో గుజరాత్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ల్లో పనిచేస్తున్న ముగ్గురు ప్రభుత్వ వైద్యులు సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అయితే, మరొకరిని కూడా అరెస్టు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. రిజిస్ట్రేషన్ కోసం ఒక్కొక్కరు 20 లక్షలు లంచంగా ఇచ్చినట్లు నిందితులు చెప్పారన్నాయి.