ఎమ్మిగనూరు టౌన్: గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సత్యనారాయణ అవినీతి, అక్రమ సంపాదనపై ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు సీబీఐ డైరెక్టర్‌కు బీజేపీ రాష్ట్ర నేత, ఆలిండియా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.పురుషోత్తంరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌గా రెండున్నరేళ్లపాటు పనిచేసిన సత్యనారాయణ అప్పటి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ తోపాటు కేఈ కృష్ణమూర్తి పేరుతో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. అప్పట్లో పీఎంఏవై కింద కర్నూలుకు ఆరువేల గృహాలు, నంద్యాలకు 4,500, ఆదోనికి 4,700, ఎమ్మిగనూరుకు వెయ్యి గృహాలు మంజూరయ్యాయన్నారు.
వీటి నిర్మాణ కాంట్రాక్టు పొందిన షాపూర్‌జీ పల్లోంజి కంపెనీ నుంచి తమిళనాడుకు చెందిన వాసన్ అండ్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్‌ను సత్యనారాయణ ఇప్పించి లబ్ధి పొందారన్నారు. అంతేగాక వాసన్ అండ్ కంపెనీకి ఇసుక సరఫరాకోసం తన సోదరుడి కుమారుడు మురళి, బంధువు శ్రీనివాస్‌లను బినామీలుగా పెట్టుకుని.. వారి పేరిట జిల్లాలోని కౌతాళం, గుడికంబాళి ఇసుక రీచ్‌లను మంజూరు చేయించారని ఆరోపించారు. ఆయన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి అక్రమాస్తులను జప్తు చేయాలన్నారు. ఈ మేరకు పీఎంవో, సీబీఐ డైరెక్టర్‌తోపాటు సీబీఐ జేడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌లకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment