Illegal earnings
-
టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై కేంద్రమంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై ఆ పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ఒకసారి చూసుకోవాలని హెచ్చరించారు.ఓ కార్యక్రమంలో పాల్గొన్న పెమ్మసారి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకేసారి ఎమ్మెల్యే అయితే చాలు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మళ్లీ మళ్లీ ఎమ్మెల్యేలు అవ్వాలనుకున్నవారు ఎవరు అవినీతికి పాల్పడిన అది తప్పే. లిక్కర్ షాపులు నిర్వహించుకోవాలంటే అందుకు పెద్దమొత్తంలో వాటాలు అడుగుతున్న ఎమ్మెల్యేల నుంచి సమస్యలు ఎదురవ్వొచ్చు. వ్యవస్థ గురించి మాట్లాడాలంటే ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి.ఇవాళ ఎన్నికలంటే డబ్బులతో కూడుకున్న పెద్ద ప్రక్రియ. ఈ వ్యవస్థను చూస్తుంటే ఒకరకంగా అసహ్యం వేస్తుంది. నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలి ప్రజా సేవ చేయాలనే వారికి రాజకీయాలు దూరమయ్యాయి.ఎన్నికలు వచ్చాయంటే నాయకులు డబ్బుల కోసం పీక్కుతింటున్నారు. ప్రజలు కూడా మాకు డబ్బు రాలేదని అడుగుతున్నారు’ అని పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై మండిపడ్డారు. -
ఐఏఎస్ సత్యనారాయణ అవినీతిపై ఫిర్యాదు
ఎమ్మిగనూరు టౌన్: గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సత్యనారాయణ అవినీతి, అక్రమ సంపాదనపై ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు సీబీఐ డైరెక్టర్‌కు బీజేపీ రాష్ట్ర నేత, ఆలిండియా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.పురుషోత్తంరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌గా రెండున్నరేళ్లపాటు పనిచేసిన సత్యనారాయణ అప్పటి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ తోపాటు కేఈ కృష్ణమూర్తి పేరుతో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. అప్పట్లో పీఎంఏవై కింద కర్నూలుకు ఆరువేల గృహాలు, నంద్యాలకు 4,500, ఆదోనికి 4,700, ఎమ్మిగనూరుకు వెయ్యి గృహాలు మంజూరయ్యాయన్నారు. వీటి నిర్మాణ కాంట్రాక్టు పొందిన షాపూర్జీ పల్లోంజి కంపెనీ నుంచి తమిళనాడుకు చెందిన వాసన్ అండ్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్‌ను సత్యనారాయణ ఇప్పించి లబ్ధి పొందారన్నారు. అంతేగాక వాసన్ అండ్ కంపెనీకి ఇసుక సరఫరాకోసం తన సోదరుడి కుమారుడు మురళి, బంధువు శ్రీనివాస్‌లను బినామీలుగా పెట్టుకుని.. వారి పేరిట జిల్లాలోని కౌతాళం, గుడికంబాళి ఇసుక రీచ్‌లను మంజూరు చేయించారని ఆరోపించారు. ఆయన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి అక్రమాస్తులను జప్తు చేయాలన్నారు. ఈ మేరకు పీఎంవో, సీబీఐ డైరెక్టర్‌తోపాటు సీబీఐ జేడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్లకు ఫిర్యాదు చేశానని తెలిపారు. -
జోరుగా కలప అక్రమ రవాణా
►జిల్లా సరిహద్దులు దాటిస్తున్న వ్యాపారులు ►బొగ్గు బట్టీలకు విలువైన వృక్షాల చేరవేత ►‘వాల్టా’కు తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు ►మామూళ్ల మత్తులో అటవీశాఖ అధికారులు..! ►హరితహారం లక్ష్యం నెరవేరేనా.. జిల్లాలో ఒక్కశాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతం వరకు పెంచాలనే ఉద్దేశంతో కలెక్టర్ శ్రీదేవసేన ఆధ్వర్యంలో అటు అధికారులు.. ఇటు ప్రజలు కృషి చేస్తుంటే.. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు అక్రమార్కులు ఉన్న చెట్లను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. తెలంగాణకు హరితహారం పేరుతో ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తుంటే.. అటవీశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలువురు అధికారులకు ప్రతి నెలా ముడుపులు ముట్టచెబుతున్నామనే ధీమాతో అక్రమార్కులు విలువైన కలపను సరిహద్దులు దాటి న్నారు. జిల్లాలోని జనగామ, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘణపురంతోపాటు పలు మండలాల నుంచి నిత్యం కలప రవాణా జోరుగా సాగుతోంది. అటవీ ప్రాంతంలోని వేప, తుమ్మ, చింత చెట్లను దర్జాగా నరికివేస్తూ లారీల ద్వారా చుట్టుపక్కల ప్రాంతా కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 25 మంది కలప వ్యాపారులు ఉండగా.. వీరికి ఏజెంట్లుగా వంద మందికి పైగా పనిచేస్తున్నట్లు సమాచారం. మామూళ్లు ఎవరికి..? కలప అక్రమ రవాణాపై అటవీశాఖ అధికారులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా సాగిస్తున్న వ్యాపారుల నుంచి నెల నెలా మామూళ్లు పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారులు, కలప వ్యాపారులు చేతులు కలపడంతో వారి సంపాదన మూడు పువ్వులు.. ఆరుకాయలుగా వర్ధిల్లుతోందనే ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా.. అప్పుడప్పుడూ తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తూ.. పెద్ద ఎత్తున కలపను పక్క జిల్లాకు దాటిస్తున్నాట్లు సమాచారం. బొగ్గుబట్టీల నిర్వహణ కోసం కంపతార, రేగి చెట్లకోసం అనుమతి తీసుకుంటున్న సదరు వ్యక్తులు విలువైన కర్రను అందులో ఉపయోగిస్తున్నారని సమాచారం. ఇంతా జరుగుతున్నా అక్రమ కలప రవాణాను అరి కట్టేందుకు అటవీశాఖ అధికారులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు మేలుకోకుంటే.. భవిష్యత్‌లో జిల్లాలో ఎన్ని మొక్కలు నాటినా నిష్ప్రయోజనమేనని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అక్రమ సంపాదన వద్దు
►శాఖాపరమైన చర్యలు తప్పవు ►ఐజీ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరిక ►సీసీటీఎన్ఎస్ పనితీరుపై ప్రశంస నిజామాబాద్ క్రైం (నిజామాబాద్‌అర్బన్): జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది అక్రమ సంపాదనకు పాల్పడితే ఎంతటి అధికారైనా శాఖాపరమైన చర్యలు తప్పవని హైదరాబాద్ రీజియన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఐజీగా బాధ్యతలు స్వీకరించాక సోమవారం తొలిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు పోలీస్ గెస్ట్‌హౌస్‌లో నిజామాబాద్ రేంజ్ డీఐజీ ఎన్ శివశంకర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయ పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం సమావేశం హాలులో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, అధికారులతో ఐజీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి, నిజాయితీకి మారు పేరైన పోలీస్‌శాఖలో సిబ్బంది ఎవరూ అక్రమ సంపాదనలకు పాల్పడవద్దని, అలాంటి విషయాలు మా దృష్టికి వస్తే క్రమ శిక్షణ లేదా తీవ్రమైన చర్య ఉంటుందన్నారు. జిల్లాలోని సాలురా చెక్‌పోస్టు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున నిజామాబాద్, నాందేడ్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ శాఖలతో మంచి సంబంధాలు పెట్టుకుని, పెట్రోలింగ్, నిఘా వ్యవస్థ పటిష్టపర్చాలన్నారు. జిల్లాలో షీ టీంలు బాగా పనిచేసి, మహిళలకు భద్రత చేకూర్చాలని, కౌన్సెలింగ్ వ్యవస్థను పటిష్ట పర్చాలని సూచించారు. ఈవ్ టీజింగ్ వ్యవస్థను కళాశాలలో రూపుమాపాలని, జనరద్దీగల ప్రాంతాలలో నిఘా వ్యవస్థను మరింత పెంచాలన్నారు. మతపరమైన విషయాలలో ఏ వర్గం వారిని నమ్మవద్దని, కీలక సమయంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తనీయవద్దని, శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. జనరద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్ల వద్ద, వాణిజ్య వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమోరాలు ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీ, ఎస్కార్ట్ బందోబస్తుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు బందోబస్తులో మార్పులకు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై స్పందించాలన్నారు. ఫిర్యాదు దారుల సమస్యలను సత్వరంగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి అలసత్వం పనికిరాదని, సమస్యలు ఉన్నప్పుడు తమ పైస్థాయి అధికారులకు త్వరగా విషయాలను తెలుపాలన్నారు. సీసీటీఎన్ఎస్ పనితీరుపై సంతృప్తి జిల్లాలో క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్) వ్యవస్థ చక్కగా పనిచేస్తోందని ఐజీ స్టీఫెన్ రవీంద్ర పోలీసులకు కితాబునిచ్చారు. ఇలాగే పనిచేస్తూ రాష్ట్రంలో జిల్లాకు మంచిపేరు తీసుకురాడానికి కృషి చేయాలన్నారు. సమావేశం అనంతరం జిల్లాలో నేరాలకు సంబంధించి, పోలీస్‌శాఖ తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఐజీకి సీపీ కార్తికేయ వివరించారు. అనంతరం విధి నిర్వహణలో చక్కని ప్రతిభ కనబర్చిన 10 మంది సీఐలు, ఎస్సైలు, సిబ్బందికి ఐజీ ప్రోత్సాహక సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. సమావేశంలో ఏసీపీలు ఆనంద్‌కుమార్, మోహన్, రవీందర్, సంజీవ్‌కుమార్, సయ్యద్ అన్వర్ హుస్సేన్, ఎస్బీ సీఐ వెంకన్న, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు, ఆర్ఐలు పోలీస్ కార్యాలయం సూపరింటెండెంట్లు జనార్దన్, మక్సుద్ హైమద్, ఐటీకోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అడ్డగోలు సంపాదనలో అటవీ శాఖ
తిరుపతిలో పెద్ద ఎత్తున ఫ్లాట్లు, ఖాళీస్థలాల కొనుగోళ్లు స్మగ్లర్లకు సహకరిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు జిల్లా అటవీ శాఖలో ఇంటి దొంగల చేతివాటం పెచ్చుమీరుతోంది. పలువురు ఉద్యోగుల అడ్డగోలు దందాకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. కొంతమంది ఉద్యోగులు అడ్డదారి సంపాదనకు అలవాటు పడ్డారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎంతో కాలం నుంచి ఒకే సీటులో కొనసాగుతున్న కొందరు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా అక్రమ సంపాదనను అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నారు. వీరిలో చాలామంది తిరుపతి నగరంలో ఖాళీ స్థలాలు, ఇళ్ల ఫ్లాట్లు కొనుగోలు చేశారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్లను అరికట్టడంలో ఏ మాత్రం చొరవ చూపని కొందరు ఫారెస్ట్ ఉద్యోగులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన మూడో కంటికి తెలియకుండా స్మగ్లర్లకు పరోక్షంగా సాయమందిస్తున్నారనే ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని నరికి దుంగలను స్మగ్లింగ్ చేయడానికి స్మగ్లర్లు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీరి ఆగడాలను అరికట్టడమే కాకుండా అన్ని రకాల అటవీ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత అటవీ శాఖ ఉద్యోగుల పైనే ఉంది. అయితే జిల్లా అటవీ శాఖలో పనిచేసే పలువురు ఉద్యోగుల పోకడ మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. అడ్డదారిలో సంపాదనే లక్ష్యంగా వీరు ముందుకు సాగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామండూరు, తిరుపతి చుట్టుపక్కల ఎఫ్ఆర్వోగా పనిచేసి భారీగా సంపాదించి పలు సందర్భాల్లో సీఎఫ్‌వో ఆగ్రహానికి గురైన ఉద్యోగి ఇప్పటికీ తన పంథాను మార్చుకోలేదని తెల్సింది. ఆంజనేయపురం చెక్‌పోస్టును అడ్డాగా మార్చుకుని పలువురు ఉద్యోగులు రెండు చేతులా సంపాదిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలపల్లి, రైల్వేకోడూరు ప్రాంతాల్లో పనిచేసిన ఓ ఉద్యోగి తిరుపతిలో నాలుగైదు చోట్ల లక్షలు పెట్టి ఖాళీస్థలాలు కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఈయన అవినీతిపై ఆరా తీసిన అటవీ అధికారులు ఒకట్రెండు సార్లు హెచ్చరించారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం టీటీడీలో పనిచేస్తోన్న ఓ అధికారి తీరులోనూ పెద్దగా మార్పులేదని సమాచారం. కొందరు ఎఫ్‌బీవో, ఏబీవో, ఎఫ్ఎస్వో, ఎఫ్ఆర్వోల, డిప్యూటీ ఎఫ్ఆర్వోలపై ఇప్పటికీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భాకరాపేట, రంగంపేట, పీలేరు ప్రాంతాల్లో పనిచేసే ఒకరిద్దరు ఉద్యోగుల తీరు కూడా ఇష్టారాజ్యంగా ఉన్నట్లు సమాచారం. సంపాదన ఎక్కడ ఏ రూపంలో ఉన్నప్పటికీ ఆయా ఉద్యోగులు ఆస్తుల కొనుగోళ్లు మాత్రం తిరుపతిలోనే జరుపుతున్నారు. అక్రమ సంపాదన సొమ్ములతో పలువురు శివజ్యోతినగర్, కొరమేనుగుంట, రేణిగుంట, పాడిపేట, మంగళం, కరకంబాడి రోడ్డుల్లో ఖాళీస్థలాలు, డబుల్, ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు తెల్సింది.అంగబలం, అర్థబలం ఎక్కువగా ఉన్న అధికార పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలిగే మరికొందరు ఉద్యోగులు రాత్రి వేళల్లో తనిఖీలంటూ వేలకు వేలు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల తీరులో మార్పు వస్తేనే ఎర్రచందనం స్మగ్లింగ్ తగ్గుముఖం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
గాంధీభవన్‌లో NSUI సమావేశం
-
అక్రమ సంపాదనతో భారీ ప్రచారం
♦ టీఆర్ఎస్పై ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజం ♦ అరాచకాలను ఎండగట్టాలి ♦ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఉగ్రవాది: భట్టి సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమ సంపాదనతో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బూటకపు ప్రచారం చేసుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి చాలా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలోని అభివృద్ధిని తమ ఘనతగా టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన ఎన్ఎస్యూఐ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకుల అరాచకాలను, అప్రజాస్వామిక పద్ధతులను ప్రజలకు తెలియజేయడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ అన్ని అడ్డదారులను తొక్కుతోందంటూ వీటిపై టీపీసీసీ రూపొందించిన వీడియో క్లిప్పింగులను విద్యార్థి నేతలకు ఉత్తమ్ చూపించారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలు, మెట్రో రైలు, ఔటర్ రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి వాటికి కాంగ్రెస్ చేసిన కృషిని ప్రజలకు వివరించాలని చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటున్న సెటిలర్లకు అందరితోపాటు సమానహక్కులుంటాయన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే వృథా అయినట్టేనని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కుట్రలు: భట్టి ప్రతిపక్షాలను లేకుండా చేయాలని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఉగ్రవాదిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటికే టీఆర్ఎస్ సర్కారు చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో శాస్త్రీయత, పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నదన్నారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా, ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినా అధికారపక్షం బరితెగించి పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌లోని ఏ దామాషా ప్రకారం డివిజన్ల రిజర్వేషన్లు చేశారని ప్రశ్నించారు. చండీయాగం దాతలెవరు: షబ్బీర్ అలీ సీఎం కేసీఆర్ నిర్వహించిన చండీయాగానికి 7.5 కోట్లు ఖర్చు అయినట్టు స్వయంగా ఆయనే చెప్పారని, దానికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను చెప్పాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ప్రచార పిచ్చి పట్టుకుందని, పబ్లిక్ టాయిలెట్లను కూడా కేసీఆర్ ఫొటోలతో నింపేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాళ్ల దగ్గర మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ ఫొటోలు న్నాయని, ముస్లిం వేషధారణలో ఉన్న ఒవైసీ ఫొటోను అక్కడ పెట్టి ముస్లిం లను అవమానిస్తున్నారన్నారు. ముస్లింలకు కేసీఆర్, అసదుద్దీన్ క్షమాపణ చెప్పాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును మించిన అబద్ధాలకోరు దేశంలోనే లేరని విమర్శించారు. వీసాలపై న్యాయసలహాలు అమెరికా వెళ్లి ఇబ్బం దులు పడుతున్న తెలంగాణ విద్యార్థులకు ఆదివారం న్యాయ నిపుణుల ద్వారా ఉచితంగా న్యాయసలహాలను అందిస్తామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ వినోద్‌కుమార్ తెలిపారు. అమెరికా వెళ్తున్న విద్యార్థులు అవగాహన లేకపోవడం వల్ల ఆర్థికంగా నష్ట పోతు న్నారని, అక్కడ ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు. -
డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
రూ. 5 కోట్ల అక్రమ సంపాదన గుట్టురట్టు హైదరాబాద్: కోట్లకు పడగలెత్తిన కరెంటు అధికారి అక్రమ సంపాదనను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బట్టబయలు చేసింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ శ్రీధర్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారం మేరకు ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్, మరో 8 మంది అధికారులు మంగళవారం హైదరాబాద్ బల్కంపేటలోని అతడి ఇంటిలో సోదాలు చేశారు. అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి అతడి నివాసంతోపాటు బంధువులు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేసి సుమారు రూ.5 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు నిర్ధారించారు. బల్కంపేటలో విలువైన భవనం, నగరంలో మరో రెండు ఫ్లాట్లు, కరీంనగర్, సిరిసిల్లల్లో భవనాలు, 60 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు, ఆరు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలు, లాకర్లను పరిశీలించాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ వెన్నెలగడ్డలో ఉన్న మేడ్చల్ విద్యుత్ డీఈ కార్యాలయంలో ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇన్స్పెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. -
సిమెంట్ ముసుగులో అక్రమ రవాణా
- యథేచ్ఛగా టీడీపీ నేతల దందా - రెండు భారీ లారీలను పట్టుకున్న పోలీసులు - వాటిని వదిలి పెట్టాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిడి సాక్షి కడప/పులివెందుల : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు అక్రమ సంపాదనకు తెగబడుతున్నారు. ఆదాయం వస్తుందంటే చాలు ఎక్కడైనా దోచుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఎర్రచందనం, ఇసుక లాంటి ప్రకృతి సంపదను కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. అడ్డంగా దొరికిపోయినప్పుడు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తూ ఆనక దర్జా ఒలకబోస్తున్నారు. వీరి దందాను ఎవరైనా అడ్డుకుంటే సామ, దాన, భేద, దండోపాయాలు ప్రదర్శించడం జిల్లాలో నిత్య కృత్యంగా మారింది. ప్రస్తుతం చెయ్యేరు, పాపాఘ్ని, పెన్నా నదుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను బెంగుళూరు, చెన్నై, ప్రకాశం జిల్లాలకు తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. పంథా మార్చిన నేతలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఇసుక తరలింపులో పలువురు కొత్త పంథాను అవలంభిస్తున్నారు. ఇంతవరకు ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తూ వచ్చిన అక్రమార్కులు.. ప్రస్తుతం 18 టైర్ల భారీ లారీల్లో సిమెంటు లోడు తరహాలో టార్ఫాలిన్ పట్టాలు కట్టి.. గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. సుమారు 30 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ లారీల్లో ఏకంగా 50 టన్నుల మేర ఇసుకను నింపి తరలిస్తున్నారు. కొండాపురం నుంచి ఏపీ04టీటీ 6939, ఏపీ04టీటీ 7668 అనే నెంబర్లు గల లారీలలో బెంగళూరుకు ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం అర్ధరాత్రి పులివెందుల జేఎన్టీయూ వద్ద ఎస్ఐ వెంకటనాయుడు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. సోమవారం రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ అక్రమ రవాణా టీడీపీ నేతల పనేనని తెలిసింది. ఈ లారీలు కూడా కొండాపురానికి చెందిన ఓ టీడీపీ నేతవని సమాచారం. పోలీసులు పట్టుకున్న లారీలను విడిచి పెట్టాలని పులివెందుల టీడీపీ నేతలు స్థానిక పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. లారీల్లో ఇసుకను తరలిస్తూ... ఆటోలలో ఇసుకను తీసుకెళుతున్నట్లు చలానాలు చూపించినట్లు సమాచారం. ఈ లారీల వెనుక మరో రెండు లారీలు వస్తుండగా.. పట్టుబడిన లారీల్లోని వారు ఇచ్చిన సమాచారంతో ఆ లారీలు వెనక్కి వెళ్లినట్లు తెలిసింది. -
అబార్షన్ కిల్లర్స్
ఆర్ఎంపీ ముసుగులో నకిలీ డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా గర్భస్రావాలు ప్రాణాలు కోల్పోతున్న గర్భిణులు మాతృత్వానికి దూరమవుతున్న యువతులు లబ్బీపేట : అక్రమ సంపాదనే లక్ష్యంగా ఆర్ఎంపీల ముసుగులో నకిలీ డాక్టర్లు యువతులకు గర్భస్రావాలు చేస్తూ వారి ప్రాణాలు తీస్తున్నారు. ఎటువంటి అనుభవం, నైపుణ్యం లేని వీరి నిర్వాకం వల్ల కొందరు యువతులు మాతృత్వానికి దూరమవుతుండగా, మరికొందరు ఇన్ఫెక్షన్లు సోకి జీవితాంతం రోగాలబారిన పడుతున్నారు. మరికొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. రెండు రోజుల కిందట మచిలీపట్నంలో జరి గిన భ్రూణహత్య ఘటనకు సంబంధించి చేపట్టిన విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మహిళకు గర్భస్రావం చేసిన ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ మరికొంత మందికి అదే తరహాలో అబార్షన్లు చేసిన విషయాన్ని గుర్తించిన అధికారులు నివ్వెరపోయారు. నిబంధనలు ఇలా.. పెళ్లయిన వారు అప్పుడే పిల్లలు వద్దనుకున్నప్పుడు, పిల్లల మధ్య ఎడం కావాలనుకున్నప్పుడు భార్యాభర్తలిద్దరి ఇష్టప్రకారం అబార్షన్ చేయొచ్చు. భార్యకు ఇష్టం లేకుండా అబార్షన్ చేయించడం నేరం. గర్భంలో పెరుగుతున్న శిశువులో లోపాలను గుర్తిస్తే గర్భస్రావం చేయవచ్చు. అవాంఛిత గర్భం దాల్చిన వారికి సైతం సరైన జాగ్రత్తలు పాటించి అబార్షన్ చేయాలి. గర్భం 12 వారాల లోపు అయితే సింగిల్ గైనకాలజిస్టు, 13 నుంచి 20 వారాల్లోపు అయితే ఇద్దరు స్పెషలైజ్డ్ వైద్యులు పరిశీలించి గర్భస్రావం చేయాల్సి ఉంటుంది. ఇవే నిదర్శనాలు.. ►గూడూరు మండలం మల్లవోలుకు చెందిన దుర్గాదేవికి మూడో కాన్పులోనూ ఆడపిల్లే పుడుతుందని లింగనిర్ధారణ పరీక్షలో తెలుసుకుని గర్భం దాల్చిన ఆరో నెలలో అబార్షన్ కోసం ఆమె అత్తింటివారు ఓ ఆర్ఎంపీని సంప్రదించారు. ఆ ఆర్ఎంపీ మరో ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే నర్సు సత్యవతితో కలిసి దుర్గాదేవికి మూస పద్ధతిలో అబార్షన్ చేయడంతో ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాల మీదకు వచ్చింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు సకాలంలో శస్త్రచికిత్స చేయడంతో ఆమె కోలుకుంటోంది. ఆర్ఎంపీ, నర్సు ఇదే తరహాలో మరిన్ని అబార్షన్లు చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ►విజయవాడ కృష్ణలంకకు చెందిన వివాహితకు సింగ్‌నగర్‌కు చెందిన ఆర్ఎంపీ చేసిన అబార్షన్ వికటించడంతో ఆ మహిళ తీవ్ర రక్తస్రావంతో వారంరోజులు పోరాడి మృత్యువాత పడింది. ఆ కేసులో ఆర్ఎంపీని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ బెయిల్‌పై వచ్చి తిరిగి అబార్షన్లు చేసిన వైనం తెలిసిందే. ►రెండేళ్ల కిందట విజయవాడ నగరపాలక సంస్థలో నర్సుగా పనిచేస్తున్న విజయకుమారి కొత్తపేట ప్రాంతానికి చెందిన యువతికి చేసిన గర్భస్రావం వికటించింది. ఆ యువతి పదిరోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో తరచూ జరుగుతున్నప్పటికీ నకిలీలపై వైద్యాధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నకిలీల నిర్వాకానికి అమాయక యువతులు, మహిళలు బలవుతున్నారు. అవాంఛిత గర్భందాల్చిన యువతులు గర్భస్రావాలు చేయించుకుని మాతృత్వానికి శాశ్వతంగా దూరమైన ఘటనలు గతంలో నమోదయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నారు. -
బ్లాక్‌మెయిలింగ్ కేసులో కీలక వ్యక్తుల పరారీ
వారు దొరికితే అనేక విషయాలు వెలుగులోకి డబ్బులు రికవరీ లేనట్లేనా ? వరంగల్ క్రైం : మీడియా పేరుతో అక్రమ సం పాదనకు తెరతీసిన కేసులో కీలక వ్యక్తులుగాఉన్న కీసరాజు దేవేందర్, పిడమర్తి మనోహర్ పరారీలో ఉన్నారు. ఇందులో దేవేందర్ టీఎస్-9 టీవీకి సీఈఓగా వ్యవహరిస్తు దందాకు సూత్రధారిగా ఉండగా, మనోహర్ డబ్బులున్న వారి వివరాలు సేకరిస్తుంటాడు. ఈ ముఠాలో వీరిద్దరిదే ప్రముఖ పాత్ర అని తెలుస్తోంది. అన్ని వివరాలు సేకరించిన తర్వాత చేయాల్సిన పనిని ముఠాలోని మిగతావారు ముగిస్తారు. ఈ ముఠా టార్గెట్ చేసిన వారంతా సమాజంలోని ప్రముఖులు కావడం విశేషం. కేయూకు చెందిన రిటైర్డ ప్రొఫెసర్, ఆర్టీసీలో ఉన్నతాధికారి, పాలడైరీలో ఉన్నతాధికారి, ఎఫ్‌సీఐ అధికారి ఇలా అందరూ హైప్రొఫైల్కు చెందిన వారు కావడం విశేషం. కీలక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసకుంటే వారు టార్గెట్ చేసిన వ్యక్తుల జాబితా మొత్తం బయటకు వచ్చే అవకాశముంది. అలాగే జెమిని న్యూస్ చానల్ లోగోను ఎందుకు వాడారనే విషయం కూడా బహిర్గతం కావాల్సి ఉంది. ఈ దందాలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. దీంతోపాటు వీరు అక్రమంగా సంపాదించిన రూ.12 లక్షలు కూడా నిందితుల వద్దనే ఉన్నాయా...? ఇంకా అంతకంటే భారీ మొత్తంలో సంపాదించారా? అనే విషయాలు వెలుగు చూడాల్సి ఉంది. ఆరుగురిని అరెస్టు చేసినప్పటికీ డబ్బులు మాత్రం రికవరీ కాకపోవడంతో డబ్బులు ఎక్కడ దాచారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరు జల్సాలకు ఖర్చు చేసినప్పటికీ ఆ సొత్తును పోలీసులు రికవరీ చేయాల్సి ఉంది. వారిని మళ్లీ కస్టడీకి తీసుకుని విచారిస్తాం : సీపీ సుధీర్‌బాబు సోమవారం కోర్టులో హాజరుపరిచిన నిందితులను మరోమారు కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తాం. పరారీలో ఉన్న వారు దొరికితే అనేక కొత్తవిషయాలు బయటకు రావడంతోపాటు డబ్బులు కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంది. -
ప్రమాదపుటంచున పులికాట్
ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల పరిధిలో ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన పులికాట్ సరస్సు ప్రమాదపుటంచులో ఉంది. సరస్సు గర్భంలో సహజసిద్ధంగా ఉన్న సున్నపు గుల్ల, వానపాములను ఇబ్బడి ముబ్బడిగా తవ్వేయడంతో భవిష్యత్తులో సరస్సు ఉనికి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. సూళ్లూరుపేట : అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు తీరప్రాంత గ్రామాల్లోని కూలీలను ప్రోత్సహించి సరస్సు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు. సున్నపుగుల్ల తీసేయడం వల్ల సరస్సు ఉత్తరంవైపు ఎడారిని తలపిస్తోంది. మరోవైపు వానపాముల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. తడమండలం వేనాడు, ఇరకం దీవుల చుట్టూ గుల్ల, వానపాములను తవ్వేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం దురదృష్టకరం. దీనికి తోడు కొండూరు, గ్రద్దగుంట, చేనిగుంట గ్రామాల్లోని కొందరు కాళంగినది లో కలిసేచోట ఉన్న ఇసుక దిబ్బలను తవ్వి ట్రాక్టర్లతో రాత్రివేళల్లో తమిళనాడుకు తరలిస్తున్నారు. వేనాడు, ఇరకం దీవులే కేంద్రాలు.. వేనాడు ఇరకం దీవుల్లోని కూలీలు ఎక్కువగా వానపాములను పట్టే పనికి వెళుతున్నట్టు తెలుస్తోంది. కూలీలు తవ్వి తీసిన వానపాములను మట్టికుండలు, ప్లాస్టిక్ బకెట్లు, పాలిథిన్ కవర్లలో అనుమానం రాకుండా తరలిస్తున్నారు. పులికాట్ సరస్సులో దొరికే వానపాములకు రొయ్యల హేచరీల్లో మంచి డిమాండ్ ఉండడంతో చాలామంది ఈ అక్రమ వ్యాపారాన్ని నడుపుతున్నారు. కిలో వానపాములు పడితే కూలీకి రూ.500 నుంచి రూ.750 వరకు ఇస్తున్నారు. వీటిని హేచరీలకు తరలించి కిలో సుమారుగా రూ.5 వేల నుంచి రూ.6 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు తమిళనాడు తీరప్రాంతంలో నిత్యం టన్నుల కొద్దీ సున్నపుగుల్లను తీసేసి సరస్సును గుల్ల చేస్తున్నారు. దీంతో మత్స్యసంపద తగ్గిపోవడం, సరస్సు గుంతల గుంతలుగా మారి ఎడారిగా మారుతోంది. తమిళనాడులోని కవరైపేటై నియోజకవర్గం పరిధిలోని సున్నాంబుగోళం (సున్నపుగుంట) గ్రామం వద్ద సరస్సుకు అతి దగ్గరలో నాలుగైదు సున్నపు గుల్ల కంపెనీలున్నాయి. వాస్తవంగా పులికాట్ సరస్సుకు వందమీటర్ల పరిధిలో ఎలాంటి పరిశ్రమలు, హోటళ్లు, రిసార్ట్స్ లాంటివి ఉండకూడదని చట్టం ఉంది. ఈ చట్టాన్ని తుంగలోతొక్కి తమిళనాడులో ఇప్పటికీ సున్నపుగుల్ల కంపెనీలు నడుస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో సూళ్లూరుపేట వన్యప్రాణి సంరక్షణ విభాగం కిందిస్థాయి సిబ్బందికి నెల మామూళ్లు అందుతుండడంతో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పులికాట్ సరస్సును భవిష్యత్తు తరాల వారికి మ్యాప్‌లో చూపించాల్సిన పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్యం లేదు. దాడులేవీ..? పులికాట్ సరస్సును అన్ని రకాలుగా కుళ్లబొడిచేస్తున్నా పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు, సిబ్బంది దాడులు చేస్తున్న దాఖలాల్లేవు. ప్రభుత్వం ఇచ్చే జీతాలతో పాటు పులికాట్లో జరిగే అక్రమాలను కూడా సొమ్ముచేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. పులికాట్ సరస్సు పరిధిలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతాన్ని కేటాయిస్తూ బీట్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. అందిన కాడికి దండుకుని వారు కార్యాలయానికి పరిమితమవుతున్నారు. దాడుల విషయమై అధికారులను అడిగితే సిబ్బంది కొరత కారణంగా దాడులు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. -
పని జరగాలంటే.. చేయి తడపాల్సిందేనా..!
చేవెళ్ల: ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజాసేవకులు.. నెలనెలా వేతనం తీసుకుంటూ విధులు నిర్వర్తించాలి. కాని నేడు కొందరు అధికారులు అక్రమ సంపాదన వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పనిని తాము చేసేందుకు లంచాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో తరచూ ఏసీబీ వలకు చిక్కుతున్నారు. కాగా ‘దొరికినోడే దొంగ’ అన్న చందంగా ఉంది. అవినీతికి పాల్పడుతూ తప్పించుకుంటున్నవాళ్లు చాలామంది ఉన్నారు. అంకితభావంతో ఉద్యోగాలు చేసేవారూ లేకపోలేదు. ప్రజల్లో చైతన్యం పెరిగినప్పుడే అవినీతిని పూర్తిస్థాయిలో నిర్మూలించే అవకాశం ఉంది. లంచం తీసుకోవడం ఎంత నేరమో.. ఇవ్వడమూ అంతే తప్పు. ఇటీవల మంచాల వ్యవసాయ అధికారి లావణ్య ఓ ఫర్టిలైజర్ లెసైన్స్ కోసం ఓ యువకుడి నుంచి డబ్బులు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కిపోయిన విషయం తెలిసిందే. జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేపలు.. * 2009లో మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సురేందర్‌రెడ్డి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. * 2011లో మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శుక్లకుమార్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుకున్నారు. * 2012లో అప్పటి శంకర్పల్లి గ్రామ పంచాయతీ ఈఓ ఓ పని నిమిత్తం రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. * 2012 ఫిబ్రవరి 16న చేవెళ్ల ప్రొబేషనరీ డీఎస్పీ గుణశేఖర్ ఓ భూవివాదం పరిష్కారిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ. 25 వేలు తీసుకుంటుండగా ఏసీబీ వలకు చిక్కారు. అప్పట్లో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. * 2013 జనవరి 30న చేవెళ్ల హెడ్‌కానిస్టేబుల్ నాగేందర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి దొరికాడు. దీంట్లో సీఐ శ్రీనివాస్ హస్తం ఉందనే ఆరోపణలతో అధికారులు ఆయనపై కూడా కేసు నమోదు చేసి అప్పట్లో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. * చేవెళ్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ కురుమానాయక్, కానిస్టేబుల్ నర్సింలు కల్లు దుకాణం యజమాని నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. * కుల్కచర్ల ఇన్చార్జి ఎంపీడీఓ పండరీనాథ్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అవినీతి అధికారులకు పట్టుబడ్డారు. * 2013లో గండేడ్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. గతంలో గండేడ్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శీనప్ప ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. * పంచాయతీ రాజ్ ఏఈఈ వేణుగోపాల్‌రెడ్డి లంచం కేసులో అవినీతి అధికారులు పట్టుకున్నారు * గండేడ్ పీహెచ్సీ కార్యదర్శి గోపాల్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. * తాజాగా ఈనెల 5న మంచాల ఏఓ (అగ్రికల్చర్ ఆఫీసర్) లావణ్య ఓ ఫర్టిలైజర్ దుకాణం లెసైన్స్ విషయంలో రూ. 2 వేలు ఓ వ్యక్తి నుం చి తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతిపరుల భరతంపట్టండి.. ప్రభుత్వ అధికారులు వేతనం తీసుకుంటున్నారు. పనిచేయడం వారి బాధ్యత. పనికోసం లంచాలి వాల్సిన అవసరం లేదు. అవినీతి పరుల భరతం పట్టాలంటే జిల్లా ఏసీబీ అధికారికి 9440446140 నంబర్లో ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు వలపన్ని వారిని పట్టుకుంటారు. -
కళ్లు తెరవండి!
ఇది వల్లూరు మండలంలోని తప్పెట్ల ఇసుకక్వారీ.. ఇక్కడ నవంబర్ 3వ తేదీ నుంచి ఇసుక విక్రయాలు ప్రారంభించారు.. ఇప్పటి వరకు 17,640 క్యూబిక్‌మీటర్ల ఇసుకను విక్రయించారు. క్యూబిక్‌మీటర్‌కు రూ. 650 చొప్పున ప్రభుత్వానికి రూ. 1.50 కోట్ల ఆదాయం ఒనగూరింది.. కేవలం 50 రోజుల్లో ఒక తప్పెట్ల క్వారీ నుంచే వచ్చిన ఆదాయం ఇది.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 3.2 కోట్ల ఆదాయం లభించింది. ఇదిలా ఉండగా ఇంతకు పదిరెట్లు అక్రమంగా ఇసుక తరలిపోతోంది. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం చూస్తుండిపోతోంది. సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి సంపద అధికార పార్టీ నేతలకు అందివచ్చిన అవకాశంగా మారింది. నాయకుల అక్రమ సంపాదనకు అడ్డుఅదుపూ లేకుండా ఉంది. ఇప్పటి వరకూ జిల్లాలో ఆరు రీచ్‌ల ద్వారా ఇసుక విక్రయాలు చేస్తున్నారు. మరో 15 రీచ్‌లలో ఇసుక తరలింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చెయ్యేరు నదిలో 6 రీచ్‌లు, పెన్నాలో 5 రీచ్‌లు, పాపాఘ్నిలో 4 రీచ్‌లను ఏర్పాటు చేయలని నిర్ణయించారు. దాదాపు 80 హెక్టార్లలో 9లక్షల 5వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించవచ్చనేది అధికారుల అంచనా. తద్వారా రూ.60 కోట్లు ఆదాయాని ఆర్జించవచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాత్రికి రాత్రే ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నా ఎవరూ నియంత్రించడం లేదు. ప్రధానంగా తప్పెట్ల, పైడికాల్వ, కమలాపురం, ములుకోనిపల్లె, నందిమండలం, వేంపల్లె, వీరన్నగట్టుపల్లె నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అలాగే కొండాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, చెన్నూరు మండలాల నుంచి కూడా ఇసుక సంపదను కొల్లగొడుతున్నారు. అంతలోనే ఎంత మార్పు... నదుల్లోని ఇసుక తరలిస్తే భూగర్భజలాలు అడుగింటి పోతాయని ఆవేదన చెందుతూ ఆందోళన చేపట్టిన నాయకులు అధికారపీఠం ఎక్కగానే దృష్టి మరలుతోంది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి తీరు ఇందుకు దర్పంగా నిలుస్తోంది. 2007-08లో తంగేడుపల్లె (వేంపల్లె దిగువన) ఇసుక టెండర్ నిర్వహించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇసుకను తరలిస్తే నీటిపథకాలకు గ్రహణం పడుతుందని, వేంపల్లెకు తాగునీటి సమస్య వస్తుందని ఆవేదన చెందారు. ప్రస్తుతం కుమ్మరాంపల్లె ఇసుకక్వారీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వేంపల్లె గ్రామానికి పైభాగాన కుమ్మరాంపల్లె గ్రామం ఉంది. తాగునీటి పథకాలన్నీ కుమ్మరాంపల్లెకు సమీపంలోనే ఉన్నాయి. 2008 నుంచి ఇప్పటివరకు ఒక్కమారు కూడా పట్టుమని పదిరోజులు పాపాఘ్ని నదిలో నీటి ప్రవాహం లేదు. నాడు వేంపల్లె భూగర్భజలాలపై ఆందోళన చెందిన ఎస్వీ సతీష్‌రెడ్డికి ప్రస్తుతం కుమ్మరాంపల్లె ఇసుకక్వారీ గుర్తుకు రాకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. కరువు మండలాలతోనే సరి... జిల్లాలో 48 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చెన్నూరు మండలాలు మినహా తక్కినవికరువు ప్రాంతాలుగా గుర్తించారు. ప్రకటన మినహా ఇంతవరకు ఎటువంటి సహాయ చర్యలు తీసుకోవలేదు. కరవు నేపధ్యంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గుదిబండగా ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కార్మికులు, చిన్నతరహా పరిశ్రమల యజమానులకు గుదిబండగా మారింది. జీఓ 296ను రద్దు చేయడంతో బెరైటీస్ ఖనిజాన్నే నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్న 20వేల మంది రోడ్డుపాలయ్యారు. బెరైటీస్ ఖనిజం ఆధారంగా 180 మిల్లులు పనిచేస్తున్నాయి. వాటిలో ప్రత్యక్షంగా 5వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇదివరకు 40ః60 దామాషా ప్రకారం బెరైటీస్ ఖనిజాన్ని సరఫరా చేసేవారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబు గ్యారంటీ అనీ ప్రకటనలు ఇచ్చారు, ఇప్పుడేమో కార్మికుల పొట్టకొట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు వాపోతున్నారు. జఠిలంగా మారుతున్న తాగునీటి సమస్య... వేసవి రాకముందే తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. 185 గ్రామాలు నీటి ఎద్దడితో ఉన్నాయి. వాటిలో 110 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.500 మాత్రమే కేటాయిస్తున్నారని .. మిగతాది తాము చేతి నుంచి భరించాల్సిన దుస్థితి నెలకొందని ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు నీటి తరలింపునకు వెనక్కి తగ్గుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తుండటంతో భూగర్భజలాల్ని అడుగంటి నీటి సమస్య ఏర్పడుతోంది. కొనసాగుతున్న వివక్షత... జిల్లాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివక్షత ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు స్పష్టమైన ఉదాహరణలుగా ఎయిర్‌పోర్టు, కలెక్టరేట్ కాంప్లెక్స్ బిల్డింగ్లు నిలుస్తున్నాయి. కడప విమానాశ్రయంలో దిగేందుకు కింగ్‌ఫిషర్, జెట్ ఏయిర్ వేస్, స్పైజెట్లు దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. వాటితోపాటు ప్రభుత్వ విమానయాన సంస్థ ఇండియన్ ఏయిర్ లైన్స్ సర్వీసులు ఎలాగూ నడుస్తాయి. అయితే కడప విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఏయిర్‌పోర్టుగా మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దీంతో కేవలం ఏటీఆర్-72 సర్వీసులు మాత్రమే నడుస్తాయి. ఏటీఆర్-72 రకం విమానాల్లో 75 మంది ప్రయాణీకులు మాత్రమే సౌకర్యం ఉంటుంది. దీనికి కూడా కొందరు అడ్డుపుల్ల వేస్తున్నారు. దీంతో విమానాశ్రయ ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తోంది. కలెక్టరేట్ కాంప్లెక్స్ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్లో పూర్తయిన భవనాలు ఐదేళ్లుగా అలాగే ఉండిపోతున్నాయి. జిల్లాలోని గండికోట ప్రాజక్టులో ఏకకాలంలో 40 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి పెండింగ్ కారణంగా గండికోట ముంపు గ్రామాలు ఖాళీ కాలేదు. గండికోట, మైలవరం, వామికొండ, సర్వారాయసాగర్, బ్రహ్మంసాగర్లలో నీరు నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉండి కూడా ఆ మేరకు చర్యలు తీసుకోలేకపోతున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఈనేపధ్యంలో శనివారం జిల్లా సర్వసభ్యసమావేశం నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు జిల్లా సమగ్రాభివృద్ధి పట్ల ప్రత్యేక చొరవ చూపెట్టాలని పాలక పక్షం వివక్షతను ఎండగట్టాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. -
అమరుల స్టిక్కర్లతో అక్రమ సంపాదన
నిజామాబాద్ క్రైం : శవాలపై పేలాలు ఏరుకోవటమంటే ఇదేనేమో. దేశం, సమాజం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమర పోలీసుల పేరు చెప్పి కొంతమంది అక్రమ సంపాదనకు ఎగబడ్డారు. పోలీస్ శాఖకు తలవంపులు తీసుకువచ్చే ఈ సంఘటన అమరుల ఆత్మకు అశాంతి కలిగిస్తుందనటంతో ఎలాంటి సందేహం అక్కరలేదు. ఇదీ సంగతి... విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసులను స్మరిస్తూ పోలీస్‌శాఖ ప్రతి సంవత్సరం అక్టోబరు 15 నుంచి 21 వరకు అమర పోలీస్ సంస్మరణ వారోత్సవాలు జరుపుతుంది. ఇందులో భాగంగా పోలీస్‌శాఖ జిల్లావ్యాప్తంగా వేలాది స్టిక్కర్లను పోలీసు సిబ్బందితో విక్రయిస్తుంది. ఇదే పోలీసులకు వరంగా మారింది. తమతో పనిబడేవారి నుంచి పోలీసులు డబ్బులు ఇవ్వనిదే పనులు చేయరనే ఆరోపణలు ఎప్పుడూ వినిపిస్తుంటాయి. కనీసం అమరులైన పోలీసుల స్టిక్కర్ల విక్రయించే విషయంలో కూడా కక్కుర్తిపడి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. అమర పోలీసు సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్టిక్కర్లు అమ్మటం ఆనవాయితీగా వస్తోంది. స్టిక్కర్లు అమ్మగా వచ్చిన డబ్బులను పోలీస్ సంక్షేమ నిధిలో జమచేస్తారు. ఇలా సేకరించిన డబ్బులను ప్రమాదంలో చనిపోయే పోలీస్ సిబ్బందికే చెల్లిస్తారు. ఈ ఏడాది... ఈ ఏడాది జిల్లాలో 61 వేల స్టిక్కర్లు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో స్టిక్కర్ రూ.10 లకే అమ్మాల్సి ఉంటుంది. ఆ విధంగా నిజామాబాద్ సబ్ డివిజన్లో 20 వేలు, ఆర్మూర్ సబ్ డివిజన్లో 10 వేలు, కామారెడ్డి, బోధన్ సబ్ డివిజన్లలో 15 వేల చొప్పున స్టిక్కర్లు విక్రయించాలని పంపారు. వీటిని కొంతమంది పోలీసులు రూ.10 లకే విక్రయించగా, మరికొంతమంది ఒక్కో స్టిక్కర్ రూ.50 నుంచి రూ.100 లకు బలవంతంగా విక్రయించినట్లు తెలిసింది. కొంతమంది వాహనదారులు స్టిక్కర్‌పై రేట్ చూడకుండా డబ్బులు ఇచ్చివెళ్లగా, మరికొంతమంది స్టిక్కర్‌పై రూ.10 ఉంటే ఎక్కువ డబ్బులు ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం దాటవేస్తూ డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఏడాది పొడవు అక్రమ సంపాదనకు చేయి చాపే కొంతమంది పోలీసులు, కనీసం అమర పోలీసుల పేరుతో విక్రయించే స్టిక్కర్లను నీతి, నిజాయితీగా అమ్మిఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి జిల్లాకు వచ్చిన వెంటనే జిల్లా పోలీసులు ప్రజలకు చేరువయ్యే పనులు చేపట్టారు. అందులో భాగంగా ఫ్రెండ్లీ పోలీసు, కొత్త పోలీస్ వ్యవస్థీకరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పోలీసులంటే ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించే కార్యక్రమాలు ఎస్పీ చేపడుతుంటే, కొంతమంది ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటం శాఖకు చెడ్డపేరు తేవడమే.