
ఇచ్చోడ(బోథ్): ఆదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ సిబ్బందిపై కలప స్మగ్లర్లు మంగళవారం రాత్రి మరోసారి దాడికి దిగారు. ఈ దాడుల్లో బేస్ క్యాంప్ ఉద్యోగి సిడాం బాపురావు తలకు తీవ్రగాయాలయ్యాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్టేషన్‌లో గుండాల గ్రామానికి చెందిన తొమ్మిది మంది కలప స్మగ్లర్లపై పోలీసులు హత్యానేరం (307) కింద కేసులు నమోదు చేశారు. కవ్వాల్ టైగర్‌జోన్ అటవీ అధికారి వాహబ్ అహ్మద్‌కు మాల్యాల్, జుగునపూర్ సమీపంలో అక్రమ కలప రవాణా చేయడానికి స్మగ్లర్లు వాహనంతో సిద్ధంగా ఉన్నట్లు మంగళవారం రాత్రి సమాచారం అందింది. దీంతో అయన సిబ్బందిని అప్రమత్తం చేసి బీట్ ఆఫీసర్ రాజు, బేస్ క్యాంప్ సిబ్బందితో పెట్రోలింగ్ చేయించారు.
వేకువ జామున జుగనపూర్ సమీపంలో ముసుగులు కట్టుకొని మూడు మోటార్ బైకులపై వచ్చిన స్మగ్లర్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ వాహనంపై రాళ్లతో దాడికి దిగారు. వీరు తేరుకునేలోపే వాహనంలో వెనుకలో ఉన్న సిడాం బాపురావు తలకు తీవ్రగాయమైంది. దీంతో వెళ్లిన వారంతా ఇచ్చోడకు తిరిగివచ్చారు. ఈ దాడుల్లో బైకులపై వచ్చిన దుండగులే కాకుండా పంటపొలాల్లో మరికొంత మంది స్మగ్లర్లు ఉన్నట్లు వారు తెలిపారు. ఇటీవల అటవీశాఖ సిబ్బంది కేశవపట్నం,గుండాల గ్రామాలపై మూడు సార్లు దాడులు నిర్వహించి.. కలపతో పాటు కట్టె కోత యంత్రాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పథకం ప్రకారం ఈ దాడికి దిగినట్లు భావిస్తున్నారు.