fake doctors
-
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్‌పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్‌ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్‌పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్‌లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
మెడికల్ రాకెట్ సంచలనం: నకిలీ సర్టిఫికెట్లతో సర్జరీలు, ఏడుగురి మృతి
వైద్యో నారాయణో హరిః అన్న మాటలకే కళంకం తెస్తూ రోగుల పాలిట యమకింకరులుగా మారిపోయారు ఆ నలుగురు. ఎలాంటి జాలి, దయ, పాప భీతి లేకుండా వరుసగా రోగుల్ని బలితీసుకుంది ఈ ముఠా దేశ రాజధాని నగరం నడిబొడ్డున చోటు చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ మెడికల్ రాకెట్ వ్యవహారం కలకలం రేపింది.నకిలీ సర్టిఫికెట్లతో సర్జన్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం సంచలనం సృష్టించింది. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని ఓ క్లినిక్‌లో శస్త్రచికిత్సలు చేయించుకున్న ఇద్దరు పేషెంట్ల మృతితో వీరి వ్యవహారం వెలుగు చూసింది. దీనికి సంబంధించి ఇద్దరు వైద్యులతో పాటు నకిలీ మహిళా సర్జన్, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌ను అరెస్ట్ చేశారు. డాక్టర్ నీరజ్ అగర్వాల్, అతని భార్య పూజా అగర్వాల్ , డాక్టర్ జస్ప్రీత్ సింగ్‌తో పాటు, మాజీ లేబొరేటరీ టెక్నీషియన్ మహేందర్ సింగ్ అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వీరి సమాచారం ప్రకారం ఫేక్ సర్టిఫికేట్లతో శస్త్ర చికిత్స చేయడంతో ఇటీవల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీరి బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసుల విచారణ చేపట్టారు. అలా మెడికల్ రాకెట్ గుట్టు రట్టయింది. 2022లో అస్గర్ అలీ గాల్‌బ్లాడర్ సమస్యతో వీరి ఆసుపత్రికి వచ్చారు. అయితే ఇతనికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ సరిగ్గా థియేటర్లోకి వెళ్లేసరికి డాక్టర్ జస్ప్రీత్ స్థానంలో పూజ ,మహేంద్ర ఉన్నారు. చివరికి ఆపరేషన్ తరువాత సరియైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్రమైన కడుపు నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే లీ ప్రాణాలు పోయాయి. ఎలాంటి అర్హత లేకుండా, కనీస వైద్య ప్రోటోకాల్స్ పాటించకుండా చాలామంది రోగులకు ఇలాంటి శస్త్రచికిత్సలు చేశారని రోగుల బంధువుల ఆరోపణలు వెల్లువెత్తాయి. 2016 నుండి అగర్వాల్ నడుపుతున్న మెడికల్ సెంటర్‌పై కనీసం తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయని దర్యాప్తులో తేలింది. వీరి నిర్లక్ష్యం కారణంగా మొత్తంగా ఏడుగురు చని పోయారు. చివరికి నవంబర్ 1 న, నలుగురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు విచారణలో వీరి బండారం బయట పడిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) చందన్ చౌదరి వెల్లడించారు. ఈసందర్భంగా ఈ క్లినక్‌నుంచి డాక్టర్ల సంతకాలు మాత్రమే ఉన్న ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లు, టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) వివరాల రికార్డులను కూడా గుర్తించారు. వీటితోపాటు గడువు ముగిసిన సర్జికల్ బ్లేడ్లు, అనేక నిషేధిత మందులు ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 47 బ్యాంకుల చెక్‌బుక్‌లు, పలు ఏటీఎం కార్డులు , పోస్టాఫీసు పాస్‌బుక్‌లు, ఆరు POS టెర్మినల్ క్రెడిట్ కార్డ్ మెషీన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల దందా...
-
ఇద్దరు దోస్తులు.. టెన్త్‌లో ఒకరు ఫెయిల్, ఒకరు పాస్.. 25 ఏళ్లుగా డాక్టర్ పని
వరంగల్ క్రైం: చదివింది పదో తరగతి.. అందులో ఒకరు ఫెయిల్.. మరొకరు పాస్. ఇద్దరు మిత్రులు.. డాక్టర్ల వద్ద పనిచేసిన అనుభవం.. పైసలపై ఆశ పెరగడంతో డాక్టర్ల అవతారమెత్తారు. అందుకు అవసరమయ్యే సర్టిఫికెట్లను కొనుగోలు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 25ఏళ్లుగా నగరంలో డాక్టర్లుగా చలామణి అవుతున్న ఇద్దరు నకిలీల బాగోతం ఎట్టకేలకు బయటపడింది. నిందితులను టాస్క్‌ఫోర్స్, ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు. నకిలీ డాక్టర్ల నుంచి రూ.1.28 లక్షలు నగదు, ఆస్పత్రి పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మంగళవారం కమిషరేట్‌లో నిందితుల వివరాలు వెల్లడించారు. హంటర్‌రోడ్డు ప్రాంతానికి చెందిన ఇమ్మడి కుమార్ పదో తరగతి పూర్తి చేయగా, వరంగల్ చార్‌బౌళి ప్రాంతానికి చెందిన మహ్మమద్ రఫీ ఫెయిల్ అయ్యాడు. ఇద్దరు మిత్రులు కావడంతో 1997 సంవత్సరానికి ముందు ప్రముఖ డాక్టర్ల దగ్గర అసిస్టెంట్లుగా పనిచేశారు. డబ్బులు బాగా సంపాదించాలనే ఆలోచనతో బీహార్ రాష్ట్రంలోని దేవఘర్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయంనుంచి ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లతోపాటు గుర్తింపు కార్డులు కొనుగోలు చేశారు. కుమార్ క్రాంతి క్లినిక్ పేరుతో కొత్తవాడలో దుకాణం తెరిచాడు. రఫీ సలీమా క్లినిక్ పేరుతో చార్‌బౌళి ప్రాంతంలో 25 ఏళ్లుగా ఆస్పత్రి నడిపిస్తున్నాడు. సాధారణ రోగాలతో వచ్చే వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవారు. రోగం ముదిరేలోపే కార్పొరేట్ ఆస్పత్రులకు పంపేవారు. చివరికి నకిలీ డాక్టర్ల వ్యవహారం బయటకు తెలియడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్థానిక మట్టెవాడ, ఇంతేజార్గంజ్ పోలీసులు.. వరంగల్ రీజినల్ ఆయుష్ విభాగం వైద్యుల ఆధ్వర్యంలో రెండు ఆస్పత్రులపై దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. నకిలీ డాక్టర్లను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్స్, పోలీసులను సీపీ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు. -
నకిలీ డాక్టర్లా.. ‘విదేశీ’ వైద్యులా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ డేటాబేస్ ట్యాంపరింగ్ నకిలీ వైద్యుల కోసమా? లేక విదేశాల్లో విద్యనభ్యసించి వచ్చిన డాక్టర్ల కోసమా? ఇంటి దొంగలు ఎవరు? అనే కోణంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ హన్మంతరావు ఫిర్యాదు మేరకు బుధవారం నమోదైన ఈ కేసును ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేష్ దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం కౌన్సిల్‌కు వెళ్లి సర్వర్‌ను పరిశీలించాలని భావిస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు కచ్చితంగా ఈ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని, ప్రత్యేక నంబర్ తీసుకున్న తర్వాతే ప్రాక్టీసుకు అర్హులు అవుతారు. ఈ వైద్యులు ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకోవడంతో పాటు తమ విద్యార్హతలు పెంచుకున్నప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఈ డేటాబేస్‌ను మెడికల్ కౌన్సిల్ నిర్వహిస్తుంటుంది. కాగా వైద్య విద్య పూర్తి చేసిన సుభాష్, నాగమణి, శ్రీనివాసులు, రామిరెడ్డి 2016లో కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా తదనంతర కాలంలో ఈ డేటాబేస్‌ను ట్యాంపర్ చేసిన ఇంటి దొంగలు కొందరు సుభాష్, రామిరెడ్డి పేర్లను తొలగించి శివానంద్, దిలీప్‌కుమార్ అనే వారి పేర్లను చేర్చారు. అలాగే నాగమణి విద్యార్హతలు, శ్రీనివాస్ ఫొటో అవే పేర్లు గల కొత్తవారితో మార్చేశారు. ఈ నలుగురినీ 2016లో సుభాష్, నాగమణి, శ్రీనివాసులు, రామిరెడ్డిలకు కేటాయించిన నంబర్లను వినియోగించి కౌన్సిల్లో చేర్చేశారు. ఇలా వెలుగులోకి..: ఇటీవల ఓ వైద్యుడు తన పీజీని అప్డేట్ చేయించుకో వడానికి, మరో ముగ్గురు ఐదేళ్లు పూర్తి కావడంతో రెన్యువల్ కోసం వచ్చారు. అయితే వీరి దరఖాస్తుల్లోని వివరాలు, ఫొటో.. అప్పటికే డేటాబేస్‌లో ఉన్న వాటితో సరిపోలకపోవడంతో ట్యాంపరింగ్ వెలుగులోకి వచ్చింది. నకిలీ పట్టాలు పొందిన వైద్యులు నేరుగా రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నిస్తే బండారం బయటపడే ప్రమాదం ఉంటుంది. అలాగే చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి వచ్చిన వాళ్లు నేరుగా ఇక్కడ రిజిస్టర్ చేసుకుని, ప్రాక్టీసు మొదలుపెట్టే అవకాశం లేదు. మెడికల్ కౌన్సిల్ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు కోవలకు చెందినవారే ఇంటి దొంగల సాయంతో డేటా బేస్ ట్యాంపరింగ్ చేయించి ఉంటారని, ఈ విధంగా మరెన్నో పేర్లు ట్యాంపర్ అయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని నిర్ధారించాలంటే కౌన్సిల్‌లోని కంప్యూటర్లు, సర్వర్‌తో పాటు దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంటుందని చెప్తున్నారు. 2016 తర్వాతే ఈ వ్యవహారం జరిగినట్లు భావిస్తున్న పోలీసులు గడిచిన ఆరేళ్ల కాలంలో ఆ పేర్లతో రిజిస్టర్ అయిన, నమోదు చేసుకున్న డాక్టర్ల వివరాలు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
సిటీలో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు..
ఇంటర్ చదివి ఎంబీబీఎస్‌గా చెలామణి అవుతున్నారు. కత్తెర పట్టి ఆపరేషన్లు చేసేస్తున్నారు. విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్లు ఎక్కిస్తున్నారు. రోగం ఏదైనా హైడోస్ యాంటీ బయాటిక్‌లు ఇచ్చేస్తున్నారు. మొత్తంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు నకిలీ డాక్టర్లు. నగరంలో నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్లుగా మారిన వందలాది మంది వైద్యరంగంలో స్థిరపడి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. గల్లీలు, బస్తీలు, కాలనీలే టార్గెట్‌గా దొంగ వైద్యులు క్లినిక్‌లు ఓపెన్ చేస్తున్నారు. అమాయకులైన నిరుపేదలను మోసం చేస్తూ వైద్యం పేరిట దండుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో వందకు పైగా నకిలీ డాక్టర్లు ఉన్నట్లు ఇటీవల వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదులు అందాయి. ఇంకా అనధికారికంగా మరో వంద మంది వరకు నకిలీ డాక్టర్లు ఉండొచ్చని అంచనా. ఫిర్యాదులు ఎక్కువవడంతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ దీనిపై విచారణకు ఆదేశించగా ఇప్పుడు నగరవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నకిలీ వైద్యులు హల్చల్ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్ ఫెయిలైన వారు సైతం ఎంబీబీఎస్ చేశామని చెప్పుకుంటూ క్లినిక్‌లు తెరుస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వార్డు బాయ్‌లుగా చేసిన వారు సైతం వైద్యుడి అవతారం ఎత్తుతున్నారు. ఆర్ఎంపీ, పీఎంపీ, ఎంబీబీఎస్ వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన విశ్వనగరంలో వందకుపైగా నకిలీ వైద్యులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖకు ఇటీవల ఫిర్యాదులు అందాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు ఈ అంశంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. మూడు రోజుల నుంచి నగరంలోని ఆయా క్లినిక్‌లలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వారి వద్ద ఉన్న మెడికల్ సర్టిఫికెట్లు, ఓపీ, ఐపీ రిజిస్టర్లను పరీక్షిస్తున్నారు. అధికారులు తనిఖీలకు వస్తున్నట్లు తెలిసి..వీరిలో కొంతమంది క్లినిక్‌లకు తాళాలు వేసి.. తప్పించుకుని తిరుగుతుండటం గమనార్హం. పేదల బస్తీలే వీరి టార్గెట్... గ్రేటర్ శివారు ప్రాంతాల్లో పేదలకు ఎక్కువగా నివసించే బస్తీలను ఈ నకిలీ వైద్యులు టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఆరోగ్యంపై కనీస అవగాహన లేని వారికి హైడోస్ యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు, సిరప్లు ఇచ్చి ఎంతో హస్తవాసి ఉన్న వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఈ హైడోస్ మందులు వల్ల తాత్కాలికంగా నొప్పి నుంచి విముక్తి లభించినప్పటికీ...భవిష్యత్తులో కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత సీనియర్ వైద్యులు ఇచ్చిన మందులు కూడా పని చేయకుండా పోతున్నాయి. ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, నాగోలు, బండ్లగూడ, యాంజాల్, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, మీర్పేట్, నాదర్గుల్, బోడుప్పల్, నారపల్లి, కీసరమండల పరిధిలోని రాజీవ్‌గృహకల్ప రోడ్, ఆల్విన్‌కాలనీ, నానక్‌రాంగూడ, కుషాయిగూడ, ఉప్పల్, కాప్రా, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, రామంతాపూర్‌లలో వందకుపైగా నకిలీ వైద్యులు ఉన్నట్లు ఇటీవల ఫిర్యాదులు అందాయి. డీమ్డ్ యూనివర్సిటీల పేరుతో సర్టిఫికెట్లు.. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న పలు డీమ్డ్ వర్సిటీల నుంచి వీరు సర్టిఫికెట్లు పొందుతున్నట్లు ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టైన వ్యక్తుల ద్వారా పోలీసులు గుర్తించారు. ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సులు చదవక పోయినా..ఆస్పత్రుల్లో, ఫార్మా కంపెనీల్లో పని చేసిన అనుభవంతో పేరుకు ముందు డాక్టర్ అనే ట్యాగ్‌ను తగిలించుకుంటున్నారు. క్లినిక్‌లకు వచ్చిన వారి నుంచి ఫీజు రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా సెలైన్లు ఎక్కించి రూ.వేలు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో నకిలీ వైద్యుడు రోజుకు సగటున 30 నుంచి 40 మందికి చికిత్స అందిస్తుండటం గమనార్హం. కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ క్రాస్ ప్రాక్టీస్ ఆయుర్వేద, యునానీ, హోమియోపతి కోర్సులు పూర్తి చేసిన వారికి సరైన ప్రాక్టీస్ లేదు. దీంతో వీరు అల్లోపతి వైద్యులుగా అవతారం ఎత్తుతున్నారు. ఈ వైద్యుల్లో ఉన్న బలహీనతను బస్తీల్లో వెలసిన క్లినిక్‌లు మాత్రమే కాదు..బడా కార్పొరేట్ ఆస్పత్రులు సైతం అవకాశంగా తీసుకుంటున్నాయి. అల్లోపతి వైద్యులతో పోలిస్తే..వీరి వేతనాలు కూడా చాలా తక్కువ. దీంతో వారిని డ్యూటీ డాక్టర్లుగా నియమించుకుంటున్నారు. వీరు కేవలం రాత్రి పూట మాత్రమే విధుల్లో ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగి చెప్పిన విషయాలన్నీ రాసుకుని, క్రాస్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసినట్లు చెబుతున్న వారు నేషనల్ మెడికల్ కమిషన్ పరీక్ష రాయకుండా ప్రాక్టీస్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వారు ఒక్క జియాగూడలోనే పది మంది వరకు ఉండటం గమనార్హం. నకిలీ వైద్యులపై కేసులు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు తమ మెడికల్ సర్టిఫికెట్లను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ప్రాక్టీస్ ప్రారంభిస్తారు. వీరితో పెద్దగా సమస్య ఉండదు. చాలా మంది వివిధ వర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సంపాదించి గుట్టుచప్పుడు కాకుండా వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఇలాంటి నకిలీ వైద్యులపై చీటింగ్ కేసుతో పాటు డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్(1940) సెక్షన్ 27 సహా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 సెక్షన్ 15, 16ల కింద కేసు నమోదు చేస్తారు. వైద్యులు లేకపోవడం వల్లే.. జనాభాకు తగినట్లుగా వైద్యుల సంఖ్య లేదు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి పదివేల మందికి కనీసం 30 మంది వైద్యులు ఉండాలి. కానీ మన దేశంలో 1400 మందికి ఒక్కరే ఉన్నారు. దీనివల్ల నకిలీ డాక్టర్ల బెడద పెరిగింది. వెంటనే డాక్టర్పోస్టుల్ని భర్తీ చేయాలి. ప్రభుత్వం స్పందించి ప్రజారోగ్యాన్ని ప్రజలకు చేరువ చేయాలి. – డాక్టర్ శ్రీనివాస్, రెసిడెంట్ డాక్టర్, నిమ్స్ ప్రమాదకరం నకిలీ వైద్యులకు సరైన పరిజ్ఞానం లేక రోగికి ప్రమాదకరమైన మందులు ఇస్తున్నారు. ఇవి వారి ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. వీరు ఇచ్చే నొప్పి మాత్రలకు అలవాటుపడిన రోగులు చివరకు అవి లేకుండా నిద్రపోని పరిస్థితికి చేరుకుంటున్నారు. యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగించడం మంచిది కాదు. నకిలీ డాక్టర్లకు వెంటనే ముకుతాడు వేయాలి. – డాక్టర్ లోహిత్ చదివింది ఇంటరే.. మీర్‌పేట టీఎస్ఆర్నగర్కు చెందిన సాయికుమార్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి, సంతోష్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా చేరాడు. ఆ తర్వాత మీర్‌పేట క్రాస్‌రోడ్‌లో తానే స్వయంగా ఓ క్లినిక్‌ను ప్రారంభించాడు. తాను ఎంబీబీఎస్ వైద్యుడినని చెప్పుకుంటూ స్థానికులకు వైద్యం చేస్తున్నాడు. విషయం బయటకు పొక్కడంతో ఇటీవల ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యుడి వద్ద అసిస్టెంటే.. తాను సీనియర్ వైద్యుడినని, ఎంతో మంది ఉన్నత వ్యక్తులు తనకు తెలుసని చెప్పుకుంటూ ఏకంగా పోలీసులనే బురిడీ కొట్టించాడు తేజ. బెంగళూర్‌లోని ఓ వైద్యుడి వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన ఇతడు.. మేడిపల్లిలో ఓ క్లినిక్‌ను తెరిచాడు. బస్తీవాసులకే కాకుండా పోలీసులకు సైతం వైద్యం చేశాడు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్, పోస్టు కోవిడ్ బాధితులకు వైద్యసేవలు అందిస్తానని చెప్పి రాచకొండ పోలీసులను ఆశ్రయించి చివరకు మూడు నెలల క్రితం పట్టుబడ్డాడు. మైక్రోబయాలజీ స్టూడెంట్.. నారాయణగూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంఎస్సీ మైక్రోబయాలజీ చదివిన ఒడిశాకు చెందిన సుప్రజిత్ పండా సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉప్పల్ హనుమాన్ సాయినగర్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే కమ్యూనిటీ కార్డియాలజీ సెంటర్ పేరుతో ఓ క్లినిక్‌ను తెరిచాడు. విదేశాల్లో డాక్టర్ కోర్సు చదివినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. ఆశించిన స్థాయిలో రోగులు రాకపోవడంతో వరల్డ్‌హెల్త్ ఆర్గనైజేషన్ పేరుతో ఎం.ఎస్ కార్డియాలజీ ఇన్ ఫెలోషిప్ ఐడీ కార్డును సృష్టించి ఏకంగా గాంధీ ఆస్పత్రిలో పట్టుబడ్డాడు. -
ఆధార్ కార్డు ఆధారంగా ఆస్పత్రికి అనుమతి..
సాక్షి, సిటీబ్యూరో: వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన సూడో డాక్టర్ల కేసులో అనేక కొత్త, ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం చనిపోయిన తన సోదరుడి కోరిక మీదటే ఈ ఆస్పత్రి ఏర్పాటు చేశానంటూ సుభానీ చెప్పుకొచ్చాడు. వైద్య పరంగా ఎలాంటి అర్హతలు లేని ఇతడి స్నేహితుడు ముజీబ్ ఏకంగా చిన్న పిల్లల వైద్యడి (పిడియాట్రిషన్) అవతారం ఎత్తాడు. ఈ వ్యవహారంలో అత్యంత కీలక విషయం ఏమిటంటే... కేవలం ఆధార్ కార్డు ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన డీఎం అండ్ హెచ్ఓ అధికారులు వీరి ఆస్పత్రికి అనుమతి ఇచ్చేయడం. బీకాం మధ్యలో ఆపేసిన మెహదీపట్నం ప్రాంతానికి చెందిన మహ్మద్ షోయబ్ సుభానీకి ఓ సోదరుడు ఉండేవాడు. డాక్టర్ కావాలని, ఓ ఆస్పత్రి పెట్టాలని ఎంతగానే ఆశపడ్డాడు. అయితే అతడు ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతూ చనిపోయాడు. తన సోదరుడి కోరిక తీర్చాలనే ‘లక్ష్యం’తో ఉన్న సుభానీకి ముజీబ్‌తో పరిచయం ఏర్పడింది. హుమాయున్‌నగర్‌లోని ఎంఎం హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఇతడికి ఉందని తెలియడంతో సుభానీ తన ఆలోచన చెప్పాడు. అలా ఆస్పత్రి ఏర్పాటు చేసి నిర్వహిస్తే భారీ లాభాలు ఉంటాయంటూ తనకున్న అనుభవంతో ముజీబ్ చెప్పాడు. దీంతో ఆస్పత్రికి అవసరమైన అనుమతి పొందడంపై దృష్టి పెట్టిన ‘టెన్త్ క్లాస్’ ముబీబ్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ ముజీబ్ పేరుతో ఓ ఆధార్ కార్డు సంపాదించాడు. (‘కొవిడ్’ తీగలాగితే బయటపడ్డ సూడో డాక్టర్లు! ) దీని ఆధారంగా 2017లో డీఎం అండ్ హెచ్ఓకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇతగాడు తాను డాక్టర్ని అంటూ ఎలాంటి నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించలేదు. కేవలం డాక్టర్ అని పేరు ముందు ఉన్న ఆధార్ కార్డును పొందుపరచగా డీఎం అండ్ హెచ్ఓ అధికారులు అనుమతి ఇచ్చారంటూ ఇతగాడు పోలీసులకు చెప్పాడు. ఇలా సమీర్ పేరుతో ఆస్పత్రి ఏర్పాటు చేసిన ఈ ద్వయం వైద్యం చేయడం మొదలెట్టింది. సుభానీ చైర్మన్‌గా, ముజీబ్ ఎండీగా ఈ ఆస్పత్రి నిర్వహిస్తూ వచ్చారు. తన పేరు పక్కన ఎండీ అని రాసుకునే ముజీబ్ ఎవరైనా గుచ్చిగుచ్చి అడిగితే తాను మెడిసిన్‌లో ఎండీ చేయలేదని, కేవలం ఆస్పత్రికి ఎండీనని చెప్పుకొచ్చేవాడు. ఇలా దాదాపు నాలుగేళ్లుగా అనేక మందికి ఈ ద్వయం వైద్యం చేస్తూ వచ్చింది. కోవిడ్ మందుల బ్లాక్ మార్కెటింగ్ ముఠా చిక్కడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ ఔషధాల కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ప్రశ్నించడానికి ఇరువురినీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వీరి గుట్టురట్టైంది. ఆధార్ కార్డులో పేరు ముందు డాక్టర్ అనే పదం ఎలా వచ్చిందంటూ పోలీసులు ముజీబ్‌ను కోరారు. తాను సుదీర్ఘ కాలంగా వివిధ ఆస్పత్రుల్లో పని చేశానని, ఈ నేపథ్యంలోనే తనని అందరూ డాక్టర్ అని పిలుస్తారని చెప్పాడు. ఆధార్ కార్డులు జారీ చేసే వారు తమ వద్దకు వచ్చినప్పుడు తాను చెప్పకుండానే వాళ్లే డాక్టర్ అని పేరు ముందు పెట్టేశారంటూ చెప్పుకొచ్చాడు. ఈ సూడో డాక్టర్లను రిమాండ్‌కు తరలించిన ఆసిఫ్‌నగర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. త్వరలో డీఎం అండ్ హెచ్ఓ అధికారులకూ నోటీసులు జారీ చేసి ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌పై ప్రశ్నించనున్నారని తెలిసింది. అసలు ఎలాంటి వైద్య విద్యకు సంబంధించిన డిగ్రీలు లేకుండా, వాటిని దాఖలు చేయకుండా ఆధార్ కార్డులో పేరు ముందు డాక్టర్ పదం ఆధారంగా ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతి ఎలా ఇచ్చారు? దానికి బాధ్యులు ఎవరు? ఈ వ్యవహారం వెనుక మతలబు ఏంటి? తదితర అంశాలు ఆరా తీయాలని పోలీసులు నిర్ణయించారు. -
చదివింది హోమియోపతి.. చేసేది అల్లోపతి!
సాక్షి, రంగారెడ్డి : జిల్లాల్లో శంకర్‌దాదాల వైద్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పవిత్రమైన వైద్య వృత్తిని అడ్డుపెట్టుకొని రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. చిన్న రోగాన్ని సైతం పెద్దగా చూపించి రోగులకు మిడిమిడి వైద్యపరిజ్ఞానంతో ట్రీట్మెంట్ చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాడీపట్టే వారంతా వైద్యులేనని నమ్మిన గ్రామీణ ప్రజలు ఆరోగ్యం కోసం వేల రూపాయలను ధారపోస్తున్నారు. ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్ఎంపీలు తమకు వచ్చిన విద్యతో రోగులకు వైద్యం చేస్తున్నారు. మరోవైపు పాతకాలపు వైద్యవిద్య హోమియోపతి చదివిన వారు కూడా డాక్టర్లుగా అవతారమెత్తి రోగులకు అల్లోపతి వైద్యం చేస్తుండడం మరోకోణం. వీరితో పాటు ఆయుర్వేదం, యునానీ, న్యాచురోపతి చదివిన వారు కూడా పాలీక్లినిక్‌లు అల్లోపతి వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో సుమారు 200లకు పైగా పాలీకేంద్రాలను ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. భారత పూర్వకాలపు ప్రకృతి వైద్యవిధానంలోని ఆయుర్వేదం, యునానీ, న్యాచురోపతి æవంటి వైద్యం నేటి ఆధునిక కాలంలో ప్రాధాన్యత చాలా తక్కువ. హోమియోపతి వైద్యంలోనూ వివిధ రకాల రోగాలకు వివిధ మూలకాలతో హోమియోపతి పిల్స్ ఇస్తారు. అయితే బీహెచ్ఎంఎస్ చేసిన వారు కూడా పాలీ క్లినిక్‌లుల బోర్డులు పెట్టి రోగులకు వైద్యం చేస్తుండటం గమనార్హం. హోమియోపతి వైద్యం కోసం వచ్చే వారికి అల్లోపతి వైద్యం చేస్తున్నారు. క్లినిక్‌లో బెడ్లు ఏర్పాటు చేసి స్టెరాయిడ్ మందులు, యాంటిబయోటిక్స్ గోలీలు, సూదులు ఇస్తున్నారు. ఇంతటితో ఆగకుండా రక్తపరీక్షలు చేస్తున్నారు. బీపీలు, షుగర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. చదువుకు సంబంధం లేకుండా తమకు తెలిసిన వైద్యపరిజ్ఞానంతో గ్రామీణ రోగుల ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని ఓ వ్యక్తి ప్రభుత్వ అనుమతులు లేకుండా పాలీక్లినిక్ను నిర్వహిస్తున్నారు. హోమియోపతి వైద్యం చాటున అల్లోపతి వైద్యం చేస్తున్నారు. మారుమూల గ్రామాల రోగులతో పాటు, కర్ణాటక నుంచి వచ్చే రోగులకు అల్లోపతి వైద్యం అందిస్తుండటం గమనార్హం. నిద్దరోతున్న అధికారులు జిల్లాలో శంకర్‌దాదాల వైద్యం యథేచ్ఛగా సాగుతున్నా జిల్లా వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో మందులు విక్రయిస్తున్నారు. అలాగే ఆర్ఎంపీ, బీఎంపీ, బీఎమ్మెస్ వారు రాసిన ప్రిస్క్రిప్షన్లకు స్టెరాయిడ్ మందులు ఇస్తున్నారు. ఇంతా జరుగుతున్నా డ్రగ్స్ అధికారులు కనీసం పర్యవేక్షణ కూడా చేయకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. -
తప్పంతా సిబ్బందిదేనట!
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఉన్నతాధికారుల విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. అసలు సూత్రదారులను వదిలే సి, తప్పంతా కింది స్థాయి సిబ్బందిదేనని అధికారులు తేల్చడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఆయా, సూపర్వైజర్లపై వేటు వేసిన ఉన్నతాధికారులు.. ఇద్దరు స్టాఫ్‌నర్సులకు మెమోలు జారీ చేసి చేతులు దులుపుకోవడం గమనార్హం. సాక్షాత్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి విచారణ జరిపినా అసలు నిందితులు బయటకు రాకపోవడమేమిటో అంతు చిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం.. జిల్లా ఆస్పత్రిలో రెండు నెలల పాటు ఎలాంటి అనుమతి లేకుండా 17 మంది ఉద్యోగులుగా కొనసాగుతూ వైద్యం చేసిన ఘటన బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా జిల్లా ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగులు తిష్ట వేసి, ఏకంగా అత్యవసర విభాగంలోనూ వైద్యచికిత్సలు అందించడం అప్పట్లో కలకలం రేపింది. ఆస్పత్రిలోని 328వ గదిలో అక్రమార్కులు తమ దందా కొనసాగించడం, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడం, ఈ గదిలోనే నకిలీ ఉద్యోగులకు విధులు కేటాయించడం చేశారు. దాదాపు రెండు నెలలు ఉద్యోగుల పేరిట ప్రైవేట్ వ్యక్తులు ఆస్పత్రిలో ఇంజక్షన్లు, ఇతరత్రా చికిత్సలు అందించడం చేశారు. అయితే, అత్యవసర విభాగంలో ఓ రోగికి యువకుడు సూది మందు ఇచ్చే విధానంలో తేడా కనిపించడాన్ని గమనించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు ఆ యువకుడ్ని వారించాడు. అసలు నువ్వు ఎవరని ఇంజక్షన్ ఇస్తున్న యువకుడ్ని సూపరింటెండెంట్ గట్టిగా నిలదీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను కొత్తగా రిక్రూట్ అయినట్లు సదరు వ్యక్తి చెప్పడంతో అవాక్కయిన రాములు అసలు విషయం ఆరా తీయగా నకిలీ ఉద్యోగుల యవ్వారం బయట పడింది. మొత్తం 17 మంది నకిలీ ఉద్యోగులు ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్నట్లు తేలింది. ఈ విషయం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది డీఎంఈ విచారించినా.. ఈ వ్యవహారంపై కలెక్టర్‌తో పాటు ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఆస్పత్రికి స్వయంగా విచారణ జరిపారు. మాక్లూర్ మండలానికి చెందిన ఓ యువకుడు.. జిల్లా ఆస్పత్రిలో కొలువుల పేరిట కొంత మంది యువతీయువకుల నుంచి డబ్బులు వసూలు చేసి, వారిని ఆస్పత్రిలో ఉంచి పని చేయించినట్లు తేలింది. బాధితులతో పాటు నిందితుడ్ని విచారించిన డీఎంఈ.. ఆస్పత్రి అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులు ఆస్పత్రిలో నేరుగా వైద్యసేవలు అందించడం, శిక్షణ పేరిట కొనసాగడంపై ఎందుకు పసిగట్టలేకపోయారని గట్టిగా క్లాస్ తీసుకున్నారు. దీంతో ఆస్పత్రిలోని కీలక అధికారులపై చర్యలు తప్పవని అంతా భావించారు. ఏం జరిగిందో ఏమో కానీ, తప్పంతా చిరుద్యోగులేనని ఉన్నతాధికారులు వారిపై కొరడా ఝళింపించారు. ఆయా, సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించారు. అలాగే, అత్యవసర విభాగం, ఓపీ విభాగం వద్ద విధులు నిర్వర్తించే స్టాఫ్‌నర్సులకు మెమోలు జారీ చేసి, అధికారులు చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుకు సాగని కేసు నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో బాధితులు ఒకటో టౌన్లో ఫిర్యాదు చేశారు. మాక్లూర్ మండలం గుత్పకు చెందిన సతీష్ ఉద్యోగాల పేరిట డబ్బుల తీసుకుని తమను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సతీష్‌ను ప్రశ్నించిన అధికారులు.. మోపాల్ మండలం కాల్పోల్కు చెందిన గోపాల్ పేరును వెల్లడించాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నెల రోజులు గడిచినా కేసు విచారణ కొలిక్కి తేలేక పోయారు. అసలు సూత్రదారులను వెలికి తీయడంలో జాప్యం జరుగుతుండడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము మోసపోయమని, తమకు న్యాయం చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరిని తొలగించాం.. నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో ఒక ఆయాతో పాటు సంబంధిత ఫ్లోర్ సూపర్వైజర్ను తొలగించాం. ఇద్దరు స్టాఫ్‌నర్సులకు మెమోలు జారీ చేశాం. ఆస్పత్రి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – డా.రాములు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఆక్యుప్రెషర్‌తో రోగాలు నయం చేస్తామంటూ...
సాక్షి, హైదరాబాద్ : ఆక్యుప్రెషర్ పేరుతో రోగాలు నయం చేస్తామంటూ మోసం చేస్తున్న ఒక ఏజెంట్, ఇద్దరు నకిలీ డాక్టర్లపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి శివమొగ్గకు చెందిన నూర్ మహ్మద్ సయ్యద్, సయ్యద్ షబ్బీర్ ఆక్యుప్రెషర్ వైద్యంతో రోగాలు నయం చేస్తామంటూ చంపాపేట్ బాలాజీ గార్డెన్లో 15 రోజుల ఒకసారి శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రతి రోగి వద్ద నుంచి 500 రూపాయలు వసూలు చేస్తూ లక్షల రూపాయలను దన్నుకున్నారు. అన్ని రకాల రోగాలను నయం చేస్తామని నమ్మబలికి వేల మంది రోగులను తప్పు దోవ పట్టిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏజెంట్ల ద్వారా వేలాది మందిని శిబిరానికి రప్పించుకుంటూ పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. మాదన్న పేటకు చెందిన మహ్మద్, ఆదిభట్లకు చెందిన సరస్వతి గతంలో ఎన్నో సార్లు వారి దగ్గర వైద్యం చేయించుకున్నారు. వైద్యం చేయించుకుంటున్నప్పటికి షుగర్ మరింత ఎక్కువవటంతో మోసపోయామని గ్రహించిన వారు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. దీంతో ఒక ఏజెంట్, ఇద్దరు డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అంతర్రాష్ట్ర నకిలీ ఆయుర్వేద మోసగాళ్లు అరెస్టు
తిరుపతి క్రైమ్: ఎలాంటి రోగాన్నైనా ఇట్టే తగ్గిస్తామంటూ నకిలీ ఆయుర్వేద మందులను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.6 లక్షల 90 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, రూ.4 లక్షల 84 వేల విలువ చేసే చెక్కులు, రూ.5 లక్షల 10 వేలు విలువ చేసే ఆయుర్వేద మందులు, నకిలీ చూర్ణం స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తిరుపతిలో క్రైమ్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాలకు వచ్చే రోగులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఆయుర్వేద మందులను విక్రయిస్తూ నకిలీ వైద్యుల ముఠా రూ.లక్షలు గుంజు తుందని డీఎస్పీ తెలిపారు. ఇలా మోసం చేస్తున్నవారిపై ఫిర్యాదు వచ్చిం దన్నారు. కర్ణాటకకు చెందిన 13 మంది ముఠాగా ఏర్పడి నకిలీ ఆయుర్వేద వైద్యులుగా చలామణి అవుతున్నారని తెలిసిందన్నారు. ఈ ముఠాలోని ఇద్దరు కీలక వ్యక్తులను మంగళవారం అలిపిరి రోడ్డులోని యాత్రికుల నడకదారిలో అరెస్టు చేశామన్నారు. వీరిని కర్ణాటకకు చెందిన రవిశెట్టి అలియాస్ రవికుమార్ యాదవ్ (38), బాగల్‌కోట కుమార్ (42)లుగా గుర్తించామని చెప్పారు. మోసం ఇలా.. 13 మంది ముఠా ఎస్వీ ఆయుర్వేద హాస్పిటల్‌కు మోకాళ్లు, మెడ నొప్పులతో వచ్చే రోగులను గుర్తించేవారు. 15 రోజుల్లోనే ఆరోగ్యవంతులవుతారని నమ్మించి శ్రీ సిద్ధి వినాయక ఆయుర్వేద మందుల దుకాణానికి వెళ్లి వైద్యున్ని సంప్రదించాలనేవారు. అక్కడ రూ.30 వేలు నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసేవారని పేర్కొన్నారు. కేసును ఛేదించడంలో క్రైమ్ సీఐలు భాస్కర్‌రెడ్డి, అబ్బన్న, శరత్‌చం ద్ర, రసూల్ సాహెబ్, పద్మలత, ఎస్ఐ రమేశ్ బాబు, సిబ్బంది తదితరులు కృషి చేశారన్నాని డీఎస్పీ తెలిపారు. -
నకిలీ వైద్యులపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును తప్పుపడుతూ గురువారం శాసనమండలిలో అధికారపక్ష సభ్యులే మంత్రి లక్ష్మారెడ్డిపై విమర్శలు చేశారు. నకిలీ వైద్యులకు సంబంధించిన ప్రశ్న సందర్భంగా ఎంఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లు అమాయక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. అలాంటి వారిపై పీడీ చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఓ ఆస్పత్రిలో చేరిన మహిళకు పరీక్షలేవీ చేయకుండానే 15 రోజుల వ్యవధిలో మూడు సర్జరీలు చేసి ఆమె మృతికి కారణమైన వైద్యులు, ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి, మంత్రి పేషీకి ఫిర్యాదు చేసినా ఇంత వరకు స్పందించలేదని మరో సభ్యుడు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి విమర్శించారు. అలాగే సరైన వైద్యం అందించక పోవడంతో అదే ఆస్పత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే మృతి చెందిన ఘటనపైనా ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. దీనిపై లక్ష్మారెడ్డి స్పందిస్తూ మహిళ మృతి కేసులో చట్ట ప్రకారం ఆస్పత్రిపె చర్యలు తీసుకుంటామని, మాజీ ఎమ్మెల్యే మృతి అంశంపై విచారణ జరుగుతోందన్నారు. ఇంకా పలువురు సభ్యులు విమర్శలు కురిపించడంతో మంత్రి లక్ష్మారెడ్డి కొంత అసహనానికి గురవగా ఆర్థిక మంత్రి ఈటల కల్పించుకొని మాట్లాడుతూ రాత్రికి రాత్రే అన్ని సమస్యలు పరిష్కారం కావన్నారు. ఏవైనా సమస్యలుంటే మంత్రుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలంటూ అందరినీ సమాధాన పరిచారు. 1.83 లక్షల కేసీఆర్ కిట్ల పంపిణీ రాష్ట్రంలో స్వల్పకాలంలోనే 1.83 లక్షల కేసీఆర్ కిట్లను పంపిణీ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. గురువారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభమయ్యాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 55 శాతం ప్రసవాలు పెరిగాయని, మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. -
నకిలీ డాక్టర్లకు సంకెళ్లు
కల్లూరు/ఎమ్మిగనూరు రూరల్ : కర్నూలులోని సుఖీభవ ఆస్పత్రి, ఎమ్మిగనూరులోని శ్రీనరహరి క్లినిక్‌కు చెందిన నకిలీ డాక్టర్లను కటకటాల వెనక్కి పంపారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఈ ఆస్పత్రులపై దాడులు నిర్వహించి..నకిలీ డాక్టర్ల గుట్టురట్టు చేసిన విషయం విదితమే. కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్స్‌లో ఉన్న సుఖీభవ ఆస్పత్రి ఎండీ నాగప్రకాష్ (ఎండీ), ఇందులో పనిచేసే యునాని డాక్టర్ రేష్మాబేగం అర్హతలు లేనప్పటికీ అల్లోపతి వైద్యం చేస్తుండడంతో విజిలెన్స్ సీఐలు శ్రీనివాసరెడ్డి, జీవన్‌కుమార్ బుధవారం అర్ధరాత్రే వారిని అదుపులోకి తీసుకుని.. నాల్గవ పట్టణ పోలీసులకు అప్పగించారు. నిందితులపై 420తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రామయ్య నాయుడు తెలిపారు. వీరిని గురువారం కోర్టులో హాజరుపరిచామన్నారు. అలాగే ఎమ్మిగనూరులో శ్రీ నరహరి క్లినిక్ నిర్వహిస్తూ విజిలెన్స్‌కు దొరికిపోయిన నకిలీ డాక్టర్ నరహరిరెడ్డి, అతని కుమారుడు శ్రీనివాసరెడ్డిలను గురువారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై చీటింగ్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశామని పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్‌కు పంపుతూ మెజిస్ట్రేట్ వాసుదేవ్ ఆదేశాలిచ్చారన్నారు. -
డిగ్రీ ఫెయిల్..30 ఏళ్లకు పైగా వైద్యం
కర్నూలు(హాస్పిటల్)/కల్లూరు/ ఎమ్మిగనూరు రూరల్: ఒకడు ఇంటర్ చదివి వైద్యం చేస్తాడు. మరొకడు డిగ్రీ ఫెయిలైనా మెడలో స్టెతస్కోపు వేసుకుంటాడు. నకిలీ ఆయుర్వేద, యునాని సర్టిఫికెట్లు కొని తెచ్చుకుని దర్జాగా తెల్లకోటు వేసుకుంటాడు మరో ప్రబుద్ధుడు. ఇలా ఒకటా, రెండా..తరచూ ఎక్కడోచోట నకిలీ డాక్టర్ల లీలలు బయటపడుతూనే ఉన్నాయి. అడ్డగోలు సంపాదనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి పట్టుకున్నప్పుడు మాత్రమే వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు విచారణ పేరిట హడావుడి చేస్తున్నారు. తాజాగా బుధవారం కల్లూరు, ఎమ్మిగనూరులో విజిలెన్స్ అధికారుల దాడుల్లో ‘శంకర్‌దాదాల’ గుట్టు రట్టయ్యింది. హెల్త్ ఎడ్యుకేటర్ ఏకంగా డాక్టర్ అవతారమెత్తాడు! కల్లూరు ఎస్టేట్స్‌లోని పందిపాడు గ్రామంలో సుఖీభవ ఆస్పత్రి ఏర్పాటు చేసిన నాగప్రకాష్ గతంలో వైద్య, ఆరోగ్యశాఖలో హెల్త్ ఎడ్యుకేటర్‌గా పనిచేశాడు. కొన్నాళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి ఆసుపత్రి నిర్మించాడు. కల్లూరులో అతను ఓ పెద్ద డాక్టర్‌గా చలామణి అవుతున్నాడు. ఈ విషయం తెలిసి విజిలెన్స్ అధికారులు రెక్కీ నిర్వహించారు. బుధవారం విజిలెన్స్ సీఐలు శ్రీనివాసరెడ్డి, జీవన్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ జయన్న, కానిస్టేబుళ్లు నాగభూషణరావు, మునిస్వామి ఆస్పత్రిపై దాడి చేశారు. ఆస్పత్రి ఏర్పాటుకు అవసరమైన డీఎం అండ్‌హెచ్‌ఓ, ఫైర్, పొల్యూషన్ తదితర అనుమతులు ఏమేరకు ఉన్నాయో రికార్డులు పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న వారి అర్హతలనూ అడిగి తెలుసుకున్నారు. నాగప్రకాష్, టి.లక్ష్మినారాయణ మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్న ఈ ఆస్పత్రిలో నాగప్రకాష్ వైద్యునిగానూ చలామణి అవుతున్నట్లు వెలుగు చూసింది. అలాగే డ్యూటీ డాక్టర్లుగా యునానీ చేసిన రేష్మాబేగం, ఎస్. షాహీన్ బేగం, మూసుం బాషాలను పెట్టుకుని..వారితో అల్లోపతి వైద్యం చేయిస్తున్నట్లు తేలింది. కాగా..తమ ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, అర్హులైన వైద్యులను పిలిపించి రోగులకు చికిత్స చేయిస్తున్నామని నాగప్రకాష్ వివరణ ఇచ్చారు. డిగ్రీ ఫెయిల్..30 ఏళ్లకు పైగా వైద్యం ఎమ్మిగనూరు మండలం పార్లపల్లికి చెందిన నరహరిరెడ్డి డిగ్రీ ఫెయిలయ్యాడు. అతని కుమారుడు శ్రీనివాసరెడ్డి ఇంటర్ వరకు చదివాడు. నరహరిరెడ్డి పార్లపల్లిలో ధనుంజయ్ అనే ఆర్ఎంపీ దగ్గర అరకొర వైద్యం నేర్చుకున్నాడు. అనంతరం గూడూరు మండలం సి.బెళగల్‌కు వెళ్లి అక్కడ దాదాపు 18 ఏళ్లపాటు క్లినిక్ నడిపాడు. 1994లో ఎమ్మిగనూరు పట్టణానికి వచ్చి స్థానిక శకుంత సర్కిల్లో శ్రీనరహరి క్లినిక్ ప్రారంభించాడు. దానికి సమీపంలోనే కుమారుడితో మెడికల్ షాప్ పెట్టించాడు. ఎంబీబీఎస్ డాక్టర్‌గా చలామణి అవుతూ రోగులకు వైద్యం చేస్తుండేవాడు. అవసరం లేకున్నా ఎక్కువ మందులు రాసిచ్చి తన కుమారుడి మెడికల్ షాపునకు పంపేవాడు. ఇతని వ్యవహారం విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించారు. రోగుల మాదిరి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు. తండ్రి లేని సమయంలో కుమారుడు శ్రీనివాసరెడ్డి కూడా వారికి వైద్యం అందించాడు. బుధవారం మళ్లీ విజిలెన్స్ ఉద్యోగి ఒకరు పేషెంట్ మాదిరి వెళ్లారు. శరీరంలో గడ్డలు ఉన్నాయని, సాయిరాం హాస్పిటల్‌కు వెళ్లి స్కానింగ్ తీయించుకురావాలని నరహరిరెడ్డి సూచించాడు. దీంతో స్కానింగ్ తీయించుకొచ్చారు. రిపోర్టులో ఏమీ లేదని బయటపడటంతో ‘లోపల బెడ్‌పై పడుకోండి.. సెలైన్ ఎక్కిస్తా’నని నరహరిరెడ్డి చెప్పాడు. సరే అని బెడ్‌పై పడుకున్నారు. అదే సమయంలో నకిలీ డాక్టర్ సెలైన్ ఎక్కించేందుకు రావటంతో విజిలెన్స్ అ«ధికారులు దాడి చేశారు. ‘నీవు వైద్యం చేసేందుకు అర్హత సర్టిఫికెట్లు ఏమి ఉన్నాయ’ని ప్రశ్నించారు. అతను సరైన సమాధానం చెప్పకుండా అడ్డంగా దొరికిపోయాడు. తండ్రి, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. క్లినిక్‌ను సీజ్ చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు వెంకటేశ్వర్లు, జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇక్కడ రోజూ వంద మంది దాకా వైద్యం చేయించుకునేవారని, నరహరిరెడ్డి వద్ద ఆయుర్వేదిక్ మెడిసిన్ సర్టిఫికెట్ ఉందని, దానిపైనా విచారణ చేస్తామని చెప్పారు. జిల్లాలో నకిలీ డాక్టర్ల గురించి సమాచారమిస్తే వారి భరతం పడతామని ప్రజలకు సూచించారు. దాడుల్లో పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, విజిలెన్స్ అధికారి ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పుట్టగొడుగుల్లా ఆస్పత్రులు జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, క్లినిక్‌లు కలిపి 393 రిజిష్టర్ అయ్యాయి. రెన్యువల్, కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం మరో 50 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. రిజిష్టరైన 393 ఆసుపత్రులు, క్లినిక్‌ల్లోనూ 70 మినహా అన్నీ కాలపరిమితి తీరిపోయాయి. వీటిని రెన్యువల్ చేయించుకోవడం లేదు. కొందరు రెన్యువల్ చేయించుకుందామని వైద్య, ఆరోగ్యశాఖకు వెళితే అక్కడ మామూళ్ల బెడద తప్పడం లేదు. వారు అడిగే మామూళ్లు ఇవ్వకపోతే ఫైళ్లు పెండింగ్ పడుతున్నాయి. ఇక నకిలీ డాక్టర్లు కూడా పెద్దసంఖ్యలోనే పుట్టుకొస్తున్నారు. ముందు ఎవరైనా డాక్టర్ వద్ద కాంపౌండర్(అసిస్టెంట్)గా చేరి కొన్నాళ్ల తర్వాత డాక్టర్ అవతారం ఎత్తుతున్న వారు చాలామందే ఉంటున్నారు. ఎలాంటి విద్యార్హత లేకపోయినా మెడలో స్టెత్ వేసుకుని, తెల్లకోటు ధరించి దర్జాగా రోగులకు వైద్యం చేస్తున్నారు. వీరి వ్యవహారం బయటపడేంత వరకు అల్లోపతి వైద్యులుగానే చలామణి అవుతున్నారు. విజిలెన్స్ అధికారులు కొన్నాళ్లుగా సీజ్ చేసిన ఆసుపత్రులు ♦ గూడూరులో 15 ఏళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా అనురాధ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్న శ్రీరాములు అనే వ్యక్తిని పట్టుకుని, ఆసుపత్రిని సీజ్ చేశారు. ఆయన వైద్యవృత్తి చేయడానికి ఎలాంటి కోర్సునూ చదవలేదు. అయినా ఆయుర్వేద రత్న అని, సర్టిఫికెట్ ఆఫ్ చిల్డ్రన్స్ హెల్త్ అని బోర్డు పెట్టుకున్నాడు. ఏకంగా 50 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్వహించేవాడు. గర్భిణులకు ప్రసవాలు, లింగనిర్ధారణ, అబార్షన్లు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. ♦ కర్నూలులోని కొత్తబస్టాండ్ ఎదురుగా ఉండే జేపీ హాస్పిటల్స్‌ను ఇంటర్ మీడియట్ చదివిన యువకులు ఎండీ డాక్టర్లుగా చలామణి అయ్యి నిర్వహించేవారు. వీరే ఆదోనిలోనూ విజయగౌరి హాస్పిటల్‌ను నిర్వహించారు. విజిలెన్స్ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఆస్పత్రులను సీజ్ చేశారు. ♦ నిబంధనలకు విరుద్ధంగా టైఫాయిడ్, జాండిస్ వ్యాక్సిన్లు వేస్తూ ప్రజలను మోసగిస్తున్న కర్నూలు నగరం నెహ్రూనగర్‌కు చెందిన నకిలీ వైద్యుణ్ని 8 నెలల క్రితం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇతను 20 ఏళ్లుగా క్లినిక్ ఏర్పాటు చేసుకుని దర్జాగా వైద్యం చేసిన ఉదంతం వెలుగు చూసింది. -
నకిలీ మందులతో వైద్యం
నిజాంసాగర్(జుక్కల్) : కంటి వైద్యుడిగా పరిచయమై నకిలీ మందులతో ఇస్తూ అమాయక ప్రజలను బురిడి కొట్టించిన దొంగ వైద్యుడిని గ్రామస్తులు నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ ప్రాంతానికి చెందిన హమీద్ కంటి వైద్యుడిగా చెలామణి అయ్యారు. మంగళవారం నిజాంసాగర్ మండలం గున్కుల్ గ్రామంలో వృద్ధులకు పరీక్షలు చేస్తూ, నాటు మందులు అందించారు. అంతేకాకుండా వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరి ఒకే రకమైన నాటు మందులు ఇవ్వడంతో పాటు కంటి అద్దాల కోసం రూ.300 నుంచి రూ. 450 వరకు వసూల్ చేశాడు. వైద్య సేవలు, అతడి పనితీరుపై అనుమానం వచ్చిన స్తానికులు వైద్యుడిని నిలిదీశారు. తాను కామారెడ్డిలోని ఓ కంటి ఆస్పత్రి వైద్యుడి వద్ద పనిచేశానని సమాధానం చెప్పడంతో సదరు ఆస్పత్రికి ఫోన్‌చేయగా తమ వద్ద ఎవ్వరూ పనిచేయలేదని చెప్పారు. అనుమానం వచ్చిన స్తానికులు దొంగ వైద్యుడిగా గుర్తించి రోగులకు అందించిన నాటు మందులు, వారి వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులను రికవరి చేసుకున్నారు. పొంతనలేని సమాధనాలు చెప్పడంతో స్తానికులు దొంగ వైద్యుడిని పోలీసులకు అప్పగించారు. -
బ్యాంకు మేనేజర్‌పై చీటింగ్ కేసు
కర్నూలు : నకిలీ డాక్టర్లతో కర్నూలు, ఆదోనిలో ఆసుపత్రులు నిర్వహిస్తున్న నాగేంద్రప్రసాద్‌తో పాటు కర్నూలు కిడ్స్ వరల్డ్ పక్కనున్న కెనరా బ్యాంక్ మేనేజర్‌పై రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయ్యింది. నాగేంద్ర ప్రసాద్ బీటెక్ చదువుకున్నాడు. ఆయన భార్య వాణికుమారి ఇంటర్మీడియట్ చదువుకుంది. అయితే కర్నూలు, ఆదోనిలో ఆసుపత్రుల నిర్వహణకు రెడ్డిపోగు విజయభాస్కర్ సహాయం కోరాడు. ఆసుపత్రి నిర్వహణలో భాగస్వామిగా ఉంటే నెలకు రూ.లక్షన్నర జీతం ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. నకిలీ వైద్యులతో ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ నెల 20వ తేదీన అధికారులు దాడులు నిర్వహించి ఆదోని, కర్నూలులో ఉన్న ఆసుపత్రులను సీజ్ చేశారు. దర్యాప్తులో నాగేంద్ర ప్రసాద్ మోసాలు మరిన్ని బయటపడ్డాయి. డాక్టర్ రెడ్డిపోగు విజయభాస్కర్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి కర్నూలు కిడ్స్ వరల్డ్ పక్కనున్న కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టి కోటిన్నర రూపాయలు రుణం తీసుకున్నారు. ఈ విషయం విజిలెన్స్ తనిఖీల్లో బయటపడటంతో డాక్టర్ విజయభాస్కర్‌ను విజిలెన్స్ అధికారులు విచారించారు. రుణంతో తనకెలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. తాను చదువుకున్న సర్టిఫికెట్లను నకిలీ చేసి ఫోర్జరీ సంతకాలతో నాగేంద్రప్రసాద్, ఆయన భార్య వాణి కుమార్ రుణం తీసుకుని మోసం చేశారంటూ శనివారం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నాగేంద్రప్రసాద్‌తో పాటు ఆయన భార్య వాణికుమారి, బావమరిది రమేష్, అప్పటి బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్, మేనేజర్లపై చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ డేగల ప్రభాకర్ తెలిపారు. -
నకిలీ వైద్యులకు రిమాండ్
ఆదోని: నకిలీ వైద్యులు నాగేంద్ర, ఆయన సమీప బంధువు జ్యోతిలను బుధవారం రిమాండ్‌కు తరలించారు. పట్టణంలోని మేదరిగేరిలో విజయ గౌరి సూపర్ స్పెషాలిటీ, కర్నూలులోని జేపీ సూపర్ స్పెషాలిటీపై దాడులు చేసి నకిలీ వైద్యులు నాగేంద్ర, ఆయన సమీప బంధువు జ్యోతిని విజిలెన్స్ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. బుధవారం తెల్లవారుజాము వరకు విచారణ కొనసాగింది. అనంతరం నిందితులను ఆదోని వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. ఇన్చార్జ్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ ఎస్ఐ ఎస్కె బాబు నిందులపై ఐపీసీ 468, 471, 420, మెడికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ బాబు తెలిపారు. -
బీటెక్ వైద్యం
కర్నూలు, ఆదోనిలో నకిలీ ఆసుపత్రులు – ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో రోగులకు చికిత్స – విజిలెన్స్ విచారణలో బట్టబయలు కర్నూలు(హాస్పిటల్): చదివింది ఇంటర్, డిగ్రీ, బీటెక్. కానీ పేరు ముందు డాక్టర్ తగలించుకున్నారు. ఎంబీబీఎస్‌తో పాటు స్పెషాలిటీ కోర్సులనూ జతచేసి కర్నూలు, ఆదోని నగర నడిబొడ్డులో దర్జాగా వైద్యం చేస్తున్నారు. వీరిచ్చే మామూళ్లకు ఆశపడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులూ ఆసుపత్రికి తాత్కాలిక అనుమతి ఇచ్చారు. తాజాగా సదరు ఆసుపత్రి ఒకచోట నుంచి మరోచోటికి మార్పు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెక్కీ నిర్వహించి ఏకకాలంలో కర్నూలు, ఆదోనిలోని ఆసుపత్రులపై దాడులు నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన నరేంద్ర అలియాస్ డాక్టర్ నాగేంద్రప్రసాద్ గతంలో హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో పనిచేశాడు. అక్కడ ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ, మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం ద్వారా వచ్చే డబ్బు చూసి ఆశ మొదలైంది. తాను కూడా ఏదైనా ఒక ఆసుపత్రి పెట్టి డబ్బు సంపాదించాలని అప్పుడే అతని మెదడులో బీజం పడింది. ఈ మేరకు కర్నూలుకు వచ్చి స్థానిక బిర్లాకాంపౌండ్లో సంక్షేమ భవన్ ఎదురుగా జేపీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. వైద్య ఆరోగ్యశాఖలో మామూళ్లు ఇచ్చి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను తీసుకున్నాడు. ఆసుపత్రిలో తాను డాక్టర్ నాగేంద్రప్రసాద్ అని, తన భార్య జ్యోతి ఎంబీబీఎస్, డీసీహెచ్ అని పేర్కొన్నాడు. అయితే ఆయన భార్య జ్యోతి కేవలం ఇంటర్ మీడియట్ మాత్రమే చదువుకుంది. వీరిద్దరూ కలిసి బిర్లా కాంపౌండ్ వద్ద రెండేళ్ల పాటు ఆసుపత్రి నడిపారు. దాంతో పాటు కర్నూలు కొత్తబస్టాండ్ ఎదురుగా, ఆదోని పట్టణంలోనూ విజయగౌరి హాస్పిటల్ పేరుతో ఆసుపత్రులు ప్రారంభించారు. కొత్తబస్టాండ్ వద్ద డాక్టర్‌గా తన బావమరిది రఘును నియమించాడు. అతనిని డాక్టర్ రాఘవేంద్ర ఎంబీబీఎస్, ఎండీగా పరిచేయం చేశాడు. ఈ మేరకు విజిటింగ్కార్డులు ముద్రించాడు. బిర్లాగడ్డ వద్ద ఆసుపత్రి దివాళా తీయడంతో దానిని కొత్తబస్టాండ్ వద్ద ఉన్న విజయగౌరి హాస్పిటల్‌కు మార్చాడు. నాగేంద్రప్రసాద్, ఆయన భార్య జ్యోతి ఇద్దరూ ఆదోనిలో బిజీ ప్రాక్టీషినర్లుగా మారారు. కర్నూలులో మాత్రం రాఘవేంద్ర డాక్టర్‌గా చెలామణి అయ్యాడు. జిల్లాలో కొందరు ఆర్ఎంపీలతో కుమ్మక్కై, వారి ద్వారా తమ ఆసుపత్రులకు రోగులను రప్పించి దోచుకునేవాళ్లు. ఒక రోగిని ఆసుపత్రికి ఆర్ఎంపీ తీసుకొస్తే అతనికి 60 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నారు. రెక్కీ నిర్వహించి దాడులు చేసిన విజిలెన్స్ జేపీ చిల్డ్రన్స్ హాస్పిటల్‌తో పాటు విజయగౌరి హాస్పిటల్‌పై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా ఉంచారు. మంగళవారం కర్నూలులో హోంగార్డు శ్రీకాంత్, తిప్పయ్యలు కలిసి విజయగౌరి హాస్పిటల్‌కు వెళ్లారు. శ్రీకాంత్ తనకు తల తిరుగుతోందని చెప్పడంతో ముందుగా రూ.150 కట్టి ఓపీ తీసుకోవాలని అక్కడి సిబ్బంది చెప్పారు. ఆ తర్వాత 5 నిమిషాలు కూర్చోబెట్టారు. ఒక నర్సు వచ్చి బీపీ చెక్ చేసి నార్మల్‌గా ఉందని చెప్పింది. అక్కడ రోగులు ఎవ్వరూ లేకపోయినా పావుగంట సేపు కూర్చోబెట్టి శ్రీకాంత్‌ను రాఘవేంద్ర అలియాస్ రఘు వద్దకు పంపించారు. శ్రీకాంత్ మణికట్టు పట్టుకుని డాక్టర్ రాఘవేంద్ర పరీక్షించాడు. అలాగే తిప్పయ్యనూ పరీక్షించాడు. ఇతనికి కడుపునొప్పి ఉందనగానే స్కానింగ్‌తో పాటు రక్తపరీక్షలు చేయాలని చెప్పాడు. అయితే తాము డబ్బులు తెచ్చుకోలేదని చెప్పడంతో ఇద్దరికీ మందులు రాసిచ్చి పంపించారు. అలాగే ఆదోనిలోనూ నాగేంద్రప్రసాద్ వద్దకు హోంగార్డు నాగరాజు వెళ్లాడు. కళ్లు తిరుగుతున్నాయి, కడుపునొప్పి ఉందని చెబితే అతనికి సెలైన్ పెట్టి డబ్బులు గుంజారు. హోంగార్డులకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మధ్యాహ్నం నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. కర్నూలులో రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శివకోటి బాబూరావు, సీఐ రామక్రిష్ణాచారి, ఏఈ భాస్కరరెడ్డి, సిబ్బంది, ఆదోనిలో సీఐ జగన్మోహన్రెడ్డి ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యం కర్నూలు, ఆదోనిలలోని ఆసుపత్రులకు తాత్కాలిక అనుమతులే తప్ప మున్సిపల్, ఫైర్, పోలీస్ అనుమతులు ఏవీ లేవు. అయినా అల్ట్రాసౌండ్స్కానింగ్ మిషన్‌తో పాటు ఎక్స్‌రే, డయోగ్నోస్టిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఏమీ చేయకున్నా అన్ని పరీక్షలు చేసినట్లు వారికి వారే నివేదికలు ఇచ్చేసి వచ్చిన రోగులకు నొప్పి నివారణ మందులు, యాంటిబయాటిక్స్, విటమిన్స్ మందులు ఇచ్చి డబ్బు వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై.నరసింహులు విచారణలో తేలింది. మెడికల్‌షాపు సైతం నరేంద్ర పేరుపైనే ఉంది. అయితే కొత్తబస్టాండ్ వద్ద ఉన్న షాపునకు అనుమతులు లేవు. దీంతో జేపీ చిల్డ్రన్స్ హాస్పిటల్/విజయగౌరి హాస్పిటల్‌ను అధికారులు సీజ్ చేశారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో 26 నకిలీ ఆసుపత్రుల జాబితా ఉంది నగరంలో మరో 26 ఆసుపత్రులు సైతం ఇదే విధంగా ఎలాంటి అనుమతులు లేకుండా, నకిలీ వైద్యులతో నిర్వహిస్తున్నట్లు మా వద్ద జాబితా ఉంది. సదరు ఆసుపత్రులపైనా దాడులు నిర్వహిస్తాం. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో కొన్ని ఆసుపత్రులు తీసుకున్న అనుమతులపైనా విచారణ చేయనున్నాం. సదరు ఆసుపత్రులు సమర్పించిన పత్రాలను పరిశీలిస్తున్నాం. – డాక్టర్ వై.నరసింహులు, డీఎంహెచ్ఓ -
ప్రాణాలతో చెలగాటం
- జిల్లాలో నకిలీ వైద్యుల దందా - ఆయుర్వేద పొడుల్లో అల్లోపతి మందులు - టైఫాయిడ్ వ్యాక్సిన్‌గా యాంటిబయాటిక్ - ఎమ్మిగనూరులో పట్టుబడిన ఆర్ఎంపీ కర్నూలు(హాస్పిటల్): ప్రజల అమాయకత్వమే వారికి పెట్టుబడి. కాస్త మాటలు నేరిస్తే చాలు ఎలాగైనా జీవించవచ్చనేది వారి తెలివి. జనాన్ని మాయమాటలతో బోల్తా కొట్టిస్తున్నారు. నొప్పి నివారణ మందులను ఆయుర్వేద మందులతో కలిపి అంటగడుతున్నారు. యాంటిబయాటిక్ మందునే టైఫాయిడ్ వ్యాక్సిన్‌గా చూపించి జనాన్ని బోల్తా కొట్టిస్తున్నారు. ఇలాంటి నకిలీ వైద్యులు జిల్లా అంతటా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నొప్పి, బాధ.. సత్వరమే పోవాలనే జనం ఆకాంక్షను వారు సొమ్ము చేసుకుంటున్నారు. అధికశాతంలో నొప్పి నివారణ మందులు, స్టెరాయిడ్స్ కలిపిన మందులు ఇచ్చి వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారు. నకిలీ మందులు ఇలా అంటగట్టారు.. ఎమ్మిగనూరులో నగేష్ అనే ఆర్ఎంపీ.. జెంటామైసిన్ అనే యాంటిబయాటిక్ ఇంజెక్షన్లను భారీ ఎత్తున కొనుగోలు చేశాడు. వాటిని నీళ్ల బకెట్లో వేసి కొద్దిసేపు ఉంచుతాడు. కొంతసేపటికి ఇంజెక్షన్ వాయిల్‌కు ఉన్న లేబుళ్లు ఊడిపోతాయి. ఊడిపోయిన లేబుళ్ల స్థానంలో అప్పటికే ముద్రించిన టైఫాయిడ్ వ్యాక్సిన్ లేబుళ్లను అతికిస్తున్నారు. సాధారణంగా జెంటామైసిన్ ఇంజెక్షన్ ఎంఆర్పీ రూ.5లు ఉంటుంది. ఇదే ఇంజెక్షన్‌ను టైఫాయిడ్ వ్యాక్సిన్‌గా చూపించి రూ.550లకు విక్రయిస్తున్నారు. గ్రామాల్లో కలుషిత నీటి వల్ల టైఫాయిడ్ వ్యాధి వస్తుందని భయపెట్టి, అది రాకుండా ఉండాలంటే టైఫాయిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రచారం చేసుకున్నారు. రూ.550 ఎంఆర్పీ ఉన్న వ్యాక్సిన్‌ను రూ.300ల నుంచి రూ.400లకు తగ్గించి అమ్ముతున్నట్లు జనాన్ని నమ్మించారు. దీంతో జనం అతని మాటలు నమ్మి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. రెండేళ్లుగా ఎమ్మిగనూరు చుట్టు పక్కల గ్రామాల్లో అధిక మొత్తంలో ప్రజలు ఈ వ్యాక్సిన్‌ను వేయించుకుని మోసపోయారు. తక్కువ స్థాయిగల జెంటామైసిన్ ఇంజెక్షన్‌ను వేసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండకపోయినా రూ.5ల విలువ చేసే మందును టైఫాయిడ్ వ్యాక్సిన్ పేరుతో రూ.300ల నుంచి రూ.400లకు విక్రయించి మోసం చేయడం దారుణం. విషయం తెలుసుకున్న ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దాడులు నిర్వహించి శనివారం.. అతన్ని పోలీసులకు అప్పగించారు. నకిలీ ఆయుర్వేద మందులతో... కర్నూలు నగర శివారులోని శిల్పాసింగపూర్ ఎస్టేట్స్ సమీపంలో మూడు నెలల క్రితం శ్రీనివాసులు అనే వ్యక్తి ఆయుర్వేద మందులను అల్లోపతి మందులతో తయారు చేసి విక్రయించేవాడు. షుగర్, థైరాయిడ్, కీళ్లనొప్పులు తదితర దీర్ఘకాలిక వ్యాధులు తమ ఆయుర్వేద మందులతో నయం అవుతాయని జనాన్ని నమ్మించాడు. ఈ మేరకు భారీగా పారాసిటమాల్, డైక్లోఫెనాక్, స్టెరాయిడ్ మాత్రలను కొనుగోలు చేసి, వాటిని ఆయుర్వేద పొడుల్లో కలిపి, వాటిని చిన్న చిన్న గోళీలుగా తయారు చేసి జనానికి విక్రయించేవాడు. విషయం తెలుసుకున్న ఔషధ నియంత్రణ శాఖ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి అతన్ని అరెస్ట్ చేశారు. అయితే కొన్నాళ్లకే అతను బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ అతని ఆయుర్వేద మందుల్లో అల్లోపతి మందులు కలిపారని నిర్ధారణ అయినట్లు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తేల్చారు. ఈ మేరకు ఆయనపై తిరిగి కేసు ఫైల్ చేసే అవకాశాలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం వీకర్‌సెక్షన్ కాలనీలోనూ ఓ వ్యక్తి ఇదే విధంగా ఆయుర్వేద పొడుల్లో అల్లోపతి మందులు కలిపి ప్రజలకు అమ్మేవాడు. అతన్ని సైతం విజిలెన్స్, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దాడులు చేసి అరెస్ట్ చేసిన విషయం విదితమే. తెలిసీ తెలియని వైద్యం.. పేద, గ్రామీణ ప్రజల నిరక్షరాస్యతను పెట్టుబడిగా చేసుకుని కొందరు నకిలీ వైద్యులు, ఆర్ఎంపీలు ప్రజలకు నకిలీ మందులను అంటగడుతున్నారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు, పత్తికొండ, డోన్, బేతంచెర్ల, బనగానపల్లె, శ్రీశైలం, మహానంది, ఆత్మకూరు, ఆళ్లగడ్డ వంటి ప్రాంతాల్లో ఇలాంటి నకిలీ వైద్యులు తిష్టవేశారు. వైద్యం చేయడానికి ఎలాంటి విద్యార్హత లేకపోయినా ఆపరేషన్లు సైతం చేస్తునఆనరు. గతంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేసిన ఓ ఉద్యోగి కల్లూరు ప్రాంతంలో ఏకంగా ప్రసవాలు, ఆపరేషన్లు సైతం నిర్వహించారు. జిల్లాలో అనేక మంది ఆర్ఎంపీలు జనరిక్, పీడీ కంపెనీల మందులను తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు జనానికి అంటగడుతున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో ఇష్టమొచ్చినట్లు మందులు ఇస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. నకిలీ మందులు అమ్మితే పదేళ్ల జైలు –చంద్రశేఖర్‌రావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ నకిలీ మందులు అమ్మితే పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. జిల్లాలో ఇప్పటి దాకా మద్దిలేటి, జనార్దనాచారి, శ్రీనివాసులు, నగేష్‌తో పాటు మరొకరిపై కేసులు నమోదు చేశాం. ఇకపై ఆర్ఎంపీలపై నిఘా పెడతాం. వారిపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తాం. ప్రజలు సైతం ఇష్టానుసారంగా నకిలీ వైద్యులు, ఆర్ఎంపీల వద్దకు వెళ్లకూడదు. అర్హులైన వైద్యుల వద్దే చికిత్స చేయించుకోవాలి. -
నకిలీ వైద్యులపై కఠిన చర్యలు
తుమకూరు: ప్రజల ప్రాణాలతో చెలగాటామాడుతున్న నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కే.పీ.మోహన్‌రాజ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశమై మాట్లాడారు. పావగడ, చిక్కనాయకనహళ్లి తదితర తాలూకాల్లో నకిలీ వైద్యులు ఇష్టారాజ్యంగా చికిత్సలు చేస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 123మంది నకిలీ వైద్యులను గుర్తించామని, వారిపై చర్యలు తప్పవన్నారు. నకిలీ వైద్యులపట్ల అప్రమత్తంగా ఉండాలని ఏఎన్ఎం కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని, జిల్లా వ్యాప్తంగా జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఇందిరా సురక్ష పథకం కింద వైద్య సేవలు అందించాలన్నారు. -
ఇద్దరు నకిలీ డాక్టర్ల అరెస్ట్
తిరువళ్లూరు : అనుమతి లేకుండా క్లినిక్‌లు నిర్వహించడంతో పాటు అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను వైద్యశాఖ అధికారులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవల డెంగీ వేగంగా విస్తరించడంతో దాదాపు 12 మంది మృత్యవాత పడిన సంఘటన తెలిసిం దే. ఈ ఉదంతం జిల్లా వ్యాప్తంగా సంచలనం ఏర్పరచిన నేపథ్యంలో అధికారులు న కిలీ డాక్టర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పరిధిలోని వెన్‌మనముదూర్‌లో నకలీ డాక్టర్ ఉన్నట్టు అధికారులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వెన్‌మనముదూర్ గ్రామానికి చెందిన గణేషన్ కుమారుడు వసంత్‌కుమార్ ప్లస్‌టూ వరకు చదివి క్లినిక్ నడుపుతున్నట్టు గుర్తించి అధికారులు అతనిని అరెస్టు చేశారు. ఇదే విధంగా పేరంబాక్కం గ్రామానికి చెందిన కోమగన్. ఇతను ఫిజియోథెరపీ పూర్తీ చేసి ఏడేళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్నట్టు అధికారులు తని ఖీల్లో గుర్తించి వారిని సైతం అరెస్టు చేశారు. కాగా ఇప్పటి వరకు 33 మందిని అరెస్టు చేసిన వైద్యశాఖ అధికారులు శుక్రవారం రాత్రి మరో ఇద్దరిని అరెస్టు చేయడం జిల్లాలో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 35కు చేరింది. -
కోసేస్తారు..తీసేస్తారు..!
ఎంబీబీఎస్ చదవక పోయినా వారు డాక్టర్లుగా చెలామణీ అవుతున్నారు. పేరు ముందు డాక్టర్ అని బోర్డు తగిలించుకుని అబార్షన్లు, హెర్నియా, గర్భసంచి తొలగింపు వంటి శస్త్రచికిత్సలు చేస్తూ అనేక మంది మరణానికి కారణమవుతున్నారు. హైదరాబాద్‌లోనే ఇలాంటి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు గల్లీకొకరు వెలుగు చూస్తుండటంపై సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో 1804 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు ఉండగా వీటిలో కేవలం 800 ఆస్పత్రులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మరో ఐదు వేలకుపైగా క్లీనిక్స్ ఉన్నాయి. వీటిలో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 1200 వరకు ఉన్నాయి. మిగిలినవన్నీ శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దానికి అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా క్లీనిక్‌లు నడుపుతూ ప్రజారోగ్యంతో చలగాటమాడుతున్న కొంత మంది ఆర్ఎంపీలను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి విద్యార్హత లేకపోయినా పేరుకు ముందు డాక్టర్ అని చేర్చుకున్న వారిపై కేసులు నమోదు చేయడం విశేషం. హెర్నియా నుంచి అబార్షన్ల వరకు: బస్తీల్లోని నిరుపేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న వీరు గైనకాలజిస్టులుగా, జనరల్ ఫిజిషయన్స్గా, జనరల్ సర్జన్స్‌గా చలామణి అవుతున్నారు. హెర్నియా, అపెండిసైటీస్, అబార్షన్లు, గర్భసంచి తొలగింపు తదితర ఆపరేషన్లు చేస్తున్నారు. కొన్నిసార్లు అధిక రక్తస్త్రావం వల్ల రోగులు మృత్యువాతపడుతున్నారు. నగరంలోని చార్మినార్, బార్కాస్, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, కంచన్‌బాగ్, బీఎన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం, భూపేష్గుప్తానగర్, నందనవనం, మీర్పేట్, హస్తినాపూర్, హయత్‌నగర్, వనస్థలిపురం, మన్సూరాబాద్, బండ్లగూడ, బోడుప్పల్, రాజేంద్రనగర్, మల్కజ్గిరి, మాణికేశ్వరినగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో నకిలీ వైద్యుల బెడద ఎక్కువగా ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదులు అందగా, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దాడులు నిర్వహించి నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా వారు స్వయంగా డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు, మెడికల్ షాపులు నడుపుతున్నారు. వీటికి ఎలా ంటి అనుమతులు లేకపోవడం కొసమెరుపు. మచ్చుకు కొన్ని ఘటనలుః ఫిలింనగర్ దుర్గాభవానీనగర్‌లో ఓ నర్సింగ్‌హోంలో గర్భవతికి డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో శిశువుకు జన్మనిచ్చి మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఓ నర్సు గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నట్లు చెప్పుకుంటూ రోగులకు చికిత్స చేస్తుండగా కంచన్‌బాగ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీరా సదరు మహిళ చదివింది బీఎస్సీనర్సింగ్ అని తెలిసి పోలీసులే నివ్వెర పోయారు. ఇటీవల చాంద్రాయణగుట్ట పరిధిలోని ఓ యునాని వైద్యుడు నొప్పితో బాధపడుతున్న ఓ రోగికి ఇంజక్షన్ ఇవ్వడంతో వికటించి మృతి చెందగా, శవాన్ని మూటలో కట్టి శంషాబాద్ సమీపంలో తగులబెడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన సంచ లనం సృష్టించింది. లేఖ రాసినా..స్పందన లేదు: హైదరాబాద్ జిల్లా పరిధిలో 1804 ఆస్పత్రులు ఉండగా, వాటిలో 800 ఆస్పత్రులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మరో 1100-1200 క్లీనిక్స్ ఉన్నట్లు గుర్తించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వాటికి నోటీసులు జారీ చే శారు. అనుమతుల్లేని వాటికి మంచినీరు, డ్రైనేజీ, కరెంట్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ సహా టీఎస్ఎస్పీడీసీఎల్కు లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఆర్ఎంపీలు నిర్వహించే క్లీనిక్స్ పై చర్యలు తీసుకునే అధికారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు లేక పోవడంతో వారేమీ చేయలేక పోతున్నారు. 16 మంది నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లు అరెస్టు వైద్యం పేరుతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 16 మంది నకిలీ ఆర్ఎంపీలను సైబరాబాద్ ఈస్ట్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. షెడ్యూల్డ్ మందులు, ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఆర్ఎంపీలపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు అందడంతో సైబరాబాద్ ఈస్ట్ ఎస్ఓటీ డీసీపీ రాంచంద్రారెడ్డి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కె.నర్సింగరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏకకాలంలో దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు ప్రత్యేకంగా ఆస్పత్రులను నిర్వహిస్తుండటం గమనార్హం. అరెస్టయిన వారి వివరాలు.. కె.రామలింగయ్య(శ్రీనివాస క్లీనిక్), కాళిదాస్(డాక్టర్ కాళీదాస్ పాలీ క్లీనిక్), కృష్ణమూర్తి( (విజయ పాలీక్లీనిక్)), మోహనాచారి( శ్రీసాయి క్లీనిక్), ఎస్.నరసింహులు(శ్రీ వెంకటసాయి క్లీనిక్),డి.శంకర్, ఎస్ఎం హుస్సేన్(అన్సారి క్లీనిక్), ఎం.పవన్‌కుమార్(శ్రీసాయి అక్షర క్లీనిక్), జనార్థనాచారి,డి.చెన్నారెడ్డి( వినిషా క్లీనిక్)లతో పాటు మేడిపల్లి, నాచారంలో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోయినా క్లినిక్ లు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
రాష్ర్టంలో నకిలీ వైద్యులు
ఇప్పటివరకు 2వేల మంది గుర్తింపు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వేల మంది నకిలీ వైద్యులను గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ వెల్లడించారు. వీరు నిర్వహిస్తున్న క్లినిక్‌లను సైతం మూయించేశామని చెప్పారు. శుక్రవారమిక్కడి ఓ హోటల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సువర్ణ భవన’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వైద్యులపై ఇప్పటికే 230 ఎఫ్ఐఆర్లను సైతం నమోదు చేసినట్లు చెప్పారు. నకిలీ వైద్యుల బెడదను తప్పించేందుకు ఆయుష్ మండలి ఇప్పటికే దేశంలోనే మొట్టమొదటి సారిగా బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని యు.టి.ఖాదర్ తెలిపారు. గతంలొ కలకత్తా, ఢిల్లీ వంటి వివిధ ప్రాంతాల్లో తాము వైద్యవిద్యను పూర్తి చేశామని చెప్పుకొని చాలా మంది నకిలీ వైద్యులు ఆస్పత్రులను నిర్వహించే వారని పేర్కొన్నారు. వారు చూపించే ధ్రువీకరణ పత్రాలు అసలైనవా లేక నకిలీవా అని గుర్తిచండం చాలా క్లిష్టమైన సమస్యగా ఉండేదని చెప్పారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనగలిగామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆయుష్ మండలి చక్కగా పనిచేస్తోందని, అందువల్లనే అంతర్జాతీయ ఆయుర్వేద ఎక్స్పో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు అవకాశాన్ని కల్పించిందని వివరించారు. సెప్టెంబర్‌లో ఈ ఎక్స్పో జరగనుందని మంత్రి యు.టి.ఖాదర్ వెల్లడించారు. ఏ బాల్ అయినా బ్యాటింగ్ చేస్తా.... ‘మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో మంత్రి స్థానం పోతుందనో లేదంటే శాఖ మారుతుందనో నాకు భయం లేదు. ఏ బాల్ అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధం, ఏ శాఖ అయినా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతించేందుకు సన్నద్ధంగా ఉన్నాను’ అని యు.టి.ఖాదర్ స్పష్టం చేశారు. -
అబార్షన్ కిల్లర్స్
ఆర్ఎంపీ ముసుగులో నకిలీ డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా గర్భస్రావాలు ప్రాణాలు కోల్పోతున్న గర్భిణులు మాతృత్వానికి దూరమవుతున్న యువతులు లబ్బీపేట : అక్రమ సంపాదనే లక్ష్యంగా ఆర్ఎంపీల ముసుగులో నకిలీ డాక్టర్లు యువతులకు గర్భస్రావాలు చేస్తూ వారి ప్రాణాలు తీస్తున్నారు. ఎటువంటి అనుభవం, నైపుణ్యం లేని వీరి నిర్వాకం వల్ల కొందరు యువతులు మాతృత్వానికి దూరమవుతుండగా, మరికొందరు ఇన్ఫెక్షన్లు సోకి జీవితాంతం రోగాలబారిన పడుతున్నారు. మరికొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. రెండు రోజుల కిందట మచిలీపట్నంలో జరి గిన భ్రూణహత్య ఘటనకు సంబంధించి చేపట్టిన విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మహిళకు గర్భస్రావం చేసిన ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ మరికొంత మందికి అదే తరహాలో అబార్షన్లు చేసిన విషయాన్ని గుర్తించిన అధికారులు నివ్వెరపోయారు. నిబంధనలు ఇలా.. పెళ్లయిన వారు అప్పుడే పిల్లలు వద్దనుకున్నప్పుడు, పిల్లల మధ్య ఎడం కావాలనుకున్నప్పుడు భార్యాభర్తలిద్దరి ఇష్టప్రకారం అబార్షన్ చేయొచ్చు. భార్యకు ఇష్టం లేకుండా అబార్షన్ చేయించడం నేరం. గర్భంలో పెరుగుతున్న శిశువులో లోపాలను గుర్తిస్తే గర్భస్రావం చేయవచ్చు. అవాంఛిత గర్భం దాల్చిన వారికి సైతం సరైన జాగ్రత్తలు పాటించి అబార్షన్ చేయాలి. గర్భం 12 వారాల లోపు అయితే సింగిల్ గైనకాలజిస్టు, 13 నుంచి 20 వారాల్లోపు అయితే ఇద్దరు స్పెషలైజ్డ్ వైద్యులు పరిశీలించి గర్భస్రావం చేయాల్సి ఉంటుంది. ఇవే నిదర్శనాలు.. ►గూడూరు మండలం మల్లవోలుకు చెందిన దుర్గాదేవికి మూడో కాన్పులోనూ ఆడపిల్లే పుడుతుందని లింగనిర్ధారణ పరీక్షలో తెలుసుకుని గర్భం దాల్చిన ఆరో నెలలో అబార్షన్ కోసం ఆమె అత్తింటివారు ఓ ఆర్ఎంపీని సంప్రదించారు. ఆ ఆర్ఎంపీ మరో ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే నర్సు సత్యవతితో కలిసి దుర్గాదేవికి మూస పద్ధతిలో అబార్షన్ చేయడంతో ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాల మీదకు వచ్చింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు సకాలంలో శస్త్రచికిత్స చేయడంతో ఆమె కోలుకుంటోంది. ఆర్ఎంపీ, నర్సు ఇదే తరహాలో మరిన్ని అబార్షన్లు చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ►విజయవాడ కృష్ణలంకకు చెందిన వివాహితకు సింగ్‌నగర్‌కు చెందిన ఆర్ఎంపీ చేసిన అబార్షన్ వికటించడంతో ఆ మహిళ తీవ్ర రక్తస్రావంతో వారంరోజులు పోరాడి మృత్యువాత పడింది. ఆ కేసులో ఆర్ఎంపీని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ బెయిల్‌పై వచ్చి తిరిగి అబార్షన్లు చేసిన వైనం తెలిసిందే. ►రెండేళ్ల కిందట విజయవాడ నగరపాలక సంస్థలో నర్సుగా పనిచేస్తున్న విజయకుమారి కొత్తపేట ప్రాంతానికి చెందిన యువతికి చేసిన గర్భస్రావం వికటించింది. ఆ యువతి పదిరోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో తరచూ జరుగుతున్నప్పటికీ నకిలీలపై వైద్యాధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నకిలీల నిర్వాకానికి అమాయక యువతులు, మహిళలు బలవుతున్నారు. అవాంఛిత గర్భందాల్చిన యువతులు గర్భస్రావాలు చేయించుకుని మాతృత్వానికి శాశ్వతంగా దూరమైన ఘటనలు గతంలో నమోదయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నారు. -
నకిలీల ఖిల్లా
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో డెంగీ, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతుండగా ఈ పరిస్థితిని నకిలీ వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. విరుదునగర్ జిల్లా నకిలీ వైద్యుల ఖిల్లాగా మారిపోవడంతో వీరివద్ద వైద్యం చేయించుకున్న 19 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. వారికి వైద్యం చేసిన 25 మంది నకిలీ వైద్యులు కటకటాల పాలయ్యారు. పగలు మాత్రమే కుట్టి, డెంగీ జ్వరానికి కారణమయ్యే దోమలు విరుదునగర్‌లో ఇటీవల విరుచుకుపడ్డాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు డెంగీ జ్వరాల బారిన పడ్డారు. అక్షరాస్యత అంతగా లేని అమాయక పేద ప్రజలు ఆందోళనతో సమీపంలోని వైద్యుల వద్ద చికిత్స చేయించుకున్నారు. వైద్యం వికటించగా వారంరోజుల్లోనే 19 మంది మృత్యువాత పడ్డారు. స్వల్ప వ్యవధిలో డెంగీ మృతులు భారీగా పెరడంతో ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, పోలీసు యంత్రాంగం వేర్వేరుగా విచారణలు చేపట్టారు. ఆస్పత్రులను, జిల్లాలో పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. 50 ప్రొక్లయిన్ల ద్వారా పంటకాల్వల్లో పూడికలు తీయించి దోమల నివారణ చర్యలు చేపట్టారు. నివాస ప్రాంతాల్లో పందుల పెంపకం సాగిస్తున్న 20 మందిని అరెస్ట్ చేసి 150 పందులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వైద్యుల గుట్టురట్టు మృతుల కుటుంబాలను పరామర్శించిన సందర్భంలో చికిత్స చేసిన వైద్యుల వివరాలను అధికారులు కోరారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పరిశీలించడంతో జిల్లాలో పెద్ద సంఖ్యలో నకిలీ ైవె ద్యులు రాజ్యమేలుతున్నట్లు తేలింది. నకిలీ వైద్యులు అందించే వైద్యం వల్ల రోగం తగ్గకపోగా మరింత ముదిరి ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వరన్ నేతృత్వంలో పోలీసు అధికారుల బృందం అనుమానం ఉన్నచోట్ల తనిఖీలు చేపట్టింది. 8వ తరగతి వరకు చదివిన ఒకవ్యక్తి కొన్నాళ్లు ఆస్పత్రిలో వార్డుబాయ్‌గా పనిచేసిన అనుభవంతో వైద్యుడిగా అవతారం ఎత్తాడు. మరొక వ్యక్తి మందుల దుకాణంలో పొందిన అనుభవంతో వైద్యం ప్రారంభించాడు. సాత్తూరులో ఒక పెట్టెల వ్యాపారి తన ఇంటిలో ఫలసరుకులతోపాటూ ఫార్మసీ మందులను సైతం విక్రయించడాన్ని కనుగొన్నారు. అంతేకాదు తన వద్దకు వచ్చిన వినియోగదారుల యోగక్షేమాలు అడిగి కోరినవారికి ఇంజక్షన్లు సైతం ఇచ్చేవాడని తెలుసుకుని పోలీసులు నిర్ఘాంత పోయారు. మరికొందరు ప్రబుద్దులు మోటార్‌బైక్‌పై గ్రామగ్రామాన తిరుగుతూ వైద్య సేవలు అందిస్తున్నారని తెలుసుకున్నారు. అనేక రకాలైన 25 మంది నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లలోకి నెట్టారు. సంచార వైద్యులుగా చలామణి అవుతున్న వారి కోసం గాలిస్తున్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం ప్రకారం నకిలీ వైద్యులపై కేసులు బనాయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు బాలకృష్ణన్ మాట్లాడుతూ, డెంగీ, చికున్ గున్యా వంటి తీవ్రస్థాయి వ్యాధులను నకలీ వైద్యులు సాధారణంగా తీసుకుని వైద్యం చేయడం వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. నకిలీ వైద్యం కల్తీ కల్లు అంతటి ప్రమాదకరమన్నారు. న కిలీలపై అధికారులు నిఘాపెట్టి ఆగడాలను అరికట్టాలని ఆయన కోరాడు.