అభిప్రాయం
ఈ ఏడాది జూలై 30, మంగళవారం కేరళ, వయనాడ్‌లోని వెల్లారి మలలో భారీ కొండచరియలు విరిగిపడటంతో వైతిరి తాలూకాలోని మెప్పాడి గ్రామ పంచాయితీలోని ముండక్కై, చూరల్‌మల గ్రామాలు చాలా వరకు కొట్టుకుపోయాయి. అపార ప్రాణ నష్టం సంభవించింది. బురద, బండరాళ్లు, నేల కూలిన చెట్లతో కూడిన ప్రవాహం భారీ వినాశనానికి కారణమయింది.
భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు రావడంతో కొండచరియలు చల్యార్ నది ఉప నదులలో ఒకటైన ఇరువజింజి పూజ (మలయాళంలో పూజ అంటే నది అని అర్థం)లోకి జారిపడి, బురద వేగంగా ప్రవహించి దిగువ ప్రాంతాలకు భారీ నష్టాన్ని కలిగించింది.
‘సెంటర్ ఫర్ ఎకలాజికల్ స్టడీస్’కు చెందిన పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ వయనాడ్ విపత్తు క్వారీ కార్యకలాపాల వల్లనే సంభవించిందని అన్నారు. 2011లో ఆయన నేతృత్వంలోని పశ్చిమ కనుమల ఎకాలజీ నిపుణుల బృందం వర్గీకరించిన మూడు సున్నితమైన పర్యావరణ జోన్‌లలో ప్రస్తుతం ప్రభావితమైన వైత్తిరి తాలూకా అత్యంత బలహీనమైన, సున్నితమైన జోన్.
2019లో, ముండక్కై కొండ దిగువలో జరిగిన, పుత్తుమల కొండచరియ విరిగిపడిన ఘటన తర్వాత, జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) సర్వేచేసి మరి కొన్ని తేలికపాటి కొండ చరియలు విరిగిపడిన స్థలా లను గుర్తించి, వయనాడ్‌లోని వేలారిమల ప్రాంతాన్ని, అత్యంత బలహీనమైన జోన్‌గా వర్గీకరించింది. పశ్చిమ కనుమలలోని ఈ ప్రాంతం భౌగోళికంగా ఒక పీఠభూమి.
అనేక చిన్న చిన్న నదులతో కూడిన ఒక నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్). ఇవి చెల్లయ్యయార్ నదికి ఉపనది అయిన ఇరువజింజి పుళాలో కలుస్తాయి. ఈ చిన్న చిన్న నదుల వాలులపై ఏర్పడిన మంద పాటి మట్టి పొరలు చాలా తొందరగా కిందికి కదిలి ఉండవచ్చు. వయనాడ్‌కు అంతకు ముందూ కొండచరియలు విరిగిపడిన చరిత్ర ఉంది. 1984, 2020ల్లో తక్కువ తీవ్రతతో విరిగిన కొండ చరియలు ప్రస్తుత పరిస్థితికి మరింత దోహదపడి ఉండవచ్చు.
కొండ ప్రాంతాలలో భూమి కొరత వలన కొండ వాలులు, నదీ తలాలపై ఇళ్లు నిర్మించుకుంటూ ఉంటారు. ఈ చర్యను నివారించాలి. ముండక్కై, చూరల్మల గ్రామాల్లో కొన్ని ఇళ్ళు ఈ తరహా లోనే ఉన్నట్లుగా గూగుల్ ఇమేజ్‌లో చూస్తే అర్థమవుతుంది. 2013లో ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు, జరిగిన విధ్వంసానికి ముఖ్య కారణం, మందాకిని నదీ తలాల్లో నిర్మించిన అడ్డదిడ్డమైన కట్టడాలే అని నిపుణులు స్పష్టం చేశారు. వయనాడ్ సంఘటనలో కూడా చాలావరకు ఇళ్ళు, నీటి మట్టం పెరిగి, నదీ ప్రవా హంలో కొట్టుకుపోయాయి.
వయనాడ్‌లో ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఎన్నో ప్రాణాలు పోయేవి కావు. ప్రకృతి వైపరీత్యాల అనుభవాల నుండి మనం ఎంతో నేర్చుకోవాలి. సహజ విపత్తులను ఎటూ నివారించలేం. అయితే జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చు. వివిధ కార ణాల వల్ల నిపుణుల సూచనలను విధాన రూప కర్తలు పట్టించుకోరు.
వయనాడ్ విలయం వంటి వాటిని నివారించడానికి... నది తలాలను ఆక్రమణకు గురి చేయకపోవడం, బలహీనమైన వాలుల నుండి నివాసాలను ఖాళీ చేయించడం, ఘాట్ రోడ్ల వెంబడి బలహీనమైన చోట్ల గోడలను నిర్మించడం లాంటివి తరచుగా నిపుణులు ఇచ్చే సూచ నలు. వీటిని పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయం. ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అయితే మన జీవన విధానం ప్రకృతికి అనుకూలంగా క్రమబద్ధం చేసుకోకపోవడమే వచ్చిన చిక్కల్లా!
ఎన్. కుటుంబరావు
వ్యాసకర్త డైరెక్టర్ జనరల్ (రిటైర్డ్), జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
మొబైల్: 94404 98590
Comments
Please login to add a commentAdd a comment