సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: హరితహారం పేరుతో ప్రభుత్వం ఓవైపు కోట్లాది రూపాయలు వెచ్చించి మూడేళ్లుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతుండగా, మరోవైపు అడవుల నరికివేత యథావిధిగా కొనసాగుతోంది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మొదలుకొని వరంగల్, మెదక్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వరకు అడవుల నరికివేత యథేచ్ఛగా సాగుతోంది. అటవీ ప్రాంతంలోని గ్రామాలకు చెందిన వారితో పాటు కలప స్మగ్లర్లు విలువైన టేకు చెట్లను నరికి తరలించుకుపోతున్నారు.
అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో అడవుల ధ్వంసం ప్రమాదకర స్థాయిలో సాగుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎమ్మెల్యేగా గెలిచిన గజ్వేల్‌లో నెలనెలా రూ. కోట్ల విలువైన కలప అక్రమంగా రవాణా అవుతుండగా, భూపాలపల్లి జిల్లాకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి అక్రమంగా కలప తరలివస్తోంది. ఖమ్మం, కొత్తగూడెంల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో కూడా టేకు వృక్షాలు కనుమరుగవుతున్నాయి. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, చెక్‌పోస్టులు నామమాత్రంగా మిగిలిపోవడం, స్మగ్లర్లకు సిబ్బంది సహకారం నేపథ్యంలో అడవుల్లోని భారీ వృక్షాలు స్మగ్లర్ల ద్వారా హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చేరిపోతున్నాయి. మామూళ్ల మత్తులో అటవీ అధికారులు చోద్యం చూస్తున్నారు.
అభయారణ్యం నుంచే నరికివేత
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని పలు మండలాల్లో అడవిని నరికి చెట్లను తరలించే కార్యక్రమం పకడ్బందీగా సాగుతోంది. ఇక్కడికి వందేళ్ల క్రితం వలస వచ్చిన ముల్తానీ కుటుంబాలతో పాటు మహారాష్ట్రకు చెందిన స్మగ్లర్లు, స్థానికులు అడవుల నరికివేతలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాళ్లపేట రేంజ్ పరిధిలోని మల్యాల, సింగరాయిపేట, తపాల్‌పూర్, మహ్మదాబాద్ బీట్‌ల నుంచి టేకు చెట్ల నరికివేత, కలప తరలింపు ప్రక్రియ సాగుతోంది. బోథ్ మండలం పరిధిలోని మర్లపల్లి, నిగిని అటవీ ప్రాంతాల నుంచి చెట్లను నరికి వేస్తున్నారు.
పెంబి మండలంలోని పలు ప్రాంతాలతో పాటు తిర్యాణి, మంగి, గుండాల, ఖానాపూర్, ఉట్నూరు, ఇచ్చోడ ప్రాంతాల నుంచి కలప నరికివేత, అక్రమ రవాణా కొనసాగుతోంది. బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు, ఉట్నూర్, నార్నూర్ మండలాలలోని అడవుల్లో స్మగ్లర్లు పగటి వేళల్లో నరికే చెట్లను గుర్తించి, రాత్రివేళ్లల్లో నరికి హైదరాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు తరలిస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఎలాంటి అనుమతులు లేకుండానే రూ. కోట్ల విలువైన అటవీ కలప తరలిపోతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పరిస్థితి రివర్స్‌లో ఉంది. ఇక్కడికి ఛత్తీస్‌గఢ్ నుంచి అక్రమంగా కలపను స్మగ్లర్లు తీసుకొస్తున్నారు.
‘చెన్నూరు అటవీ ప్రాంతంలోని దుగ్నెపల్లి జీపీ పరిధిలోని లింగంపేట అడవిలో నరికిన 40 టేకు చెట్లను దుంగలుగా మార్చి ట్రక్కులో మంచిర్యాల వైపు తరలిస్తుండగా శుక్రవారం చెన్నూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు’
కుమ్రం భీం జిల్లాలోని మామిడిపల్లి అటవీ సెక్షన్ కొత్తపల్లి బీట్ పరిధిలోని అడవిలో మామిడిపల్లి నుంచి కవ్వాల్‌కు రోడ్డు వేయాలన్న డిమాండ్‌తో మామిడిపల్లి గ్రామస్తులు అడవిలోని 120 టేకు వృక్షాలను నరికివేశారు.
Comments
Please login to add a commentAdd a comment