కేరళ విలయానికి క్వారీలే కారణం | Quarries were the cause of Kerala Wayanad Disaster | Sakshi
Sakshi News home page

కేరళ విలయానికి క్వారీలే కారణం

Published Thu, Aug 8 2024 6:12 AM | Last Updated on Thu, Aug 8 2024 7:21 AM

Quarries were the cause of Kerala Wayanad Disaster

విశ్లేషణ

మూడేళ్ల క్రితం కొంకణ్‌ ప్రాంతంలోనే ప్రస్తుతం వయనాడ్‌లో చోటు చేసుకున్నట్లు కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాయగఢ్‌ జిల్లా తాలియే ప్రాంతంలో ఏకంగా 124 మంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రాంతంలోనూ రాతి తవ్వకాల కోసం పెద్ద ఎత్తున పేలుళ్లు  కొనసాగుతున్న విషయాన్ని గమనించాలి. కాగా  భారీ వర్షాల కారణంగానే తాజాగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయనీ, ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయి 350కి పైగా ప్రాణాలు పోయాయనీ ప్రభుత్వం నమ్మబలకవచ్చు; కానీ టూరిస్టు రిసార్టుల కోసం నేలను చదును చేయడం, లాటరైట్‌ రాయి తవ్వకాలు పెద్ద ఎత్తున చేపట్టడం ఈ విధ్వంసానికి దారి తీసిన అసలు కారణాలు అనడంలో సందేహం లేదు.

పశ్చిమ కనుమల్లో రాతి తవ్వకాలు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఈ క్వారీయింగ్‌కూ,కొండచరియలు విరిగిపడేందుకూ మధ్య దగ్గరి సంబంధాలున్నాయని తెలిసినా... పట్టించుకోకపోవడమే జూలై 30న కేరళలోని వయనాడ్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి కారణమైంది. భారీ వర్షాల కారణంగానే వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయనీ, ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయి 350కి పైగా ప్రాణాలు పోయాయనీ ప్రభుత్వం నమ్మబలకవచ్చు; కానీ టూరిస్టు రిసార్టుల కోసం నేలను చదును చేయడం, సరస్సులను నేలమట్టం చేస్తూ లాటరైట్‌ రాయి తవ్వకాలు పెద్ద ఎత్తున చేపట్టడం ఈ విధ్వంసానికి దారితీసిన అసలు కారణాలు అనడంలో సందేహం అవసరం లేదు. 

ఆరు గంటల వాన అరగంటలోనే!
అయితే ఒక్క విషయం. భారీ వర్షాలకు కూడా లాటరైట్‌ రాయి తవ్వకాలే కారణమయ్యాయా? అవుననే చెప్పాలి. ఎందుకంటే భారత్‌లో భవన నిర్మాణం, గనులు, రాతి తవ్వకాలు, రోబో శాండ్‌ కోసం రాయిని పొడిలా మార్చడం వంటి అన్నింటి కారణంగా ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఏరోసాల్స్‌ (దుమ్ము, ధూళిల కారణంగా గాల్లోకి చేరే అతి సూక్ష్మ కణాలు) గాల్లోకి చేరుతున్నాయి. వాహన కాలుష్యం, థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో బొగ్గు వాడకం కూడా ఈ ఏరోసాల్‌ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. 

గాల్లోని నీటి ఆవిరికి ఈ ఏరోసాల్స్‌ తోడైనప్పుడు ఆవిరి ఘనీభవించడం మొదలవుతుంది. అది కాస్తా ముందు చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఒకదానితో ఒకటి చేరడం ద్వారా నీటి బిందువుల పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా అతితక్కువ సమయంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయి. అందుకే ఆరు గంటల సమయం జల్లుగా కురవాల్సిన వాన కాస్తా అరగంటలో కుమ్మరించిపోతోంది. 

పశ్చిమ కనుమలకు సంబంధించిననంతవరకూ కొంకణ్‌ ప్రాంతం చాలా కీలకమైంది. మహారాష్ట్రలోని ఈ ప్రాంతంతోపాటు పక్కనే ఉండే దక్కన్‌  పీఠభూమి ప్రాంతంలోనూ 2021 జూన్‌  22న అతి తక్కువ కాలంలోనే అతిభారీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలోని ఎత్తయిన ప్రాంతాల్లో నివసించే వారు కూడా అంత తక్కువ కాలంలో అంత ఎక్కువ వాన కురవడం గతంలో ఎప్పుడూ లేదని చెబుతారు. అదే ఏడాది అక్టోబరులో కేరళ ప్రాంతంలో విలయం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. 

కేరళలో 2018 ఆగస్టులో కురిసిన అతిభారీ వర్షాలు, తద్వారా ఏర్పడ్డ వరద పరిస్థితి వందేళ్ల రికార్డుగా నమోదైన విషయం తెలిసిందే. ఈ వరదల్లో దాదాపు 483 మంది ప్రాణాలు కోల్పోగా, 140 మంది కనిపించకుండా పోయారు. కేరళలోని చాలక్కుడిలోని ప్రఖ్యాత రివర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ 2018 నాటి వరదలపై పూర్తిస్థాయిలో అధ్య యనం చేసింది. చాలక్కుడి నదీ బేసిన్‌ లో చాలా రిజర్వాయర్లు ఉండగా... 2018లో మే నెలలోనే క్యాచ్‌మెంట్‌ ఏరియాలో మంచి వర్షాలు కురిశాయి. 

జూన్‌ , జూలైలలో ఒకట్రెండు భారీ వర్షాలూ నమో దయ్యాయి. రుతుపవనాలు ఇంకా చురుకుగా ఉండగానే డ్యామ్‌లన్నీ వేగంగా నిండిపోవడం మొదలైంది. ఈ తరుణంలో మరిన్ని వర్షాలు కురిస్తే వరదలు తప్పవన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018లో జూలై 17 నుంచే రివర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నిపుణులు, చాల క్కుడి రివర్‌ ప్రొటెక్షన్‌  ఫోరమ్‌ వాళ్లు వరదల నుంచి ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు విఫలయత్నం చేశారు. 

డ్యామ్‌లలోని నీరు దశల వారీగా నిదానంగా వదలాలనీ, తద్వారా వరద ముప్పును కొంత వరకూ తగ్గించవచ్చుననీ వీరు సూచించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఒకవేళ ఈ సూచనలు పాటించి ఉంటే డ్యామ్‌ గరిష్ఠ మట్టాన్ని చేరకుండా రెండు మీటర్ల మేర తక్కువ స్థాయిలోనే నీటిని నిలుపుకునే వారు. తద్వారా ప్రమాద తీవ్రత తగ్గేది. 

భారీ వర్షాల్లోనూ క్వారీ తవ్వకాలు!
మూడేళ్ల క్రితం కొంకణ్‌ ప్రాంతంలోనే ప్రస్తుతం వయనాడ్‌లో చోటు చేసుకున్నట్లు కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాయగఢ్‌ జిల్లా తాలియే ప్రాంతంలో ఏకంగా 124 మంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రాంతంలోనూ రాతి తవ్వకాల కోసం పెద్ద ఎత్తున పేలుళ్లు, రహదారి నిర్మాణం కోసం అడవుల నరికి వేత విచ్చలవిడిగా కొనసాగుతున్న విషయం ప్రస్తావనార్హం. 2021 జూన్‌  – జూలైలో మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదు కాగా అక్టోబరు 16న కేరళలోని కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో అదే తరహా విపత్తు సంభవించింది. 

మహారాష్ట్ర మాదిరిగానే కేరళలోనూ రాతి క్వారీల తవ్వకం వంటివే విపత్తులకు కారణమయ్యాయి. కేరళలోని ప్లాప్పల్లీ, కొట్టా యంలోని కూటిక్కల్‌లు బాగా దెబ్బతిన్నాయి. ఇక్కడ దాదాపు పదేళ్లుగా రాతి క్వారీలు జోరుగా సాగుతున్నాయి. వీటి నిలిపివేతకు పెద్ద ఎత్తున ఉద్యమమూ నడుస్తోంది. అయినా క్వారీ నిర్వాహకులు పట్టించుకోలేదు. అక్టోబరు 16న కూటిక్కల్‌లో కొండచెరియలు విరిగి పడే సమయంలోనూ రాతి క్వారీలు పని చేస్తూనే ఉన్నాయి. 

విపత్తు సంభవించినప్పుడు క్వారీలు ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారిక సమాచా రంలో కేవలం మూడు రాతి క్వారీల పేర్లు ఉన్నప్పటికీ ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా కనీసం 17 క్వారీలను గుర్తించారు. కేరళ మొత్తమ్మీద ప్రస్తుతం దాదాపు ఆరు వేల వరకూ క్వారీలు నడుస్తు న్నట్లు తెలుస్తోంది. 2018 వరదల తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 223 రాతి క్వారీలకు అనుమతివ్వడం గమనార్హం.

నిలిపివేత నిర్ణయంపై రాజకీయాలు
కూటిక్కల్‌ నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోని కడ నాడ్‌లో రాతి క్వారీల సమస్యను అధిగమించేందుకు ఒక ప్రయత్నం జరిగింది. 2008లో కడనాడ్‌ పంచాయతీ అధ్యక్షుడు మజు పుతెని కందం బయో డైవర్సిటీ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. పంచా యతీలోని పదమూడు వార్డులకు చెందిన నిపుణులు, కార్యకర్తలు ఈ కమిటీ కార్యకలాపాలను నిర్వహించేవారు. రైతులు, సభ్యులందరి నుంచి సమాచారం సేకరించిన మజు పుతెనికందం బృందం పీపుల్స్‌ బయోడైవర్సిటీ రిజిస్టర్‌ ఒకదాన్ని సిద్ధం చేసింది. జీవ వైవిధ్యభరిత మైన పెరుమ్‌ కన్ను ప్రాంతంలో రాతి క్వారీయింగ్‌ సరికాదని గుర్తించిన ఈ కమిటీ క్వారీయింగ్‌ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. కేరళ స్టేట్‌ బయో డైవర్సిటీ బోర్డు కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది. 2012లో కేరళ హైకోర్టు ఈ అంశాన్ని పరిశీలించి క్వారీ నిలిపివేత నిర్ణయాన్ని సమర్థించింది. 

అయితే ఈ విషయంలో కొన్ని దుష్టశక్తుల ప్రవేశం వెంటనే జరిగి పోయింది. కడనాడ్‌ ప్రాంతాన్ని గ్రామ పంచాయతీ పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటించిందని... దాంతో రైతులు, ప్రజలు అటవీ అధికారుల పెత్తనంలో బతకాల్సి వస్తుందని తప్పుడు ఆరోపణలు వ్యాప్తిలోకి తెచ్చింది. దురదృష్టకరమైన అంశం ఏమిటంటే, అటవీ శాఖ కూడా ఈ దుష్ట శక్తులతో కుమ్మక్కైపోవడం. పర్యావరణ పరిరక్షణ పేరు చెప్పి వీరు ప్రజలను వేధించడం కూడా వాస్తవమే. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో కడనాడ్‌ పంచాయతీ రాతి క్వారీల తవ్వకాలను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం కాస్తా నిర్వీర్యమై పోయింది. పంచాయతీ తన తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. అయితే సరైన దిశలో వేసిన ఈ తొలి అడుగు మరిన్ని ముందడుగులకు ప్రారంభం కావాలని ఆశిద్దాం!

మాధవ్‌ గాడ్గిల్‌ 
వ్యాసకర్త పర్యావరణవేత్త, ‘సెంటర్‌ ఫర్‌ ఎకలాజికల్‌ స్టడీస్‌’ వ్యవస్థాపకులు (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement