బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బి శివరాము సొంత పార్టీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు.
గత బీజేపీ ప్రభుత్వంలో 40 శాతం అవినీతి జరిగిందని ప్రశ్నించిన కాంగ్రెస్.. అంతకంటే ఎక్కువగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. తన సొంత జిల్లా హసన్‌లోనే ఈ అవినీతి.. బీజేపీ హాయాంలోని 40 శాతం కంటే అధికంగా పెరిగిపోందన్నారు. ఈ విషయాన్ని తాను నేరుగా సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు చేస్తున్న అవినీతిపై పార్టీ కార్యకర్తల్లో సైతం తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు.
తాను అవినీతి విషయంలో చాలా స్పష్టంగా తన అభిప్రాయాలు తెలియజేస్తున్నానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు నేతల్లో కూడా ఇదే అభిప్రాయం ఉందని తెలిపారు. పార్టీలో కొంతమంది చేస్తున్న అవినీతిపై చర్చ జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా.. ఎప్పటికప్పుడు పార్టీ నేతలపై నిఘా ఉంచాలని అన్నారు.
తాను సొంతపార్టీ నేతల అవినీతిపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తే చెడ్డవాడిగా ముద్రవేస్తారని తెలుసని అన్నారు. కానీ, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల కోసమే తాను మాట్లాడుతున్నానని తెలిపారు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే మాజీ ఎమ్మెల్యే శివరాము.. అధికారంలో ఉన్న సొంత పార్టీపై అవినీతి ఆరోపణలు చేయటం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం గానీ.. సీఎం సిద్ధరామయ్య గాని ఎలా స్పందిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment