Wayanad: బురద వరద ముంచేసింది | Wayanad: Massive landslides At least 123 people have been killed | Sakshi
Sakshi News home page

Wayanad: బురద వరద ముంచేసింది

Published Wed, Jul 31 2024 1:50 AM | Last Updated on Wed, Jul 31 2024 7:43 AM

Wayanad: Massive landslides At least 123 people have been killed

కేరళలో మృత్యువిలయం  

123 మంది బలి

వయనాడ్‌ (కేరళ): ఘోర కలి. మాటలకందని విషాదం. కేరళ చరిత్రలో కనీ వినీ ఎరగని ప్రకృతి విలయం. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కొండ ప్రాంతమైన వయనాడ్‌ జిల్లాలో మహోత్పాతానికి కారణమయ్యాయి. అక్కడి మెప్పడి ప్రాంతంపైకి మృత్యువు కొండచరియల రూపంలో ముంచుకొచి్చంది. 
 

సోమవారం అర్ధరాత్రి దాటాక ఆ ప్రాంతమంతటా భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వెల్లువెత్తిన బురద, ప్రవాహం ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తాయి. గ్రామాలతో పాటు సహాయ శిబిరాలు కూడా బురద ప్రవాహంలో గల్లంతయ్యాయి. ఎటుచూసినా అంతులేని బురదే కప్పేసింది. దాంతో గాఢ నిద్రలో ఉన్న వందలాది మంది తప్పించుకునే అవకాశం కూడా లేక నిస్సహాయంగా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. 

బురద, మట్టి దిబ్బల కింద సమాధైపోయారు. కళ్లు తిప్పుకోనివ్వనంత అందంగా ఉండే మెప్పడి ప్రాంతమంతా క్షణాల వ్యవధిలో శవాల దిబ్బగా మారిపోయింది. ఇప్పటిదాకా 123 మృతదేహాలను వెలికితీశారు. వాటిలో చాలావరకు సమీపంలోని నదుల్లోకి కొట్టొకొచ్చినవే. ఏ శవాన్ని చూసినా కాళ్లు చేతులు తెగిపోయి కని్పంచడం బీభత్స తీవ్రతను కళ్లకు కడుతోంది.

 ప్రమాద స్థలం పొడవునా నిండిపోయిన బురద ప్రవాహాన్ని, మట్టి దిబ్బలను తొలగిస్తే వందల్లో శవాలు బయట పడతాయని చెబుతున్నారు. మృతుల్లో స్థానికులతో పాటు ఉత్తరాది నుంచి పొట్ట చేత పట్టుకుని వచి్చన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారని భావిస్తున్నారు. సమీపంలోని టీ ఎస్టేట్లో పని చేస్తున్న 600 మంది వలస కూలీల జాడ తెలియడం లేదు. వారంతా విలయానికి బలై ఉంటారంటున్నారు. 

నడి రాత్రి ఘోర కలి... 
మెప్పడి ప్రాంతంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండ ప్రాంతమంతా తడిసీ తడిసీ వదులుగా మారిపోయింది. అర్ధరాత్రి వేళ కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. 

తొలుత సోమవారం అర్ధరాత్రి రెండు గంటల వేళ ముండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో సహాయక సిబ్బంది హుటాహుటిన స్పందించారు. బాధితులను సమీపంలోని చూరల్మల స్కూలు వద్ద సహాయక శిబిరాలకు తరలించారు. అనంతరం తెల్లవారుజామున నాలుగింటికి ఆ ప్రాంతమంతటా మళ్లీ భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో శిబిరాలతో పాటు పరిసర గ్రామాల్లోని ఇళ్లు, దుకాణాలన్నీ బురదలో కొట్టుకుపోయాయి.

 రోడ్లు, బ్రిడ్జిల వంటివన్నీ నామరూపాల్లేకుండా పోయాయి. దాంతో ఆ ప్రాంతాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో సహాయక బృందాలు అక్కడ కాలు పెట్టలేకపోతున్నాయి. అయితే బురదలో చిక్కుబడి ప్రాణాలతో ఉన్న పలువురిని సైన్యం, నేవీ సంయుక్త ఆపరేషన్‌ చేపట్టి హెలికాప్టర్ల ద్వారా కాపాడాయి.

 మెప్పడి ఆరోగ్య కేంద్రంలో స్థలాభవం కారణంగా మృతదేహాలను నేలపైనే వరుసగా పేరుస్తున్నారు. ఉత్పాతం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారంతా తలలు బాదుకుంటూ, హృదయ విదారకంగా రోదిస్తూ తమవారి శవాల కోసం వెదుక్కుంటున్నారు! నిర్వాసితులుగా మారిన వేలాదిమందిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. 

రంగంలోకి సైన్యం 
కేరళ ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సైన్యం, జాతీయ విపత్తు దళం హుటాహుటిన రంగంలోకి దిగాయి. బురద, మట్టి దిబ్బల కింద ప్రాణాలతో ఉన్నవారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నారు. వారి ఆనవాలు పట్టేందుకు డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. 

మోదీ దిగ్భ్రాంతి 
ఈ ఘోర విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. సీఎం పినరయి విజయన్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయక చర్యలు తదితరాల్లో కేరళకు అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని ప్రకటించారు. ఆయన బుధవారం కేరళ వెళ్లనున్నారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది.

ప్రాణం దక్కించుకున్న వృద్ధుడు 
వయనాడ్‌ విలయంలో వెల్లువెత్తిన బురద ప్రవాహంలో చిక్కిన ఓ వృద్ధుడు గంటల కొద్దీ ఒక పెద్ద బండరాయిని ఆధారంగా పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. స్థానికులు అతని ఆర్తనాదాలు విని కూడా వరద ప్రవాహ తీవ్రత కారణంగా ఏమీ చేయలేకపోయారు. దాంతో వృద్ధుడు జోరు వానలో, వరద ప్రవాహం నడుమ గంటల పాటు బండరాయి చాటునే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. చివరికి సహాయక బృందాలు చాలాసేపు శ్రమించి ఆయన్ను కాపాడాయి. ఆ వీడియో వైరల్‌గా మారింది.

త్రుటిలో బయటపడ్డాం... 
కళ్లముందే సర్వస్వాన్నీ ముంచెత్తిన వరద, బురద బీభత్సం నుంచి పలువురు త్రుటిలో తప్పించుకున్నారు. ఆ భయానక అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ వణికిపోయారు. ఓ వృద్ధ జంట తమ ఇంటి చుట్టూ బురద నీటి ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుండటంతో వణికించే చలిని, జోరు వానను కూడా లెక్కచేయకుండా రాత్రి 11 గంటల వేళ కొండపై భాగానికి వెళ్లిపోయింది. కాసేపటికే వాళ్ల ఇల్లు నామరూపాల్లేకుండా పోయింది.

 ‘‘పొరుగింటాయనను రమ్మని బతిమాలాం. రాకుండా ప్రాణాలు పోగొట్టుకున్నాడు’’ అంటూ వాళ్లు వాపోయారు. ‘‘మా బంధువులైన దంపతులు పసిపాపను చంకనేసుకుని ప్రాణాల కోసం పరుగులు తీస్తూ నాతో ఫోన్లో మాట్లాడారు. వరద ప్రవాహం, బురద తమను ముంచెత్తుతున్నాయని చెప్పారు. కాసేపటికే ఫోన్‌ మూగబోయింది. వాళ్ల జాడా తెలియడం లేదు’’ అంటూ ఒక మహిళ రోదించింది.

వయనాడ్‌కు రెడ్‌ అలర్ట్‌: న వయనాడ్‌తో పాటు కేరళలోని ఉత్తరాది జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఫోన్లలో ఆర్తనాదాలు 
బురద ప్రవాహంలో చిక్కుబడ్డ చాలామంది కాపాడాలంటూ అధికారులకు ఫోన్లు చేశారు. ప్రాణ భయంతో ఫోన్లోనే ఏడ్చేసిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. చానళ్లలో ప్రసారమవుతున్న ఆ సంభాషణలు, గ్రామాలన్నీ బురద కింద కప్పబడిపోయిన్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి.

 ఇది మాటలకందని విషాదమని సీఎం విజయన్‌ అన్నారు. ‘‘భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం ప్రాంతమంతా పెను విధ్వంసానికి లోనైంది. మృతుల్లో మహిళలు, చిన్నారులున్నారు. పలు శవాలు చెలియార్‌ నదిలో పొరుగున మలప్పురం జిల్లాలోకి కొట్టుకొచ్చాయి.

నదే రెండుగా చీలింది 
విరిగిపడ్డ కొండచరియల ధాటికి స్థానిక ఇరువలింజిపుజ నది ఏకంగా రెండుగా చీలిపోయింది! అక్కడి వెల్లరిమల ప్రభుత్వ పాఠశాల పూర్తిగా సమాధైపోయిందని సీఎం విజయన్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement