రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా టీజీఎంసీ తనిఖీలు
ఇప్పటివరకు 400కి పైగా కేసుల నమోదు
హైదరాబాద్‌లోనే 150 ఆసుపత్రులపై కేసులు
పదో తరగతి అర్హతతో కూడా వైద్యులుగా చెలామణి
రోగులకు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ సిఫార్సు
వీరితో జాగ్రత్తగా ఉండాలని మెడికల్ కౌన్సిల్ సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉక్కుపాదం మోపుతోంది. మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేశ్ ఆధ్వర్యంలోని బృందం విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. ఎంబీబీఎస్ డిగ్రీ లేకపోయినా నకిలీ సర్టిఫికెట్లతో ఆసుపత్రులు ప్రారంభించి వైద్యం చేస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకుంటోంది.
మెడికల్ కౌన్సిల్ లోని యాంటీ క్వాకరీ కమిటీ క్రియాశీలకంగా పనిచేస్తూ ఇప్పటివరకు ఏకంగా 400 ఆసుపత్రులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. హైదరాబాద్‌లోనే 150కిపైగా ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి.
పదో తరగతితో డాక్టర్..
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పదో తరగతి మాత్రమే అర్హత ఉన్నవాళ్లు కూడా వైద్యం చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. వీరు ఎలాంటి భయం లేకుండా దర్జాగా ఆసుపత్రులను నడుపుతూ.. రోగులకు చికిత్స అందించడం చూసి మెడికల్ కౌన్సిల్ సభ్యులే ఖంగుతింటున్నారు.
పైగా నిపుణులైన వైద్యులు సూచించే యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు (అమికాసిన్), కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్లు (ప్రొజెస్టిరాన్, సెట్రోరెలిక్స్) వంటివి కూడా వీరి వద్ద పెద్దసంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. పలువురు ఆర్‌ఎంపీలు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకే విచ్చలవిడిగా హై ఎండ్ యాంటీబయాటిక్స్‌ను రోగులకు ఇస్తున్నారు. దీంతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరుగుతుందని మెడికల్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తంచేస్తోంది.
కరోనాకన్నా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. వీటిని అధికంగా వాడితే భవిష్యత్తులో పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి యాంటీబయాటిక్స్ పనిచేయవని, దాంతో రోగి ప్రాణాల మీదికి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ ఉంటేనే ప్రాక్టీస్ చేయాలి..
ఎంబీబీఎస్ పట్టా పొంది, మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే అల్లోపతి వైద్యం చేయాల్సి ఉంటుంది. బీఏఎంఎస్, బీహెచ్‌ఎంస్, వేరే ఏ ఆయుష్ కోర్సులు చేసినవారు కూడా అల్లోపతి వైద్యం చేయడం చట్టరీత్యా నేరం. అలాగే ఒక రకం స్పెషలైజేషన్ చేసినవారు వేరే స్పెషలైజేషన్ ప్రాక్టీస్ చేసినా నేరమే అవుతుందని మెడికల్ కౌన్సిల్ అధికారులు చెబుతున్నారు.
కొందరు కార్పొరేట్ ఆసుపత్రుల వాళ్లు బిజినెస్ పెంచుకునేందుకు స్థానిక ఆర్‌ఎంపీలకు కమీషన్లు ఇచ్చి పేషెంట్లను రిఫర్ చేయించుకుంటున్నారని, ఈ విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎంబీబీఎస్ పట్టా లేకుండా.. మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వైద్యం చేస్తూ పట్టుబడితే ఏడాది జైలు శిక్ష.. రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన చికిత్స
రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 4,600 సబ్‌సెంటర్లు ఉన్నాయి. ప్రతి రెండు గ్రామాలకు ఒక సబ్‌సెంటర్ అందుబాటులో ఉంది. 890 పీహెచ్‌సీలు ఉన్నాయి. పల్లె దవాఖానలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆర్‌ఎంపీలపై ఆధారపడకుండా ఈ ఆసుపత్రులకు వెళ్లాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నకిలీ వైద్యులను సంప్రదించి లేనిపోని ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవద్దు. – డాక్టర్ గుండగాని శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment