Global Commission on Economics of Water: దారి తప్పిన జల చక్రం! | Global water crisis leaves half of world food production at risk in next 25 years | Sakshi
Sakshi News home page

Global Commission on Economics of Water: దారి తప్పిన జల చక్రం!

Published Fri, Oct 18 2024 4:22 AM | Last Updated on Fri, Oct 18 2024 4:22 AM

Global water crisis leaves half of world food production at risk in next 25 years

చరిత్రలో ఇదే తొలిసారి 

పరాకాష్టకు నీటి ఎద్దడి 

మనిషి నిర్వాకమే కారణం 

అంతర్జాతీయ నివేదిక వెల్లడి 

పర్యావరణంతో శతాబ్దానికి పైగా మనిషి ఆడుతున్న ప్రమాదకరమైన ఆట పెను విపత్తుగా పరిణమిస్తోంది. దాని తాలూకు విపరిణామాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా అడవుల నరికివేత, మితిమీరిన వాతావరణ కాలుష్యం తదితరాల దెబ్బకు చివరికి భూమిపై జీవకోటి మనుగడకు అత్యవసరమైన జలచక్రం కూడా గతి తప్పింది. అంతర్జాతీయ నిపుణుల సమూహమైన గ్లోబల్‌ కమిషన్‌ ఆన్‌ ద ఎకనామిక్స్‌ ఆఫ్‌ వాటర్‌ చేపట్టిన అధ్యయనం ఈ మేరకు తేలి్చంది.

 ‘‘చరిత్ర పొడవునా అత్యంత భారీ వాతావరణ మార్పులనెన్నింటినో తట్టుకుని నిలిచిన జలచక్రం ఇలా సంతులనం కోల్పోవడం మానవాళి చరిత్రలో ఇదే తొలిసారి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి అతి త్వరలోనే పరాకాష్టకు చేరడం ఖాయం’’ అని బుధవారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మనిషి నిర్వాకం వల్ల చోటుచేసుకుంటున్న పర్యావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమంటూ కుండబద్దలు కొట్టింది! ‘‘దీనివల్ల ఆహార సంక్షోభం మొదలుకుని పలు రకాల విపరిణామాలు తలెత్తనున్నాయి. వీటి దెబ్బకు త్వరలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం కావడం ఖాయం’’ అని జోస్యం చెప్పింది. 

ఏమిటీ జలచక్రం...!? 
జలచక్రం భూమిపై నీటి కదలికలకు సంబంధించిన సంక్లిష్టమైన వ్యవస్థ. చెరువులు, నదులు, ముఖ్యంగా సముద్రంలోని నీరు సూర్యరశ్మి ప్రభావంతో ఆవిరిగా వాతావరణంలోకి చేరుతుంది. భారీ నీటి ఆవిరి మేఘాలుగా మారి సుదూరాలకు పయనిస్తుంది. శీతల వాతావరణం ప్రభావంతో చల్లబడి వానగా, మంచుగా తిరిగి నేలపైకి చేరుతుంది. ఈ ప్రక్రియనంతటినీ కలిపి జలచక్రంగా పేర్కొంటారు. మనిషి చేజేతులారా చేస్తూ వస్తున్న పర్యావరణ విధ్వంసం ధాటికి దీనిపై కొన్ని దశాబ్దాలుగా కనీవినీ ఎరగని స్థాయిలో ఒత్తిడి పడుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో అది భరించలేని స్థాయికి చేరిందని అధ్యయనం వెల్లడించింది. దశాబ్దాల తరబడి భూమిని విచ్చలవిడిగా విధ్వంసకర విధానాలకు వాడేయడం మొదలుకుని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు నీటి నిర్వహణలో కనబరుస్తున్న లెక్కలేనితనం దాకా జలచక్రం గతి తప్పేందుకు దారితీసిన పలు కారణాలను నివేదిక ఏకరువు పెట్టింది.
 
గతి తప్పితే అంతే...!
 జలచక్రం గతి తప్పితే జరిగే చేటును తాజా నివేదిక కళ్లకు కట్టింది...
→ కేవలం నీటి ఎద్దడి దెబ్బకు 2050 నాటికి దాదాపుగా అన్ని దేశాల జీడీపీ కనీసం 8 శాతం, అంతకుమించి తగ్గిపోతుందని అంచనా. అల్పాదాయ దేశాల జీడీపీలో 15 శాతానికి పైగా క్షీణత నమోదు కావచ్చు.
→ దీని ప్రభావంతో ఏకంగా 300 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా దేశాల్లో పంటలూ నేలచూపులు చూస్తున్నాయి. ళీ భారీ భవనాలు తదితరాల తాలూకు ఓపలేని భారానికి తోడు భూగర్భ జల వనరులూ నిండుకుంటుండటంతో నగరాలు, పట్టణాలు నానాటికీ మరింత వేగంగా భూమిలోకి కూరుకుపోతున్నాయి. 
→ నీటి సంక్షోభం ఇప్పటికే ప్రపంచ ఆహారోత్పత్తిని 50 శాతానికి పైగా ప్రభావితం చేస్తోంది.

హరిత జలం.. అతి కీలకం 
చెరువులు, నదుల వంటి జలాశయాల్లోని నీటికి బ్లూ వాటర్‌ అంటారు మట్టి, మొక్కల్లో నిల్వ ఉండే తేమను హరిత జలం అని పేర్కొంటారు. మనం ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోని ఈ నీటి వనరును జలచక్రంలో అతి కీలకమైన పొరగా నివేదిక అభివరి్ణంచింది. ‘‘ప్రపంచ వర్షపాతంలో ఏకంగా సగానికి పైగా దీనివల్లే సంభవిస్తోంది. భూమిని వేడెక్కించే కర్బన ఉద్గారాలను చాలావరకు శోషించుకునేది ఈ హరితజలమే’’ అని తేలి్చంది. కానీ, ‘‘ఏ దేశంలో చూసినా చిత్తడి నేలలను నాశనం చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దీనికి తోడు అడవులనూ విచ్చలవిడిగా నరికేస్తున్నారు. దాంతో కర్బన ఉద్గారాలు నేరుగా వాతావరణంలోకి విడుదలైపోతున్నాయి. ఫలితంగా గ్లోబల్‌ వారి్మంగ్‌ ఊహాతీత వేగంతో పెరిగిపోతోంది. మట్టిలో, చెట్లలో ఉండే తేమ హరించుకుపోతోంది. ఇదో విషవలయం. దీని దెబ్బకు కార్చిచ్చుల ముప్పు కూడా నానాటికీ పెరుగుతోంది’’ అని నివేదిక హెచ్చరించింది.

అడ్డూ అదుపూ లేని మానవ కార్యకలాపాల వల్ల భూమిపై జలచక్రంతో సహా అన్నిరకాల సంతులనాలూ ఘోరంగా దెబ్బ తింటున్నాయి. దాంతో వర్షపాత ధోరణులు విపరీతంగా మారుతున్నాయి. దేశాలన్నీ తమ నీటి నిర్వహణ తీరుతెన్నులను యుద్ధ ప్రాతిపదికన మెరుగు పరుచుకోవాలి. కాలుష్యానికి తక్షణం అడ్డుకట్ట వేయాలి. లేదంటే మానవాళి మనుగడకు ముప్పు మరెంతో దూరంలో లేదు’
– రిచర్డ్‌ అలన్, క్లైమేట్‌ సైన్స్‌ ప్రొఫెసర్, రీడింగ్‌ యూనివర్సిటీ, ఇంగ్లండ్‌

ప్రపంచ నీటి సంక్షోభం పెను సమస్య మాత్రమే కాదు. జల ఆర్థిక వ్యవస్థల్లో అత్యవసరమైన మార్పుచేర్పులకు అవకాశం కూడా. ఇందుకోసం ముందుగా నీటి విలువను సరిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. దురదృష్టవశాత్తూ చాలా దేశాల్లో అదే లోపిస్తోంది
– గోజీ ఒకొంజో ఇవాలా,డైరెక్టర్‌ జనరల్, వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement