గ్రీన్‌హౌస్ వాయువుల కట్టడిలో వైఫల్యం వల్లే
ప్రపంచ దేశాలపై ఐక్యరాజ్యసమితి అసహనం
వచ్చే నెలలో జరిగే కాప్–29 సదస్సుపైనే ఆశలు
వాతావరణ మార్పుల కట్టడి కోసం ప్రస్తుతం ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న చర్యలు ఏమాత్రం సరిపోవని ఐక్యరాజ్యసమితి తేలి్చచెప్పింది. భూగోళంపై ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్న గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను అరికట్టడంలో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఎండగట్టింది. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సగటు ఉష్ణోగ్రత మరో 3.1 డిగ్రీల సెల్సియస్(5.4 డిగ్రీల ఫారెన్‌హీట్) పెరుగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు వార్షిక ఉద్గారాల నివేదికను ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసింది.
వాస్తవానికి ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకే(2.7 ఫారెన్‌హీట్) పరిమితం చేయాలన్న ప్రతిపాదనకు ప్రపంచదేశాలు మద్దతు పలికాయి. 2015లో పారిస్‌లో జరిగిన కాప్–21 సదస్సులో సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేశాయి. భూగోళంపై జీవుల మనుగడ కొనసాగాలంటే ఉష్ణోగ్రతల పెరుగుదలను కట్టడి చేయాల్సిందేనని నిపుణులు స్పష్టంచేశారు. పారిస్ ఒప్పందంపై సంతకాలు చేసి దాదాపు పదేళ్లవుతున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండడం శోచనీయమని ఐక్యరాజ్యసమితి ఆక్షేపించింది.
→ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, వాస్తవ పరిస్థితిని చూస్తే 2100 నాటికల్లా ఉష్ణోగ్రతలు 3.1 డిగ్రీల దాకా పెరిగిపోనున్నాయి. అంటే లక్ష్యం కంటే రెండింతలు కావడం గమనార్హం. ప్రభుత్వాల చర్యలు ఎంత నాసిరకంగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
→ కర్బన ఉద్గారాలను అరికట్టడం, వాతావరణ మార్పులను నియంత్రించడం తక్షణావసరమని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వెల్లడించారు. లేకపోతే మనమంతా మహావిపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
→ 2022 నుంచి 2023 దాకా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు 1.3 శాతం పెరిగినట్లు ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇది 57.1 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్‌కు సమానం.
→ ఒకవేళ ఇప్పటినుంచి ఉద్గారాల నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేసినప్పటికీ ఉష్ణోగ్రతలు 2100 కల్లా 2.6 డిగ్రీల నుంచి 2.8 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
→ కర్బన ఉద్గారాల్లో అధిక వాటా జీ20 దేశాలదే. వాతావరణ మార్పులను అరికట్టడంతో ఆయా దేశాలు దారుణగా విఫలమవుతున్నాయని ఐక్యరాజ్యసమితి అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణ లక్ష్యాల సాధనలో చాలా వెనుకంజలో ఉన్నాయని వెల్లడించింది.
→ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను 2030 నాటికి 42 శాతం, 2035 నాటికి 57 శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమేనని నిపుణులు అంటున్నారు.
→ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పారీ్టస్(కాప్–29) సదస్సు వచ్చే నెలలో అజర్‌బైజాన్‌లో జరుగనుంది. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ సదస్సులో కీలక తీర్మానాలు ఆమోదిస్తారని పర్యావరణ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment