వాల్టాకు...అధికారుల తూట్లు
మహబూబ్ నగర్: పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వాల్టా చట్టానికి తూట్లూ పొడుస్తుంది. ఇష్టానుసారంగా ఇసుకను తరలించడం, చెట్లను నరికివేయడం, ఎక్కడపడితే అక్కడ బోర్లు వేస్తూ జిల్లా రైతులు, గ్రామీణ ప్రాంతాల వారు చట్టం నిబంధనలను అతిక్రమిస్తున్నారు.
పర్మిషన్ లేకుండా బోర్లు, అక్రమంగా ఇసుక రవాణా
బోర్లు పగలు వేయడం వల్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్న ఉద్దేశంతో రైతులు, గ్రామ వాసులు రాత్రి వేళల్లో బోర్లు వేస్తున్నారు. అధికారులు పక్కపక్కనే రిగ్గులు వేస్తూ రైతుల మధ్యన గొడవకు కారణమవుతున్నారు. బోరు వేయాలంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా బోర్లు వేస్తూ నిబంధనలు అతిక్రమిస్తూ పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నారు. జిల్లాలోని కానాయపల్లి, గోవిందహళ్లి, పామాపురం, అప్పరాల, కనిమెట్ట తదితర గ్రామాల వాగులు, వంకల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తూ సంపదను అర్జిస్తున్నారు. పగటిపూట గ్రామ శివారులలో ఇసుకను డంపింగ్ చేస్తూ, రాత్రి వేళ్లల్లో దర్జాగా అమ్ముకుంటున్నారు.
చెట్ల నరికివేత
ఇష్టానుసారంగా పచ్చని చెట్లను నరికివేస్తున్నారు. స్థానికులు నిబందనలు అతిక్రమిస్తూ వాల్టా చట్టానికి తూట్లూ పొడుస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.