అబార్షన్ కిల్లర్స్
ఆర్‌ఎంపీ ముసుగులో నకిలీ డాక్టర్లు
నిబంధనలకు విరుద్ధంగా గర్భస్రావాలు
ప్రాణాలు కోల్పోతున్న గర్భిణులు
మాతృత్వానికి దూరమవుతున్న యువతులు
లబ్బీపేట : అక్రమ సంపాదనే లక్ష్యంగా ఆర్‌ఎంపీల ముసుగులో నకిలీ డాక్టర్లు యువతులకు గర్భస్రావాలు చేస్తూ వారి ప్రాణాలు తీస్తున్నారు. ఎటువంటి అనుభవం, నైపుణ్యం లేని వీరి నిర్వాకం వల్ల కొందరు యువతులు మాతృత్వానికి దూరమవుతుండగా, మరికొందరు ఇన్ఫెక్షన్లు సోకి జీవితాంతం రోగాలబారిన పడుతున్నారు. మరికొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. రెండు రోజుల కిందట మచిలీపట్నంలో జరి గిన భ్రూణహత్య ఘటనకు సంబంధించి చేపట్టిన విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మహిళకు గర్భస్రావం చేసిన ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ మరికొంత మందికి అదే తరహాలో అబార్షన్లు చేసిన విషయాన్ని గుర్తించిన అధికారులు నివ్వెరపోయారు.
నిబంధనలు ఇలా..
పెళ్లయిన వారు అప్పుడే పిల్లలు వద్దనుకున్నప్పుడు, పిల్లల మధ్య ఎడం కావాలనుకున్నప్పుడు భార్యాభర్తలిద్దరి ఇష్టప్రకారం అబార్షన్ చేయొచ్చు. భార్యకు ఇష్టం లేకుండా అబార్షన్ చేయించడం నేరం. గర్భంలో పెరుగుతున్న శిశువులో లోపాలను గుర్తిస్తే గర్భస్రావం చేయవచ్చు. అవాంఛిత గర్భం దాల్చిన వారికి సైతం సరైన జాగ్రత్తలు పాటించి అబార్షన్ చేయాలి. గర్భం 12 వారాల లోపు అయితే సింగిల్ గైనకాలజిస్టు, 13 నుంచి 20 వారాల్లోపు అయితే ఇద్దరు స్పెషలైజ్డ్ వైద్యులు పరిశీలించి గర్భస్రావం చేయాల్సి ఉంటుంది.
ఇవే నిదర్శనాలు..
►గూడూరు మండలం మల్లవోలుకు చెందిన దుర్గాదేవికి మూడో కాన్పులోనూ ఆడపిల్లే పుడుతుందని లింగనిర్ధారణ పరీక్షలో తెలుసుకుని గర్భం దాల్చిన ఆరో నెలలో అబార్షన్ కోసం ఆమె అత్తింటివారు ఓ ఆర్‌ఎంపీని సంప్రదించారు. ఆ ఆర్‌ఎంపీ మరో ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే నర్సు సత్యవతితో కలిసి దుర్గాదేవికి మూస పద్ధతిలో అబార్షన్ చేయడంతో ఇన్‌ఫెక్షన్ సోకి ప్రాణాల మీదకు వచ్చింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు సకాలంలో శస్త్రచికిత్స చేయడంతో ఆమె కోలుకుంటోంది. ఆర్‌ఎంపీ, నర్సు ఇదే తరహాలో మరిన్ని అబార్షన్లు చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.
►విజయవాడ కృష్ణలంకకు చెందిన వివాహితకు సింగ్‌నగర్‌కు చెందిన ఆర్‌ఎంపీ చేసిన అబార్షన్ వికటించడంతో ఆ మహిళ తీవ్ర రక్తస్రావంతో వారంరోజులు పోరాడి మృత్యువాత పడింది. ఆ కేసులో ఆర్‌ఎంపీని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ బెయిల్‌పై వచ్చి తిరిగి అబార్షన్లు చేసిన వైనం తెలిసిందే.
►రెండేళ్ల కిందట విజయవాడ నగరపాలక సంస్థలో నర్సుగా పనిచేస్తున్న విజయకుమారి కొత్తపేట ప్రాంతానికి చెందిన యువతికి చేసిన గర్భస్రావం వికటించింది. ఆ యువతి పదిరోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో తరచూ జరుగుతున్నప్పటికీ నకిలీలపై వైద్యాధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నకిలీల నిర్వాకానికి అమాయక యువతులు, మహిళలు బలవుతున్నారు. అవాంఛిత గర్భందాల్చిన యువతులు గర్భస్రావాలు చేయించుకుని మాతృత్వానికి శాశ్వతంగా దూరమైన ఘటనలు గతంలో నమోదయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నారు.