దేవతల రాజ్యంగా పేరుబడ్డ కేరళలోని సుందరమైన వయనాడ్ ప్రకృతి ఆగ్రహానికి గురై శ్మశాన స్థలిగా మారిన దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా భావోద్వేగం కలగకమానదు. జూలై 29 సోమవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల ప్రాంతంలో అందరూ ఆదమరిచి నిద్రిస్తున్న వేళ భారీ వాన, ఉరుము లేని పిడుగులా వరుసగా భారీయెత్తున కొండచరియలు విరిగి మీద పడడంతో కేరళ ఉత్తర ప్రాంతంలోని ఆ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది.
కళ్ళుపొడుచుకున్నా కనిపించని చీకటిలో, ఏం జరుగుతోందో తెలిసే లోపల ఇళ్ళు కూలిపోయాయి. నిలువెత్తు బురదలో మునిగి, గ్రామాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఘటనాస్థలి నుంచి కొన్ని పదుల కిలోమీటర్ల వరకు మనుషులు కొట్టుకు పోయి, ఛిద్రమైన దేహాలతో శవాలై తేలారు. మృతుల సంఖ్య 150 దాటి అంతకంతకూ పెరుగు తున్న వేళ ఇటీవల కొన్నేళ్ళుగా కేరళలో ఆకస్మిక వరదలు, భూపతనాలు పెరిగిపోవడం పట్ల చర్చ మొదలైంది. ఈ విలయంలో ప్రకృతి శాపమెంత? పాలకుల పాపమెంత?
గమనిస్తే... గత ఏడేళ్ళలో దేశంలో అత్యధికంగా కొండచరియలు విరిగిపడింది కేరళలోనే! 2015 నుంచి 2022 మధ్య దేశవ్యాప్తంగా 3,782 ఘటనలు జరిగితే, వాటిలో 59.2 శాతం ఘటనలు ఒక్క మలయాళ సీమలోనే సంభవించాయి. 1961 – 2016 మధ్యతో పోలిస్తే, ఇప్పుడు ఏటా ఇలాంటి దుర్ఘటనలు, ప్రాణనష్టం అనూహ్యంగా పెరగడానికి అనేక కారణాలున్నాయి. ప్రకృతితో పాటు మనం కూడా దీనికి కారణమేనని నిపుణులు, శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా వాతావర ణంలో వస్తున్న మార్పులూ దానికి వచ్చి చేరాయి.
వాతావరణ మార్పుల వల్ల కేరళపై కమ్ముకుంటున్న క్యుములోనింబస్ మేఘాలు హఠాత్తుగా భారీ వర్షాలు కురిపిస్తున్నాయి. అసలు కేరళలో దాదాపు సగం... భౌగోళికంగా 20 డిగ్రీలకు మించిన ఏటవాలు భూముల ప్రాంతం. అందువల్ల నేలకోత, కొండచరియలు విరిగిపడడం ఎక్కువే! దానికి తోడు కొండరాళ్ళను పట్టి ఉంచే మట్టి వదు లుగా మారి, ముప్పు పెరుగుతోంది. వాలుభూముల్లో భారీగా వానలు వస్తే, పై మట్టి బాగా వదు లైపోయి, కొండచరియలు పతనమై ప్రాణాంతకమవుతాయి. వయనాడ్‌లో ఇప్పుడు జరిగింది అదే!
వయనాడ్ జిల్లాలో చిన్న పట్నమైన ముండక్కాయ్ లాంటి వాటి పరిస్థితి మరీ ఘోరం. కొండ చరియలు విరిగిపడిన ఘటనల నుంచి గత నాలుగు దశాబ్దాల్లో రెండుసార్లు (1984లో, 2019లో) ప్రాణనష్టం, ఆస్తినష్టంతో బయటపడ్డ ఆ పట్నం తాజా విలయంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాన్ని బట్టి తాజా విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 400 మందికి పైగా మరణానికి కారణమైన 2018 నాటి కేరళ వరదల తర్వాత అత్యంత దురదృష్టకరమైన విపత్తు ఇది.
నిజానికి, తుపానులు, అధిక వర్షపాతం, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులకు సంబంధించి ప్రమాద హెచ్చరిక వ్యవస్థలు ఎవరికైనా కీలకం. అనేక ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోఅందుకు అత్యాధునిక వ్యవస్థలు ఉన్నాయని కేంద్ర సర్కారు చెబుతోంది. అంతెందుకు... అధిక వర్ష పాతం గురించి కేరళను అప్రమత్తం చేస్తూ, వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడానికి వారం రోజుల ముందే జూలై 23న ముందస్తు హెచ్చరిక చేశామంటోంది. కేరళ సర్కార్ మాత్రం ప్రమాద స్థాయి తక్కువైన ఆరెంజ్ ఎలర్ట్ మాత్రమే తమకు అందిందని అంటోంది.
రాజకీయాలు, పరస్పర నిందారోపణలు పక్కనపెడితే... కేరళ సహా పడమటి కనుమలు వ్యాపించిన ప్రాంతమంతటా ఇలాంటి ప్రమాదాలు పొంచివున్నాయని కొన్నేళ్ళుగా నిపుణులు గగ్గోలు పెడుతున్నారు. 2011లోనే కేంద్రం పడమటి కనుమల పరిరక్షణకై పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ సారథ్యంలో నిపుణుల కమిటీ వేసింది. అరుదైన జీవజాలానికి ఆవాసమైన దట్టమైన అరణ్యా లున్నందు వల్ల గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళలకు విస్తరించిన పడమటి కనుమల్లో 75 శాతం మేర ప్రాంతాన్ని పర్యావరణరీత్యా సున్నితమైనదిగా ప్రకటించాలని కమిటీ సిఫార్సు చేసింది.
గాడ్గిల్ కమిటీ నివేదిక ఇచ్చి 13 ఏళ్ళవుతున్నా కేరళ సహా ప్రభుత్వాలేవీ ఆ సిఫార్సుల్ని పాటించలేదు. అదేమంటే, సిఫార్సులు కఠినంగా ఉన్నాయనీ, అభివృద్ధికీ, జీవనోపాధికీ నష్టం చేస్తాయనీ సాకులు చెబుతున్నాయి. పైగా, అభివృద్ధి రేసులో పడి కొండల్ని తొలిచి, భారీ నిర్మాణాలకు దిగాయి. జలవిద్యుత్ కేంద్రాలు చేపట్టాయి. కేరళలో హోటళ్ళు, టూరిస్ట్ రిసార్ట్‌లు, అక్రమ తవ్వకాలకైతేఅంతే లేదు. సున్నిత పర్యావరణ ప్రాంతాల్లోని ఈ తప్పుడు అభివృద్ధి నమూనాను ఇకనైనా మార్చు కోకపోతే కష్టం.
కేరళ, తమిళనాడు, కర్ణాటక – మూడు రాష్ట్రాలకూ కూడలిలో వయనాడ్ అందమైన పర్యాటక ప్రాంతమన్నది నిజమే. దేశదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు అనువుగా వసతులు పెంచి, పర్యా టక ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలన్న ఆకాంక్షా సహజమే. కానీ, పర్యావరణ రీత్యా అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టి, యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం సాగిస్తే అది మొదటికే మోసమన్న ఇంగితం లేకుంటే ఎలా? ప్రకృతితో సహజీవనం మరిచి, ఇటు చట్టబద్ధంగానూ, అటు చట్టవిరుద్ధంగానూ గనుల తవ్వకాలను అనుమతిస్తే అన్ని రకాలుగా విలయమే తప్ప వికాసం జరుగుతుందా?
మనుషుల భద్రత కన్నా మాయదారి వ్యాపారం ఎక్కువా? అందుకే, ఒక్క మాటలో వయనాడ్ విలయం కేవలం ప్రకృతి సృష్టించినది కాదు. మనుషుల దురాశకు ఫలితం. అభి వృద్ధి పేరిట మనం సాగిస్తున్న ప్రకృతి వినాశనం తాలూకు విపరిణామం. మనిషి తన పరిధి, పరి మితి గుర్తెరిగి ప్రవర్తించకపోతే, మనుగడకే ముప్పని చెప్పే నిష్ఠురసత్యం. బాధ్యులమైన అందరం ఇకనైనా కళ్ళు తెరవాలి. ప్రకృతి పునరుజ్జీవనానికి ఆగి ఆలోచించాలి. వయనాడ్ నేర్పే పాఠం అదే!
Comments
Please login to add a commentAdd a comment