deforestation
-
Global Commission on Economics of Water: దారి తప్పిన జల చక్రం!
పర్యావరణంతో శతాబ్దానికి పైగా మనిషి ఆడుతున్న ప్రమాదకరమైన ఆట పెను విపత్తుగా పరిణమిస్తోంది. దాని తాలూకు విపరిణామాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా అడవుల నరికివేత, మితిమీరిన వాతావరణ కాలుష్యం తదితరాల దెబ్బకు చివరికి భూమిపై జీవకోటి మనుగడకు అత్యవసరమైన జలచక్రం కూడా గతి తప్పింది. అంతర్జాతీయ నిపుణుల సమూహమైన గ్లోబల్ కమిషన్ ఆన్ ద ఎకనామిక్స్ ఆఫ్ వాటర్ చేపట్టిన అధ్యయనం ఈ మేరకు తేలి్చంది. ‘‘చరిత్ర పొడవునా అత్యంత భారీ వాతావరణ మార్పులనెన్నింటినో తట్టుకుని నిలిచిన జలచక్రం ఇలా సంతులనం కోల్పోవడం మానవాళి చరిత్రలో ఇదే తొలిసారి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి అతి త్వరలోనే పరాకాష్టకు చేరడం ఖాయం’’ అని బుధవారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మనిషి నిర్వాకం వల్ల చోటుచేసుకుంటున్న పర్యావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమంటూ కుండబద్దలు కొట్టింది! ‘‘దీనివల్ల ఆహార సంక్షోభం మొదలుకుని పలు రకాల విపరిణామాలు తలెత్తనున్నాయి. వీటి దెబ్బకు త్వరలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం కావడం ఖాయం’’ అని జోస్యం చెప్పింది. ఏమిటీ జలచక్రం...!? జలచక్రం భూమిపై నీటి కదలికలకు సంబంధించిన సంక్లిష్టమైన వ్యవస్థ. చెరువులు, నదులు, ముఖ్యంగా సముద్రంలోని నీరు సూర్యరశ్మి ప్రభావంతో ఆవిరిగా వాతావరణంలోకి చేరుతుంది. భారీ నీటి ఆవిరి మేఘాలుగా మారి సుదూరాలకు పయనిస్తుంది. శీతల వాతావరణం ప్రభావంతో చల్లబడి వానగా, మంచుగా తిరిగి నేలపైకి చేరుతుంది. ఈ ప్రక్రియనంతటినీ కలిపి జలచక్రంగా పేర్కొంటారు. మనిషి చేజేతులారా చేస్తూ వస్తున్న పర్యావరణ విధ్వంసం ధాటికి దీనిపై కొన్ని దశాబ్దాలుగా కనీవినీ ఎరగని స్థాయిలో ఒత్తిడి పడుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో అది భరించలేని స్థాయికి చేరిందని అధ్యయనం వెల్లడించింది. దశాబ్దాల తరబడి భూమిని విచ్చలవిడిగా విధ్వంసకర విధానాలకు వాడేయడం మొదలుకుని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు నీటి నిర్వహణలో కనబరుస్తున్న లెక్కలేనితనం దాకా జలచక్రం గతి తప్పేందుకు దారితీసిన పలు కారణాలను నివేదిక ఏకరువు పెట్టింది. గతి తప్పితే అంతే...! జలచక్రం గతి తప్పితే జరిగే చేటును తాజా నివేదిక కళ్లకు కట్టింది...→ కేవలం నీటి ఎద్దడి దెబ్బకు 2050 నాటికి దాదాపుగా అన్ని దేశాల జీడీపీ కనీసం 8 శాతం, అంతకుమించి తగ్గిపోతుందని అంచనా. అల్పాదాయ దేశాల జీడీపీలో 15 శాతానికి పైగా క్షీణత నమోదు కావచ్చు.→ దీని ప్రభావంతో ఏకంగా 300 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా దేశాల్లో పంటలూ నేలచూపులు చూస్తున్నాయి. ళీ భారీ భవనాలు తదితరాల తాలూకు ఓపలేని భారానికి తోడు భూగర్భ జల వనరులూ నిండుకుంటుండటంతో నగరాలు, పట్టణాలు నానాటికీ మరింత వేగంగా భూమిలోకి కూరుకుపోతున్నాయి. → నీటి సంక్షోభం ఇప్పటికే ప్రపంచ ఆహారోత్పత్తిని 50 శాతానికి పైగా ప్రభావితం చేస్తోంది.హరిత జలం.. అతి కీలకం చెరువులు, నదుల వంటి జలాశయాల్లోని నీటికి బ్లూ వాటర్ అంటారు మట్టి, మొక్కల్లో నిల్వ ఉండే తేమను హరిత జలం అని పేర్కొంటారు. మనం ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోని ఈ నీటి వనరును జలచక్రంలో అతి కీలకమైన పొరగా నివేదిక అభివరి్ణంచింది. ‘‘ప్రపంచ వర్షపాతంలో ఏకంగా సగానికి పైగా దీనివల్లే సంభవిస్తోంది. భూమిని వేడెక్కించే కర్బన ఉద్గారాలను చాలావరకు శోషించుకునేది ఈ హరితజలమే’’ అని తేలి్చంది. కానీ, ‘‘ఏ దేశంలో చూసినా చిత్తడి నేలలను నాశనం చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దీనికి తోడు అడవులనూ విచ్చలవిడిగా నరికేస్తున్నారు. దాంతో కర్బన ఉద్గారాలు నేరుగా వాతావరణంలోకి విడుదలైపోతున్నాయి. ఫలితంగా గ్లోబల్ వారి్మంగ్ ఊహాతీత వేగంతో పెరిగిపోతోంది. మట్టిలో, చెట్లలో ఉండే తేమ హరించుకుపోతోంది. ఇదో విషవలయం. దీని దెబ్బకు కార్చిచ్చుల ముప్పు కూడా నానాటికీ పెరుగుతోంది’’ అని నివేదిక హెచ్చరించింది.అడ్డూ అదుపూ లేని మానవ కార్యకలాపాల వల్ల భూమిపై జలచక్రంతో సహా అన్నిరకాల సంతులనాలూ ఘోరంగా దెబ్బ తింటున్నాయి. దాంతో వర్షపాత ధోరణులు విపరీతంగా మారుతున్నాయి. దేశాలన్నీ తమ నీటి నిర్వహణ తీరుతెన్నులను యుద్ధ ప్రాతిపదికన మెరుగు పరుచుకోవాలి. కాలుష్యానికి తక్షణం అడ్డుకట్ట వేయాలి. లేదంటే మానవాళి మనుగడకు ముప్పు మరెంతో దూరంలో లేదు’– రిచర్డ్ అలన్, క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్, రీడింగ్ యూనివర్సిటీ, ఇంగ్లండ్ప్రపంచ నీటి సంక్షోభం పెను సమస్య మాత్రమే కాదు. జల ఆర్థిక వ్యవస్థల్లో అత్యవసరమైన మార్పుచేర్పులకు అవకాశం కూడా. ఇందుకోసం ముందుగా నీటి విలువను సరిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. దురదృష్టవశాత్తూ చాలా దేశాల్లో అదే లోపిస్తోంది– గోజీ ఒకొంజో ఇవాలా,డైరెక్టర్ జనరల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Year End 2023: అన్నీ మంచి శకునములే!
ఓజోన్ పొరకు గండి పూడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరుగుతోంది. పర్యావరణపరంగా వరుస దుర్వార్తల పరంపర నడుమ ఇలాంటి పలు సానుకూల పరిణామాలకు కూడా 2023 వేదికవడం విశేషం! బ్రెజిల్లో అమెజాన్ అడవుల క్షీణత బాగా తగ్గుముఖం పట్టడం మొదలు ఇటీవలి కాప్28 సదస్సులో కీలక పర్యావరణ తీర్మానం దాకా ముఖ్యమైన ఇలాంటి ఓ ఐదు పరిణామాలను గమనిస్తే... సంప్రదాయేతర ఇంధనోత్పత్తి పైపైకి... శిలాజ ఇంధనాలకు వీలైనంత త్వరగా స్వస్తి పలికితేనే గ్లోబల్ వారి్మంగ్ భూతాన్ని రూపుమాపడం సాధ్యమని పర్యావరణవేత్తలంతా ఎప్పటినుంచో చెబుతున్నదే. సౌర విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం ఇందుకున్న మార్గాల్లో ముఖ్యమైనది. ఈ విషయంలో 2023లో ప్రపంచ దేశాలు చెప్పుకోదగ్గ ప్రగతినే సాధించాయి. అంతర్జాతీయంగా సంప్రదాయేతర ఇంధనోత్పత్తి ఈ ఒక్క ఏడాదే ఏకంగా 30 శాతం, అంటే 107 గిగాబైట్లకు పైగా పెరిగిందట! అంతర్జాతీయ ఇంధన సంస్థ ఈ మేరకు వెల్లడించింది. వాతావరణ కాలుష్య కారక దేశాల్లో అగ్ర స్థానంలో ఉన్న చైనాయే ఈ విషయంలోనూ అందరికంటే ముందుంది! చైనా సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గత జూన్ నాటికే మిగతా ప్రపంచ దేశాలన్నింటి ఉమ్మడి సామర్థ్యాన్ని కూడా మించిపోయిందని ఒక నివేదిక తేల్చడం విశేషం. అదే సమయంలో చైనాలో బొగ్గు ఉత్పత్తి కూడా కొద్ది నెలలుగా తారస్థాయికి చేరినా, త్వరలోనే అది బాగా దిగొస్తుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తుండటం మరో సానుకూల పరిణామం. హాలోవీన్ వేడుక సందర్భంగా పోర్చుగల్ అక్టోబర్ 31 నుంచి వరుసగా ఆరు రోజుల పాటు కేవలం సంప్రదాయేతర ఇంధన వనరులను మాత్రమే వినియోగించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఓజోన్ క్రమంగా కోలుకుంటోంది... అతినీల లోహిత కిరణాల వంటివాటి బారి నుంచి భూమిని కాపాడే కీలకమైన ఓజోన్ పొర కోలుకునే ప్రక్రియ 2023లో మరింతగా వేగం పుంజుకుంది. విచ్చలవిడి క్లోరోఫ్లోరో కార్బన్ల విడుదల తదితరాల కారణంగా ఓజోన్‌కు రంధ్రం పడిందని, అది నానాటికీ పెరుగుతోందని 1980ల నుంచీ పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు అంతర్జాతీయంగా జరిగిన ప్రయత్నాలు ఫలితాలిస్తున్నట్టు వారు తాజాగా చెబుతున్నారు. ఇందుకోసం చేసుకున్న మాంట్రియల్ ఒప్పందం ప్రకారం క్లోరో ఫ్లోరో కార్బన్లకు పూర్తిగా స్వస్తి చెప్పాలన్న లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కృషి ఇలాగే కొనసాగితే 2040 కల్లా ఓజోన్ పొర 1980లకు ముందునాటి స్థితికి మెరుగు పడటం ఖాయం’’ అని ఐరాస తాజా నివేదికలో హర్షం వెలిబుచి్చంది. అయితే అంటార్కిటికా మీద మాత్రం ఓజోన్‌కు పడ్డ రంధ్రం గతంతో పోలిస్తే మరింతగా విస్తరించిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెజాన్‌కు ఉద్దీపన అమెజాన్ అడవులను ప్రపంచం పాలిట ఊపిరితిత్తులుగా, ఆకుపచ్చని వలగా అభివరి్ణస్తుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద వర్షాధారిత అడవులివి. బ్రెజిల్లో కొన్నేళ్లుగా అడ్డూ అదుపూ లేకుండా సాగుతూ వస్తున్న వాటి విచ్చలవిడి నరికివేతకు 2023లో భారీ బ్రేక్ పడింది. బ్రెజిల్ గురించే చెప్పుకోవడం ఎందుకంటే 60 శాతానికి పైగా అమెజాన్ అడవులకు ఆ దేశమే ఆలవాలం! గత జూలై నాటికే అక్కడ అడవుల నరికివేత ఏకంగా 22.3 శాతం దాకా తగ్గుముఖం పట్టిందట. గత ఆర్నెల్లలో ఇది మరింతగా తగ్గిందని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. 2030 నాటికి బ్రెజిల్లో అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని ప్రకటించిన నూతన అధ్యక్షుడు లులా డసిల్వా ఆ దిశగా గట్టి చర్యలే తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోష్ పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచమంతటా దుమ్ము రేపుతున్నాయి. 2023లో వాటి అమ్మకాల్లో అంతర్జాతీయంగా విపరీతమైన పెరుగుదల నమోదైంది. అగ్ర రాజ్యం అమెరికాలోనైతే ఈవీల అమ్మకాలు ఆల్‌టైం రికార్డులు సృష్టించాయి! 2023లో అక్కడ 10 లక్షలకు పైగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైనట్టు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. చైనాలో కూడా 2023లో మొత్తం వాహనాల అమ్మకాల్లో 19 శాతం వాటా ఈవీలదేనట! పలు యూరప్ దేశాల ప్రజలు కూడా వాటిని ఇబ్బడిముబ్బడిగా కొనేస్తున్నారు. అక్కడ 2022తో పోలిస్తే ఈవీల అమ్మకాల్లో 55 శాతానికి పైగా వృద్ధి నమోదైంది! మొత్తమ్మీద 2023లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వాహన కొనుగోళ్లలో 15 శాతానికి ఈవీలేనని తేలింది. ప్రపంచ కాలుష్యంలో ఆరో వంతు వాటా రోడ్డు రవాణా వాహనాలదే. ఈ నేపథ్యంలో ఈవీలు ఎంతగా పెరిగితే ఈ కాలుష్యం అంతగా దిగొస్తుంది. శిలాజ ఇంధనాలపై తీర్మానం బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలని ఇటీవల దుబాయ్‌లో జరిగిన కాప్28 అంతర్జాతీయ పర్యావరణ సదస్సు తీర్మానించడం విశేషం. పర్యావరణ పరిరక్షణకు కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ తీర్మానాన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఏకంగా 100కు పైగా దేశాలు దీనికి సంపూర్ణంగా మద్దతు పలకగా, ఈ దిశగా శక్తివంచన లేకుండా ప్రయతి్నంచాలని మరో 50 పై చిలుకు దేశాలు ఈ సదస్సు వేదికగా అభిప్రాయపడ్డాయి. గతంలోనూ పలు కాప్ సదస్సుల్లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగినా అవి చర్చల స్థాయిని దాటి తీర్మానం దాకా రాకుండానే వీగిపోయాయి. అందుకే ఇది చరిత్రాత్మక తీర్మానమని కాప్28 సదస్సుకు అధ్యక్షత వహించిన సుల్తాన్ అల్ జబర్ అభివరి్ణంచారు. ఇది దేశాల ఆర్థిక వ్యవస్థలనే పునరి్నర్వచిస్తుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. దీనికి దేశాలు ఏ మేరకు కట్టుబడి ఉంటాయన్న దానిపై భూగోళం భవిష్యత్తు చాలావరకు ఆధారపడి ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Climate Change: డేంజర్ మార్క్ దాటేశాం
భయపడుతున్నంతా అవుతోంది. మితిమీరిన కాలుష్యం, ఇంధన వాడకం, అడ్డూ అదుపూ లేని పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత భూమిని శరవేగంగా వినాశనం వైపు నెడుతున్నాయి. వీటివల్ల భూతాపోన్నతి అతి త్వరలో ‘2 డిగ్రీ’ల అంతిమ హద్దును దాటుతుందని, అదే జరిగితే సర్వనాశనమేనని పర్యావరణప్రియులు, శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా హెచ్చరిస్తుండటం తెలిసిందే. ఈ పెను విపత్కర పరిస్థితిని నివారించడమే ఏకైక లక్ష్యంగా చిన్నా పెద్దా దేశాలన్నీ దశాబ్దాలుగా మేధోమథనం చేస్తున్నాయి. గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వస్తున్నాయి. అందుకు వందల కోట్ల డాలర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆ లక్ష్యాల సాధనకు క్షేత్ర స్థాయిలో చేస్తున్నదేమీ లేదని తేలిపోయింది. నవంబర్ 17న అంతటి విపత్కర పరిస్థితిని భూమి తొలిసారిగా రుచిచూసింది. భూతాపంలో గత శుక్రవారం తొలిసారి ఏకంగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! భూగోళాన్ని మనం శరవేగంగా వినాశనం దిశగా నెడుతున్నామనేందుకు ఇది తాజా హెచ్చరిక సంకేతమేనని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు...! వినాశనమే...? గ్లోబల్ వారి్మంగ్‌తో ఎదురయ్యే ప్రమాదాన్ని కళ్లకు కట్టేందుకు పర్యావరణవేత్తలు భూతాపాన్ని పారిశ్రామికీకరణకు ముందు నాళ్లతో, అంటే 1850–1900 మధ్య కాలంతో పోల్చి చెబుతుంటారు. అప్పటితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగిపోయింది. దానికే కొన్నేళ్లుగా కనీవినీ ఎరగని ఉత్పాతాలతో ప్రపంచమంతా అతలాకుతలమైపోతోంది. అలాంటిది, నవంబర్ 17న సగటు భూతాపంలో పెరుగుదల కొద్దిసేపు ఏకంగా 2.06 డిగ్రీలుగా నమోదైందని యూరప్‌లోని కోపరి్నకస్ వాతావరణ మార్పుల సంస్థ సోమవారం ప్రకటించింది! 1991–2020 మధ్య నమోదైన భూతాప సగటుతో పోలి్చనా ఇది ఏకంగా 1.17 డిగ్రీలు ఎక్కువని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్గెస్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆమె చేసిన పోస్టు పర్యావరణవేత్తల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘‘గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేయకుంటే సర్వనాశనం తప్పదన్న హెచ్చరికలను సంపన్న దేశాలు పెడచెవిన పెడుతున్నాయని తేలిపోయింది. భూమిపై జీవజాలాన్ని తుడిచిపెట్టగల ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామన్న మాటలు నీటి మూటలేనని రుజువైంది’’ అంటూ వారు మండిపడుతున్నారు. మానవాళి చరిత్రలో నవంబర్ 17 దుర్దినమేనని సైంటిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాప్’ లక్ష్యాలన్నీ గాలికి... గ్లోబల్ వారి్మంగ్ను 2 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి, సరిగ్గా చెప్పాలంటే 1.5 డిగ్రీలకు పరిమితం చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పారిస్ పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. దాని సాధనే ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా కాప్ సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాయి. కాప్–27 పర్యావరణ సదస్సు గతేడాది నవంబర్‌లో జరిగింది. పర్యవారణ లక్ష్యాల సాధనకు ఆర్థిక వనరుల్లేని పేద దేశాలకు వందలాది కోట్ల డాలర్లు గ్రాంట్‌గా అందజేసేందుకు సంపన్న దేశాలన్నీ అంగీకరించాయి. గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు తామంతా కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని దాదాపుగా తగ్గించేస్తామని చెప్పుకొచ్చాయి. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు... ► చాలా దేశాలు శిలాజ ఇంధనోత్పత్తిని 2030కల్లా రెట్టింపు, అంతకంటే ఎక్కువ చేయనున్నాయని ఐరాస గత వారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది! ► గ్లోబల్ వారి్మంగ్ 1.5 శాతానికి పెరగకుండా ఉండాలంటే కర్బన ఉద్గారాలను 2030కల్లా 45 శాతం తగ్గించాల్సి ఉంది. గత కాప్ సదస్సులో దేశాలన్నీ నిర్దేశించుకున్న లక్ష్యం కూడా అదే. కానీ అన్ని దేశాలూ తమ తమ పర్యావరణ లక్ష్యాలను సాధించినా కర్బన ఉద్గారాలు 2030కల్లా 9 శాతం పెరుగుతాయని హెచ్చరించింది. ► గ్లోబల్ వార్మింగ్ ఉత్పాతానికి అడ్డుకట్ట వేసేందుకు దేశాలు చేయాల్సినంత ప్రయత్నం చేయడం లేదని పలు అంతర్జాతీయ పర్యావరణ నివేదికలు కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. ► ముఖ్యంగా గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాన్ని తగ్గించేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం చాలా అవసరమని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లో క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్ రిచర్డ్ అలన్ స్పష్టం చేస్తున్నారు. ► గత సదస్సుల వాగ్దానాలేవీ ఆచరణలోకి రాలేదన్న పెదవి విరుపుల మధ్య మరో రెండు వారాల్లో దుబాయ్‌లో కాప్–28 సదస్సు జరగనుంది. అందులో ఏమేం చర్చిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి! వినాశనమే...? ఉష్ణోగ్రతలో ఒకట్రెండు డిగ్రీల పెరుగుదలతో ఏమవుతుంది లెమ్మనుకుంటే చాలా పొరపాటు. భూమి సగటు ఉష్ణోగ్రత అతి తక్కువగా పెరిగినా తీవ్ర పర్యవసానాలుంటాయి. అలాంటిది ఒక డిగ్రీ పెరిగిందంటే అది తీవ్ర ప్రభావమే చూపుతుంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే అదే జరుగుతోంది! గత వందేళ్లలో భూతాపం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే సగటున ఒకటిన్నర డిగ్రీల మేరకు పెరిగిపోయింది. దాంతో నానారకాల పర్యావరణ ఉత్పాతాలతో మానవాళి అతలాకుతలం అవుతోంది. అదే ఉష్ణోగ్రతలో పెరుగుదల గనక 2 డిగ్రీలకు చేరితే కనీవినీ ఎరగని వినాశనం, కష్టనష్టాలు తప్పవని పర్యావరణవేత్తలు ఎప్పట్నుంచో నెత్తీనోరూ బాదుకుంటున్నారు. భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటిన కొద్దీ దారుణాలు జరుగుతాయి. అదే 2 డిగ్రీలు పెరిగిందంటే... ► పెను తుఫాన్లు, తీవ్ర దుర్భిక్షం వంటి అతి దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. ► పర్యావరణ సంతులనాన్ని కాపాడటంలో అతి కీలకమైన కోరల్ రీఫ్‌లు, ధ్రువ ప్రాంతపు మంచు పొరలు సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. ► పర్యావరణ వ్యవస్థ మరింకెప్పటికీ ఎన్నటికీ బాగుచేయలేనంతగా పాడైపోతుంది. ► క్రమంగా భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంది. ► జీవ, జంతు జాలాల మనుగడ ప్రమాదంలో పడుతుంది. ► అత్యుష్ణ పరిస్థితులు స్థిరంగా కొనసాగితే జీవజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. ► గత 12 నెలలు ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడి నెలలుగా రికార్డుకెక్కాయి. గత ఏడాది కాలంలో పాకిస్తాన్, ఉత్తర అమెరికాలో తీవ్ర వరదలు, ఆస్ట్రేలియా, అమెరికాల్లో కార్చిచ్చులు, మంచు తుఫాన్ల వంటి వైపరీత్యాలతో ప్రపంచం అల్లాడింది. ► మన దేశంలో చూసుకుంటే పారిశ్రామికీకరణకు ముందు చెన్నై సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీలుండేది. ఇప్పుడది 29.5 డిగ్రీలు దాటేసింది! ఇదే ధోరణి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ► ఇటీవలే ఉత్తరాఖండ్‌లో భూమి బీటలుబారడం తెలిసిందే. భూతాపంలో పెరుగుదల 2 డిగ్రీల సెంటీగ్రేడ్ల సరిహద్దును దాటింది కొద్దిసేపు మాత్రమే. కానీ భూమి నానాటికీ ఆమోదయోగ్యం కానంతగా వేడెక్కిపోతోందనేందుకు ఇది అతి పెద్ద సంకేతం. ఇదే ధోరణి ఇంకొంతకాలం కొనసాగితే దిద్దుబాటు అసాధ్యమే కావచ్చు! – సమంతా బర్గెస్, డిప్యూటీ డైరెక్టర్, కోపర్నికస్ వాతావరణ మార్పుల సంస్థ – సాక్షి, నేషనల్ డెస్క్ -
పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనక తప్పదు! ముందుంది పెను ముప్పు?
దేవభూమి ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్‌లో కాళ్లకింది నేల ఉన్నపళంగా కుంగిపోతున్న తీరు పర్యావరణపరంగా మానవాళి ముందున్న పెను ముప్పును కళ్లకు కట్టింది. పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. జోషి మఠ్ సమస్యకు కారణమైన అడవుల విచ్చలవిడి నరికివేత, పెచ్చరిల్లిన వాతావరణ కాలుష్యం వంటివి ప్రపంచమంతటినీ వేధిస్తున్న సమస్యలే. వాటి పర్యవసానాలను గ్లోబల్ వార్మింగ్, ఆకస్మిక వరదలు, తీవ్ర కరువుల రూపంలో అన్ని దేశాలూ చవిచూస్తూనే ఉన్నాయి. ఈ ప్రాకృతిక విపత్తుల తీవ్రత కొన్నేళ్లుగా బాగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇవన్నీ మనిషి అత్యాశకు ప్రకృతి ప్రతిస్పందన తాలూకు సంకేతాలే. వాటిని ఇప్పటికైనా అర్థం చేసుకుని తక్షణం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ‘‘లేదంటే అతి త్వరలో పరిస్థితి పూర్తిగా చేయి దాటడం ఖాయం. ఇప్పుడు జోషి మఠ్‌లో జరుగుతున్నది రేపు అన్నిచోట్లా జరుగుతుంది. ప్రకృతితో ఇష్టారాజ్యపు చెలగాటం అంతిమంగా వినాశనానికే దారి తీస్తుంది’’ అంటూ హెచ్చరిస్తున్నారు. ఏం జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ తదితరాల వల్ల సముద్ర మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ధోరణి కొన్నేళ్లుగా వేగవంతమవుతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలు క్రమంగా నీట మునుగుతాయి. మానవాళిపై పెను ప్రభావం చూపగల పరిణామమిది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో పదో వంతుకు పైగా సముద్ర తీర ప్రాంతాల్లోనే వ్యాపించి ఉంది. మహా నగరాల్లో కూడా అధిక శాతం అక్కడే ఉన్నాయి. అవన్నీ మునగడమో, పూర్తిగా నివాసయోగ్యం కాకుండా పోవడమో జరుగుతుంది. ఫలితంగా కోట్లాది మంది పొట్ట చేత పట్టుకుని వలస బాట పడతారు. వారందరికీ పునరావాసం, ఉపాధి తదితరాలన్నీ అతి పెద్ద సవాళ్లుగా నిలుస్తాయి. మానవాళి చరిత్రలో ఇది పెను విపత్తుగా మారినా ఆశ్చర్యం లేదు. అంతేగాక మితిమీరిన కాలుష్యం ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తోంది. సురక్షితమైన తాగునీటికి చాలా దేశాల్లో ఇప్పటికే తీవ్ర కొరత ఏర్పడింది. మున్ముందు ఇది మరింత తీవ్రతరం కానుంది. ప్రజలు సరైన తిండికి, తాగునీటికే కాదు, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలికి కూడా నోచుకోని పరిస్థితి తలెత్తనుంది! మాటలకే పరిమితం పర్యావరణ నష్టాలకు అడ్డుకట్టే వేసేందుకు చారిత్రక పారిస్ ఒప్పందం మొదలుకుని పలు కాప్ శిఖరాగ్రాల దాకా పేరుకు ప్రయత్నాలెన్నో జరుగుతున్నాయి. కానీ చిత్తశుద్ధితో కూడిన చర్యలు మాత్రం కన్పించడం లేదు. కర్బన ఉద్గారాల తగ్గింపు తదితరాలకు సంబంధించి గొప్ప లక్ష్యాలు నిర్ణయించుకోవడం, తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా సాగుతోంది. ఎవరికి వారు పొరుగు దేశమే ప్రధానంగా బాధ్యత తీసుకోవాలన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కళ్లు మూసుకుని పాలు తాగుతున్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఎటు చూసినా విపత్తులే... ► మంచు ఖండమైన అంటార్కిటికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా కరుగుతున్నాయి. దీని దుష్ప్రభావం పర్యావరణంపై చాలా రకాలుగా ఉండబోతోంది. ► ఆర్కిటిక్ బ్లాస్ట్ కారణంగా ముందుగా ఇంగ్లండ్ తదితర యూరప్ దేశాలు అతి శీతల వాతావరణంతో అల్లాడాయి. తర్వాత అమెరికా దాని దెబ్బకు 10 రోజులకు పైగా దాదాపుగా స్తంభించిపోయింది. దేశ చరిత్రలో ఎన్నడూ ఎరగనంతటి చలి గాలులు, మంచు తుఫాన్లతో అల్లాడింది. వేల కోట్ల డాలర్ల ఆస్తి నష్టం చవిచూసింది. ► అమెరికాలో ఇటీవలి దాకా కార్చిచ్చులతో అల్లాడిన కాలిఫోర్నియా ఇప్పుడేమో కనీవినీ ఎరగని వరద బీభత్సంతో తల్లడిల్లుతోంది. ► ఉత్తర భారతం కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతటి చలితో వణుకుతోంది. ► పొరుగు దేశం పాకిస్తాన్ గతేడాది దేశ చరిత్రలో ఎన్నడూ చూడనంతటి వరదలతో అతలాకుతలమైంది. మూడొంతుల ప్రాంతాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఆ ప్రభావం నుంచి పాక్ ఇప్పటికీ కోలుకోలేదు. ఏటా 10 సెం.మీ. కుంగిన జోషీ మఠ్! జోషి మఠ్‌లో నేల 2018 నుంచి ఏటా 10 సెంటీమీటర్ల చొప్పున కుంగుతూ వస్తోందట! అధునాతన శాటిలైట్ ఇమేజ్ విశ్లేషణ ఆధారంగా జరిగిన ఒక తాజా అధ్యయనంలో ఈ మేరకు తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కశ్మీరీ పండిట్ల గాథ...
భూతల స్వర్గమైన కశ్మీర్ లోయలో 32 ఏళ్ల క్రితం జరిగిన ఆ దారుణాలు లక్షలాది మంది గుండెల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. నిత్య భయోత్పాతానికి, సామూహిక హత్యాకాండకు జడిసి కట్టుబట్టలతో లోయను వీడి వచ్చిన నాటినుంచీ వాళ్లు న్యాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. సొంత నేలకు దూరంగా, ఏ సదుపాయాలూ లేని శరణార్థి శిబిరాల్లో ఎవరికీ పట్టని అనాథల్లా నిస్సహాయంగా బతుకీడుస్తున్నారు. వాళ్లే... కశ్మీరీ పండిట్లు. ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు మారుతున్నా తమ గోడు పట్టించుకుంటున్న వారే లేరన్న వారి ఆక్రందన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. కశ్మీర్ ఫైల్స్ సినిమా సృష్టించిన వివాదంతో పండిట్ల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది... కశ్మీరీ పండిట్ల ఊచకోతకు, తదనంతర సామూహిక వలసలకు మూగ సాక్షిగా 1990 సంవత్సరం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఆ అల్లర్ల అనంతరం 1990 జనవరి–మార్చి మధ్య లక్షన్నర మంది కశ్మీరీ పండిట్లలో కనీసం లక్ష మందికి పైగా లోయను వీడినట్టు పలు నివేదికలు తేల్చాయి. మహా అయితే 3,000 కుటుంబాలు అక్కడ మిగిలాయని అంచనా. అవి కూడా 2010 నాటికి 800కు తగ్గాయి. కశ్మీర్ ప్రభుత్వ పునరావాస కమిషన్ (శరణార్థుల) అధికారిక వెబ్సైట్ ప్రకారమే 60 వేల కుటుంబాలు లోయను వీడాయి. వీరిలో చాలామంది 30 ఏళ్లుగా జమ్మూ, పరిసరాల్లోని శరణార్థి శిబిరాల్లో దయనీయ పరిస్థితుల్లో తలదాచుకుంటున్నారు. మరో 23 వేల కుటుంబాలు దేశ నలుమూలల్లోనూ విదేశాల్లోనూ స్థిరపడ్డాయి. లోయలో ఇంతటి కల్లోలానికి కారణమైన హిందూ, ముస్లిం ఘర్షణలు 1980ల నుంచే పెరుగుతూ వచ్చాయి. నిజానికి లోయలో 1950ల నుంచి చూసినా హిందూ పండిట్ల సంఖ్య 4 నుంచి 5 శాతం మించి లేదని గణాంకాలు చెప్తున్నాయి. 94 శాతం దాకా ముస్లిం జనాభాయే. అయినా లోయను సంపూర్ణంగా ఇస్లామీకరించే ప్రయత్నాలు 1980ల్లో ఊపందుకున్నాయి. ఫలితంగా స్థానిక ముస్లింలలో హిందువులపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. వారి నివాసాలపై దాడులతో మొదలై హిందూ నేతలను హతమార్చడం దాకా వెళ్లింది. వేర్పాటువాదమే సిద్ధాంతంగా జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వంటివి పుట్టుకు రావడంతో పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడింది. 1990 జనవరి హింసాకాండకు ఇదంతా ఓ భయానక నేపథ్యంగా అమరింది. ఆ మూడు నెలలూ... 1990 జనవరి తొలి రోజులు కశ్మీరీ పండిట్ల గుండెల్లో ఆరని మంటలు రగిల్చాయి. అప్పటికే తారస్థాయికి చేరిన మత అసహనం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. హిందువులు మతం మారడమో, లోయను వీడటమో, మరణించడమో తేల్చుకోవాలంటూ తీవ్రవాద మూకలు పండిట్ల ఇండ్లపై పడి మారణహోమం సృష్టించారు. కనిపించిన వారినల్లా కాల్చి చంపుతూ నరమేధానికి దిగారు. ఆ క్రమంలో అంతులేని దారుణ అత్యాచారాలకు, చెప్పుకోలేని ఘోరాలకు పాల్పడ్డారు. దాంతో పండిట్ల కుటుంబాలు కట్టుబట్టలతో లోయ ను వీడాయి. ఈ హింసాకాండలో మరణించిన హిందువులు 100 లోపేనని అధికారిక గణాంకాలు చెప్తున్నా వాస్తవ సంఖ్య వేలల్లో ఉంటుందంటారు. పట్టించుకున్న వాళ్లే లేరు... జమ్మూ, పరిసరాల్లోని శిబిరాల్లో తలదాచుకున్న పండిట్లు, కొద్ది నెలల్లో లోయకు తిరిగి వెళ్తామన్న ఆశలు క్రమంగా ఆవిరవడంతో దశాబ్దాలుగా అక్కడే బతుకీడుస్తున్నారు. ప్రభుత్వపరంగా వీరికి పెద్దగా సాయం కూడా అందడం లేదు. 2004లో యూపీఏ ప్రభుత్వం పండిట్ల కోసం టౌన్‌షిప్‌ల్లోని చిన్న ఫ్లాట్లను కొందరు కొనుక్కోగా ఆ స్తోమతలేని చాలామంది ఇప్పటికీ దయనీయంగానే గడుపుతున్నారు. ఆర్థిక కష్టాలతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు కూడా. అయినా నాటి గాయాలు వీరిలో ఎంత తాజాగా ఉన్నాయంటే... ఇప్పటికీ చాలామంది తమ అవస్థలపై పెదవి విప్పేందుకు కూడా ఇష్టపడటం లేదు! 2008లో ప్రధాని పునరావాస ప్యాకేజీ కింద పండిట్లకు కొన్ని ఉద్యోగాలివ్వడంతో సరిపెట్టారు. వారికి ఉద్యోగాలతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.7.5 లక్షల దాకా ఆర్థిక సాయం ఇస్తామని 2021లో కేంద్రం ప్రతిపాదించినా ముందడుగు పడలేదు. దాంతో మోదీ ప్రభుత్వం కూడా తమకోసం చేసిందేమీ లేదంటూ పండిట్లు వాపోతున్నారు. కశ్మీరీ పండిట్ల డిమాండ్లు ► కనీసం రూ.25 వేల పై చిలుకు నెలవారీ పరిహారం ► కేంద్రపాలిత ప్రాంత హోదాతో కూడిన ప్రత్యేక హోమ్‌లాండ్ ► మైనారిటీ హోదా, తదనుగుణమైన హక్కులు, ప్రయోజనాలు ► నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు తేల్చాలి. అన్నివిధాలా న్యాయం చేయాలి ► తమ నివాసాలు, భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించి వెనక్కి ఇప్పించాలి ఒక విజయం, వంద వివాదాలు కశ్మీరీ పండిట్ల ఊచకోత, వలసలపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ.15 కోట్లతో రూపొందిన ఈ సినిమా 20 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల పై చిలుకు కలెక్షన్లు రాబట్టి రికార్డుల మోత మోగించింది. మార్చి 11న కేవలం 600 థియేటర్లలో పెద్దగా హడావుడి లేకుండా విడుదలైనా, చూస్తుండగానే టాక్ ఆఫ్ ద కంట్రీగా మారిపోయింది. ప్రధాని మోదీ మొదలుకుని అమిత్ షా తదితర కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రముఖులంతా సినిమాను ప్రశంసలతో ముంచెత్తడమే గాక అందరూ తప్పక చూడాలంటూ పిలుపునిచ్చారు. ఇందుకు విపరీతమైన మౌత్ పబ్లిసిటీ తోడై చూస్తుండగానే 4,000కు పైగా థియేటర్లకు విస్తరించింది. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ఉచితంగా షోలు వేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపులిచ్చాయి. యూఏఈ, సింగపూర్ వంటి దేశాల్లో కూడా నిషేధం తొలగి త్వరలో విడుదలవుతుండటంతో కలెక్షన్లు ఇంకా కొనసాగేలా ఉన్నాయి. అయితే సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పైగా దీన్ని బీజేపీ ప్రమోట్ చేస్తోందన్న అభిప్రాయంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. సినిమాకు అనుకూలంగా, వ్యతిరేకంగా విమర్శలు, ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి. సినిమా అవాస్తవాలమయమని ఆప్ వంటి పార్టీలు అంటున్నాయి. మరో వర్గం మాత్రం సినిమాలో నిజాలు చూపించారని, పండిట్ల గుండెకోత ఇప్పటికైనా వెలుగులోకి వచ్చిందని అంటోంది. బెదిరింపుల నేపథ్యంలో అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రత కల్పించాల్సి వచ్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ముప్పు ముంగిట అమెజాన్.. కథ మారకపోతే కష్టాలకు తలుపులు బార్లా తెరిచినట్టే!
ఒకపక్క వాతావరణ మార్పులు, మరోపక్క అడవుల నరికివేతతో ప్రఖ్యాత అమెజాన్ వర్షారణ్యం (రెయిన్ ఫారెస్ట్) ఎండిపోతోంది. మానవ తప్పిదాల కారణంగా అమెజాన్ అడవులు రికవరీ అయ్యే ఛాన్సులు క్షీణిస్తున్నాయని, దీంతో ఇవి క్రమంగా అడవుల స్థాయి నుంచి సవన్నా (గడ్డి మైదానాలు)లుగా మారిపోతాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇదే నిజమైతే కేవలం అమెజాన్ విస్తరించిన ప్రాంతమే కాకుండా ప్రపంచమంతటిపై పెను ప్రభావం పడుతుందని తెలిపింది. అమెజాన్ బేసిన్‌లోని వర్షారణ్యం ప్రపంచ వర్షారణ్యాల్లో సగానికిపైగా ఉంటుంది. ప్రపంచ కార్బన్‌డైఆక్సైడ్ (co2) స్థాయి నియంత్రణలో అమెజాన్ వర్షారణ్యానిది కీలకపాత్ర. అయితే ఈ అడవులు క్షీణించి సవన్నాలుగా మారితే co2 నియంత్రణ బదులు co2 వేగంగా పెరిగేందుకు కారణమవుతాయని పర్యావరణ నిపుణులు వివరించారు. గతంలో ఊహించినదాని కన్నా వేగంగా ఈ అడవులు అంతర్ధానం అంచుకు చేరుతున్నాయన్నారు. 25 సంవత్సరాల శాటిలైట్ డేటాను విశ్లేషించి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ అడవి వేగంగా క్షీణిస్తోందని నేచర్ క్లైమెట్ ఛేంజ్‌లో పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా చెట్ల నరికివేత, కరువు సంభవించిన ప్రాంతాల్లో తిరిగి అడవి కోలుకోవడం దాదాపు సగానికిపైగా తగ్గిందని అధ్యయన సహ రచయత టిమ్ లెంటాన్ చెప్పారు. మానవ తప్పిదాలకు తోడు పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు అమెజాన్ అడవుల రికవరీ సామర్థ్యం పూర్తిగా నశించిపోయేందుకు కారణమవుతున్నాయని వివరించారు. ముఖ్యంగా కార్బన్ కాలుష్యాన్ని తగ్గించకపోతే శతాబ్ది మధ్యకు వచ్చేసరికి ఈ అడవులు పూర్తిగా కనుమరుగవుతాయని అంచనా వేశారు. ప్రపంచానికే డేంజర్ ఇప్పటికే ధ్రువాల వద్ద మంచు కరగడం, వాతావరణంలో co2 స్థాయిలు పెరగడం, దక్షిణాసియాలో అనూహ్య రుతుపవనాలు, క్షీణిస్తున్న కోరల్ రీఫ్ పర్యావరణ వ్యవస్థలు, అట్లాంటిక్ సముద్ర ప్రవాహాల్లో మార్పులతో ప్రపంచమంతా ప్రమాదం అంచుల్లోకి పయనిస్తోంది. వీటికి అమెజాన్ అడవుల క్షీణత తోడైతే కార్చిచ్చుకు వాయువు తోడైనట్లు ప్రమాదకర పర్యావరణ మార్పులు సంభవిస్తాయని నిపుణుల అంచనా. అమెజాన్ అడవులు అధిక శాతం విస్తరించిన బ్రెజిల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడవుల నరికివేత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఒకప్పుడు co2 సింక్ (కార్బన్ డైఆక్సైడ్‌ను పీల్చుకునే)గా ఉన్న అమెజాన్ ఫారెస్టు ప్రస్తుతం co2 సోర్స్ (ఉత్పత్తి కారకం)గా మారిందని సైంటిస్టులు హెచ్చరించారు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో అమెజాన్ అడవులు వదిలే కార్బన్‌డైఆక్సైడ్ పరిమాణం 20 శాతం మేర పెరిగిందన్నారు. వాతావరణంలో co2 పెరగడం ఉష్ణోగ్రతలు పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ వాయువును పీల్చుకోవడంలో చెట్లు, మృత్తిక కీలక పాత్ర పోషిస్తాయి. ఎప్పుడైతే చెట్ల నరికివేత ఊపందుకొని, మృత్తికలు సారహీనం కావడం జరుగుతుందో co2 నియంత్రణ అదుపుతప్పుతుంది. అమెజాన్ అడవులు దాదాపు 9000 కోట్ల టన్నుల co2ను నియంత్రిస్తుంటాయి. ఈ అడవుల క్షీణతతో ఇంత స్థాయిలో co2 వాతావరణంలోకి విడులయ్యే అవకాశాలు పెరుగుతాయి. అప్పుడు దక్షిణఅమెరికాతో పాటు ప్రపంచమంతా ఫలితం అనుభవించాల్సిఉంటుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఇంకా ఉందని అధ్యయన రచయతలు తెలిపారు. ప్రపంచ ఉష్ణోగ్రతలను నియంత్రించగలిగితే ఆటోమేటిగ్గా అరణ్య రికవరీ సామర్ధ్యం పెరుగుతుందన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం, చెట్ల నరికివేతను నియంత్రించడం, పంటమార్పిడి ద్వారా మృత్తిక సారహీనం కాకుండా కాపాడడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకతలు.. ► 9 దేశాల్లో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల పైచిలుకు విస్తీర్ణంలో అమెజాన్ వర్షారణ్యం వ్యాపించి ఉంది. ► అమెజాన్ పరీవాహక ప్రాంతంలో 75 శాతాన్ని ఈ అడవులు ఆక్రమించాయి. ► కలప, బయో ఇంధనం, పోడు వ్యవసాయం కోసం 1970 నుంచి ఈ అరణ్యంలో 20 శాతాన్ని మనిషి కబళించాడు. ► ఈ అడవుల్లో దాదాపు 3,344 ఆదిమ జాతుల ప్రజలు నివాసముంటున్నారు. ► వీటిపై ఆధారపడి సుమారు 3 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. ► ప్రపంచంలోని జీవ ప్రజాతుల్లో పదింట ఒకటి ఈ వర్షారణ్యాల్లో కనిపిస్తుంది. ► ప్రపంచంలోనే అత్యధిక వృక్ష, జీవ ప్రజాతులకు ఈ అడవులు ఆవాసం. ► ఇందులో సుమారు 16 వేల ప్రజాతులకు చెందిన దాదాపు 39,000 కోట్ల చెట్లున్నట్లు అంచనా. ► ఈ అడవుల్లో 25 లక్షల రకాల కీటకాలు, 2, 200 రకాల చేపలు, 1,294 రకాల పక్షులు, 427 రకాల క్షీరదాలు, 378 రకాల సరీసృపాలు నివసిస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి. -
వైరస్ల దాడి కరోనాతో ఆగదా.. ఇంకా వస్తాయా?
కరోనా మహమ్మారి దాడి మొదలై ఏడాదిన్నర దాటింది. ఇప్పటికీ చాలా దేశాలను వణికిస్తూనే ఉంది. మరి దీనికి అంతమెప్పుడు? అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. అసలు మనుషులపై ఇలాంటి మహమ్మారుల దాడి ఇదే మొదటిదీ కాదు.. ఇదే చివరిది అయ్యే అవకాశమూ లేదు. తరచూ ఏదో ఓ కొత్త వైరస్ దాడి మొదలవుతూనే ఉంటుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? కారణాలు ఏమిటి? భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుంది? అన్న సందేహాలు వస్తున్నాయి కదా. దీనిపై ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్‌ఫాం ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీస్ (ఐపీబీఈఎస్)’ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందామా.. జంతువులు, పక్షుల నుంచే.. మనుషులకు కొత్తగా సంక్రమిస్తున్న వ్యాధుల్లో చాలా వరకు జంతువులు, పక్షుల నుంచి వ్యాపిస్తున్నవే. అంటే ప్రాథమికంగా జంతువులు, పక్షుల్లోనే ఉండి, వాటిపైనే ప్రభావం చూపే సూక్ష్మజీవులు.. మ్యుటేషన్ చెంది మనుషులపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఇలాంటి వ్యాధులను జూనోటిక్ లేదా జూనోసెస్ అని పిలుస్తారు. 1940 దశాబ్దం నుంచి ఇప్పటివరకు కొత్తగా 330 అంటువ్యాధులను గుర్తించగా.. అందులో 60 శాతానికిపైగా జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపించినవే. ఏటా మరిన్ని కొత్త వ్యాధులు జంతువులు, పక్షుల నుంచి మనుషులకు విస్తరిస్తున్న కొత్త వ్యాధుల సంఖ్య ఏటా పెరుగుతూపోతోంది. సగటున 3, 4 వ్యాధులు ప్రభావం చూపుతున్నాయి. వీటిల్లో కొన్నిరకాల వైరస్లు సామర్థ్యం పెంచుకుని మహమ్మారులుగా మారుతున్నాయి. మహమ్మారులుగా మారేవి అవే.. ఇన్ఫ్లుయెంజా, సార్స్, ఇప్పటి కోవిడ్ సహా మహమ్మారిగా మారి ప్రపంచాన్ని వణికించిన, వణికిస్తున్న వ్యాధులు మొత్తం కూడా జంతువులు, పక్షుల నుంచి వచ్చినవే. ఎబోలా, జికా, నిఫా వంటి ప్రమాదకర వ్యాధులను కలిగించే వైరస్లలో 70 శాతానికిపైగా అడవి జంతువుల నుంచో, పెంపుడు జంతువుల నుంచో మనుషులకు విస్తరించినవే. 1. మంకీపాక్స్ ఎబోలా లైమ్ డిసీజ్ సార్స్ హంటా వైరస్ 2. ఆంథ్రాక్స్ వెస్ట్ నైల్ వైరస్ ప్లేగ్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా రేబిస్ బ్రూసెల్లోసిస్ ట్యూబర్క్యులోసిస్ సాల్మనెల్లోసిస్ ట్యులరెమియా 3. కౌపాక్స్ బొవైన్ స్పాంజిఫామ్ ఎన్సెఫలోపతి రిఫ్ట్వ్యాలీ ఫీవర్ ఈ కొలి ఇంకా గుర్తించని వైరస్లు లక్షల్లోనే.. జంతువులు, పక్షుల్లో ఉండే వైరస్లలో మనం ఇంకా గుర్తించని వాటి సంఖ్య 17 లక్షలకుపైనే అని ఒక అంచనా. అందులో 6.3 లక్షల నుంచి 8.2 లక్షల వైరస్‌లకు మనుషులకు సోకే సామర్థ్యం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఊ నిజానికి భూమ్మీద కొన్నికోట్ల రకాల వైరస్లు ఉన్నాయని.. వాటిలో మనం గుర్తించినవి, గుర్తించగలిగినవి చాలా తక్కువేనని స్పష్టం చేస్తున్నారు. ప్రకృతి సమతౌల్యం దెబ్బతినడం వల్లే.. వైరస్లు ఇప్పుడిప్పుడు కొత్తగా పుడుతున్నవేమీ కాదు. కొన్ని లక్షల ఏళ్లుగా జంతువులు, పక్షుల్లో ఉన్నవే. పరిస్థితులకు అనుగుణంగా రూపుమార్చుకుంటున్నవే. మరి ఇప్పుడు కొత్తగా ప్రభావం చూపించడం ఏమిటన్న సందేహాలు వస్తున్నాయి కదా.. ప్రకృతి సమతౌల్యాన్ని మనుషులు దెబ్బతీయడమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అడవులను నరికివేయడం వల్ల వస్తున్న వాతావరణ మార్పులు, వన్యప్రాణులు జనావాసాలకు దగ్గర కావడం, వాటి మాంసం వినియోగం వంటివి ప్రమాదకరంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ►దాదాపు వందేళ్ల కిందటితో పోలిస్తే.. ప్రస్తుతం 30 శాతం అడవులు తగ్గిపోయాయి. ఆ భూమిలో వ్యవసాయం, పట్టణీకరణ పెరిగింది. ►2050 నాటికి 247 కోట్ల ఎకరాల అడవులు అంతరిస్తాయని ఒక అంచనా. ►ప్రపంచవ్యాప్తం గా అడవి జంతువుల్లో 24 శాతం వరకు స్మగ్లింగ్ బారినపడుతున్నాయి. దీని విలువ సగటున ఏటా 17 వేల కోట్ల రూపాయలకుపైనే అని అంచనా. ఊహించ లేనంత నష్టం ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీస్తూ మనుషులు సంపాదిస్తున్న దానికంటే కోల్పోతున్నదే ఎక్కువని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వివిధ రూపాల్లో జరుగుతున్న నష్టం ఊహించలేమని పేర్కొంటున్నారు. ►వివిధ మహమ్మారుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆర్థికంగా జరుగుతున్న నష్టం ఏడున్నర లక్షలకు కోట్ల మేర ఉంటుందని అంచనా. ►అదే కరోనా కారణంగా తొలి ఏడాదిలో జరిగిన నష్టం ఏకంగా 60 లక్షల కోట్ల నుంచి కోటి కోట్లదాకా ఉంటుందని చెబుతున్నారు. మరి ఇప్పుడేం చేయాలి? ప్రకృతితో కలిసి జీవించడమే మనిషి ఇప్పుడు చేయాల్సిన పని అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొత్తగా మహమ్మారులు వచ్చాక వాటిని నియంత్రించేందుకు కష్టపడటం కంటే.. అసలు అలాంటి భయంకర వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త పడటమే మేలు అని స్పష్టం చేస్తున్నారు. అడవులను నరికివేయడం ఆపాలని, వీలైతే కొత్తగా అడవులు పెంచాలని.. వన్యప్రాణుల వేట, వ్యాపారాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు. ►జంతువులు, పక్షుల నుంచి వైరస్లు మనుషులకు వ్యాపించే అవకాశాలను ముందుగానే గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని.. ఒకవేళ సోకినా వెంటనే గుర్తించి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. -
వైరస్ల దాడులకు కారణం ఇదే!
హరివిల్లులో ఏడు రంగుల స్థానంలో ఒక రంగు మాత్రమే ఉంటే? భూమ్మీద తెల్లటి పూలు మాత్రమే పూస్తే? పండ్లు అన్నింటి రుచి ఒకేలా ఉంటే? అబ్బే... ఏం బాగుంటుంది అంటున్నారా? నిజమే. అన్నీ ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది! వైవిధ్యం అనేది మనసుకు ఆనందం కలిగిస్తుంది! ప్రయోజనాలూ బోలెడు! కానీ.. ఈ విషయం మనిషికి పూర్తిగా అర్థమైనట్లు లేదు. ఎందుకంటే.. మన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని తెలిసినా... వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ తదితరాల పేరుతో.... అడవులు, నదులు, సరస్సులు, నేలలను నాశనం చేస్తూనే ఉన్నాడు! వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సిద్ధం చేసిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ –2020 చెబుతున్నది ఇదే! కోవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కోట్ల కేసులు.. లక్షల్లో మరణాలు... ఆర్థిక వ్యవస్థ ఛిద్రం.. ఉద్యోగాల కోత. ఇలా ఎన్నెన్నో సమస్యలకు ఒక వైరస్ కారణమైందంటే ఆశ్చర్యం అనిపించక మానదు. కానీ.. కోట్ల సంవత్సరాలపాటు జంతువుల్లో నిక్షేపంగా బతికిన ఈ వైరస్లు ఈ మధ్య కాలంలో మనిషికి ఎందుకు సంక్రమిస్తున్నాయో.. కారణమేమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? హెచ్1ఎన్1 కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి. స్వైన్‌ఫ్లూ కానివ్వండి అన్నీ జంతువుల నుంచి మనిషికి సోకిన వ్యాధులే. ఇప్పుడు కోవిడ్–19 కూడా. మనిషి ఎప్పుడైతే అటవీ సంపదను తన స్వార్థం కోసం విచ్చలవిడిగా వాడటం మొదలుపెట్టాడో అప్పటి నుంచే ఈ సమస్య కూడా పెరగడం మొదలైందని అంటారు నిపుణులు. ప్రకృతిని, జీవజాలాన్ని పరిరక్షించుకోవడం ఇప్పటికైనా నేర్చుకోకపోతే కోవిడ్ –19 తరహా విపత్తులు మరిన్ని ఎదుర్కోక తప్పదని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ –2020లో స్పష్టం చేసింది. రెండేళ్లకు ఒకసారి విడుదల చేసే లివింగ్ ప్లానెట్ రిపోర్ట్‌ను ఈసారి దాదాపు 125 మంది నిపుణులు కలిసి సిద్ధం చేశారు. 1970 నుంచి 2016 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 21 వేల క్షీరదాలు, పక్షులు, జలచరాలు, సరిసృపాలు సంతతిని పరిశీలిస్తూ సిద్ధం చేసిన ఈ నివేదిక దాదాపు 164 పేజీల నిడివి ఉంది. -
కరోనా వైరస్ మానవ తప్పిదమే!
న్యూఢిల్లీ : వివిధ రకాల వైరస్ల వల్ల సంక్రమిస్తోన్న వ్యాధులను ఆంగ్లంలో ‘జూనాటిక్ డిసీసెస్’ లేదా ‘జూనోసెస్’ అని అంటారు. అంటే జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులని అర్థం. మానవులకు సంక్రమించే వ్యాధుల్లో 75 శాతం అంటువ్యాధులు కాగా, వాటిలో 60 శాతం జంతువుల నుంచి సంక్రమిస్తున్నవే. నేడు ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కోవిడ్ వైరస్ కూడా ఆ కోవకు చెందినదే. సార్స్ (సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) పునుగు పిల్లుల నుంచి రాగా, మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), ఒంటెల వల్ల రాగా, ఎబోలా, బర్డ్ ఫ్లూలు ఇతర జంతువుల నుంచి వచ్చాయి. (పారాసిటమాల్ మింగి.. దర్జాగా ఇంటికి..!) వ్యవసాయ విస్తరణ లేదా పట్టణీకరణ లేదా మరే ఇతర కారణాల వల్ల జంతువులు, ఇతర వన్య ప్రాణులు జీవించే అడువులను నరికి వేయడం వల్ల జంతువుల ఆరోగ్యం క్షీణించి వైరస్ల బారిన పడుతున్నాయి. వాటిలో బలిష్టంగా రూపాంతరం చెంతుతోన్న పలు రకాల వైరస్లు వాటి నుంచి మనుషులకు సోకుతున్నాయి. అడవులను నరికివేయడం వల్ల పర్యావరణ పరిస్థితులు దెబ్బతినడంతోపాటు ఇలాంటి అనర్థాలు సంభవిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం విభాగం 2016లోనే ఓ నివేదికలో హెచ్చరించింది. (కరోనా: కృత్రిమంగా తయారు చేసింది కాదు!) ఒక్క 2018లోనే చెట్లు నరికివేయడం వల్ల, కార్చిచ్చుల వల్ల 1.20 కోట్ల హెక్టార్ల అడవులు నశించాయని, బ్రెజిల్, ఇండోనేసియా, మలేసియా దేశాల్లో ఎక్కువ అడవులు నశించాయని ‘గ్లోబల్ వారెస్ట్ వాచ్’ ఓ నివేదికలో వెల్లడించింది. పట్టణీకరణలో భాగంగా అతి తక్కువ స్థలంలో జన సాంద్రత ఎక్కువగా ఉండడం, సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒకరికి సోకిన వైరస్ ఇతరులకు వేగంగా వ్యాపిస్తోందని ఆ నివేదికలో ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. పర్యావరణ ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే ప్రపంచ మానవాళి మనుగడ బాగుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆహార, వ్యవసాయ సంస్థ పిలుపునివ్వగా, ‘జంతువులు, అడవుల ఆరోగ్యంపైనే మానవులు ఆరోగ్యం ఆధారపడి ఉంది’ అని ‘ది సెంటర్ ఫర్ పీపుల్ అండ్ ఫారెస్ట్స్ ఇన్ బ్యాంగ్కాగ్’ ఎగ్సిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ గ్యాంగ్ వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా వైరస్ల విజృంభణకు మానవ తప్పిదనమని స్పష్టం అవుతోంది. (ప్రపంచ దేశాల్లో ప్రజా దిగ్భందనం) -
అడవి దొంగలు
అడవులతోనే మానవ మనుగడ. అలాంటి అడవి అక్రమార్కుల గొడ్డలి వేటుకు బలవుతోంది. ఇష్టారీతిన చెట్లను నరికివేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కలపను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో చెట్లు లేక అడవి వెలవెలబోతోంది. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అటవీ శాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అటవీ శాఖలో విధులు నిర్వహించే ఇంటి దొంగలు ఎక్కువవుతుండటంతో చెట్లపై గొడ్డలి వేటు పడుతోంది. సామాజిక అడవుల అభివృద్ధి కోసం ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపడుతుండగా మరో పక్క యథేచ్ఛగా కలప తరలిపోతోంది. అధికారులు, సిబ్బంది కలప స్మగ్లర్లతో లాలూచి పడి అందిన కాడికి అడవులను అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దొరికితేనే వేటు అన్నచందంగా మారింది. గత రెండు మాసాల క్రితం ఫరీద్పూర్ అటవీ ప్రాంతంలో కొందరు అక్రమార్కులు కలపనునరికి ఎలాంటి అనుమతులు లేకుండా బొగ్గుబట్టిలను పెట్టారు. దీని వెనుకాల ఓ క్షేత్రస్థాయి అధికారి ఉన్నట్టు తెలుస్తోంది. నర్దన అడవి నుంచి కలప రవాణ సర్దన నుంచి బోదన్కు వెళ్లే దారి పొడవునా అడవి ఉంది. ఈ అడవిలో రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. చెట్లను నరికేసిన ఆనవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ దారిలో చెట్లు నరికివేతకు గురవుతున్నాయంటే మారుమూల పల్లెల్లోని అడవుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాతూర్ అడవిలో.. మెదక్ – రామాయంపేట ప్రధాన రహదారైన పాతూర్ అడవిలో చెట్లను విచ్చలవిడిగా నరికివేశారు. అడవి లోపలికి కొద్దిదూరం వెళ్తే అన్ని నరికేసిన చెట్ల మొదళ్లే దర్శనమిస్తున్నాయి. ఈ విషయంపై పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, అటవీ అధికారులకు ఎంతో కొంత ఇస్తే ఏ చెట్టునైనా నరుక్కుపొమ్మంటారని కొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా అటవీ శాఖ అధికారుల ప్రమేయం లేకుండా అడవి లోపలికి వెళ్లి చెట్లను నరకటం ఎవరికి సాధ్యం కాదనే చెప్పాలి. అడవిలో పడేసిన మొక్కలు హరితహారం పథకంలో భాగంగా ఇటీవల అటవీ శాఖ అధికారులు అడవుల్లో గ్యాబ్ ప్లాంటేషన్ విరివిగా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కొన్ని అడవుల్లో మొక్కలు నాటారు. ఇందులో భాగంగానే పాతూర్ అడవిలో అధికారులు కొంతమేర గ్యాబ్ ప్లాంటేషన్ చేసినప్పటికీ నాటిన మొక్కల కన్నా రెట్టింపు మొక్కలు అడవిలో ఎక్కడ పడితే అక్కడే పడేశారు. దీంతో అవి ఎండిపోయాయి. వీటిని చూస్తుంటే మన అటవీ శాఖ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాహనాలు ఇచ్చినా ఫలితం శూన్యం అటవీ శాఖ క్షేత్ర స్థాయిలో బీట్ ఆఫీసర్ల నుంచి మొదలుకొని సెక్షన్, రేంజ్ అధికారులకు ప్రభుత్వం వాహనాలను సమకూర్చింది. నిత్యం అడవుల్లో పర్యటిస్తూ అడవిని రక్షిస్తారని ఇచ్చిన వాహనాలను వారి సొంతానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశించినా.. ఇటీవల కలెక్టర్ ధర్మారెడ్డి అడవుల్లోకి ఎవరైనా గొడ్డలి పట్టుకొని లోపలికి పోయినా కేసులు నమోదు చేయాలని స్పష్టంగా అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారిచేశారు. కానీ మన అధికారులు ఎవరిపై కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే మన అధికారులే అక్రమార్కులకు కొండంతా అండగా ఉంటున్నారు కాబట్టి. ఇక కలెక్టర్ చెప్పిన మాటలకు తలాడించి బయటకు రాగానే వారిపని వారు యథావిధిగా చేసుకుంటున్నారు. అడవుల జోలికొస్తే చర్యలు తప్పవు అడవులను ఎవరు నరికినా చట్టరీత్య చర్యలు తప్పవు. సొంత పొలం గెట్ల నుంచి అక్రమంగా కలపను నరికినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయి అధికారులు స్థానికంగా ఉంటూ ఎప్పటికప్పుడు అడవుల రక్షణకు పాటు పడల్సిందే.. లేదంటే చర్యలు తప్పవు. గతంలో అడవులను నరికిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నాం. గడిచిన రెండేళ్లలో అడవిలో జిల్లా వ్యాప్తంగా 222 కేసులు నమోదు చేశాం. రూ.31.45 లక్షల జరిమానా విధించాం. 2018లో 169 కేసులు నమోదు చేసి అక్రమార్కుల నుంచి రూ.22.84 లక్షల జరిమానాలు విధించాం. 2019లో సెప్టెంబర్ వరకు అక్రమార్కులపై 53 కేసులు నమోదు చేసి రూ.8.61 లక్షలు జరిమానాలు విధించాం. – పద్మజారాణి, డీఎఫ్‌వో -
ఎన్నాళ్లీ ‘వృక్షసంహారం’?
మానవాళికి చెట్లు చేసే మేలేమిటో తెలుసుకోవడానికి ఎవరూ గూగుల్‌ను ఆశ్రయించనవసరం లేదు. పర్యావరణవేత్తలు చెబితే తప్ప తెలియని వారెవరూ లేరు. చెట్ల ఉపయోగాల గురించి బడి చదువుల దగ్గరనుంచి గురువులు నూరిపోయడమే ఇందుకు కారణం. దురదృష్టమేమంటే అధికార పీఠాలపై ఉన్న నేతలు, ఉన్నతాధికార వర్గంలో పనిచేస్తున్నవారు ఏ బళ్లో చదువుకుని ఆ స్థాయికి ఎదిగారోగానీ... దేశంలో ‘అభివృద్ధి’ పేరు చెప్పి వృక్ష సంహారం జరగని రోజంటూ దేశంలో ఉండటం లేదు. ఇప్పుడు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్(ఎంఎంఆర్‌సీ) వంతు వచ్చింది. పర్యవ సానంగా ఆ మహానగరం శివార్లలోని ఆరే కాలనీకి మూడింది. అందులోని వేల చెట్లు నేలకొరి గాయి. ఈ చెట్లను కాపాడటానికి గత నాలుగేళ్లుగా ఆ కాలనీ వాసులు, పర్యావరణ ఉద్యమకారులు చేయని పోరాటమంటూ లేదు. 2015లో వారి ఒత్తిడికి తలొగ్గి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీకి అనేక ప్రత్యామ్నాయ ప్రతిపాదనలొచ్చాయి. వాటిల్లో ఏ ఒక్కటీ తమకు ఉపయోగపడదంటూ మెట్రో రైల్ కార్పొరేషన్ తిరస్కరించింది. చివరకు ఆరే కాలనీలో ఓ చీకటి రాత్రి చెట్లు కూల్చే పని ప్రారంభం కాగానే జనం అడ్డుకున్నారు. హైకోర్టును ఆశ్రయించారు. కానీ స్టే ఇవ్వడానికి శనివారం న్యాయస్థానం నిరాకరించడంతో సోమవారం వారు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఈనెల 21 వరకూ యధాతథ స్థితిని కొనసాగించమని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. చిత్రమేమంటే ఈలోగానే... అంటే రెండురోజుల్లోనే 2,141 చెట్లు నేలకూలాయి. ముంబై మహా నగర జనాభా దాదాపు రెండు కోట్లు. అక్కడ రోజూ 80 లక్షలమంది ప్రయా ణీకులు(దాదాపు ఇజ్రాయెల్ జనాభా పరిమాణం) ఇప్పుడున్న సిటీ రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తారు. ప్రస్తుతం ఉన్న రెండు మెట్రో లైన్లకు తోడు మరో లైన్ నిర్మిస్తే అంధేరీ ఈస్ట్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి, శాంతాక్రజ్‌లోని దేశీయ విమానాశ్రయానికి, నగర పరిసరాల్లోని ప్రధాన ప్రాంతాలకూ కూడా రవాణా సౌకర్యం విస్తరిస్తుందని, రోజూ 17 లక్షలమందికి ఉపయో గపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. దాన్నెవరూ కొట్టిపారేయడం లేదు. కానీ అందుకు నగరా నికి ప్రాణవాయువును అందిస్తున్న ఆరే ప్రాంత వృక్షజాలాన్ని ధ్వంసం చేయాలా అని ప్రశ్నిస్తు న్నారు. ఈ కాలనీకి చేర్చి ఉన్న సంజయ్ గాంధీ జాతీయ పార్క్ వన్యమృగాలకూ, వందలాది రకాల పక్షులకూ నిలయం. ఈ పక్షుల్లో అనేకం ఆరే కాలనీ వాసుల్ని కూడా పలకరిస్తాయి. కను విందు చేస్తాయి. భిన్న జాతుల పక్షుల్ని వీక్షించడానికి, తమ కెమెరాల్లో బంధించడానికి విహంగ ప్రేమికులు నిత్యం ఇక్కడికొస్తారు. దీనికి ‘మినీ కశ్మీర్’గా పేరుంది. ఉరుకుల, పరుగుల జీవితాలకు కాస్తంత విరామం ఇచ్చి, ప్రశాంతంగా స్వచ్ఛమైన వాయువు పీల్చి పునీతులు కావడానికి నగర వాసుల్లో అత్యధికులు ఎన్నుకునే చోటిది. ఇక్కడున్న లక్షలాది వృక్షాల్లో అనేకం 110 ఏళ్లపైబడినవి. దాదాపు 3,180 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ చెట్లనుంచి వీచే గాలిని ఆస్వాదిస్తూ వందలమంది ఇక్కడ సైక్లింగ్, జాగింగ్ చేస్తుంటారు. మెట్రో రైలు అయినా, మరొకటైనా నగర ప్రజలకు ఉపయో గపడేదే కావొచ్చు. కానీ అందుకోసం ఇంత ప్రాణప్రదమైన ప్రాంతాన్ని పాక్షికంగానైనా నాశనం చేయవచ్చా? మెట్రో రైలు బోగీలను పరిశుభ్రం చేయడం, వాటికి అవసరమైన మరమ్మత్తులు చేయడం వంటి అవసరాలకు షెడ్లు నిర్మించడం కోసం ఈ చెట్ల కూల్చివేత పర్వం మొదలైంది. ముంబైతో సహా మన మహానగరాలు వేల కోట్లు ఆర్జించే పెట్టే బంగారు గనులే కావొచ్చు. అక్కడ అనేకులకు ఉపాధి దొరుకుతుండవచ్చు. కానీ వాటికి కావలసినంత అపకీర్తి కూడా ఉంది. అందులో అనేకం కాలుష్యకారకాలు. ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత నగరాలు 20 ఉంటే అందులో 15 మన నగరాలే! తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రపంచంలోని 15 నగరాల్లో మన వాటా 11! ఈ నగరాల వాతావరణంలో, ఇక్కడి తాగునీటిలో మృత్యువు దాగుందని నిపుణులు చాన్నాళ్లుగా చెబుతున్నారు. నగర పౌరుల ఊపిరితిత్తుల్లోకి కొంచెం కొంచెంగా చొరబడుతున్న కాలుష్యం వారిని రోగగ్రస్తులుగా మారుస్తోంది. కేన్సర్, గుండె జబ్బులు వగైరాలకు కారణ మవుతోంది. అనేకుల్లో అకాల వృద్ధాప్యాన్ని కలిగిస్తోంది. వారిని పనిపాటలకు దూరం చేస్తోంది. ఇదంతా మన పాలకులకు ఆందోళన కలిగించాలి. దీన్ని సరిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి పురిగొల్పాలి. ఆరే కాలనీ తరహాలో చెట్లు పెంచాలి. తొలగించకతప్పదను కుంటే ఆ చెట్లను మరొకచోట పాతడానికి ప్రయత్నించవచ్చు. కానీ జరుగుతున్నదంతా అందుకు విరుద్ధం. ప్రపంచ అధ్యయన సంస్థలు చెబుతున్న వాస్తవాలేవీ వారిలో కదలిక తీసుకురావడం లేదు. ఇల్లు కట్టుకుందామనో, ఉన్న ఇంటిని విస్తరించుకుందామనో ఎవరైనా తమ ఆవరణలో చెట్లు కొట్టాలంటే అందుకు అనుమతులు తీసుకోవడం అవసరం. కానీ తమకు అలాంటి నిబంధనలు వర్తించవన్నట్టు అధికార యంత్రాంగాలు ప్రవర్తిస్తున్నాయి. ఆరే కాలనీ చెట్ల నరికివేత వ్యవహారం తీసుకుంటే చట్ట ప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కారు. 1975నాటి చట్టం ప్రకారం ఏ చెట్టు తొలగించాలన్నా అందుకు అనుమతి ఉండాలి. అలా తొలగించడానికి పక్షం రోజులముందు ప్రజలందరికీ తెలిసేలా ఆ అనుమతిని పత్రికల్లో ప్రచురించాలి. ఆరేళ్లక్రితం బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం సంబంధిత సంస్థలు తమ తమ వెబ్సైట్లలో అనుమతి కాపీలను అప్లోడ్ చేయాలి. కానీ ఆరే కాలనీ చెట్ల కూల్చివేతలో ఈ నిబంధనలేవీ పాటించలేదు. చెట్లు కూల్చడం మొదలుపెట్టిన శుక్రవారం రాత్రే అనుమతి కాపీని కూడా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఆదరా బాదరాగా అందుబాటులోకి తెచ్చారు. పాలనా సంస్థలే ఇలా చట్టాల్ని ధిక్కరించే స్థితికి దిగజారడం, ప్రశ్నించినవారిని నిర్బంధించడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. -
అనుమతులు అనవసరం!.. కట్టె కొట్టు.. శివారు దాటించు..!!
కలప అక్రమ రవాణా జిల్లాలో జోరుగా సాగుతోంది. కలప వ్యాపారులు అటవీ భూములు, పట్టాభూముల్లోని చెట్లను యథేఛ్చగా నరికేస్తున్నారు. అటవీశాఖ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరా చేసుకుని విలువైన కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఓ వైపు హరితహారంతో అటవీ విస్తీర్ణం పెంచాలని చూస్తుంటే మరోవైపు కలప వ్యాపారులు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. మామూళ్లకు అలవాటుపడిన కొంత మంది అధికారుల వల్లే కలప అక్రమ వ్యాపారం జిల్లాలో సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.చెట్లను నరికి అక్రమంగా సాగిస్తున్న కలప వ్యాపారంపై సాక్షి ప్రత్యేక కథనం... సాక్షి, మెదక్: జిల్లాలో అనుమతులు లేకుండా చెట్లు నరికి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మెదక్, హవేళిఘణాపూర్, రామాయంపేట, నర్సాపూర్, వెల్దుర్తి, కౌడిపల్లి, శివ్వంపేట, మనోహరాబాద్ మండలాల్లో ఈ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. అటవీ, పట్టా భూముల్లోని టేకు, మద్ది, తుమ్మ, వేప, యూకలిప్టస్, మేడి, సరువు, మామిడి, చింత చెట్లు ఇలా అన్ని రకాల చెట్లను అనుమతులు లేకుండానే నరికేస్తున్నారు. నరికిన అరుదైన వృక్షాలను లారీల ద్వారా హైదరాబాద్, తూప్రాన్, పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలకు , ఇటుక బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో 10 మందికిపైగా కలప వ్యాపారులు ఉండగా వీరి వద్ద పనిచేస్తున్న ఏజెంట్లు కలప నరకడం, రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో రూ.10 నుంచి రూ.30 లక్షల కలప అక్రమ దందా సాగుతున్నట్లు అంచనా. సెలవు, పండుగ రోజుల్లో పోలీసులు, రెవెన్యూ, అటవీశాఖ అధికారుల తనిఖీలు తక్కువగా ఉంటాయి. దీన్ని ఆసరా చేసుకుని కలప వ్యాపారులు కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. జిల్లాలోని అటవీ, పట్టాభూముల నుంచి అక్రమంగా నరికిన కలపను ఎక్కువగా టింబర్ డిపోలు, ఇటుక బట్టీలు, పరిశ్రమలకు తరలిస్తున్నారు. నిబంధనలు సడలింపుతో.. చెట్లను సంరక్షించేందుకు ప్రభుత్వం వాల్టా 2002 చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. దీంతో ప్రతిరోజూ జిల్లా వ్యాప్తంగా వందలాది టన్నుల కలప అక్రమ రవాణా జరుగుతోంది. అటవీ చట్టాన్ని అనుసరించి అటవీభూముల్లోని చెట్లను నరకడం నిషేధం. అలాగే పట్టాభూముల్లోని చెట్లను నరకడం, రవాణాకు వాల్టా చట్టం ప్రకారం రెవెన్యూ అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. ఈ చట్టం ప్రకారం చెట్లు నరికిన చోట మొక్కలను పెంచాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వం 26 రకాల చెట్లను నరకడాన్ని నిషేధించింది. అయితే ఇటీవల ప్రభుత్వం మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు 42 చెట్ల రవాణా అనుమతిస్తూ నిబంధనలను సడలించింది. దీనిని ఆసరా చేసుకుని కలప అక్రమ రవాణా చేసే వ్యాపారులు ఇష్టారాజ్యంగా చెట్లను నరుకుతూ అక్రమంగా కలప వ్యాపారం సాగిస్తున్నారు. గ్రామాల నుంచి సామిల్‌కు.. అసైన్డ్ భూములు, పట్టా భూముల్లో మాత్రం చెట్లను అడ్డగోలుగా నరుకుతున్నారు. చింతచెట్టు నరకాలంటే అటవీశాఖ జిల్లా అధికారి అనుమతి తప్పనిసరికాగా తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండానే లారీలు, ట్రాక్టర్లలో కలప అక్రమ రవాణా జరుగుతుంది. పట్టా, అసైన్డ్ భూముల్లో చెట్లను నరకడానికిగాను సంబంధిత కంట్రాక్టర్ అటవీ సిబ్బందికి మమూళ్లు ఇవ్వాల్సిందే. ఒక్క రామాయంపేట రేంజీ పరిధిలోనే ప్రతిరోజూ పదిహేను లోడ్ల కలప రవాణా చేస్తున్నారు. మారుమూల గ్రామాలనుంచి కలప సా మిల్లులకు చేరుతుంది. దీనితో వారు చీకటి పడ్డాక హైదరాబాద్ తరలిస్తున్నారు. తూప్రాన్ సరిహాద్దులో జాతీయ ర«హదారిపై అటవీశాఖ చెక్‌పోస్టు ఉండగా, ఇక్కడ నుంచి జాతీయ రహదారిపై కలప తరలిస్తున్న ప్రతి వాహనానికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సిందే. పారిశ్రామిక వాడలకు తరలింపు.. నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి, అచ్చంపేట, నత్నాయిపల్లి, ఎల్లాపూర్, బ్రాహ్మాణపల్లి తదితర గ్రామాలను ఆనుకుని ఉన్న అడవులలో చెట్లను నరికి కలపను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్కుల, తిమ్మాపూర్, పాంబండ గ్రామాలు అడవులను ఆనుకుని ఉన్నందున అడవుల నుంచి కలప నరికి మేడ్చల్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన కంపెనీలకు రవాణా చేస్తున్నారు. కొత్తపేట ప్రాంతంలో ఇటుక బట్టీలు ఎక్కువగా చేపడుతూ అడవిలోని చెట్లను నరికి బట్టీలకు వినియోగిస్తున్నారు. కౌడిపల్లి మండలంలోని మహ్మద్‌నగర్ గ్రామ పంచాయితీలోని గిరిజన తండాలతో పాటు కౌడిపల్లి కొల్చారం మధ్య ఉన్న అడవి నుంచి చెట్లను నరికి కలపను పారిశ్రామిక వాడలకు రవాణా చేస్తుంటారు. ఇటీవల శివ్వంపేట మండలంలోని కొత్తపేట నుంచి కలపను అక్రమంగా చేస్తున్న లారీ నర్సాపూర్త్లో బోల్తా పడింది. కలప లారీకి ఎలాంటి అనుమతులు లేకపోయినా లారీపై కేసు నమోదు చేయకుండానే వదిలివేయడం పోలీసు ల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. కఠిన చర్యలు తప్పవు అక్రమంగా అటవీభూములు, పట్టాభూముల్లో చెట్లు నరికి అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో కలప రవాణా కేసులు తక్కువగానే ఉన్నాయి. అటవీ అధికారులు మామూళ్లు తీసుకుని కలప రవాణాకు అనుమతిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాప్తవం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు కలప అక్రమ రవాణాకు సంబంధించి 40 కేసులు పెట్టాం. అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు తప్పవు. వాల్టా చట్టం ప్రకారం ముందుస్తు అనుమతి తీసుకుని చెట్లు నరకడం లేదా రవాణా చేయాలని తెలిపారు. – పద్మజారాణి, డీఎఫ్ఓ -
అరణ్యరోదన
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: హరితహారం పేరుతో ప్రభుత్వం ఓవైపు కోట్లాది రూపాయలు వెచ్చించి మూడేళ్లుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతుండగా, మరోవైపు అడవుల నరికివేత యథావిధిగా కొనసాగుతోంది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మొదలుకొని వరంగల్, మెదక్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వరకు అడవుల నరికివేత యథేచ్ఛగా సాగుతోంది. అటవీ ప్రాంతంలోని గ్రామాలకు చెందిన వారితో పాటు కలప స్మగ్లర్లు విలువైన టేకు చెట్లను నరికి తరలించుకుపోతున్నారు. అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో అడవుల ధ్వంసం ప్రమాదకర స్థాయిలో సాగుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎమ్మెల్యేగా గెలిచిన గజ్వేల్‌లో నెలనెలా రూ. కోట్ల విలువైన కలప అక్రమంగా రవాణా అవుతుండగా, భూపాలపల్లి జిల్లాకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి అక్రమంగా కలప తరలివస్తోంది. ఖమ్మం, కొత్తగూడెంల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో కూడా టేకు వృక్షాలు కనుమరుగవుతున్నాయి. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, చెక్‌పోస్టులు నామమాత్రంగా మిగిలిపోవడం, స్మగ్లర్లకు సిబ్బంది సహకారం నేపథ్యంలో అడవుల్లోని భారీ వృక్షాలు స్మగ్లర్ల ద్వారా హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చేరిపోతున్నాయి. మామూళ్ల మత్తులో అటవీ అధికారులు చోద్యం చూస్తున్నారు. అభయారణ్యం నుంచే నరికివేత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని పలు మండలాల్లో అడవిని నరికి చెట్లను తరలించే కార్యక్రమం పకడ్బందీగా సాగుతోంది. ఇక్కడికి వందేళ్ల క్రితం వలస వచ్చిన ముల్తానీ కుటుంబాలతో పాటు మహారాష్ట్రకు చెందిన స్మగ్లర్లు, స్థానికులు అడవుల నరికివేతలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాళ్లపేట రేంజ్ పరిధిలోని మల్యాల, సింగరాయిపేట, తపాల్పూర్, మహ్మదాబాద్ బీట్ల నుంచి టేకు చెట్ల నరికివేత, కలప తరలింపు ప్రక్రియ సాగుతోంది. బోథ్ మండలం పరిధిలోని మర్లపల్లి, నిగిని అటవీ ప్రాంతాల నుంచి చెట్లను నరికి వేస్తున్నారు. పెంబి మండలంలోని పలు ప్రాంతాలతో పాటు తిర్యాణి, మంగి, గుండాల, ఖానాపూర్, ఉట్నూరు, ఇచ్చోడ ప్రాంతాల నుంచి కలప నరికివేత, అక్రమ రవాణా కొనసాగుతోంది. బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు, ఉట్నూర్, నార్నూర్ మండలాలలోని అడవుల్లో స్మగ్లర్లు పగటి వేళల్లో నరికే చెట్లను గుర్తించి, రాత్రివేళ్లల్లో నరికి హైదరాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు తరలిస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఎలాంటి అనుమతులు లేకుండానే రూ. కోట్ల విలువైన అటవీ కలప తరలిపోతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పరిస్థితి రివర్స్‌లో ఉంది. ఇక్కడికి ఛత్తీస్‌గఢ్ నుంచి అక్రమంగా కలపను స్మగ్లర్లు తీసుకొస్తున్నారు. ‘చెన్నూరు అటవీ ప్రాంతంలోని దుగ్నెపల్లి జీపీ పరిధిలోని లింగంపేట అడవిలో నరికిన 40 టేకు చెట్లను దుంగలుగా మార్చి ట్రక్కులో మంచిర్యాల వైపు తరలిస్తుండగా శుక్రవారం చెన్నూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు’ కుమ్రం భీం జిల్లాలోని మామిడిపల్లి అటవీ సెక్షన్ కొత్తపల్లి బీట్ పరిధిలోని అడవిలో మామిడిపల్లి నుంచి కవ్వాల్కు రోడ్డు వేయాలన్న డిమాండ్‌తో మామిడిపల్లి గ్రామస్తులు అడవిలోని 120 టేకు వృక్షాలను నరికివేశారు. -
అటవీ నిర్మూలనతో మలేరియా వ్యాప్తి!
న్యూయార్క్: అడవులను నాశనం చేయడం ద్వారా మలేరియా వ్యాప్తి అధికమయ్యే అవకాశాలున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు 67 తక్కువ అభివృద్ధి చెందిన, మలేరియా ప్రభావిత దేశాలపై అమెరికాలోని లేహై విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించి తెలిపారు. అడవులను నాశనం చేయడంతో సూర్యకాంతి అధికంగా భూమిని చేరడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో నీరు ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రవహించకుండాపోయి ఒకే ప్రదేశంలో తటస్థంగా నిల్వ ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పరిస్థితులు మలేరియా వ్యాప్తికి ముఖ్య కారకాలైన ‘అనాఫిలెస్’ జాతికి చెందిన దోమలు పెరగటానికి దోహదపడతాయని చెప్పారు. తద్వారా మలేరియా కేసులు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని లేహై విశ్వవిద్యాలయానికి చెందిన కెల్లీ ఆస్టిన్ వివరించారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 1990 నుంచి దాదాపు 130 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని నాశనం అయినట్లు ఐకరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ నివేదికలో వెల్లడించింది. -
అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం
పుంగనూరు (చిత్తూరు): చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బోడినాయనిపల్లి దళితవాడ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు చింతచెట్లను భారీగా నరికివేశారు. అయితే రాష్ట్ర అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారు. నరికివేతకు గురైన చింతచెట్లు వందేళ్ల నాటివని, అటవీశాఖ అధికారులు వీటి విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. -
వాల్టాకు...అధికారుల తూట్లు
మహబూబ్ నగర్: పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వాల్టా చట్టానికి తూట్లూ పొడుస్తుంది. ఇష్టానుసారంగా ఇసుకను తరలించడం, చెట్లను నరికివేయడం, ఎక్కడపడితే అక్కడ బోర్లు వేస్తూ జిల్లా రైతులు, గ్రామీణ ప్రాంతాల వారు చట్టం నిబంధనలను అతిక్రమిస్తున్నారు. పర్మిషన్ లేకుండా బోర్లు, అక్రమంగా ఇసుక రవాణా బోర్లు పగలు వేయడం వల్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్న ఉద్దేశంతో రైతులు, గ్రామ వాసులు రాత్రి వేళల్లో బోర్లు వేస్తున్నారు. అధికారులు పక్కపక్కనే రిగ్గులు వేస్తూ రైతుల మధ్యన గొడవకు కారణమవుతున్నారు. బోరు వేయాలంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా బోర్లు వేస్తూ నిబంధనలు అతిక్రమిస్తూ పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నారు. జిల్లాలోని కానాయపల్లి, గోవిందహళ్లి, పామాపురం, అప్పరాల, కనిమెట్ట తదితర గ్రామాల వాగులు, వంకల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తూ సంపదను అర్జిస్తున్నారు. పగటిపూట గ్రామ శివారులలో ఇసుకను డంపింగ్ చేస్తూ, రాత్రి వేళ్లల్లో దర్జాగా అమ్ముకుంటున్నారు. చెట్ల నరికివేత ఇష్టానుసారంగా పచ్చని చెట్లను నరికివేస్తున్నారు. స్థానికులు నిబందనలు అతిక్రమిస్తూ వాల్టా చట్టానికి తూట్లూ పొడుస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.