దేవభూమి ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్‌లో కాళ్లకింది నేల ఉన్నపళంగా కుంగిపోతున్న తీరు పర్యావరణపరంగా మానవాళి ముందున్న పెను ముప్పును కళ్లకు కట్టింది. పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. జోషి మఠ్ సమస్యకు కారణమైన అడవుల విచ్చలవిడి నరికివేత, పెచ్చరిల్లిన వాతావరణ కాలుష్యం వంటివి ప్రపంచమంతటినీ వేధిస్తున్న సమస్యలే. వాటి పర్యవసానాలను గ్లోబల్ వార్మింగ్, ఆకస్మిక వరదలు, తీవ్ర కరువుల రూపంలో అన్ని దేశాలూ చవిచూస్తూనే ఉన్నాయి.
ఈ ప్రాకృతిక విపత్తుల తీవ్రత కొన్నేళ్లుగా బాగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇవన్నీ మనిషి అత్యాశకు ప్రకృతి ప్రతిస్పందన తాలూకు సంకేతాలే. వాటిని ఇప్పటికైనా అర్థం చేసుకుని తక్షణం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ‘‘లేదంటే అతి త్వరలో పరిస్థితి పూర్తిగా చేయి దాటడం ఖాయం. ఇప్పుడు జోషి మఠ్‌లో జరుగుతున్నది రేపు అన్నిచోట్లా జరుగుతుంది. ప్రకృతితో ఇష్టారాజ్యపు చెలగాటం అంతిమంగా వినాశనానికే దారి తీస్తుంది’’ అంటూ హెచ్చరిస్తున్నారు.
ఏం జరుగుతుంది?
గ్లోబల్ వార్మింగ్ తదితరాల వల్ల సముద్ర మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ధోరణి కొన్నేళ్లుగా వేగవంతమవుతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలు క్రమంగా నీట మునుగుతాయి. మానవాళిపై పెను ప్రభావం చూపగల పరిణామమిది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో పదో వంతుకు పైగా సముద్ర తీర ప్రాంతాల్లోనే వ్యాపించి ఉంది. మహా నగరాల్లో కూడా అధిక శాతం అక్కడే ఉన్నాయి. అవన్నీ మునగడమో, పూర్తిగా నివాసయోగ్యం కాకుండా పోవడమో జరుగుతుంది. ఫలితంగా కోట్లాది మంది పొట్ట చేత పట్టుకుని వలస బాట పడతారు. వారందరికీ పునరావాసం, ఉపాధి తదితరాలన్నీ అతి పెద్ద సవాళ్లుగా నిలుస్తాయి. మానవాళి చరిత్రలో ఇది పెను విపత్తుగా మారినా ఆశ్చర్యం లేదు. అంతేగాక మితిమీరిన కాలుష్యం ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తోంది. సురక్షితమైన తాగునీటికి చాలా దేశాల్లో ఇప్పటికే తీవ్ర కొరత ఏర్పడింది. మున్ముందు ఇది మరింత తీవ్రతరం కానుంది. ప్రజలు సరైన తిండికి, తాగునీటికే కాదు, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలికి కూడా నోచుకోని పరిస్థితి తలెత్తనుంది!
మాటలకే పరిమితం
పర్యావరణ నష్టాలకు అడ్డుకట్టే వేసేందుకు చారిత్రక పారిస్ ఒప్పందం మొదలుకుని పలు కాప్ శిఖరాగ్రాల దాకా పేరుకు ప్రయత్నాలెన్నో జరుగుతున్నాయి. కానీ చిత్తశుద్ధితో కూడిన చర్యలు మాత్రం కన్పించడం లేదు. కర్బన ఉద్గారాల తగ్గింపు తదితరాలకు సంబంధించి గొప్ప లక్ష్యాలు నిర్ణయించుకోవడం, తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా సాగుతోంది. ఎవరికి వారు పొరుగు దేశమే ప్రధానంగా బాధ్యత తీసుకోవాలన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కళ్లు మూసుకుని పాలు తాగుతున్న చందంగా వ్యవహరిస్తున్నారు.
ఎటు చూసినా విపత్తులే...
► మంచు ఖండమైన అంటార్కిటికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా కరుగుతున్నాయి. దీని దుష్ప్రభావం పర్యావరణంపై చాలా రకాలుగా ఉండబోతోంది.
► ఆర్కిటిక్ బ్లాస్ట్ కారణంగా ముందుగా ఇంగ్లండ్ తదితర యూరప్ దేశాలు అతి శీతల వాతావరణంతో అల్లాడాయి. తర్వాత అమెరికా దాని దెబ్బకు 10 రోజులకు పైగా దాదాపుగా స్తంభించిపోయింది. దేశ చరిత్రలో ఎన్నడూ ఎరగనంతటి చలి గాలులు, మంచు తుఫాన్లతో అల్లాడింది. వేల కోట్ల డాలర్ల ఆస్తి నష్టం చవిచూసింది.
► అమెరికాలో ఇటీవలి దాకా కార్చిచ్చులతో అల్లాడిన కాలిఫోర్నియా ఇప్పుడేమో కనీవినీ ఎరగని వరద బీభత్సంతో తల్లడిల్లుతోంది.
► ఉత్తర భారతం కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతటి చలితో వణుకుతోంది.
► పొరుగు దేశం పాకిస్తాన్ గతేడాది దేశ చరిత్రలో ఎన్నడూ చూడనంతటి వరదలతో అతలాకుతలమైంది. మూడొంతుల ప్రాంతాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఆ ప్రభావం నుంచి పాక్ ఇప్పటికీ కోలుకోలేదు.
ఏటా 10 సెం.మీ. కుంగిన జోషీ మఠ్!
జోషి మఠ్‌లో నేల 2018 నుంచి ఏటా 10 సెంటీమీటర్ల చొప్పున కుంగుతూ వస్తోందట! అధునాతన శాటిలైట్ ఇమేజ్ విశ్లేషణ ఆధారంగా జరిగిన ఒక తాజా అధ్యయనంలో ఈ మేరకు తేలింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment