కేరళలో సంభవించిన ప్రకృతి వైపరిత్యంపై రాజకీయ రగడ రాజుకుంది. వయనాడ్‌లో వరద విలయంతో కొండచరియలు విరిగిపడి దాదాపు 200 మందికిపైగా మృత్యువాతపడిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనపై కేరళ ప్రభుత్వం, కేంద్రం మధ్య మాటల యుద్ధం నెలకొంది. విపత్తు గురించి తాము ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదంటూ కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు తాజాగా కేరళ మఖ్యమంత్రి పినరయి విజయన్ కౌంటర్ ఇచ్చారు. తమకు ఎలాంటి అలర్ట్‌ను జారీ చేయలేదంటూ తెలిపారు.
బుధవారం తిరువనంతపురంలో సీఎం మీడియాతో మాట్లాడుతూ. వాతావరణ మార్పులకు సంబంధించి తీవ్రమైన సమస్యలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కూడా గ్రహించాలని సూచించారు. ‘మనం ఇప్పుడు చూస్తున్న విపరీతమైన వర్షాలు గతంలో కురిసేవా? వాతావరణ మార్పులను తగ్గించే ప్రయత్నాలు మనకు అవసరం. ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఇతరులపై నిందలు మోపడానికి ప్రయత్నించకండి. మీ బాధ్యతల నుంచి తప్పించుకోకండి. ఇది ఒకరినొకరు నిందించుకునే సమయం కాదు’ అని తెలిపారు.
‘వయనాడ్‌లో 115-204 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఆ తర్వాత 48 గంటల్లో 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడిన రోజున ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసింది. విషాదం సంభవించే ముందు ఆ ప్రాంతంలో ఒక్కసారి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించలేదు. కొండచరియలు విరిగిపడిన తర్వాత మాత్రమే ఉదయం 6 గంటలకు వారు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జులై 29న కేంద్ర వాతావరణశాఖ జూలై 30, 31 తేదీలకు గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. కానీ అప్పటికే భారీ వర్షం కురిసింది. కొండచరియలు విరిగిపడ్డాయి’ అని సీఎం పేర్కొన్నారు.
అయితే వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడానికి వారం రోజుల ముందు పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించిందని, దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన కేంద్రం తొమ్మిది ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను కేరళకు పంపిందని అమిత్‌షా రాజ్యసభలో పేర్కొన్నారు.
కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని జులై 26న మరోసారి హెచ్చరించామని తెలిపారు. జూలై 23న కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున తొమ్మిది ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను కేరళకు పంపినట్లు చెప్రారు. కానీ సకాలంలో ప్రజలను తరలించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
కాగా.. భారీ వర్షాలతో వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతులసంఖ్య 205కు చేరింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment