సందర్భం
కేరళలోని వయనాడ్‌లో జూలై 30న వానరూపంలో మృత్యువు చేసిన కరాళ నృత్యానికి 375 మంది మృత్యు వాతపడగా మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ విలయం కంటే ముందు 2019 ఆగస్ట్‌లో పుతుమల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఇక, 2018లో కనివిని ఎరుగని విధంగా కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు, వరదలకు 433 మంది మృత్యువాత పడగా, దాదాపు 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయినట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి.
ఇంతకూ ఎందుకు కేరళ రాష్ట్రంలో పదేపదే ప్రకృతి ప్రకోపిస్తోంది? ఈ ప్రశ్నకు జవాబు ప్రభుత్వాలకు చెంప పెట్టుగా నిలుస్తుంది. నిజానికి ప్రకృతి తనంతట తాను ప్రకో పించదు. దాన్ని ధ్వంసం చేసినప్పుడు మాత్రమే కన్నెర్ర జేస్తుంది. మనిషి అంతులేని స్వార్థంతో ప్రకృతి సంపదను ఇష్టానుసారం దోచుకోవడానికి చేసే విధ్వంసమే ప్రకృతి గతి తప్పడానికి కారణం అవుతోంది. ఇది ఒక్క కేరళలో మాత్రమే కాదు... గత దశాబ్ద కాలంగా హిమాలయ ప్రాంతంలోని ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలో సైతం ఇదే జరుగు తోంది. అందుకే అక్కడా తరచుగా భారీ వర్షాలు కురిసి కొండ చరియలు విరిగి పడుతున్నాయి. వాటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు జరగడం పరిపాటిగా మారింది.
బెంగళూరులోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్’కు చెందిన ప్రొఫెసర్ సీపీ రాజేంద్రన్ ‘వయనాడ్’లో ప్రకృతి ప్రకోపానికి కారణమవుతున్న అంశాలను శాస్త్రీయంగా వివరించారు. 50వ దశకం వరకు వయనాడ్‌లో 85 శాతం దట్టమైన అడవులు ఉండగా, అవి క్రమంగా క్షీణిస్తూ 2018 నాటికి 62 శాతానికి చేరుకొన్నాయి. అడవులను నరికి వేసి ఆ ప్రాంతంలో విస్తారంగా తేయాకు తోటల పెంపకం ప్రారంభించారు. దాంతో అక్కడ అనేక జనావాసాలు పుట్టు కొచ్చాయి. మానవ కార్యకలాపాలు విస్తృతం అయ్యాయి.
కాలుష్య కారకాల వల్ల కర్బన ఊద్గారాలు పెరిగి వాతా వరణంలో వేడి అధికమైంది. ఫలితంగా, ఆగ్నేయ ప్రాంతంలోని అరేబియా సముద్రం వేడెక్కి ఒక్కసారిగా కుండపోత వానలు పడటం మొదలైంది. అడవులు ఉన్నప్పుడు వర్షపు నీటి ప్రవాహ వేగం తక్కువుగా ఉండి ఒక క్రమపద్ధతిలో పల్లపు ప్రాంతానికి చేరేది. కానీ, అడవుల్ని నరకడం వల్ల ప్రవాహ ఉధృతి పెరిగిపోవడం, వర్షపునీటి సాంద్రత అధికమవడంతో... రాతి శకలాల మధ్య ఉన్న మట్టి తొందరగా కరిగిపోయి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడు తున్నాయి. వయనాడ్ కొండప్రాంతం లేటరైట్ మృత్తిక, రాతిశకలాల మిశ్రమంతో నిండి ఉండటం వల్ల భారీ వర్షాలు, వరదనీటి తాకిడికి కొండలు పెళ్లలు ఊడిపడినట్లు పడతా యని ఎప్పటి నుంచో శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
పశ్చిమ కనుమల పర్యావరణ స్థితిగతుల నిపుణుల బృందం (వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్‌పర్ట్ ప్యానెల్)కు నేతృత్వం వహించిన మాధవ్ గాడ్గిల్ 2010 నుంచి దాదాపు ఏడాదిపాటు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కేరళ నుంచి ఇటు తమిళనాడు; అటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ వరకు విస్తరించిన పశ్చిమ కనుమల ప్రాంతాన్ని సున్నితమైన 3 జోన్లుగా వర్గీకరించి... ఒకటవ జోన్‌లో ఉన్న వయనాడ్ ప్రాంతంలో పర్యావరణాన్ని నష్టపరిచే కార్యకలా పాల్ని నిషేధించాలని సిఫారసు చేశారు. కనుమల స్థిరత్వాన్ని దెబ్బతీసే భారీ కట్టడాల్ని నిర్మించడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు.
అయితే, అపరిమితమైన ప్రకృతి సంపద గలిగిన ఆ ప్రాంతంపై కన్నేసిన కొందరు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మాధవ్ గాడ్గిల్ కమిషన్ నివేదికను బుట్ట దాఖలా చేయాలని చూశారు. స్థానికంగా ఉన్న ప్రజల్ని రెచ్చ గొట్టారు. ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగితే స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ప్రచారం ముమ్మరం కావడంతో మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు తలొగ్గిన ప్రభుత్వాలు మాధవ్ గాడ్గిల్ కమిషన్ చేసిన సూచనలకు సవరణలు ప్రతిపాదించి, పరిమితమైన వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చాయి. ఫలితంగా వయ నాడ్ ప్రాంతంలో మైనింగ్, క్వారీ కార్యకలాపాలు పెరిగి పోయాయి. అలాగే కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటు సజావుగా సాగిపోయింది. ఈ చర్యలన్నింటి వల్లనే కేరళ తరచుగా విపత్తులకు గురవుతోందని శాస్త్రజ్ఞులు అంటున్నారు.
దేశంలో ఎటువంటి ఉపద్రవం సంభవించినా దాని చుట్టూ రాజకీయ రంగు పులుముకోవడం సహజమైపోయింది. వయనాడ్ మృత్యు విలయంపై ఆ మరుసటి రోజునే పార్లమెంట్‌లో హోమ్ మంత్రి అమిత్‌షా ‘కాలింగ్ అటెన్షన్’ రూపంలో చర్చను ప్రారంభించారు. ముందుగా ఆయన భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక (అలెర్ట్) లను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. అదే సమయంలో పశ్చిమ కనుమలలో దాదాపు 60 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణం పరంగా సున్నిత ప్రాంతంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు.
అందులో వయనాడ్‌లోని కనుమ ప్రాంతం కూడా ఉంది. అయితే, కేంద్రం తాజాగా ప్రకటన నేపథ్యంలో 5 రాష్ట్రాల పశ్చిమ ప్రాంతంలో విస్తరించిన ఈ కనుమలలో ఇప్పటికే జరుగుతున్న పర్యావరణ విధ్వంసకర కార్యకలాపాలను నిలుపుదల చేయాలంటే అక్కడి పరిశ్రమలను వెంటనే తరలించాలి. ఆ పరిశ్రమలలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశ్రమల యజమానులకు తగిన పరిహారం ఇవ్వాలి. ఈ చర్యలన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే జరగాలి. ఇవన్నీ జరగాలంటే.. రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ప్రజల ప్రాణాలకంటే విలువైనదేదీ లేదన్న స్పృహ పాలకుల్లో కలిగినప్పుడే విపత్తుల్లో చోటుచేసుకునే ప్రాణ, ఆస్తి నష్టాలు గణనీయంగా తగ్గుతాయి.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment