40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అనావృష్టి పరిస్థితులు
ఆహారం, పరిశుభ్రమైన నీరు దొరకని దుస్థితి
కలుషితమైన నీటితో ప్రబలుతున్న అంటు వ్యాధులు
కెన్యా నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరువుతో కొట్టుమిట్టాడుతోంది. లక్షలాది మంది ప్రజలు తగినంత ఆహారం, నీరు లేకుండా అల్లాడిపోతున్నారు. వాతావరణ మార్పులతో తీవ్రమైన కరువు దేశ వ్యవసాయం, పశుసంపదపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో కెన్యా ప్రజల జీవనోపాధి కష్టమవుతోంది. తినడానికి తిండి, తాగడానికి మంచి నీరు కూడా లేక లక్షలాది మంది ప్రజలు అంటు వ్యాధులబారిన పడుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది.
ఎండిపోతున్న జలాశయాలు
కెన్యాలో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఘోరమైన కరువు తాండవిస్తోంది. నదులు, సరస్సులు, జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. చిన్నపాటి చెరువులు ఎండిపోతున్నాయి. ఐక్యరాజ్యసమితి నీటి అభివృద్ధి నివేదిక ప్రకారం భూగర్భ జల మట్టాలు సైతం పడిపోతున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులు దేశాన్ని తీవ్రమైన కరువులోకి నెట్టేశాయి. 15 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా పాడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ దీర్ఘకాలిక కరువు ధాటికి దాణా దొరక్క ఏకంగా 70 శాతం పశువులు ప్రాణాలు కోల్పోయాయి. పాడి ఆవులపై ఆధారపడిన వేలాది కుటుంబాల జీవనం ఇప్పుడు ఆదాయం లేక దుర్భరమైంది. ఆహార వనరులు కూడా తగ్గిపోయాయి. కరువు దెబ్బకు ఉన్న కాస్తంత ప్రధాన ఆహారాల ధరలు అమాంతం పైకిఎగశాయి. బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు ఐదేళ్ల సగటు కంటే 10 నుంచి 90 శాతం అధికంగా ఉన్నాయి.
ఎంత లోతు తవ్వినా..
2023లో కొన్ని ప్రాంతాల్లో దశాబ్దం కిందటి కంటే రెట్టింపు లోతులో బావులు తవ్వాల్సి వచ్చింది. తీవ్రమైన కరువు కారణంగా, చాలా మంది భూగర్భం నుంచి తీసుకువచ్చిన నీటిని తాగవలసి వస్తోంది. ఇది కూడా పరిశుభ్రంగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో నీటి విక్రయాలు పెరిగాయి. ఆ నీరు సైతం పరిశుభ్రంగా ఉండకపోవడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు, కెన్యా కరువు ప్రతిస్పందన పథకం కింద సుమారు 30 లక్షల మంది ప్రజలు ఏదో ఒక రకమైన కరువు సహాయాన్ని పొందారు.
ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి
తక్కువ పారిశ్రామికీకరణతో ఇక్కడ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు తక్కువే. అయినా తక్కువ వర్షపాతం, గ్లోబల్ వార్మింగ్ కరువుకు కారణమవుతున్నాయి. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా, భవిష్యత్తులో కరువు ప్రభావాలను తగ్గించడానికి దేశానికి ఆర్థిక మద్దతును పెంచాలని కెన్యా ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నాయి. ఇదే విషయాన్ని ఈ ఏడాది అజర్ బైజాన్‌లోని బాకు నగరంలో జరిగిన 2024 ఐక్యరాజ్యసమితి కాన్ఫెరెన్స్ ఆఫ్ పారీ్టస్(కాప్29) సదస్సు పునరుద్ఘాటించింది. ఇలాంటి క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి దేశానికి సహాయపడటానికి అభివృద్ధి చెందిన దేశాల నుంచి మరింత ఆర్థిక మద్దతు అవసరమని నొక్కి చెప్పింది.
– సాక్షి నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment