అడ్డగోలు సంపాదనలో అటవీ శాఖ
అడ్డగోలు సంపాదనలో అటవీ శాఖ
Published Mon, Oct 24 2016 11:35 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
తిరుపతిలో పెద్ద ఎత్తున ఫ్లాట్లు, ఖాళీస్థలాల కొనుగోళ్లు
స్మగ్లర్లకు సహకరిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు
జిల్లా అటవీ శాఖలో ఇంటి దొంగల చేతివాటం పెచ్చుమీరుతోంది. పలువురు ఉద్యోగుల అడ్డగోలు దందాకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. కొంతమంది ఉద్యోగులు అడ్డదారి సంపాదనకు అలవాటు పడ్డారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎంతో కాలం నుంచి ఒకే సీటులో కొనసాగుతున్న కొందరు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా అక్రమ సంపాదనను అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నారు. వీరిలో చాలామంది తిరుపతి నగరంలో ఖాళీ స్థలాలు, ఇళ్ల ఫ్లాట్లు కొనుగోలు చేశారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్లను అరికట్టడంలో ఏ మాత్రం చొరవ చూపని కొందరు ఫారెస్ట్ ఉద్యోగులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన మూడో కంటికి తెలియకుండా స్మగ్లర్లకు పరోక్షంగా సాయమందిస్తున్నారనే ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని నరికి దుంగలను స్మగ్లింగ్ చేయడానికి స్మగ్లర్లు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీరి ఆగడాలను అరికట్టడమే కాకుండా అన్ని రకాల అటవీ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత అటవీ శాఖ ఉద్యోగుల పైనే ఉంది. అయితే జిల్లా అటవీ శాఖలో పనిచేసే పలువురు ఉద్యోగుల పోకడ మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. అడ్డదారిలో సంపాదనే లక్ష్యంగా వీరు ముందుకు సాగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మామండూరు, తిరుపతి చుట్టుపక్కల ఎఫ్‌ఆర్‌వోగా పనిచేసి భారీగా సంపాదించి పలు సందర్భాల్లో సీఎఫ్‌వో ఆగ్రహానికి గురైన ఉద్యోగి ఇప్పటికీ తన పంథాను మార్చుకోలేదని తెల్సింది. ఆంజనేయపురం చెక్‌పోస్టును అడ్డాగా మార్చుకుని పలువురు ఉద్యోగులు రెండు చేతులా సంపాదిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలపల్లి, రైల్వేకోడూరు ప్రాంతాల్లో పనిచేసిన ఓ ఉద్యోగి తిరుపతిలో నాలుగైదు చోట్ల లక్షలు పెట్టి ఖాళీస్థలాలు కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఈయన అవినీతిపై ఆరా తీసిన అటవీ అధికారులు ఒకట్రెండు సార్లు హెచ్చరించారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం టీటీడీలో పనిచేస్తోన్న ఓ అధికారి తీరులోనూ పెద్దగా మార్పులేదని సమాచారం. కొందరు ఎఫ్‌బీవో, ఏబీవో, ఎఫ్‌ఎస్‌వో, ఎఫ్‌ఆర్‌వోల, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వోలపై ఇప్పటికీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భాకరాపేట, రంగంపేట, పీలేరు ప్రాంతాల్లో పనిచేసే ఒకరిద్దరు ఉద్యోగుల తీరు కూడా ఇష్టారాజ్యంగా ఉన్నట్లు సమాచారం. సంపాదన ఎక్కడ ఏ రూపంలో ఉన్నప్పటికీ ఆయా ఉద్యోగులు ఆస్తుల కొనుగోళ్లు మాత్రం తిరుపతిలోనే జరుపుతున్నారు. అక్రమ సంపాదన సొమ్ములతో పలువురు శివజ్యోతినగర్, కొరమేనుగుంట, రేణిగుంట, పాడిపేట, మంగళం, కరకంబాడి రోడ్డుల్లో ఖాళీస్థలాలు, డబుల్, ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు తెల్సింది.అంగబలం, అర్థబలం ఎక్కువగా ఉన్న అధికార పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలిగే మరికొందరు ఉద్యోగులు రాత్రి వేళల్లో తనిఖీలంటూ వేలకు వేలు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల తీరులో మార్పు వస్తేనే ఎర్రచందనం స్మగ్లింగ్ తగ్గుముఖం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
Advertisement