Natural disaster
-
అది చూశాక.. జీవితంలో మొదటిసారిగా నాకు నోట మాటరాలేదు!
డిసెంబర్ 26వ తేదీ వచ్చిందంటే విషాద ఛాయలు ఆవ రిస్తాయి. సునామీ (2004 Tsunami) మన దేశపు సముద్రపు తీరప్రాంతాన్ని 2004 డిసెంబర్ 26 నాడు ఎంత గట్టి దెబ్బ కొట్టిందో... ఆ క్రమంలో చోటుచేసుకున్న అన్ని దృశ్యాలూ నా కళ్లముందు ప్రత్యక్షమవుతాయి.నేను కెనడియన్ హైకమిషన్ ఢిల్లీ కార్యాలయంలో సీనియర్ సలహాదారునిగా పనిచేసి 2015లో పదవీ విరమణ చేశాను. నా ఉద్యోగ బాధ్యతల్లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన పని ఒక కీలక భాగం. విశాలమైన మన దేశంలో ఏడాదంతా ప్రకృతి వైపరీత్యాలు పలురూపాల్లో (వరదలు, కరువు, అకాల వర్షాలు, భూకంపాలు, తుఫానులు, అడవి కార్చిచ్చులు, (Wild Fire) వేడి–చలిగాలులతో చావులు) జీవజాలాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ప్రాణనష్టంతో పాటు మౌలిక వసతుల్ని నాశనంచేసి... సవాళ్లను ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగాలకు వదిలేసి వెనుదిరిగి పోతాయి.ప్రకృతి వైపరీత్యాలతో నా బంధం 1999 అక్టోబర్ 29 నాడు ఒరిస్సాలో వచ్చిన సూపర్ సైక్లోన్‌తో (Super Cyclone) మొదలయ్యింది. అదొక పెద్ద విషాదం. ఇరవై వేలకి పైగా జనాన్ని పొట్టన పెట్టుకొంది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకే అంటే 2001 జనవరి 26న (రిపబ్లిక్ డే) గుజరాత్‌లోని భుజ్ ప్రాంతాన్ని కుదిపిన బలమైన భూకంపం వచ్చింది. ఉద్యోగ రీత్యా ఫీల్డ్ విజిట్ కోసం వెళ్ళాను. వందశాతం నెలకొరిగిన గ్రామాలను చూసి చలించిపోయాను. విధ్వంసపు తీవ్రతని కళ్ళారా చూశాక, జీవితంలో మొదటిసారిగా నాకు నోట మాటరాలేదు. బాంబుల దాడికి సంపూర్ణంగా నాశనమైన గ్రామాల మధ్యలో నడుస్తున్న భావన. కూలిన ఇండ్లు, విసిరి పడేసినట్టుగా ఇంటి సామాన్లు, పిల్లల వస్తువులు, చెల్లాచెదురుగా పడి ఉన్న దేవుళ్ళ పటాలు, పెళ్లి ఫోటోలు... ఎనభై సెకండ్ల భూకంపానికి చిన్నా భిన్నమైన జన జీవన దృశ్యాలు! నాలోని రచయిత ఏదైనా రాద్దాం (కథో, నవలో...) అనే ఆలోచనల్లో పడి ఓ వైపు సామగ్రినంతా చక్కగా అమర్చి పెట్టుకొన్నాను. కథలో మరణమృదంగం ఇమడలేదు. బలమైన వస్తువు కదా... నవల రాద్దాం అంటే సమయం దొరకలేదు. గుజరాత్ భూకంపపు (Gujarat Earthquake) ప్రాజెక్టుల్ని పూర్తిచేసి కాస్త ఊపిరి పీల్చుకొంటున్నామో లేదో, 2004 డిసెంబర్ రానే వచ్చింది. సునామీతో మనదేశపు తూర్పుతీర ప్రాంతాన్ని చావుదెబ్బ కొట్టింది. మన దేశంతో సహా పదమూడు దేశాల్లో మహా బీభ త్సాన్ని వదిలి వెళ్లింది సముద్రం. మనదేశంలో ఇరవై వేలకి పైగా చనిపోయారంటారు. కానీ అంత కంటే ఎక్కువే అని అనధికారికంగా చెబుతుంటారు. జనవరి (2005) మొదటి వారంలో ఫీల్డ్ విజిట్ మొదలు పెట్టి రెండువారాలు మూడు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ) దెబ్బ తిన్న ప్రదేశాల్ని చూస్తూ తిరిగాను. ఎన్నో కష్టాల కోర్చి అంకిత భావంతో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవాసంస్థలను కలిశాను. ప్రభావితులైన వారి స్థితి ఏంటి? తక్షణ అవసరాలేమిటి? ఎవరు ఎలాటి సహాయ కార్యక్రమాలను చేపట్టారు? దాతలు సహాయాన్నందించడానికి ఎలా ముందుకు వస్తు న్నారు వంటి విషయాలపై ఒక అవగాహన కోసం ఎందరినో కలిశాను. మూడు రాష్ట్రాలూ పుస్తకాల్లో దొరకని జ్ఞానపు గనుల్ని నా ముందుకు తెచ్చాయి. 2009 వరకు కెనడా దేశం ఆర్థిక సహాయాన్నిచ్చిన ప్రాజె క్టులు పూర్తయ్యాయి.చదవండి: బాలికా విద్యపై ఇంకా వివక్షా?ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ నాలోని రచయిత ఏం రాయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే ఊపు అందుకొంటున్న ‘నానీల’ ప్రక్రియ పట్ల ఆకర్షితుడనై, ‘సునామీ నానీలు’ అనే 45 పేజీల పుస్తకాన్ని వంద నానీలతో ప్రచురించి సునామీ వచ్చి సంవత్సరం పూర్తికాకముందే ప్రచురించాను. నాకు గొప్ప తృప్తినిచ్చింది. తరువాత ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి అనువదింపబడి రెండు భాషల సాహితీ ప్రియులకీ చేరింది. ఈ చిరు పుస్తకాల అమ్మకాలతో వచ్చిన డబ్బుని (రూ. 37,000) రెండు స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చాను.చదవండి: ఒక దేశం ఒక ఎన్నికపై... ఒక మాట!ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఫైళ్లని మూసేశాము. మళ్ళీ ఆ ప్రదేశాల్ని తిరిగి చూసే అవకాశాలు రావు. అయిదేళ్లుగా తరచుగా వెళ్లి తిరిగిన ప్రాజెక్టు ప్రాంతాల్లో ఇరవై సంవత్సరాల్లో చాలా మార్పులు తప్పక వచ్చి ఉంటాయి. అప్పటి పిల్లలు యువకులైపోయుంటారు. మధ్య వయస్కులు అరవై దాటి వృద్ధాప్యంలోకి అడుగు పెట్టి ఉంటారు. పిల్లల్ని కోల్పోయిన తల్లులు మళ్ళీ పిల్లల్ని కని ఉంటారు. వారందరి మోహాలపై నవ్వుల్ని చూసే అవకాశం రాదు. రానే రాదు. అందరూ సునామీ తమకి మిగిల్చిన విషాదాన్ని పీడకలగా భావించి ఆశావాదంతో నెమ్మదిగా నిలదొక్కుకొంటూ, కాలక్రమేణా ముందుకు దూసుకుపోయి ఉంటారని ఊహించుకొంటూ ప్రతి డిసెంబర్ చివరివారం గడుపుతుంటాను.- డాక్టర్ టి. సంపత్ కుమార్ ఢిల్లీలోని కెనడియన్ హైకమిషన్‌లో మాజీ సీనియర్ సలహాదారు(2004 నాటి సునామీకి రేపటితో ఇరవై ఏళ్లు) -
పదేళ్లు.. ప్రకృతి నష్టం
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో ప్రకృతి వైపరీత్యం రాష్ట్రానికి పెద్ద నష్టమే చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. వడగళ్లు, కరువు, భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్, అకాల వర్షాలు, వరదలు, అధిక వేడి, పిడుగుల్లాంటి ఘటనల కారణంగా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి నివేదించిన లెక్కల ప్రకారం గత పదేళ్ల కాలంలో (2015–2024) ప్రకృతి వైపరీత్యాల కారణంగా వేల కోట్ల రూపాయల విలువైన నష్టం జరిగింది. ఒక్కో ఏడాది ఒక్కో రకమైన వైపరీత్యం కారణంగా ఇప్పటివరకు 371 మంది చనిపోయినట్టు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, మూగజీవాలు అయితే లక్షకు పైగా మృత్యువాత పడ్డాయి. మొత్తం 80 వేల ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 40 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. వీటన్నింటి విలువ రూ.1,500 కోట్ల వరకు ఉందని ప్రభుత్వ నివేదికలో పేర్కొన్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
మొబైల్ అలర్ట్‌లతో ప్రాణాలు కాపాడేలా..
ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మరణాలరేటు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొబైల్ వినియోగదారులకు కాల్స్, టెక్ట్స్ రూపంలో అలర్టులు అందించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయించింది. సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సొల్యూషన్స్(సీబీఎస్) ద్వారా టెలి కమ్యునికేషన్ విభాగం సాయంతో ఈ సేవల ప్రారంభించాలని యోచిస్తోంది. ఈమేరకు సంబంధిత శాఖలతో చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.దేశవ్యాప్తంగా భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్(సీఏపీ)తో స్థానిక ప్రజలకు మెసేజ్‌లు, కాల్స్ రూపంలో సలహాలు, సూచనలు అందించనున్నారు. దానివల్ల ప్రమాదం జరగడానికి ముందుగానే ప్రజలను అప్రమత్తం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ప్రజలకు ముందుగానే సమాచారం అందిస్తే అందుకు తగ్గట్టుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. దాంతో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: ఉచితాలు.. శాపాలు!ఐఎండీ, సీడబ్ల్యూసీ, ఎన్సీఎస్ వంటి కేంద్ర సంస్థల సహాయంతో ప్రభుత్వం ఈ అలర్టులు పంపే అవకాశం ఉందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ సదుపాయం వల్ల అటవీ ప్రాంతాలు, సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రదేశాల్లో నివసిస్తున్న వారికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా, గతేడాది పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరిలోని మొబైల్ వినియోగదారుల ద్వారా టెలి కమ్యునికేషన్ విభాగం ఈ అలర్టు సర్వీసును పరీక్షించింది. -
Wayanad landslide: వయనాడ్ విలయానికి... ఉమ్మడి కుటుంబం బలి!
వయనాడ్: అప్పటిదాకా ఇంటినిండా 16 మంది సభ్యుల సందడితో కళకళలాడిన ఆ ఉమ్మడి కుటుంబం ఒక్కసారిగా కళతప్పింది. కొండల మీదుగా దూసుకొచ్చిన ప్రకృతి ప్రళయం కుటుంబాన్ని అమాంతం మింగేసింది. చూరల్మల కుగ్రామంలో ఆ ఉమ్మడి కుటుంబంలో 42 ఏళ్ల మన్సూర్ ఒక్కడే మిగిలాడు. విపత్తు రోజున ఊళ్లో లేకపోవడంతో బతికిపోయాడు. తన ఇంట్లో 16 మందిని కొండలు కబళించాయంటూ విలపిస్తున్నాడు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విలయానికి బలైన వారి సంఖ్య 221కి చేరినట్టు కేరళ ఆదివారం ప్రకటించింది. వాస్తవ సంఖ్య 370 దాటినట్టు స్థానిక మీడియా చెబుతోంది. జీవనదిలో నిర్జీవ దేహాలు వయనాడ్ తదితర తీరవాసులకు జీవనాడిగా పేరొందిన చలియార్ నది ఇప్పుడు విలయానికి గుర్తుగా మారింది. కొండచరియలకు బలైన వారి మృతదేహాలు ఆరు రోజులైనా ఇంకా నది ప్రవాహంలో కొట్టుకొస్తున్నాయి! ఘటనాస్థలి మీదుగా 40 కి.మీ.ల పొడవునా తీరం వెంట గాలింపు కొనసాగుతోంది.సైన్యానికి సెల్యూట్.. బాలుడి లేఖ వయనాడ్‌లో అన్వేషణ, సహాయక పనుల్లో సైన్యం కృషిని రాయన్ అనే స్థానిక చిన్నారిని కదలించింది. ‘మీరు నిజంగా గ్రేట్’ అంటూ మూడో తరగతి చదువుతున్న ఆ బాలుడు ఆరీ్మకి లేఖ రాశాడు. ‘‘ధ్వంసమైన నా వయనాడ్‌లో బాధితులను ఆర్మీ కాపాడుతున్న తీరు చూసి గర్వపడుతున్నా. మీ ఆకలిని కేవలం బిస్కెట్లతో చంపుకుంటూ శరవేగంగా బ్రిడ్జి కట్టడం టీవీలో చూశా. నేను కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తా’’ అని పేర్కొన్నాడు. ‘‘నువ్వు ఆర్మీ యూనిఫాంలో మాతో కలిసి పనిచేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాం’’ అంటూ ఆర్మీ అతనికి తిరుగు లేఖ రాసింది! -
Wayanad: బురద వరద ముంచేసింది
వయనాడ్ (కేరళ): ఘోర కలి. మాటలకందని విషాదం. కేరళ చరిత్రలో కనీ వినీ ఎరగని ప్రకృతి విలయం. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కొండ ప్రాంతమైన వయనాడ్ జిల్లాలో మహోత్పాతానికి కారణమయ్యాయి. అక్కడి మెప్పడి ప్రాంతంపైకి మృత్యువు కొండచరియల రూపంలో ముంచుకొచి్చంది. సోమవారం అర్ధరాత్రి దాటాక ఆ ప్రాంతమంతటా భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వెల్లువెత్తిన బురద, ప్రవాహం ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తాయి. గ్రామాలతో పాటు సహాయ శిబిరాలు కూడా బురద ప్రవాహంలో గల్లంతయ్యాయి. ఎటుచూసినా అంతులేని బురదే కప్పేసింది. దాంతో గాఢ నిద్రలో ఉన్న వందలాది మంది తప్పించుకునే అవకాశం కూడా లేక నిస్సహాయంగా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. బురద, మట్టి దిబ్బల కింద సమాధైపోయారు. కళ్లు తిప్పుకోనివ్వనంత అందంగా ఉండే మెప్పడి ప్రాంతమంతా క్షణాల వ్యవధిలో శవాల దిబ్బగా మారిపోయింది. ఇప్పటిదాకా 123 మృతదేహాలను వెలికితీశారు. వాటిలో చాలావరకు సమీపంలోని నదుల్లోకి కొట్టొకొచ్చినవే. ఏ శవాన్ని చూసినా కాళ్లు చేతులు తెగిపోయి కని్పంచడం బీభత్స తీవ్రతను కళ్లకు కడుతోంది. ప్రమాద స్థలం పొడవునా నిండిపోయిన బురద ప్రవాహాన్ని, మట్టి దిబ్బలను తొలగిస్తే వందల్లో శవాలు బయట పడతాయని చెబుతున్నారు. మృతుల్లో స్థానికులతో పాటు ఉత్తరాది నుంచి పొట్ట చేత పట్టుకుని వచి్చన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారని భావిస్తున్నారు. సమీపంలోని టీ ఎస్టేట్‌లో పని చేస్తున్న 600 మంది వలస కూలీల జాడ తెలియడం లేదు. వారంతా విలయానికి బలై ఉంటారంటున్నారు. నడి రాత్రి ఘోర కలి... మెప్పడి ప్రాంతంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండ ప్రాంతమంతా తడిసీ తడిసీ వదులుగా మారిపోయింది. అర్ధరాత్రి వేళ కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. తొలుత సోమవారం అర్ధరాత్రి రెండు గంటల వేళ ముండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో సహాయక సిబ్బంది హుటాహుటిన స్పందించారు. బాధితులను సమీపంలోని చూరల్మల స్కూలు వద్ద సహాయక శిబిరాలకు తరలించారు. అనంతరం తెల్లవారుజామున నాలుగింటికి ఆ ప్రాంతమంతటా మళ్లీ భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో శిబిరాలతో పాటు పరిసర గ్రామాల్లోని ఇళ్లు, దుకాణాలన్నీ బురదలో కొట్టుకుపోయాయి. రోడ్లు, బ్రిడ్జిల వంటివన్నీ నామరూపాల్లేకుండా పోయాయి. దాంతో ఆ ప్రాంతాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో సహాయక బృందాలు అక్కడ కాలు పెట్టలేకపోతున్నాయి. అయితే బురదలో చిక్కుబడి ప్రాణాలతో ఉన్న పలువురిని సైన్యం, నేవీ సంయుక్త ఆపరేషన్ చేపట్టి హెలికాప్టర్ల ద్వారా కాపాడాయి. మెప్పడి ఆరోగ్య కేంద్రంలో స్థలాభవం కారణంగా మృతదేహాలను నేలపైనే వరుసగా పేరుస్తున్నారు. ఉత్పాతం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారంతా తలలు బాదుకుంటూ, హృదయ విదారకంగా రోదిస్తూ తమవారి శవాల కోసం వెదుక్కుంటున్నారు! నిర్వాసితులుగా మారిన వేలాదిమందిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. రంగంలోకి సైన్యం కేరళ ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సైన్యం, జాతీయ విపత్తు దళం హుటాహుటిన రంగంలోకి దిగాయి. బురద, మట్టి దిబ్బల కింద ప్రాణాలతో ఉన్నవారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నారు. వారి ఆనవాలు పట్టేందుకు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. మోదీ దిగ్భ్రాంతి ఈ ఘోర విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. సీఎం పినరయి విజయన్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయక చర్యలు తదితరాల్లో కేరళకు అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని ప్రకటించారు. ఆయన బుధవారం కేరళ వెళ్లనున్నారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది.ప్రాణం దక్కించుకున్న వృద్ధుడు వయనాడ్ విలయంలో వెల్లువెత్తిన బురద ప్రవాహంలో చిక్కిన ఓ వృద్ధుడు గంటల కొద్దీ ఒక పెద్ద బండరాయిని ఆధారంగా పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. స్థానికులు అతని ఆర్తనాదాలు విని కూడా వరద ప్రవాహ తీవ్రత కారణంగా ఏమీ చేయలేకపోయారు. దాంతో వృద్ధుడు జోరు వానలో, వరద ప్రవాహం నడుమ గంటల పాటు బండరాయి చాటునే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. చివరికి సహాయక బృందాలు చాలాసేపు శ్రమించి ఆయన్ను కాపాడాయి. ఆ వీడియో వైరల్‌గా మారింది.త్రుటిలో బయటపడ్డాం... కళ్లముందే సర్వస్వాన్నీ ముంచెత్తిన వరద, బురద బీభత్సం నుంచి పలువురు త్రుటిలో తప్పించుకున్నారు. ఆ భయానక అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ వణికిపోయారు. ఓ వృద్ధ జంట తమ ఇంటి చుట్టూ బురద నీటి ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుండటంతో వణికించే చలిని, జోరు వానను కూడా లెక్కచేయకుండా రాత్రి 11 గంటల వేళ కొండపై భాగానికి వెళ్లిపోయింది. కాసేపటికే వాళ్ల ఇల్లు నామరూపాల్లేకుండా పోయింది. ‘‘పొరుగింటాయనను రమ్మని బతిమాలాం. రాకుండా ప్రాణాలు పోగొట్టుకున్నాడు’’ అంటూ వాళ్లు వాపోయారు. ‘‘మా బంధువులైన దంపతులు పసిపాపను చంకనేసుకుని ప్రాణాల కోసం పరుగులు తీస్తూ నాతో ఫోన్లో మాట్లాడారు. వరద ప్రవాహం, బురద తమను ముంచెత్తుతున్నాయని చెప్పారు. కాసేపటికే ఫోన్ మూగబోయింది. వాళ్ల జాడా తెలియడం లేదు’’ అంటూ ఒక మహిళ రోదించింది.వయనాడ్‌కు రెడ్ అలర్ట్: న వయనాడ్‌తో పాటు కేరళలోని ఉత్తరాది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.ఫోన్లలో ఆర్తనాదాలు బురద ప్రవాహంలో చిక్కుబడ్డ చాలామంది కాపాడాలంటూ అధికారులకు ఫోన్లు చేశారు. ప్రాణ భయంతో ఫోన్లోనే ఏడ్చేసిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. చానళ్లలో ప్రసారమవుతున్న ఆ సంభాషణలు, గ్రామాలన్నీ బురద కింద కప్పబడిపోయిన్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఇది మాటలకందని విషాదమని సీఎం విజయన్ అన్నారు. ‘‘భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం ప్రాంతమంతా పెను విధ్వంసానికి లోనైంది. మృతుల్లో మహిళలు, చిన్నారులున్నారు. పలు శవాలు చెలియార్ నదిలో పొరుగున మలప్పురం జిల్లాలోకి కొట్టుకొచ్చాయి.నదే రెండుగా చీలింది విరిగిపడ్డ కొండచరియల ధాటికి స్థానిక ఇరువలింజిపుజ నది ఏకంగా రెండుగా చీలిపోయింది! అక్కడి వెల్లరిమల ప్రభుత్వ పాఠశాల పూర్తిగా సమాధైపోయిందని సీఎం విజయన్ చెప్పారు. -
ప్రళయమొచ్చినా..ఈ ఐదూ బతికేస్తాయట!
ఏదైనా అత్యంత భయానక ప్రకృతి విపత్తు వస్తేనో, ఏదైనా పెద్ద ఆస్టరాయిడ్ ఢీకొంటేనో.. భూమ్మీది జీవరాశిలో చాలా వరకు నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. కానీ ఓ ఐదు రకాల జీవులు మాత్రం బతికి ఉండగలుగుతాయట. వాటికి ఉన్న ప్రత్యేక లక్షణాలు, కఠిన పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవేమిటో తెలుసుకుందామా.. టాప్‌లో టార్డిగ్రేడ్లు.. జీవులన్నింటిలో అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుని బతకగలిగే అతి చిన్న జీవులు టార్డిగ్రేడ్లు. నీటిలో జీవిస్తుండటం, ఎలుగుబంటిని పోలి ఉండటంతో వీటిని వాటర్ బేర్లు అని కూడా పిలుస్తారు. 150 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను, మైనస్ 70 డిగ్రీల వరకు తీవ్ర చలిని ఇవి తట్టుకోగలవు. ఆక్సిజన్, ఆహారం, నీళ్లు లేని పరిస్థితుల్లోనూ వారాలకు వారాలు బతికేస్తాయి. అందుకే ప్రళయమొచ్చినా బతికే జీవుల్లో టార్డిగ్రేడ్లు టాప్‌లో ఉన్నాయి. బొద్దింకలూ బతికేస్తాయి.. మనను నానా చికాకు పెట్టే బొద్దింకలను అంత ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఎన్నో విపత్కర పరిస్థితులను తట్టుకునే శక్తి వాటి సొంతం. డైనోసార్లతో కలిసి జీవించిన బొద్దింకలు.. భూమిని ఆస్టరాయిడ్ ఢీకొన్నప్పుడు డైనోసార్లు అంతమైపోయినా బతకగలిగాయి. మట్టిలో, రాళ్లలో, మరెక్కడైనా దూరిపోయి దాక్కోవడం, ఏది దొరికితే దాన్ని తిని బతికేయడం, చాలా వరకు విషపదార్థాలను, రేడియేషన్‌ను కూడా తట్టుకోగలగడం వీటి స్పెషాలిటీ. అందుకే ఎంత తీవ్ర విపత్తు వచ్చినా బొద్దింకలు బతికే అవకాశాలు ఎక్కువట. రాబందులను తక్కువగా చూడొద్దు భూమ్మీద ప్రకృతి విపత్తు వచ్చే స్థాయిని బట్టి కొన్ని రకాల జంతువులకు లాభమూ జరుగుతుంది. అలాంటివాటిలో రాబందులు ఒకటి. ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనడం వంటివి జరిగితే.. గాల్లో అంతెత్తున, చాలా దూరం ప్రయాణించి తప్పించుకోగలవు. విపత్తుల మరణించే జంతువుల మాంసాన్ని తింటూ బతికేయగలవు. కుళ్లిన మాంసంలో పెరిగే బ్యాక్టీరియాను, ఇతర సూక్ష్మజీవులను కూడా డైజెస్ట్ చేయగల యాసిడ్లు రాబందుల జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతాయి. షార్క్‌లకు విపత్తులంటే లెక్కే లేదు.. భూమ్మీది పురాతన జీవుల్లో షార్క్ చేపల జాతి కూడా ఒకటి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. భూమ్మీద చెట్లు ఏర్పడకముందే సముద్రాల్లో షార్క్‌ల జాతి ఉద్భవించి జీవిస్తున్నాయి. తర్వాత జరిగిన ప్రకృతి ఉత్పాతాల్లో డైనోసార్లు సహా ఎన్నో జీవజాతులు అంతరించినా షార్క్‌లు మాత్రం బతికేస్తూనే ఉన్నాయి. సముద్రాల్లో అత్యంత లోతున, ఎలాంటి వెలుగు ప్రసరించని చోట, తీవ్ర పీడనాన్ని తట్టుకుని బతకగలగడం షార్క్‌ల స్పెషాలిటీ. ఇప్పుడు మరో విపత్తు వచ్చినా అవి తట్టుకుని బతికేయగలవు మరి. ఎంపరర్ పెంగ్విన్లకూచాన్స్ ఎక్కువే..అంటార్కిటికా ఖండంలో ఉండే అత్యంత శీతల పరిస్థితులను, గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకుని జీవిస్తున్న జంతువులు ఎంపరర్ పెంగ్విన్లు. వాటి శరీరంలో గణనీయంగా కొవ్వు ఉంటుంది. కొన్నివారాల పాటు ఆహారం లేకున్నా బతికేయగలవు. పైగా అవి ఉన్న ప్రాంతాల్లో విపత్తులు ఏర్పడే అవకాశాలూ తక్కువని, నిక్షేపంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. -
మిచాంగ్ గుణపాఠం
ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడినప్పుడల్లా మనిషి చేసిన, చేస్తున్న పాపాలు బయటపడతాయి. అంతవరకూ పాలకులు రూపొందించిన విధానాల్లోని వైఫల్యాలు బట్టబయలవుతాయి. తీవ్ర తుపానుగా పరిగణించిన మిచాంగ్ నాలుగురోజుల పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించింది. దాని ధాటికి చెన్నై నుంచి తమిళ తీరప్రాంతాలతో మొదలుపెట్టి దక్షిణాంధ్ర జిల్లాలన్నీ తడిసిముద్దయ్యాయి. కోస్తా జిల్లాలు సైతం వర్షాలతో సతమతమయ్యాయి. పంటలు దెబ్బ తిన్నాయి. చెన్నైలో గత 47 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత స్థాయిలో భారీ వర్షం కురిసింది. నగరం నగరమంతా వరదనీటిలో తేలియాడింది. వివిధ ఘటనల్లో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతవరకూ 2015 నాటి కుంభవృష్టే రికార్డు. ఈ ఏడాది చిన్నా పెద్దా స్థాయిలో దేశం ఆరు తుపాన్లనూ, వాటి దుష్పరిణామాలనూ చవిచూసింది. మొన్న జూన్‌లో గుజరాత్, మహా రాష్ట్రల్లో బిపర్జయ్ తుపాను సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఆకాశాన్నంటే భవంతులతో, రోడ్లపై నిరంతరం రివ్వుమంటూ దూసుకుపోయే వాహనాలతో, అరచేతిలో ఇమిడే సెల్‌ఫోన్‌తో దేన్నయినా క్షణాల్లో పొందగల వెసులుబాటు వగైరాలతో అత్యద్భుతంగా కనబడే నగరాలు, పట్టణాలు చినుకుపడితే నరకాన్ని తలపిస్తాయి. అటువంటిది కనీవినీ ఎరుగని రికార్డు స్థాయి కుంభవృష్టి పడితే ఇక చెప్పేదేముంది? కేవలం ఆది, సోమ వారాల్లో రాత్రింబగళ్లు కురిసిన వర్షపాతం ఏకంగా 35 సెంటీమీటర్లంటే పరిస్థితి ఎలావుందో ఊహించుకోవచ్చు. శివారుల్లో వున్న చెరువులు, రిజర్వాయర్లు, అడయార్, కూవమ్ నదులు, బకింగ్‌హామ్ కాల్వ పూర్తిగా నిండి వరద జలాలు చెన్నై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా అన్ని హైవేలు, సబ్‌వేలు మూతబడక తప్పలేదు. వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రముఖులు నివాసం ఉండే పొయెస్ గార్డెన్ రోడ్డు ఏడడుగుల మేర కుంగిపోయి అందులో ట్రాన్స్ఫార్మర్లు, వాహనాలు కూరుకుపోయాయంటే పరిస్థితి ఎలా ఉన్నదో ఊహించుకోవచ్చు. వాతావరణ విభాగం చెబుతున్న ప్రకారం మిచాంగ్ గత తుపానులకు భిన్నమైనది. సాధారణంగా తీరానికి సుదూరంగా తుపాను తిరుగాడుతుంది. కానీ ఈసారి తీరానికి 90 కిలోమీటర్ల దూరంలోనే మిచాంగ్ లంగరేసింది. పైగా అది చాలా నెమ్మదిగా... అంటే గంటకు 5–7 కిలోమీటర్ల మధ్య వేగంతో కదిలింది. తుపాను వేగం సాధారణంగా గంటకు 10–18 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. తీరానికి దగ్గరగా వుండి మందకొడిగా కదలటం వల్ల విడవకుండా భారీ వర్షాలు కురిశాయి. 2015లో చెంబరామ్బాక్కమ్ సరస్సు, పూండి రిజర్వాయర్ల నుంచి ఒక్కసారి భారీయెత్తున నీటిని విడుదల చేసిన పర్యవసానంగా చెన్నై నీట మునిగింది. ఈసారి అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఒక క్రమపద్ధతిలో నీరు వదిలినా మిచాంగ్ తీవ్రత కారణంగా ఇంచుమించు అప్పటి పరిస్థితే ఏర్పడింది. తీరానికి ఆవల ఉండాల్సిన సముద్రం నగరబాట పట్టిందా అన్నంతగా వరద పోటెత్తింది. అభివృద్ధి పేరు మీద అన్నిటినీ ఒకేచోట కేంద్రీకరిస్తే వృత్తి ఉద్యోగాల కోసం, చిన్నా చితకా వ్యాపారాల కోసం దూరతీరాల నుంచి సైతం జనం అక్కడికి చేరుకుంటారు. జనాభా అపరిమితంగా పెరుగుంది. నగరీకరణ, పట్టణీకరణ జరుగుతున్నప్పుడు ఆ వంకన భూబకా సురులు ప్రవేశిస్తారు. సరస్సులు, చెరువులు మాయమవుతాయి. కాల్వలు కుంచించుకు పోతాయి. పచ్చటి చెట్లు నేలకొరుగుతాయి. ఎటుచూసినా కాంక్రీట్ కీకారణ్యాలే విస్తరిస్తుంటాయి. మన దేశంలోనే కాదు... వేరే దేశాల్లో ఇదే పరిస్థితి. అయితే ఆ దేశాల్లో కాస్త ముందే మేల్కొని అభివృద్ధి వికేంద్రీకరణ వైపు కదిలారు. కానీ మన దగ్గర ప్రకృతి విలయాలు కళ్ల ముందే కనబడుతున్నా ఆ అంశంపై పాలకులు దృష్టి సారించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణానికి చేసిన ప్రయత్నం ఇందుకు ఉదాహరణ. వికేంద్రీకరణతో పాటు విపత్తులు ముంచుకొచ్చినప్పుడు తలెత్తగల సమస్యలను ముందే గుర్తించి అందుకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు ఏర్పరిస్తే ఇబ్బందులు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ స్థితిగతులు మారాయి. కర్బన ఉద్గారాలు అపరిమితంగా పెరిగిన పర్యవసానంగా భూగోళం వేడెక్కడం, ఆ వేడిమిలో 90 శాతం సముద్రాలకే పోవటం వల్ల వాటి జలాలు వేడెక్కుతున్నాయి. తుపానులకు అదే ప్రధాన వనరు. ఈ పరిస్థితుల్లో నగరీకరణ, పట్టణీకరణలపై పునరాలోచించటం, ఇప్పటికే ఉన్న నగరాలు, పట్టణాల్లో ప్రస్తుత స్థితిని మెరుగుపరచటానికి అనుసరించాల్సిన విధానాలకు రూపకల్పన చేయటం అవసరం. పారిస్ ఒడంబడికకు అనుగుణంగా అహ్మదాబాద్‌లోని అర్బన్ మేనేజ్మెంట్ సెంటర్ ఈ విధానాలకు తుదిరూపం ఇచ్చింది. తమిళనాడు సర్కారు దాని ఆధారంగా చెన్నైకు మొన్న జూన్‌లో సవివరమైన ప్రణాళికను రూపొందించింది. 2050కల్లా ఆ నగరాన్ని కర్బన ఉద్గారాల బారి నుంచి రక్షించటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక విధానాన్ని ప్రకటించింది. నీటి కొరత నివారణ, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు, విద్యుత్‌తో నడిచే బస్సులు వందశాతం ఉండేలా చూడటం, నగరంలో హరితవనాల్ని 35 శాతానికి విస్తరించటం, పకడ్బందీ పారిశుద్ధ్యం, చెన్నై వరద ముంపు బారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవటం అందులో కొన్ని. నగర విస్తరణకూ, కాలనీల నిర్మాణానికీ విచ్చలవిడి అనుమతులీయటం విరమించుకుంటే, డ్రైనేజీ వ్యవస్థల పునర్వ్యవ స్థీకరణకు చర్యలు తీసుకుంటే ప్రతి నగరమూ మెరుగవుతుంది. మిచాంగ్ వంటి తీవ్ర తుపానుల వల్ల జరిగే నష్టం కనిష్ఠస్థాయికి పరిమితమవుతుంది. పాలకులు ఈ దిశగా ఆలోచించాలి. -
కార్చిచ్చును కేర్ చేయని ఇల్లు.. వైరలవుతోన్న ఫోటో.. నిజమేనా?
హవాయి: అమెరికాలోని హవాయి దీవిలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత వందేళ్లలో ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు అని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ నగరమైన ‘లాహైనా’ బూడిద కుప్పగా మారిపోయింది. ఇక్కడ దాదాపు అన్ని ఇళ్లు మంటల్లో చిక్కుకొని నేలమట్టమయ్యాయి. మంటల తీవ్రతకు వంద మందికిపైగానే మరణించారు. కానీ, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలిచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఇల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాహైనా సిటీలో రివర్ ఫ్రంట్ వీధిలో ఈ ఇల్లు ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇదొక్కటే ఎప్పటిలాగే మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా? ఫొటోలో ఏదైనా మార్పులు చేశారా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భవన యజమాని ట్రిస్ మిలికిన్ స్పందించారు. అది నిజమైన ఫొటో అని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ చెక్క ఇంటిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశామని, పాత పైకప్పును తొలగించి, లోహపు పైకప్పు వేయిచామని తెలిపారు. చుట్టుపక్కల గడ్డి లేకుండా బండలు పరిచామని వెల్లడించారు. ఈ జాగ్రత్తల వల్లే తమ ఇల్లు మంటల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కార్చిచ్చులో నిప్పు రవ్వలు తమ ఇంటిపై పడినా లోహపు పైకప్పు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ట్రిస్ మిలికిన్ వివరించారు. -
ఈ కన్నీటిని ఆపేదెట్లా?
ఒకపక్కన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎండలు మంటెత్తుతుంటే, మరోపక్కన తూర్పు, ఈశాన్య ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్న విచిత్రమైన పరిస్థితి. వరదలు అలవాటే అయినా, మునుపెన్నడూ కనివిని ఎరుగని జలప్రళయంతో ఈశాన్య ప్రాంతం అతలాకుతలమవుతోంది. అస్సామ్, మేఘాలయల్లోని తాజా దృశ్యాలు ‘టైటానిక్’ చిత్రంలోని జలవిలయాన్ని తలపిస్తు న్నాయి. ఒక్క అస్సామ్‌లోనే ఈ నెల ఇప్పటి దాకా సాధారణం కన్నా 109 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. 35 జిల్లాలకు గాను 33 జిల్లాలు ముంపునకు గురి కాగా, 42 లక్షల మందికి పైగా ముంపు బారిన పడ్డారు. 70 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్యంలో ఆరెంజ్ అలర్ట్‌తో, సహాయక చర్యలకు సైన్యం బరిలోకి దిగాల్సివచ్చింది. అస్సామ్ వరదలను జాతీయ సమస్యగా ప్రకటించాలని కొన్నేళ్ళుగా కేంద్రానికి వస్తున్న వినతిపై మళ్ళీ చర్చ మొదలైంది. సహాయక చర్యల్లోని ఇద్దరు పోలీసులు వరదల్లో కొట్టుకుపోయారంటే, అస్సామ్‌లో వరదల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, అస్సామ్కు వరదలు కొత్త కావు. వరదలతో ఈశాన్యంలో అల్లకల్లోలం ఏటా ఆనవాయితీ. వందల సంఖ్యలో జననష్టం, పశునష్టం. వేలమంది జీవనోపాధి కోల్పోవడం. పంటలు నాశనం కావడం. ఈసారీ అదే జరిగింది. పంట భూములు తుడిచిపెట్టుకుపోయాయి. కీలక రవాణా మార్గాలు ధ్వంసమయ్యాయి. అస్సామ్ దక్షిణ భాగంలోని బరాక్ లోయలోని తేయాకు తోటల పరిస్థితి మరీ దయనీయం. దిగువ అస్సామ్ బాగా దెబ్బతింది. బర్పేట లాంటి పట్నాలు పూర్తిగా నీట మునిగాయి. అస్సామ్‌లోని మొత్తం 78.52 లక్షల హెక్టార్ల భూభాగంలో 40 శాతం (సుమారు 31.05 లక్షల హెక్టార్లు) ఏటేటా వరద ముంపునకు గురవుతోంది. అస్సామ్ ఇలా ఏటా వరదల బారిన పడడానికి అనేక కారణాలున్నాయి. ఆ రాష్ట్రంలోని నదుల వెంట, మరీ ముఖ్యంగా బ్రహ్మపుత్రలో పల్లపు ప్రాంతాలు చాలా ఎక్కువ. దాంతో, అస్తవ్యస్తంగా మట్టి పేరుకుపోతుంటుంది. నదీ భూతలాలలో ఇలా మట్టి పేరుకుపోయినకొద్దీ, వరదలు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. అలాగే, గౌహతి లాంటి ప్రాంతాల భౌగోళిక స్వరూపం సైతం తరచూ వరదల బారిన పడేలా చేస్తోంది. మన చేతిలో లేని ఈ ప్రకృతి సంబంధమైన కారణాలతో పాటు మానవ తప్పిదాలూ ఈ జల విలయానికి ప్రధాన కారణమవుతున్నాయి. మానవజోక్యంతో నదీతీరాలు క్షయమవుతున్నాయి. అస్సామ్ మొత్తం విస్తీర్ణంలో దాదాపు 8 శాతం మేర భూభాగం గడచిన ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో నదీక్షయంతో మనిషి చెరబట్టినదేనని ఓ లెక్క. ఫలితంగా నదీప్రవాహ దిశలు మారడం, కొత్త ప్రాంతాలకు వరదలు విస్తరించడం సర్వసాధారణం. వరదలతో పేరుకొనే ఒండ్రుమట్టి భూసారానికి ప్రయోజనకరమే. కానీ, ఈ జల విలయం తెచ్చి పెడుతున్న తీరని నష్టాలు నివారించి తీరాల్సినవి. నదీతీరాల్లో అడవుల నరికివేత, బ్రహ్మపుత్రా నది ప్రవాహ ఉరవడి జత కలసి ఏయేటికాయేడు పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. సాధారణంగా అధిక నీటిప్రవాహాన్ని నేలలోకి పీల్చుకొని, నష్టాన్ని నివారించేందుకు ప్రకృతి ఇచ్చిన వరంగా మాగాణి నేలలు ఉపకరిస్తాయి. కానీ, అత్యాశ ఎక్కువై మాగాణి నేలలను సైతం మానవ ఆవాసాలుగా మార్చేస్తున్నారు. అలా అస్సామ్‌లో మాగాణి తగ్గింది. వెరసి, ఆ రాష్ట్రం ప్రతిసారీ ముంపులో చిక్కుకు పోతోంది. కరకట్టల నిర్మాణంతో పాలకులు చేతులు దులుపుకుంటూ ఉంటే, అధిక వరదలతో అవీ కొట్టుకుపోతున్నాయి. పొంగిపొర్లే నీటిని కొంతైనా పీల్చుకొనేందుకు వీలుగా నదీ భూతలాల్లో అడదాదడపా పూడికలు తీస్తున్నా, బ్రహ్మపుత్ర లాంటి నదుల్లో త్వరితగతిన మట్టిపేరుకుపోతుంది గనక అదీ ఉపయోగం లేకుండా పోతోంది. భారీ ఆనకట్టల నిర్మాణంతో పర్యావరణ నష్టం సరేసరి. ఏమైనా, అస్సామ్ సహా ఈశాన్య రాష్ట్రాలకు వరదల ముప్పు తరచూ తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు, ప్రభుత్వాలు వ్యవహరించాలి. దీనిపై ఇవాళ్టికీ ఒక దీర్ఘకాలిక ప్రణాళికంటూ లేకపోవడమే విడ్డూరం. ప్రతి ఏటా వరదలు ముంచెత్తుతున్నా, పాలకులు క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన ఆచరణాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకోకపోవడం వరదను మించిన విషాదం. టిబెట్ నుంచి మన అస్సామ్ మీదుగా బంగ్లాదేశ్‌కు దాదాపు 800 కి.మీ ప్రవహించే బ్రహ్మపుత్రలో అడుసు తీయడానికి అయిదేళ్ళ క్రితం 2017లోనే కేంద్రం రూ. 400 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. పూడిక తీశాక రూ. 40 వేల కోట్లతో 725 కి.మీ పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ యోచనా చెప్పారు. కానీ వాటికి అతీగతీ లేదు. అధిక వ్యయమయ్యే కరకట్టలు, పూడికతీతలతో పెద్దగా ప్రయోజనం లేదు గనక ఇప్పటికైనా సమగ్ర ప్రణాళికకు శ్రీకారం చుట్టాలి. అస్సామ్‌తో పాటు వరద బీభత్సానికి గురవుతున్న పొరుగు రాష్ట్రాలు సైతం కలసికట్టుగా అడుగేయాలి. సమష్టిగా వనరుల సమీకరణ, సమాచార వినిమయంతో పరిష్కారం కనుగొనాలి. ఏటా కోట్లలో నష్టం తెస్తున్న వరద వైపరీత్యాన్ని అస్సామ్ ప్రభుత్వం ఎంతో కాలంగా కోరుతున్నట్టు జాతీయ సమస్యగా ప్రకటించే ఆలోచన కేంద్ర సర్కార్ చేయాలి. తక్షణ సాయం అందించడంతో పాటు రాష్ట్రాల మధ్య సమన్వయ బాధ్యతను చేపట్టాలి. సామాన్యులు సైతం మాగాణి నేలల ప్రాధాన్యాన్నీ, యథేచ్ఛగా అడవుల నరికివేతతో నష్టాన్నీ గ్రహించాలి. ప్రజానీకం, పార్టీలు, ప్రభుత్వాలు– అంతా కలసికట్టుగా ఈ వరద ముప్పుకు అడ్డుకట్ట వేయకపోతే ఏటా ఈ నష్టం తప్పదు. ప్రజల వినతులు, పార్టీల హామీలు నిష్ఫలమై, ప్రతిసారీ ఎన్నికల అజెండాలో అంశంగా అస్సామ్ వరదల సమస్య మిగిలిపోవడం ఇకనైనా మారాలి. -
రాష్ట్రానికి తుపాన్ల దెబ్బ.. 90వేల కోట్లు నష్టం
తుపానులు అనేక దశాబ్దాలుగా రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. 1977 నుంచి ఇప్పటివరకు ఏకంగా 66 తుపాన్లు రాష్ట్రంపై విరుచుకుపడ్డాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. వీటి వల్ల రూ.90 వేల కోట్లకుపైగా ఆర్థిక నష్టం జరిగింది. 1891 నుంచి 2019 వరకు 184 తుపాన్లు ఏపీ తీరంలో తీరం దాటినట్లు ఐఎండీ (భారత వాతావరణ శాఖ) నివేదికలు చెబుతున్నాయి. ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ల్లో కనీసం ఒక తుపానైనా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపడం ఆనవాయితీగా మారింది. ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి వీటిలో తీవ్ర తుపానులు ఉంటున్నాయి. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. ఒడిశా తర్వాత తుపాన్ల బారిన ఎక్కువగా పడుతున్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. బంగాళాఖాతం తుఫాన్లు ఏర్పడడానికి అనువైన ప్రాంతంగా ఉండడమే ఇందుకు కారణం. 1977 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిన 66 తుపాన్లు ► ఈ 43 ఏళ్లలో 16,450 మంది మృత్యువాత ► అతి తీవ్ర తుపాన్లు.. దివిసీమ ఉప్పెన, హుద్‌హుద్ ► దివిసీమ ఉప్పెనలో 10 వేల మంది మృతి ► తరచూ తుపాను బారిన పడుతున్న 190 మండలాలు ► తీవ్ర తుపాను ముప్పును ఎదుర్కొంటున్న 692 గ్రామాలు ► తుపాన్లకు బంగాళాఖాతం అత్యంత అనువైన ప్రాంతం కావడమే దీనికి కారణం ► దేశంలో ఒడిశా తర్వాత తుపాన్ల తీవ్రత ఏపీలోనే ఎక్కువ హుద్‌హుద్‌దే అగ్రస్థానం.. తుపాన్ల వల్ల ఎక్కువ ఆస్తి నష్టం 2014లో వచ్చిన హుద్‌హుద్ వల్ల జరిగింది. 180 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ఉత్తరాంధ్ర జిల్లాలను తుడిచిపెట్టేశాయి. ఆ తుపాను వల్ల రూ.21,908 కోట్ల నష్టం వాటిల్లింది. అలాగే అతి భయంకరమైన తుపాన్లలో 1977లో దివిసీమ ఉప్పెన నిలిచింది. అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఉప్పెనలో పది వేల మంది మృతి చెందారు. మొత్తం 66 తుపాన్ల వల్ల 77.78 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. 1976 నవంబర్‌లో మచిలీపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర తుపానులో ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ 66 తుపాన్ల వల్ల 16,450 మంది మృతి చెందగా 12.66 కోట్ల మంది ప్రభావితమయ్యారు. తుపానుల వల్ల వచ్చిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. ఇక తుపానుల ఉప్పెనలతో తీర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాల్లో 974 కిలోమీటర్ల మేర 92,906 చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలోని 430 మండలాల్లో 190 మండలాలు తుపాన్ల బారిన పడుతున్నాయి. ఇందులో 17 మండలాలు అతి తీవ్ర ముప్పును ఎదుర్కొంటుండగా, 31 మండలాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. అలాగే సముద్ర తీరానికి 2 కిలోమీటర్లలోపు ఉన్న 692 తీర గ్రామాలు తుపాన్ల బారిన పడుతున్నాయి. ఈ సమయంలో వచ్చే పెద్ద అలల వల్ల ఈ గ్రామాలు దెబ్బతింటున్నాయి. 9 జిల్లాల్లోని మొత్తం జనాభాలో 11 శాతం తుపాన్ల ముప్పు పరిధిలో ఉన్నారు. ఇందులో 7 శాతం అర్బన్, 4 శాతం రూరల్ ప్రాంతాల ప్రజలు ఉన్నారు. విపత్తు ప్రణాళికలు అమలు చేస్తున్నాం.. గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం), వాతావరణ మార్పుల వల్ల కొన్నేళ్లుగా తుపానుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలు, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నాం. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తున్నాం. నష్టాన్ని తగ్గించడం, మరణాలు సంభవించకుండా చూడడం, ఆస్తి, మౌలిక వసతుల నష్టాన్ని సాధ్యమైనంత తక్కువ జరిగేలా చూస్తున్నాం. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ ప్రణాళికలు అమలవుతున్నాయి. తుపాన్లకు ముందు, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏ శాఖ ఎలా వ్యవహరించాలో చెప్పడంతోపాటు ఆ పనిని సరిగా చేస్తున్నాయో, లేదో పర్యవేక్షిస్తున్నాం. – కె.కన్నబాబు, కమిషనర్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ -
ఈ అభివృద్ధి విధ్వంసానికి బాట
కేదార్‌నాథ్‌లో 2013 సంవత్సరం వరదల విలయతాండవం చోటుచేసుకున్న తర్వాత, 11 వేల అడుగుల కంటే ఎత్తులో ఉన్న పూడిపోయిన ఆలయ గర్భగుడి పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. సుప్రసిద్ధ భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ నవీన్ జుయల్ ఆలయ పునర్మిర్మాణంపై తీవ్రంగా హెచ్చరించారు. ఈ ప్రాంతంలో భారీ నిర్మాణం, పెద్దమొత్తంలో సిమెంట్ లేక ఇనుమును ఉపయోగిస్తే కేదార్నాథ్ పరిసరాల్లో భవిష్యత్తులో మరిన్ని విపత్తులు చెలరేగుతాయని హెచ్చరించారు. వేసవిలో మంచు కరిగేటప్పుడు భూ ఉపరితలానికి పైనున్న నేల కిందికి జారిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కానీ పర్యావరణ హెచ్చరికలపై, శాస్త్రీయ వాదనలపై దృష్టి సారించడానికి బదులుగా ఎన్నికల్లో గెలుపు కోసం పరుగుపందెమే ఇప్పుడు ముఖ్యమవుతోంది. కేదార్‌నాథ్‌లో డాక్టర్ జుయల్, ఇతర నిపుణులు పర్యటనలు ప్రారంభిస్తున్నప్పుడు, కేదార్నాథ్, ఉత్తరాఖండ్ కొండల చుట్టూ వెల్లువగా ప్రకృతి విపత్తుల ఘటనలు పెరుగుతూ వచ్చాయి. అక్కడ నిర్మాణపనులు పెరిగినప్పుడే విపత్తులు కూడా పెరగడం కాకతాళీయంగా కొట్టిపారేయలేం. ఈ ఒక్క ఏడాదిలోనే ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విపత్తుల కారణంగా 250 మంది ప్రజలు చనిపోయారు. పైగా ఇవి కలిగించిన ఆర్థిక నష్టాలు తక్కువేమీ కాదు. (చదవండి: ఆ చట్టాలు నేటికీ వివక్షాపూరితమే!) కేదార్నాథ్ ప్రాంతంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి ప్రాజెక్టూ జాతీయ భద్రతతో, మతపరమైన విశ్వాసాలతో ముడిపడి ఉంది. ఈ నెల మొదట్లో కేదార్నాథ్ పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ ‘పర్వతాల్లో నీళ్లు, పర్వతాల్లో యువత’ అనే పాత సామెతను ఉపయోగించారు. తన ప్రభుత్వం ఈ రెండింటినీ (నీరు, యువత) అభివృద్ధి పథకాలతో కాపాడటానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే జీవితాలను నిలబెట్టడానికి బదులుగా పర్వతాల్లోని నీరు వేగంగా నిర్మించిన డ్యాముల్లో ఇరుక్కుపోయి ఉంది. వరదల రూపంలో పదేపదే విపత్తులకు కారణమవుతోంది. రాష్ట్రంలో 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలను ప్రకటిస్తూ, ఈ శతాబ్ది మూడోదశాబ్దం ఉత్తరాఖండ్‌దే అవుతుందనీ, గత వందేళ్లలో ఎన్నడూ చూడని విధంగా వచ్చే పదేళ్లలోనే రాష్ట్రానికి పర్యాటకులు వెల్లువెత్తుతారనీ మోదీ ఘనంగా ప్రకటించారు. రాష్ట్రంలో అనేకమంది ప్రజలకు మతపరమైన, ప్రకృతిపరమైన పర్యాటకం ఒక్కటే ఏకైక ఆధారం అనేది నిజం. కానీ ఉత్తరాఖండ్‌లో ప్రోత్సహిస్తున్న ప్రణాళికలు కొంతమంది కాంట్రాక్టర్లకు, కంపెనీలకు మాత్రమే లబ్ధి కలిగిస్తాయి. వీటి నుంచి సామాన్య ప్రజానీకం పొందేది ఏమీ లేదు. (చదవండి: కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!) పర్యావరణ నియమాలను నిర్లక్ష్యపర్చడం, విచక్షణారహితంగా అడవులను నరికేయడం కారణంగా ఈ యాత్రామార్గంలో నిర్మాణ పనులు తరుచుగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. చార్ధామ్ యాత్రా మార్గాన్ని అన్ని వాతావరణాల్లో పనిచేసే రహదారిగా పేర్కొన్నారు. కానీ నాణ్యతా లోపం వల్ల కట్టిన రహదారి ఎప్పుడో మాయమైపోయింది. నదీ ఉపరితలాలను ఆక్రమించడం, అక్రమ నిర్మాణాలు, పేలవమైన నగర నిర్వహణ వంటివి విపత్తులకు కారణాలు. ఢిల్లీ–మీరట్ హైవే లేదా ఉత్తరాఖండ్‌లో ముంబై–పుణే హైవే వంటి రహదారుల నిర్మాణం అన్ని వాతావరణాల్లో పనిచేసేవిధంగా ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది పర్వత ప్రాంత భౌగోళికతకు దూరంగా లేదు. అందుకనే ప్రతి ఏటా ఈ రోడ్లు వరదల్లో కొట్టుకుపోతుంటాయి. ప్రజాధనం వృథా అయిపోతుంటుంది. పర్యావరణానికి మాత్రం కోలుకోలేని నష్టం జరుగుతుంటుంది. సరిహద్దు ప్రాంతాలకు నాణ్యమైన రహదారులు కావాలి తప్ప వెడల్పాటి రహదారులు అవసరం లేదు. పైగా అత్యంత సున్నిత ప్రాంతాల్లో రహదారులను నిర్మించడమే కాకుండా, సొరంగాలు కూడా తవ్వడం మరీ ప్రమాదకరం. కేదార్‌నాథ్‌కి కేబుల్ కార్లలో నేరుగా చేరుకోవాలన్న ప్రధాని మోదీ ఆలోచన పర్యావరణ పరిరక్షణకు భిన్నంగా ఉంది. పైగా ఆధ్యాత్మిక యాత్రల స్ఫూర్తికి అది దూరంగా ఉంటుంది. కేదార్ మార్గ్ ప్రయాణంలో ప్రకృతి నిసర్గ సౌందర్యం నుంచి నడుచుకుంటూ పోతూ చివరి గమ్యాన్ని చేరుకున్నప్పుడు కఠిన ప్రయాణాన్ని అధిగమించిన భావన మనసు నిండా వ్యాపిస్తుంది. కానీ కేదారనాథ్‌లో ఇప్పుడు హెలికాప్టర్లు రొదపెడుతున్నాయి. న్యాయస్థానాల ఆంక్షలను ఈ హెలికాప్టర్లు ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తున్నాయి. నిరంతరం ఇవి పెట్టే రొద, శబ్దాలు కేదార్ రక్షిత లోయలోని పక్షులు, జంతువుల ఉనికికి ప్రమాదకరంగా మారుతున్నాయి. నడకదారిలో యాత్ర మెల్లగా సాగిపోతున్నప్పుడు యాత్రికులు అక్కడక్కడా కూర్చుంటూ మరింత ఎక్కువ సమయం ఈ ప్రాంతంలో ఆహ్లాదంగా గడిపేవారు. స్థానిక దుకాణదారులు, దాబా యజమానులు, టీ విక్రేతలు, వ్యాపారులు, సరకులు మోసే వారు, ఇంకా అనేకమంది లబ్ధి పొందేవారు. దీనికి భిన్నంగా హెలికాప్టర్లు, హైవే వల్ల కొన్ని ఎంచుకున్న కంపెనీలకు, ట్రావెల్ ఏజెంట్లకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. గ్లాస్గోలో కాప్–26 వాతావరణ సదస్సు జరుగుతున్నప్పుడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ సదస్సు నుంచి తిరిగొచ్చిన ప్రధాని పర్యావరణ హిత జీవన శైలి అనే నినాదాన్ని ఇచ్చారు. కానీ ప్రకృతిని వట్టి నినాదాల ద్వారా మాత్రమే కాపాడలేమని పదేపదే రుజువవుతోంది. ప్రకృతిని ఛిన్నాభిన్నం చేసే ప్రతి ఒక్క ప్రయత్నమూ, నేటి, రేపటి తరాలను బలి తీసుకుంటుందని మరవరాదు. – హృదయేష్ జోషీ రచయిత, సంపాదకుడు -
రైతు నష్టపోవద్దు
-
ఈ కేఫ్‌లో వరద ఉధృతిని నేరుగా వీక్షిస్తూ ఆస్వాదించచ్చు!
థాయ్‌లాండ్: ఒక పక్క కరోనా మహమ్మారీ కారణంగా చాలా వ్యాపారాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయంటే మరోవైపు ప్రకృతి విపత్తుల కారణంగా మరింత దారుణంగా దెబ్బతింటున్నాయి. చాలా మంది ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో తెలియక నిరాశ నిస్ప్రుహలతో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కానీ కొంతమంది ఆ కష్టాలనే ఆసరాగా చేసుకుని పలు అవకాశాలను సృష్టించుకుని అందరిచేత 'ఔరా' అనిపించేలా గొప్పగా బ్రతికి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిన వారే థాయ్‌లాండ్‌కి చెందిన కేఫ్ యజమాని టిటిపోర్న్ జుటిమనాన్ (చదవండి: ఎయిర్‌లైన్స్ మహిళా సిబ్బంది..... ఇక హైహిల్స్, స్కర్ట్స్‌కి స్వస్తీ) వివరాల్లోకెళ్లితే.......ఈ ఏడాది ఆరంభంలోనే కోవిడ్ సెకండ్ వేవ్ విజృభించి ప్రపంచదేశాలన్ని సెకండ్ లాక్‌డౌన్‌ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమలోనే టిటిపోర్న్ జుటిమనాన్ ఉత్తర బ్యాంకాక్‌కు సమీపంలోని నొంతబురిలో చావో ఫ్రయా యాంటిక్ కేఫ్‌ను నిర్వహిస్తున్నాడు. మొన్నమొనటి వరకు కరోనా కారణంగా లాక్ డౌన్‌తో కేఫ్ మూసేయడంతో నష్టాల్లో ఉందనకుంటే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా థాయ్‌లాండ్‌లోని నదులన్ని వరదలో పొంగి పొరలుతున్నాయి. మళ్లీ మరోసారి కేఫ్ మూసేయాల్సిందేనా అని ఆలోచనలో మునిగిపోయాడు. దీన్నే అవకాశంగా మార్చుకుని కస్టమర్లను ఎందుకు ఆకర్షించకూడదు అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టాడు. వరదలకు తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కేఫ్ రన్ చేస్తే.. ఒక పక్క కస్టమర్లు లైవ్‌లో వరద ఉద్దృతిని వీక్షించినట్టు ఉంటుంది, కేఫ్‌ను మళ్లీ యథావిధిగా రన్ చేయగలిగే అవకాశం ఉంటుందని టిటిపోర్న్ భావించాడు. అతనూ ఊహించిందే నిజమైంది. వరదనీటిని చూస్తూ థ్రిల్‌గా ఫీలవుతూ ... కేఫ్‌లో వాళ్లకి ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని చక్కగా ఆస్వాదిస్తూ తింటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింగ తెగ వైరల్ అవుతోంది. అయితే విపత్తును మరో సంక్షోభంగా భావించకుండా దాన్నే కేఫ్ యజమాని 'టిటిపోర్న్' ఒక మంచి అవకాశంగా మార్చుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. (చదవండి: ఇక నుంచి వీధుల్లో రోబోల గస్తీ...) -
ఈ వైపరీత్యం ఎవరి పాపం?
పర్యావరణ మార్పుల ప్రభావంతో విధ్వంసం ఏదైనా సరే.. పేదదేశాలకే పరిమితమని పాశ్చాత్య దేశాల ప్రజల్లో సర్వసాధారణంగా ఉన్న అంచనాను గత రెండువారాలుగా జరుగుతున్న పరిణామాలు పటాపంచలు చేశాయి. వరదకు అర్థం తెలీని జర్మనీలో.. అమెరికా, కెనడాల్లో చెలరేగిన వడగాల్పుల్లో వందలాది మంది మృతి చెందడం యావత్ ప్రపంచానికీ గుణపాఠం కావాలి. ఈ ఆకస్మిక వైపరీత్యాల సమస్యను సంపన్నదేశాలు ఏదోలా అధిగమిస్తాయన్న ధీమా గాలికి కొట్టుకుపోయింది. కోవిడ్ కానివ్వండి.. ఇంకో ప్రకృతి విపత్తు కానివ్వండి.. ప్రతి ఒక్కటీ మనకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతా కచ్చితంగా ఉంటుందని! యూరప్‌లో వరద బీభత్సం... కెనడాలో చరిత్రలో ఎన్నడూ ఎరగని స్థాయి ఉష్ణోగ్రతలు.. అకాల వర్షాలు... వరదలు!! ఇటీవలి కాలంలో సర్వత్రా వినిపిస్తున్న వార్తలివే. కారణాలు సుస్పష్టం. వాతావరణ మార్పులు. అయితే బాధ్యత ఎవరిదన్న విషయానికి వస్తే మాత్రం ప్రపంచం రెండుగా విడిపోయిందనే చెప్పాలి. జర్మనీలో ఇటీవలి వరదకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశమైనప్పటికీ వరదను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితిలో ఎందుకుంది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం నీళ్లు నములుతోంది. ‘‘జరిగిన విధ్వంసాన్ని వర్ణించేందుకు జర్మన్ భాషలో పదాలు కరవయ్యాయి’’ అని చాన్స్‌లర్ ఏంజెలా మార్కెల్ ఓ టీవీ రిపోర్టర్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానిస్తే... ఓ సామాన్య మహిళ మాత్రం ‘‘అసలు వరదల్లాంటివన్నీ పేద దేశాల్లో కదా జరగాలి. జర్మనీలోనూ వస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు. వాన ఎంత వేగంగా వచ్చిందో... అంతే వేగంగా మనుషులను తనతో తీసుకెళ్లిపోయింది’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంపన్న దేశాలు మినహాయింపు కాదు... ఈ మహిళ తన వ్యాఖ్యలో తెలిసో తెలియకో పాశ్చాత్యదేశాల్లోని మెజార్టీ ప్రజల్లో ఉన్న ఒక తప్పుడు అవగాహనను ఇంకోసారి స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల ప్రభావం తాలూకూ విధ్వంసం ఏదైనా సరే.. పేదదేశాలకే పరిమితమన్నది వీరి అంచనా. అధిక జనాభాతో కిటకిటలాడే ఆయా దేశాల తీర ప్రాంతాల్లోనే నష్టం ఎక్కువగా ఉంటుందని.. ధనిక దేశాలకు ఏం ఫర్వాలేదన్న అపోహకు హేతువేమిటో తెలియదు. అంతేకాదు. సంపన్నదేశాలు ఏదోఒకలా ఈ సమస్యను అధిగమిస్తాయన్న ధీమా కూడా వారిలో వ్యక్తమవుతూంటుంది. కానీ వాస్తవం మాత్రం ఇందుకు భిన్నం. ప్రాంతం ఏదైనా.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగే జననష్టం మాత్రం అంతా ఇంతా కాదు. అయితే ఈ సంఘటనలకు మనం ఎలా స్పందిస్తున్నామన్న అంశంపైనే వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చలు విభేదాలకు దారితీస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల పేద దేశాలే ఎక్కువ నష్టపోతాయన్న అంచనా కూడా ఇలాంటిదే. కానీ కోవిడ్ కానివ్వండి.. ఇంకో ప్రకృతి విపత్తు కానివ్వండి.. ప్రతి ఒక్కటి మనకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతా కచ్చితంగా ఉంటుందని! వాతావరణ మార్పులపై ఈ ఏడాది మరోసారి అంతర్జాతీయ స్థాయి చర్చలు జరగనున్నాయి. బ్రిటన్‌లోని గ్లాస్గ్లవ్లో ఈ చర్చ జరగాల్సి ఉండగా.. ఈ ఏడాది కూడా కనివినీ ఎరుగని రీతిలో ప్రకృతి విపత్తులు చవిచూశాం మనం. కాలిఫోర్నియాను అలవికాని దావానలం చుట్టేస్తే.. అమెరికాలో దశాబ్దాల తరువాత వడగాడ్పులు వీస్తున్నాయి. ఉత్తర అమెరికాలో భాగమైన కెనడాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకోవైపు జర్మనీలో వరదలు.. వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో చైనాలో వాన బీభత్సం. ఇవన్నీ ఇటీవలి పరిణామాలే. చైనాలో ప్రళయాన్ని తలపించేలా కార్లు, విమానాలు నీళ్లలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సుదూర భవిష్యత్తులోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దేశీయంగా చూస్తే.. నలభై ఏళ్లలో లేనంత స్థాయిలో వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలమైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేవలం ఆరు వారాల వ్యవధిలో రెండుసార్లు ప్రమాద హెచ్చరికలను చూడాల్సి వచ్చింది. ఉప్పొంగిన సముద్రకెరటాలు ఒకవైపు.. ఎడతెరిపిలేని వానలు ఇంకోవైపు మహా నగరాన్ని భయంతో కంపించేలా చేశాయంటే అతిశయోక్తి కాదేమో. చిన్నపాటి వర్షానికే నగరాలు చెరువుల్లా మారిపోతూండటానికి నగర ప్రణాళికల్లో లోపం, వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ విపరీతంగా సాగుతున్న కాంక్రీట్ నిర్మాణాలు కొంత కారణమైనప్పటికీ... ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువయ్యాయని అందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవ చేష్టల ఫలితంగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయని.. భవిష్యత్తులో వీటి ప్రభావం మరింత తీవ్రమవుతాయని.. సముద్రతీర ప్రాంతాల్లోని మహానగరాలు నీటమునిగినా ఆశ్చర్యం లేదని అందరూ అంగీకరిస్తున్నా.. కొన్ని ధనికదేశాలు ఈ విపత్తును అధిగమించగలవన్న ఆశ కొనసాగుతూండటం ఆందోళనకరం. ఆధిపత్య భావజాలమా? అతితక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం! ఇలాంటి అనూహ్య పరిణామాలు తరచూ జరుగుతుంటాయని వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి కమిటీ ఐపీసీసీ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. భూతాపోన్నతి కారణంగా సంభవించే వాతావరణ మార్పుల్లో ఇదీ ఒకటని కూడా విస్పష్టంగా పలు నివేదికల్లో పేర్కొంది. ఇది ప్రపంచంలోని అన్నిదేశాలకూ వర్తించే అంశమైనప్పటికీ ఈ విషయమై వివక్ష స్పష్టంగా కనిపిస్తూంటుంది. తెల్లతోలు ఆధిపత్య భావజాలం కనిపిస్తూంటుంది. ప్రకృతి వనరులను రేపన్నది లేని చందంగా వాడేసుకుంటూ వాతావరణ మార్పులకు వారే కారణమవుతున్నా.. నెపం మాత్రం పేద దేశాల్లోని అధిక జనాభాపై నెట్టేయడం ఈ భావజాలానికి ఓ ప్రతీకగా చెప్పుకోవచ్చు. కొందరి సోకు.. అందరి శోకం! వాతావరణ మార్పుల విషయంలో వాస్తవం ఏమిటంటే.. పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం. ప్రధాన భూమిక దీనిదే. కొందరి కార్బన్ ఫుట్‌ప్రింట్ (మన జీవనశైలి, అలవాట్ల ఫలితంగా ఉత్పత్తి అయ్యే విషవాయువుల మోతాదు. వాహనాల్లో పెట్రోలు వాడకంతో కార్బన్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ వంటి వాయువులు వెలువడుతూంటాయి). అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఒకసారి తరచి చూస్తే.. కేవలం కొన్ని దేశాలు, ప్రజల కార్బన్ ఫుట్‌ప్రింట్ అధిక జనాభా ఉన్న ఇతర దేశాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటంతోనే ప్రపంచం ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రపంచ వనరులపై 2019 నాటి ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. అధిక ఆదాయానికి, భూ వాతావరణంపై పడుతున్న ప్రభావానికి ప్రత్యక్ష సంబంధం ఉందని చెబుతుంది. అధిక జనాభా కానే కాదు. ఆదాయం పెరిగిన కొద్దీ విలాసాలు ఎక్కువవుతాయన్నది అనుభవం. ధనికదేశాల్లో జరుగుతున్నది అదే. జనాభా వృద్ధి రేటు తగ్గుతున్నా.. ఆయా దేశాల్లో వనరుల వినియోగంలో మాత్రం తగ్గుదల నమోదు కావడం లేదు. అంతేకాదు.. తక్కువ ఆదాయమున్న దేశాల్లో జనాభా ఎక్కువవుతున్నా వారి వనరుల కోసం డిమాండ్‌లో మాత్రం వృద్ధి లేకపోవడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచ వనరుల్లో పేద దేశాల డిమాండ్ మూడు శాతంగానే కొనసాగుతోంది. ఏతావాతా... వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించాలంటే.. జనాభ సమస్యను కాకుండా.. ఐశ్వర్యం అనే సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ ఏడాది జర్మనీలో తరహాలోనే పలు ప్రకృతి వైపరీత్యాలను చవిచూడాల్సి వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రపంచం ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పరిస్థితి ఇంతకంటే దిగజారకుండా జాగ్రత్త పడినాచాలు. ఇది జరగాలంటే రానున్న కాప్ 26 సమావేశాల్లో ధనిక దేశాల వివక్ష సమస్యపై కచ్చితంగా చర్చ జరగాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల ప్రభావం భూమ్మీద ప్రతిఒక్కరిపై ఉంటుందన్న ఎరుక కలిగినప్పుడే దాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని, విపత్తును నివారించగలమని అందరూ గుర్తించాలి. బహార్ దత్ వ్యాసకర్త పర్యావరణ జర్నలిస్టు, అధ్యాపకురాలు -
మోత కష్టం, లేత కొండలవి!
ప్రకృతిని లెక్కజేయని మనిషి తత్వం తీరని ఉపద్రవాలు తెస్తోంది. ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణ మౌతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జనిత కరోనా మహమ్మారి నుంచి... అదే చైనా నేలపై వెయ్యేళ్లలో లేని వర్షాలు జనావాసాలను ముంచెత్తడం వరకు ఇవన్నీ ప్రకృతి చెబుతున్న పాఠాలే! అయినా మనిషి నేర్చుకుంటున్నదెక్కడ? అనావృష్టి, అతివృష్టి, ఎన్నడూ లేని ఎండలు, వరదలు– వడగాలులు, కరుగుతున్న ధ్రువాలు, పెరుగుతున్న సముద్ర మట్టాలు... ఈ రోజు ప్రపంచమంతా అసాధారణ వాతావరణ పరిస్థితుల్ని చవిచూసి, దుష్ఫలితాలు అనుభవిస్తోంది. అర్ధ శతాబ్దిలో లేని వర్షాలు అయిదారు రోజుల పాటు మహారాష్ట్రను ముంచెత్తి అతలాకుతలం చేశాయి. హిమాచల్ ప్రదేశ్, సిర్మౌర్ జిల్లాలో తాజాగా కొండ చరియ విరిగి, క్షణాల్లో వంద మీటర్ల మేర జాతీయ రహదారి అమాంతం లోతైన లోయలోకి జారిన తీరు గగుర్పాటు కలిగించింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం లేదు గానీ, వందలాది వాహనాలు ఎటూ వెళ్లే దారిలేక కొండల్లో చిక్కుబడిపోయాయి. ఈ వారంలోనే కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగి తొమ్మిది మంది యాత్రికులు మరణించారు. ఒక్క హిమాచలే కాదు, ఉత్తరాఖండ్ తదితర హిమాలయ రాష్ట్రాల్లో ఇది తరచూ జరుగుతోంది. ప్రకృతి సమతుల్యతకు విఘాతం కలిగించేలా జలవిద్యుత్ ప్రాజెక్టులు, బహుళ అంతస్తు భవనాలు, అడ్డదిడ్డం రోడ్లు, ఆ క్రమంలో... అడవుల్ని నరకడం వంటి మానవ చర్యలు భూమ్యావరణ స్థితికి భంగం కలిగిస్తున్నాయి. ప్రమాదాల్ని ఆహ్వానించి విపత్తులు పెంచుతున్నాయి. భూభౌతిక పరిణామ ప్రభావాలకు తోడు మానవ ప్రమేయ కారణాలు, తాజాగా తలెత్తిన పర్యావరణ మార్పు ప్రతికూల తలు వెరసి కొత్త సమస్యలు తెస్తున్నాయి. విపత్తుల్ని ఇంకా తీవ్రం చేస్తున్నాయి. వీటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి, విపత్తులు... తట్టుకునే (రెసిలియెన్స్), సమర్థంగా ఎదుర్కొనే (మిటిగేషన్), ఏదోలా సర్దుకునే (అడాప్టబిలిటీ) సామర్థ్యాల్నిచ్చే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. ఇందుకు అవసరమైన నిర్దిష్ట కార్యాచరణలో వరుస ప్రభుత్వాలు విఫలమౌతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత యువ పర్వతశ్రేణి హిమాలయాలు. భారత–యూరేషియా ప్లేట్లు ఢీకొంటున్న ప్రక్రియ వల్ల టిబెట్ పీఠభూమి, హిమాలయాలు ఏర్పడ్డాయి. 50 మిలియన్ సంవ త్సరాల కింద మొదలైన ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అందుకే, అత్యంత ఎత్తుగా, సున్ని తంగా, కుదురుకుంటున్న స్థితిలో ఉంటాయీ పర్వతాలు. దానికి తోడు హిమంతో కప్పుకొని ఉండటం కూడా సున్నితత్వం పెంచేదే! ఏ ఆరావళి పర్వతశ్రేణి లాగో, మరే తూర్పు–పశ్చిమ కను మల్లాగానో పురాతన శ్రేణి కాదిది. మానవ కల్పిత పర్యావరణపరమైన ఒత్తిళ్లను హిమాలయాలు తట్టుకోలేవు. కొత్తగా పోసిన ఇసుక రాసిలాగా కిందకు జారే తత్వం ఎక్కువ! పొరలు గట్టిపడలేదు కనుక కొండచరియలు విరిగిపడటం సహజం. దానికి తోడు విశ్వవ్యాప్తంగా పెరిగిన కర్బన ఉద్గారాలు, ఇతర కాలుష్యాల వల్ల భూతాపోన్నతి పెరుగుతోంది, మంచు కరుగుతోంది. మేఘ విస్పోటనాల వల్ల నిమిషాల్లో కుంభవృష్టి కురిసి కొండ చరియలు అమాంతం విరిగిపడుతున్నాయి. ఈ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోకుండా చేస్తున్న మానవ ప్రమేయ, ప్రేరిత చర్యలు విపత్తులు పెంచి, సమస్యను జటిలం చేస్తున్నాయి. గడచిన ఒకటిన్నర దశాబ్దాలుగా హిమాలయ రాష్ట్రాల్లో తలెత్తిన ఎన్నో ఉపద్రవాలకు, ప్రాణ–సంపద నష్టాలకు మనం ప్రత్యక్ష సాక్షులం. ఇక ప్రకృతి, పర్యావరణపరమైన నష్టాలకు కొలతలే లేవు! కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి... చార్ధామ్ పుణ్యక్షేత్ర సముదాయపు దారుల్ని చుట్టుముట్టి, కన్నీళ్లు మిగిల్చిన పెద్ద జలవిలయాన్ని లోగడ మనం చూశాం. ఇదంతా భూకంప ఆస్కారపు మండలమే (సీస్మిక్ జోన్)! రిక్టర్ స్కేల్ పైన 3, 4, 5 నమోదయ్యే భూకంపాలు తరచూ జరిగేవే! 1999లో మన దగ్గర, 2015లో నేపాల్ (ఖాట్మండు)లో పెద్ద భూకంపాలొచ్చి తీరని నష్టం జరిగింది. ఇంకో పెద్ద భూకంపానికి ఆస్కారం ఉందని భౌగోళిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో... సహజ నదీ ప్రవాహాలకు అడ్డుకట్టలు, జల విద్యుత్ ప్రాజెక్టులు, పట్టణీకరణ, అశాస్త్రీయ రహదారుల ఏర్పాటు, ఆ మేర అడవుల నరికివేత... ఇవన్నీ విఘాతాలే! స్తంభం నుంచి ఊడి నేలకొరిగిన విద్యుత్ వైర్‌తో ప్రమాద ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది. దానికి మనిషో, మరే జంతువో తగులుకున్నప్పుడది ప్రమాదం కింద మారుతుంది! హిమాలయ పర్వత సానువుల్లో విపత్తు ఆస్కారం నిరంతరం ఉంటుంది. పనిగట్టుకొని మనిషి అందులోకి చొర బడి, సదరు ఆస్కారాన్ని విపత్తుగా మారుస్తున్న సందర్భాలే ఎక్కువ. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధన వాడకం తగ్గించడమనే కారణం చూపి, చౌక జలవిద్యుత్తు ఉత్పత్తి పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు. స్వార్థం హద్దులు దాటుతోంది. సహజ జలధారల్ని అడ్డగించి, 25 శాతం నీటిని రిజర్వాయర్లలో బంధించి, 75 శాతం నీటిని టన్నెల్స్ ద్వారా పంపించడం ప్రమాదహేతువని నేపాల్ భూకంపాన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ, 2018–19 లో సట్లెజ్లోయ ప్రాంతాన్ని సందర్శించిన పార్లమెంట్ (ఇంధన) స్థాయీ సంఘం, ప్రస్తుత జలవిద్యుదుత్పత్తి 10,547 మెగావాట్లు, దీన్ని రెట్టింపు చేసుకోవచ్చు, చేసుకోండని సూచించడాన్ని ఎట్లా అర్థం చేసు కోవాలి? అందుకే, ప్రభుత్వాలకు ప్రజా ప్రయోజనాలు కల్పించే తెలివిడే కాదు, ప్రకృతిని పరిరక్షించి విపత్తుల నుంచి వారిని కాపాడే ఇంగితం, దూరదృష్టి కూడా ఉండాలి. -
ప్రకృతి విలయంగా వరదలు..
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లో వరద తాకిడితో పలు ప్రాంతాలు దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వం వరదలను ప్రకృతి విలయంగా ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం, పునరావాసం కోసం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రూ 100 కోట్ల సాయం ప్రకటించారు. వరదలను ప్రకృతి విలయంగా పరిగణిస్తూ తదనుగుణంగా సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకు అవసరమైన నోటిఫికేషన్ సత్వరం జారీ చేయాలని ఫైనాన్షియల్ కమిషనర్ (రెవెన్యూ)ను సీఎం ఆదేశించారు. గతంలో పంట నష్టాలకు గురైన రైతులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని విడుదల చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు.వరదల్లో నష్టపోయిన రైతాంగంతో పాటు నిర్వాసితులనూ తక్షణమే ఆదుకుంటామని సీఎం అమరీందర్ సింగ్ బాధితులకు భరోసా ఇచ్చారు. -
ఏపీకి కేంద్రం కరవు సాయం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు కరవు సాయం కింద కేంద్రం 900.40 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మొత్తం ఆరు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక నిధుల నుంచి 7,214.03 కోట్ల రూపాయలను మంజూరు చేస్తు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన ఈ కమిటీ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు, కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. 2018-19 ఏడాదిలో వరదలు, కొండచరియలు విరిగిపడటం, గజా తుపాను, అకాల వర్షాలు, కరవు పరిస్థితులు వాటిల్లిన రాష్ట్రాలకు కేంద్రం ఈ సహాయాన్ని ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన మొత్తంలో హిమచల్ ప్రదేశ్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన నష్టానికి సహాయంగా 317.44 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు వరద సహాయంగా 191.73 కోట్లు, ఏపీకి కరవు సహాయంగా 900.40 కోట్లు, కర్ణాటకకు కరవు సహాయంగా 949.49 కోట్లు, మహారాష్ట్రకు కరవు సహాయంగా 4,714.28 కోట్లు, గుజరాత్‌కు కరవు సహాయంగా 127.60 కోట్లు, పుదుచ్చేరికి తుపాన్ సహాయంగా 13.09 కోట్ల రూపాయలు కేటాయించింది. -
నిర్వహణ కాదు.. నివారణ ముఖ్యం
ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఏర్పడుతున్న సంక్షోభాలను నిర్వహిం చడం కంటే వాటిని నివారించడం ఎంతో కీలకమైన అంశం. ఒక చిన్న రాష్ట్రమైన కేరళ ఇటీవల కనీవినీ ఎరుగని వరదల బారినపడి రూ. 21వేల కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. పశ్చిమకనుమల్లో పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన 3 ప్రాంతాల్లో 14 లక్షల చదరపుటడుగుల నేల క్షయమైపోవడంపై మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలోని వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్పర్ట్ ఎకాలజీ ప్యానెల్ చాలాకాలం క్రితమే తీవ్రంగా హెచ్చరించింది. ఈ కీలక ప్రాంతంలో నిర్మాణాలను, మైనింగ్ కార్యకలాపాలను తక్షణం నిషేధించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. కానీ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మాదిరే కేరళ ప్రభుత్వం మాధవ్ గాడ్గిల్ నివేదికను అలా తోసిపుచ్చింది. దీని ఫలితమే పెను వరద బీభత్సం. భారతదేశం ప్రకృతి వైపరీత్యాలకు నిలయం. దేశ భూభాగంలో 70 శాతం మేరకు సునామీలకు, తుపానులకు నిలయంగా ఉంటోంది. దాదాపు 60 శాతం భూమి భూకంపాల బారిన పడుతుండగా, 12 శాతం వరదల బారిన పడుతోంది. కానీ పట్టణ భారత్‌లో మాత్రం బహుళ అంతస్థుల భవనాలను విచ్చలవిడిగా కడుతున్నారు. ఇవి భూమిపై వేస్తున్న అదనపు భారాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా భూకంపాలకు సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సును దేశంలో అతికొద్ది యూనివర్సిటీలు మాత్రమే నిర్వహిస్తుండటం గమనార్హం. ప్రకృతి బీభత్సం ఇంత ప్రమాదకర స్థాయిలో చెలరేగుతున్నప్పటికీ నష్ట నివారణ ప్రక్రియ ఇప్పటికీ దేశంలో శైశవదిశలోనే ఉంటోంది. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కూడా రిస్క్ మేనేజ్మెంట్ రంగంలో నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి సైనిక బెటాలియన్ల ఏర్పాటుతోపాటు ప్రత్యేక బృందాలను ఎర్పర్చుకోవాలని కేంద్ర హోంశాఖ 2003లోనే ప్రతిపాదించింది. ప్రత్యేకించి కేరళ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి శిక్షణా సంస్థను నెలకొల్పుకోవాలని, పోలీసు బెటాలియన్లను సిద్ధం చేసుకోవాలని హోంశాఖ సూచిం చింది కానీ నేటికీ కేరళ ప్రభుత్వం స్పందించలేదు. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. కేదార్నాథ్ విషాదం జరిగి ఏళ్లు గడిచిపోయినప్పటికీ ఉత్తరాఖండ్ రాష్ట్రం మూడు నుంచి ఆరు గంటల ముందే కారు మేఘాల గురించి, అతిభారీ వర్షాల గురించి హెచ్చరించే డాప్లర్ రాడార్ల వ్యవస్థను చాలా పరిమితంగానే కలిగి ఉంది. తగిన సంఖ్యలో హెలిపాడ్లు సరే సరి.. వరద తాకిడికి గురయ్యే ప్రాంతాల్లో నిర్మాణాలు ఎలా జరగాలో సూచించే మార్గదర్శక సూత్రాలు, వరద సమయాల్లో సురక్షిత ప్రాంతాలను గుర్తించే మ్యాప్‌లు కూడా తగినన్ని లేకపోవడం విచారకరం. పర్వతప్రాంతాల్లో భారీ డ్యామ్‌లకు ఆమోదముద్ర తెలిపినప్పటికీ జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ –ఎన్‌ఎమ్‌డీఏ– మూగపోయినట్లు కనిపిస్తోంది. భారత్‌లోని 5 వేల డ్యామ్‌లకు సంబంధించి అతి కొద్ది రాష్ట్రాలు మాత్రమే అత్యవసర కార్యాచరణ పథకాలతో సంసిద్ధంగా ఉన్నాయి. ఇంతవరకు 200 డ్యామ్‌లను మాత్రమే ఇవి కవర్ చేయడం గమనార్హం. మిగిలిన 4,800 డ్యాముల అతీగతీ లేదు. కేవలం 30 రిజర్వాయర్లు, బ్యారేజీలకు మాత్రమే వరద ప్రవాహం గురించిన అంచనాలు సిద్ధంగా ఉన్నాయి ప్రధాన నగరాల్లో వరద ప్రమాదాల గురించిన అంచనా, ఉపశమన చర్యల ప్రాజెక్టుల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదని కాగ్ దుయ్యబట్టింది కూడా. ఇక వరద ప్రాంతాల్లో ధ్వంసమైన ఇళ్లకు చెల్లిస్తున్న నష్టపరిహార మొత్తం దేశమంతా ఒకే విధానంతో ఉండటం సమస్యలను రెట్టింపు చేస్తోంది. నష్టతీవ్రతకు అనుగుణంగా పరిహారం అందించకుండా సమానత్వ ప్రాతిపదికన రూళ్లకర్ర సిద్ధాం తాన్ని అమలు చేస్తే ప్రభావిత ప్రాంతాలు కోలుకోవడం చాలా కష్టం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, మత్స్య పరిశ్రమలు, పశుసంపద, హస్తకళలు వంటి వాటికి జరిగిన నష్టంపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే అవి కుప్పగూలడం తథ్యం. అన్నిటికంటే ముఖ్యంగా విపత్తులు సంభవిం చినప్పుడు సైన్యం, పారామిలటరీ బలగాలను మాత్రమే తరలించే పద్ధతి వల్ల రాష్ట్రాల్లో వరద సహాయక చర్యలు కుంటినడకతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశం బలమైన విపత్తు నిర్వహణా సంస్థను తక్షణం నెలకొల్పాల్సిన అవసరముంది. ఇప్పుడు కావలసింది ప్రకృతి వైపరీత్యాల అత్యవసర నిర్వహణపై దృష్టి సారించడమే కానీ తాత్కాలిక చర్యలతో సరిపెట్టుకోవడం కాదు. ఈ విషయంలో రాష్ట్రాల స్వావలంబన చాలా ముఖ్యం. వరుణ్‌గాంధీ వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
నాటి సహాయక చర్యలు నేటికి స్ఫూర్తి
సాక్షి, న్యూఢిల్లీ : ‘గాడ్స్ ఓన్ కంట్రీ... ఏ ల్యాండ్ ఆఫ్ బ్యూటీ.. ఏ ల్యాండ్ ఆఫ్ ప్లెంటీ... ఏ ల్యాండ్ ఆఫ్ పీస్’గా ప్రసిద్ధి కెక్కిన కేరళలో జల ప్రళయం సంభవించడం ఇదే మొదటి సారి కాదు. అనేక సార్లు కేరళలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా 1924, 1999లో వచ్చిన వరదలు అపార ప్రాణ, ఆస్తి నష్టాలను కలిగించాయని చరిత్ర పుటలు తెలియజేస్తున్నాయి. ‘వాటర్! వాటర్ ఎవ్రీవేర్’ అన్న వ్యాఖ్యంతో ప్రముఖ మలయాళ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత థకాజి శివశంకరన్ పిల్లై నవల ‘ఇన్ ది వాటర్’ మొదలవుతుంది. ‘టావన్కోర్లో అది అతిఎత్తైన దేవాలయం. దాని శిఖరంపై 67 మంది పిల్లలు, 350 మంది పెద్దలు, గొర్రెలు, మేకలు, పెంపుడు జంతువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని వారాలుగా భారీ వర్షాలు కురవడంతో వందలాది మానవులు, వేలాది జంతువుల ప్రాణాలు నీటిలో కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లూ, జీవనాధార పంటలు నీటి పాలయ్యాయి. నీటిలో గర్భవతులు, పిల్లల నరక యాతన వర్ణనాతీతం’ అని 1924లో సంభవించిన వరదల గురించి థకాజి తన పుస్తకంలో వర్ణించారు. ఆయన అలప్పూజ జిల్లాలోని థకాజి గ్రామంలో జన్మించడంతో ఆయన ఊరిపేరుతోనే ఆయన్ని పిలిచేవారు. 1924లో జూలై నెలలో వరదలు వచ్చాయి. వరదల కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు ఆగస్టు మొదటి వారంలో అనేక ప్రాంతాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. అలా అంబాలపూజలో 4,000 మందికి, అలెప్పి శిబిరంలో 3,000 మందికి, కొట్టాయంలో 5,000 మందికి, ఛంగనస్సరీలో 3,000 మందికి, పరూర్‌లో 8,000 మందికి ఆశ్రయం కల్పించారు. ఇవే కాకుండా ఇంకా అనేక చోట్ల నాడు ఆశ్రయం కల్పించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ‘మన్నార్ ఫ్లడ్ రిలీఫ్ డిప్యూటేషన్’ నివేదిక ప్రకారం నాడు వరదల వల్ల ఒక్క మధ్య ట్రావన్‌కోర్ ప్రాంతంలోనే 500 ఇళ్లు, 200 కొబ్బరి తోటలు, వెయ్యి ఎకరాల భూమి, 6,40,000 కిలోల ధాన్యం నీటి పాలయ్యాయి. నాడు బ్రిటీష్ మద్రాస్ పాలకులు వరద సహాయక చర్యల కోసం నిపుణుడైన టి. రాఘవయ్యను నియమించారు. ఆయన ఆధ్వర్యంలో సహాయక కమిటీ ఏర్పాటై నిరంతరగా పనిచేసింది. అప్పటి ట్రావన్‌కోర్ పాలకుడు మహారాజ మూలమ్ తిరునాల్ ఆ ఏడాదికి ప్రజల పన్నులన్నింటిని రద్దు చేశారు. వ్యవసాయ రుణాల కోసం నాలుగు లక్షల రూపాయలను కేటాయించారు. ఈ దిశలో ఆయన కన్నుమూశారు. అప్పట్లో కూడా మూడు రోజులపాటు సంతాప దినాలు పాటించాలి. ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించరాదు. అయితే ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన సేతు లక్ష్మీ భాయ్ సహాయక చర్యలను అధికారికంగా అనుమతించారు. ఎప్పటికప్పుడు రాఘవయ్యతో పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకున్నారు. రైతుల వ్యవసాయ రుణాల బడ్జెట్‌ను నాలుగు లక్షల రూపాయల నుంచి ఐదున్నర లక్షల రూపాయలకు పెంచారు. పేదల ఇళ్ల పునర్నిర్మాణం కోసం అడవిలోని వెదురు చెట్లను ఉచితంగా కొట్టుకొని తెచ్చుకునే హక్కును కల్పించారు. పదివేల మంది రైతులకు ఐదు వందల రూపాయల చొప్పున నాడు రుణాలు అందజేశారు. రైతుల ఆర్థిక పరిస్థితిని బట్టి వడ్డీ రేటును 6.25 శాతం నుంచి ఆరుకు, అంతకన్నా తక్కువకు తగ్గించారు. కొన్ని లక్షల రూపాయలతో రోడ్లు, మంచినీటి సౌకర్యాలను పునరుద్ధరించారు. అప్పుడు ప్రజలు తమ సొంత ఊళ్లకు తరలి వచ్చారు. అప్పటి వరకు తన పట్టాభిషేక ఉత్సవాన్ని వాయిదా వేసుకున్న రాణి లక్ష్మీ భాయ్ ఆ తర్వాత ఉత్సవాన్ని అధికారికంగా జరుపుకున్నారు. మను ఎస్ పిళ్లై రాసిన ‘ది ఐవరీ త్రోన్: క్రానికల్స్ ఆఫ్ ది హౌజ్ ఆఫ్ ట్రావెన్కోర్’ పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి. నేటి పాలకులకు స్ఫూర్తి కోసం నాటి వివరాలు. సంబంధిత కథనాలు: పునరావాసమే సవాల్! ఎందుకు ఎయిర్ పోర్టుల్లోకి వరదలు? సామాన్యులే రియల్ హీరోలు మనిషి పుడతాడు కష్టంలో కేరళలో ఎందుకీ వరదలు? -
కేరళలో ఎందుకీ వరదలు?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో భారీ వరదలకు అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇందుకు కారణం ఏమిటని ఎవరిని ప్రశ్నించిన ‘భారీ వర్షాలు’ అని సమాధానం ఇస్తారు. భారీ వర్షాలకు కారణం ఏమిటని అడిగితే అల్పపీడనం అనో, పర్యావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు వల్లనో అనో సమాధానం ఇస్తారు. ఇక వర్షాలు ఎక్కువ పడినా, తక్కువ పడినా ‘ఎల్ నైనో’ లేదా ‘లా నైనో’ ప్రభావమని ఇటు ప్రభుత్వం అటు అధికార యంత్రాంగం చెబుతోంది. ఇందులో సగం మాత్రమే ఉంది. ప్రభుత్వం విధాన లోపం కారణంగానే వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఎక్కువగా ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఆగస్టు 15 నాటికి కేరళ రాష్ట్ర వ్యాప్తంగా పడాల్సిన వర్షపాతం కన్నా మూడు రెట్లు వర్షపాతం ఎక్కువగా ఉంది. మొత్తం రాష్ట్రంలో కురిసిన వర్షపాతం ఎంతో ఇదుక్కి, వేయనాడ్ జిల్లాల్లో అంత వర్షపాతం కురిసింది. కేరళను ఆనుకొని ఉన్న కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. తమిళనాడులోని ఈరోడు, నమ్మక్కల్ ప్రాంతాల్లో, కర్ణాటక కొడగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి భారీగా వరదలు వచ్చాయి. కేరళలో సాధారణ వర్షపాతం కన్నా 30 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. సహజ సిద్ధమైన కొండలు, లోయలు ఎక్కువగా ఉండే కేరళలో ఇంత ఎక్కువ వర్షపాతం కురిసినంత మాత్రాన ఇంతటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాల్సిన అవసరం లేదు. అయిన జరిగిందంటే మానవ తప్పిదమే. పాలకులు విధాన నిర్ణాయక లోపమే. 11 రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన కోచి విమానాశ్రయం ఎక్కడుందంటే ఇప్పటికే ఎంతో బక్క చిక్కిన పెరియార్ నదికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉంది. భారీ వర్షాలు పడినప్పుడు వరదలు రమ్మంటే రావా? ఇక భారీ వర్షాలు కురిసిన ఈరోడు, నమ్మక్కాల్ ప్రాంతాలను తీసుకుంటే కావేరి నది ఒడ్డున కార్మికులు నిర్మించిన ఇళ్లన్ని కొట్టుకుపోయి ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. కావేరి నదికి నాలుగు కిలోమీటర్ల దూరంలో వరిపొలాలకు నీరందక రైతులు ఆందోళన చెందుతుంటే కావేరీకి వరదలొచ్చి ప్రాణ నష్టం సంభవించిందటే ఎవరి తప్పు? ఇవి ఉదాహరణలు మాత్రమే. కేరళలో కొండ చెరియలు విరిగి పడి ప్రాణ నష్టం సంభవించడానికి క్వారీలు కారణం. ఇటు క్వారీలు, అటు నదీ ప్రవాహాల పక్కన జనావాసాలు, మానవ నిర్మాణాల వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. -
ఇంతకు ‘జాతీయ విపత్తు’ అంటే ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో ఈ శతాబ్దంలోనే ఎన్నడు ఎరగనంతగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం నాడు ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, 500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కేరళ వరదలను ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని అదే రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్‌కు సోషల్ మీడియాలో అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇంతకు జాతీయ విపత్తు అంటే ఏమిటీ? అలా ప్రకటించడం వల్ల ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయం కన్నా ఎక్కువ సహాయం లభిస్తుందా? ప్రకృతి వైపరీత్యాల వల్లగానీ, మానవ తప్పిదాల వల్లగానీ, ప్రమాదాల వల్లగానీ అపార ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించినప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు 2005లో అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్’ను తీసుకొచ్చింది. అయితే అందులో ఫలానాది జాతీయ విపత్తు, రాష్ట్ర స్థాయి లేదా జిల్లాస్థాయి విపత్తు లేదా స్థానిక విపత్తు అని వివరించి చెప్పేందుకు ఎలాంటి నిబంధనలుగానీ, ఎలాంటి మార్గదర్శకాలుగానీ లేవు. ‘ఏ ప్రాంతంలోనైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల, మానవ తప్పిదాల వల్ల, ప్రమాదాల వల్ల అపార ప్రాణ, ఆస్తి నష్టాలు లేదా మానవులకు కష్టాలు, పర్యావరణకు నష్టాలు ఏర్పడి, వాటిని నివారించడం ఆ ప్రాంతం అధికార యంత్రాంగానికి సాధ్యమయ్యే పరిస్థితి లేకుంటే వాటిని ప్రళయంగా, బీభత్సంగా, ఘోర ప్రమాదంగా భావిస్తాం’ అని మాత్రమే చట్టంలో నిర్వచనం ఉంది. ఈ చట్టం పరిధిలో ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్’ అనే ప్రభుత్వ విభాగం ఒకటి పనిచేస్తోంది. అది కూడా కార్యనిర్వహణా విభాగంలా కాకుండా సలహా సంఘంగానే పనిచేస్తోంది. రాష్ట్ర సంక్షోభ నిరోధక సలహా సంఘాలతో సలహా సంప్రదింపులకే పరిమితం అవుతోంది. ‘జాతీయ విపత్తు’ను నిర్వహించడానికి లేదా పిలవడానికి చట్టపరంగా,కార్యనిర్వాహకపరంగా ఎలాంటి నియమ నిబంధనలు, కనీసం సూచనలు కూడా లేవని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్’ ప్రకృతి వైపరీత్యాల విభాగం అధిపతి అనిల్ గుప్తా తెలిపారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, కేంద్రం కేవలం సలహాలకే పరిమితం అవుతుందని ఆయన చెప్పారు. సంక్షోభ పిరిస్థితుల్లో కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. 2016లో ప్రణాళిక విడుదల ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ డిజాస్టర్ మేనేజ్మెంట్’ విభాగం 2016లో ఓ ప్రణాళికను విడుదల చేసింది. అందులో ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ఘోర ప్రమాదాలతో ఏర్పడే విపత్తు పరిస్థితులను మూడు రకాలుగా విభజించారు. ఓ ప్రాంతంలో విపత్తు పరిస్థితులు ఏర్పడి, వాటిని ఎదుర్కోవడం అక్కడి పాలనా యంత్రంగంకు సాధ్యమయ్యే పరిస్థితి ఉంటే దాన్ని ఒకటవ నెంబర్ విపత్తుగా, ఆ ప్రాంతం పాలనా యంత్రాంగానికి సాధ్యమయ్యేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో సాధ్యమయ్యే పరిస్థితులను రెండో విపత్తుగా, ఇక రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఎదుర్కొనే పరిస్థితి లేకపోతే దాన్ని మూడవ విపత్తుగా ఆ ప్రణాళిక నిర్వచించింది. దీన్ని మనం కావాలనుకుంటే జాతీయ విపత్తుగా పిలచుకోవచ్చు. ఎలాంటి సహాయం అందుతుంది? మూడవ విపత్తు కింద కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలు అందించాలో ఎక్కడా ఓ నిర్వచనంగానీ నిబంధనగానీ లేదు. దేశవ్యాప్తంగా ఇంతవరకు ఎన్నో విపత్తులు సంభవించినా తాము అది ఏ స్థాయి విపత్తో ఇంతవరకు ఎన్నడూ పేర్కొన లేదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్’ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ డివిజన్’ అధిపతి సూర్య ప్రకాష్ తెలిపారు. విపత్తు పరిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రం విజ్ఞప్తి మేరకే కేంద్రం స్పందిస్తుందని, ఎంత ఆర్థిక సహాయం చేయాలి, ఎలాంటి సహాయం చేయాలో స్పష్టం చేసే మార్గదర్శకాలేవీ లేవని అన్నారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనే విషయాన్నే పరిగణలోకి తీసుకొని కేంద్రం స్పందన ఉండటం సహజమని ఆయన వివరించారు. అందుకేనా ఈ వ్యత్యాసం? 2013లో ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు సంభవించి 5,700 మంది మరణిస్తే అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 2015లో తమిళనాడులో వరదలు సంభవించి ప్రాణహాని అంతగా లేకపోయినా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 939.6 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కేరళలో శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తి ఇప్పటికే 400 మందికిపైగా మరణిస్తే మోదీ ప్రభుత్వం ముందుగా వంద కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాత్రమే ప్రకటించింది. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉందన్న కారణంగానే మోదీ ప్రభుత్వం అంత తక్కువ ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందంటూ విమర్శలు వెల్లువెత్తడంతో మోదీ స్వయంగా కేరళ వరద ప్రాంతాలను గగన మార్గంలో సందర్శించి అదనంగా 500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయన్ని ప్రకటించారు. ఆర్థిక సహాయాన్ని అందించడంలోనే కాకుండా వరదలను జాతీయ విపత్తుగా పేర్కొనడంలోనూ రాజకీయాలు ఉన్నాయి. 2017లో గుజరాత్, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సంభవించిన వర్షాలను ప్రభుత్వంగానీ, ప్రతిపక్షంగానీ జాతీయ విపత్తుగా వర్ణించలేదు. అంతకుముందు మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో జమ్మూ కశ్మీర్లో సంభవించిన వరదలను ‘జాతీయ స్థాయి విపత్తు’గా మోదీనే వర్ణించారు. బిహార్‌లో సంభవించిన వరదలకన్నా ప్రాణ నష్టం అతి తక్కువగా ఉన్నప్పటికీ ఆయన అలా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేరళ వరదలను కూడా ‘జాతీయ విపత్తు’గా పేర్కొని 500 కోట్ల రూపాయల సహాయాన్ని మరింతగా పెంచాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయగా, ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. హతవిధి! ‘జాతీయ విపత్తు’కే విపత్తు వచ్చింది. -
కానరాని కనికరం
► వడదెబ్బ మృతులకు పరిహారానికి ఎన్నో నిబంధనాలు ► ఉష్ణోగ్రత 52 డిగ్రీలు దాటితేనే చెల్లించే ప్రతిపాదనలు ► పేద కుటుంబాలకు తీవ్ర అన్యాయం నర్సీపట్నం: ఈ ఏడాది ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఏటేటా భూతాపం పెరిగి ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులకు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కేంద్రం వడగాడ్పులను ప్రకృతి విపత్తుగా పరిగణించలేమని చెబుతోంది. ఇలా వారికి రావాల్సిన పరిహారం ఇవ్వటం లేదు. స్థానిక విపత్తుగా లెక్కించి సహాయక చర్యలు, పరిహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు చేస్తోంది. పనులు చేసే రైతులు, కార్మికులే ఎక్కువగా ఈ వడగాడ్పులతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో మృతులకు పరిహారం అందక అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భానుడి ప్రతాపానికి మార్చి నుంచే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటితే బయట తిరగలేని పరిస్థితి. అడవులు అంతరించిపోవడంతో వేడి, వడగాడ్పులు అధికంగా ఉంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా వృద్ధులు, పనులు చేసుకునే వారు పిట్టల్లా రాలిపోతున్నారు. బీడుబారిన పొలాలు, నీటి చుక్క కన్పించని దయనీయ పరిస్థితితో పొలం పనులకు వెళ్లిన రైతులు, కూలీలు, ఇతర పనులు చేసే వారు పదుల సంఖ్యలో వడగాడ్పులతో ప్రాణాలు కోల్పోతున్నారు. నిబంధనతో దాటవేత 43 డిగ్రీల ఉష్ణోగ్రతకే వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటితే చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. అటువంటిది కేంద్రం 52 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితేనే విపత్తుగా పరిగణిస్తామని ప్రకటించటం వల్ల వడగాడ్పులకు మరణించే వారి కుటుంబాల వారికి పరిహారం విషయంలో అన్యాయం జరుగుతుంది. అదే కేంద్రం విపత్తుగా గుర్తిస్తే బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందుతుంది. కొత్తగా వచ్చిన నిబంధనలు ప్రకారం 52 డిగ్రీలు దాటితేనే విపత్తుగా లెక్కిస్తామని చెబుతోంది. దీంతో సాధారణ ఉష్ణోగ్రత నమోదైన సమయంలో మృతి చెందిన వారికి లక్ష రూపాయలు పరిహారం కాకుండా ఆపద్బంధు పథకం కింద కేవలం రూ.50 వేల మాత్రమే అందజేయనున్నారు. ఈ నిబంధన వల్ల మృతుల కుటుంబాలకు పెద్దగా ఆర్థిక ఆసరా అందే అవకాశాలు లేవు. కమిటీ నిర్ధారణతో పరిహారం వడదెబ్బతో మృతిచెందారని నిర్ధారించేందుకు ప్రభుత్వం తహసీల్దార్, వైద్యుడు, ఎస్ఐతో కమిటీ ఏర్పాటు చేసింది. వీరు పూర్తిస్థాయి విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మృతులకు లక్ష రూపాయలు పరిహారం అందజేస్తుంది. దీంతో ఏటా పదుల సంఖ్యలో మృతి చెందుతున్నా నిబంధనల కారణంగా అరకొరగా పరిహారం అందుతుంది. కమిటీకి సమాచారం అందజేయాలి వడదెబ్బతో ఎవరైనా మృతి చెందితే కమిటీకి త్వరగా సమాచారం అందజేయాలి. వెంటనే కమిటీ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేస్తారు. పోస్టుమార్టం నిర్వహించి నివేదిక అందజేస్తారు. - వి.వి.రమణ, తహసీల్దార్ -
విపత్తు నిర్వహణలో మహిళలు
అంతర్జాతీయంగా వారి ప్రోత్సాహాన్ని పెంచాలి - ఏఎంసీడీఆర్‌ఆర్ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు - పట్టణీకరణతో పర్యావరణానికి చేటు జరగొద్దు న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తుల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించేందుకు రూపొందిస్తున్న కార్యక్రమాల్లో అంతర్జాతీయంగా మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారమిక్కడ జరిగిన ఆసియన్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (ఏఎంసీడీఆర్‌ఆర్) సదస్సును మోదీ ప్రారంభించారు. విపత్తుల ద్వారా జరిగే నష్ట పరిహారం విషయంలో పేదలతో మొదలుపెట్టి చిన్న, మధ్యతరహా వ్యాపారులు, బహుళజాతి కంపెనీలు, రాష్ట్రాల వరకు అందరికీ సరైన న్యాయం జరిగేలా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇందుకోసం మోదీ పదిసూత్రాల ప్రణాళికను సూచించారు. అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలు నష్ట నివారణ నిర్వహణలో భాగం పంచుకోవాలని.. ఈ విభాగంలో మహిళా నాయకత్వాన్ని, భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రోత్సహించాలన్నారు. ఏ రకమైన విపత్తు వచ్చినా ఎక్కువగా నష్టపోతున్నది మహిళలేనన్నారు. ‘సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఆపద సమయాల్లో మొబైల్, సామాజిక మాధ్యమాల వినియోగంపైనా దృష్టిపెట్టాలి’ అని అన్నారు. హిందూ మహాసముద్రం సునామీ హెచ్చరిక వ్యవస్థ పూర్తిగా అమల్లోకి వచ్చిదన్న మోదీ.. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇండోనేషియాల్లోనూ దీని పని మొదలైందన్నారు. భారత సముద్ర సమాచార సేవా కేంద్రం ఎప్పటికప్పుడు సునామీ బులెటిన్లు విడుదల చేస్తుందన్నారు. ఇదే వ్యవస్థ తుపాను విషయంలోనూ ముందస్తు హెచ్చరికలు చేస్తుందన్నారు. తుపాను నష్టాన్ని తగ్గించే విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలను ప్రపంచమంతా గుర్తించిందన్నారు. విపత్తుల నష్టం తగ్గించడంలో పర్యావరణ మార్పులు చాలా కీలకంగా పనిచేస్తాయన్న మోదీ.. పారిస్ ఒప్పందం సరైన సమయంలో జరిగిన సరైన ఒప్పందమన్నారు. పట్టణీకరణను సరిగా నిర్వహించకపోవటం వల్ల ప్రకృతి విపత్తులు, దుర్ఘటనలు పెచ్చుమీరే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా అడుగేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 61 ఆసియా, పసిఫిక్ దేశాలు పాల్గొన్నాయి. ఒకేసారి ఎన్నికలు వారికీ ఇష్టమే: మోదీ పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటంపై రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా అనుకూలంగానే ఉన్నప్పటికి ప్రజల్లోకి వెళ్లేటప్పటికి స్పష్టంగా చెప్పలేకపోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జర్నలిస్టులతో నిర్వహించిన దీపావళి మిలన్లో మోదీ మాట్లాడుతూ.. ప్రభుత్వం బలవంతంగా ఈ విధానాన్ని అమల్లోకి తేలేదని.. దీనిపై చర్చ జరగాల్సిన అవసరాన్ని మాత్రం గుర్తిస్తోందన్నారు. ఈ విషయంపై మీడియా ఏమైనా చేస్తే బాగుంటుందన్నారు. -
ఆసియా దేశాలు ప్రకృతి విపత్తులకు నెలవు!
పారిస్: ఆసియాలోని పలు దేశాలు, నగరాలు తుపానులు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ దేశాల కన్నా ఆఫ్రికాలోని ఉపసహారా ప్రాంతాల ప్రజల కు ఎక్కువ హాని పొంచి ఉన్నట్లు రిస్క్ అనలిస్ట్స్ వెరిస్క మ్యాపుల్క్రాఫ్ట్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తెలిపింది. దక్షిణాసియా దేశాలైన భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లోని దాదాపు 140 కోట్ల మంది ప్రజలు వరదలు, తుపానులు, సముద్రాలు ఉప్పొంగడం, భూకంపాల్లో ఏదో ఒక విపత్తు బారిన పడుతున్నారని పేర్కొంది. బంగ్లాలో 100% మంది ప్రజలకు ముప్పు పొంచి ఉండగా, భారత్‌లో 82 శాతం, పాక్‌లో 70 శాతం మంది విపత్తుల బారిన పడతారంది. వీటితో పాటు చైనా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లోని అధిక ప్రజలు కూడా ప్రమాదంలో ఉన్నారని వెల్లడించింది. ఆఫ్రికా ఖండంలో ఈ విపత్తుల కారణంగా అధిక మరణాలు సంభవించడమే కాకుండా గాయాలు, రోగాల బారిన పడుతున్నారు. -
అవినీతి తుఫాన్
‘హుద్‌హుద్’ పేరుతో భారీ అక్రమాలు తప్పుడు అంచనాలతో సొమ్ములు తినేసే ప్రణాళికలు ‘వుడా కైలాసగిరి’ లోగో పునరుద్ధరణకే రూ.1.10 కోట్లు పార్కులు, ప్రభుత్వ భవనాలకు అత్యధికంగా ఖర్చు ఔరా.. అనిపించేలా అధికారుల నివేదికలు విశాఖపట్నం: హుద్‌హుద్.. విశాఖ వాసులకు కనీవినీ ఎరుగని ప్రకృతి వైపరీత్యం.. కొన్ని గంటల్లోనే వి శాఖ రూపు రేఖలు మార్చేసిన భారీ తుఫాన్.. భవిష్యత్ తరాలు కథలు, కథలుగా చెప్పుకునేంత పెను విపత్తు.. అయితేనేం ప్రజల మరోధైర్యం ముందు తలవంచింది. వారం పది రోజులు తిండికి, తాగునీటికి అలమటించినా, వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లినా అతి త్వరలోనే నగరం మళ్లీ నిలబడింది. దాతలు ఇచ్చిన ఉదార విరాళాలు, స్థానికుల శ్రమదానం, నిబద్ధతలతో విశాఖ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. కానీ ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. విశాఖ కోలుకోవడానికి తాము చేసిన భారీ ఖర్చు కారణమని చూపిస్తూ కనిపించని అవినీతి తుఫాన్ సృష్టించారు. నివేదికల్లో తప్పుడు లెక్కలు చూపించి వుడా అధికారులు సొమ్ములు దండుకుంటున్నారు. నగరం మునుపటి స్థితికి చేరడంతో తమ దర్జాగా దోచుకుతింటున్నారు. చకచకా సొమ్ములొచ్చే పనులు హుద్‌హుద్ 48మందిని పొట్టనపెట్టుకుంది. 122మందిని గాయాలపాలు చేసింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరంలోని కట్టడాలను కకావికలం చేసేశాయి. వాటిని పునరుద్ధరించడానికి అధికారులు అంచనాలు రూపొందించారు. దాని ప్రకారం అనేక పనులు పూర్తి చేయగా, మరికొన్ని జరుగుతున్నాయి. ఇంకొన్నిటికి టెండర్లు పిలిచారు. తుపాను వల్ల దెబ్బతిన్న 1,46,799 సామాన్యుల గృహాలను తిరిగి కట్టిచ్చేందుకు ఆసక్తి చూపని ప్రభుత్వం, అధికారులు తమకు ప్రయోజనం కలిగే పనులను మాత్రం చకచకా చేసుస్తున్నారు. అయితే పునరుద్ధరణ, పునఃనిర్మాణ పనులకు చేసిన, చేస్తున్న ఖర్చుల లెక్కలు అధికారుల అవినీతికి అద్దం పడుతున్నాయి. వారి లెక్కలు ఇవిగో కైలాసగిరి కొండపై వుడా కైలాసగిరి (వీయూడీఏ కేఏఐఎల్ఎస్ఏజీఐఆర్ఐ-కైలాసగిరి) అనే పేరును దాదాపు రూ.80 లక్షల వ్యయంతో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. తుపాను దెబ్బకు అవి కింద పడిపోయాయి. దీంతో వాటి స్థానంలో కొత్త అక్షరాలను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయాలనుకున్నారు. దానికి రూ.1.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ మళ్లీ ఏమనుకున్నారో ఏమో ఆ ప్రతిపాదనను పక్కనపెట్టేశారు. పడిపోయిన అక్షరాలను నిలబెట్టి సరిపెట్టేశారు. కానీ విచిత్రం ఏమిటంటే రూ.1.10 కోట్లు ఖర్చు అయినట్లుగా రికార్డుల్లో రాసేశారు. ఉన్నవి నిలబెట్టి కొత్త వాటికి చేయాలనుకున్న ఖర్చును ఎలా చూపిస్తున్నారో అంతుచిక్కడం లేదు. దీనిపై వుడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను సంప్రదించగా రికార్డుల్లో పొరపాటుగా నమోదైవుంటుందని చెప్పుకొచ్చారు. దీనిపై ఆరా తీయగా పడిపోయిన అక్షరాలు పునరుద్ధరించడానికి రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. అదే ఎక్కువనుకుంటే రికార్డుల్లో కోటీ పది లక్షల రూపాయలు చూపించడం వెనక మతలబు ఏమిటో అర్ధం కావడం లేదు. అన్నిటిలోనూ ఇదే తీరు వుడా అధికారులు చేసిన ఖర్చుల లెక్కల ప్రకారం.. బీచ్ రోడ్డులోని కురుసురా సబ్‌మెరైన్ మ్యూజియం వద్ద చెత్త, ఇసుక తొలగించడానికి, ఎలక్ట్రికల్ పనులకు రూ.54.57 లక్షలు ఖర్చయింది. వుడా పార్కు ముఖద్వారం పక్కన 60 మీటర్ల కాంపౌండ్ వాల్, చిల్డ్రన్ ట్రాఫిక్ పార్కు పునరుద్ధరణకు రూ.11.43 లక్షలు ఖర్చు చేశారు. రే హౌసింగ్ స్కీం భవనాలకు పగిలిన గాజు అద్దాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి రూ.19.42 లక్షలు వెచ్చించారు. కైలాసగిరి రోప్‌వే ప్రాంతం నుంచి తొట్ల కొండ వరకు పడిపోయిన విద్యుత్ స్తంభాల పునరుద్ధరణకు రూ.6 లక్షలు ధారపోశారు. దెబ్బతిన్న గురజాడ కళాకేంద్రం రూఫ్ స్థానంలో కొత్తది నిర్మించడానికి రూ.5.70 కోట్లతో టెండర్లు తుదిదశకు చేరాయి. సిరిపురం వద్ద యుబి కాంప్లెక్స్ ఎలివేషన్ ప్యానెళ్లు, కిటికీ అద్దాలకు రూ.35 లక్షలు ఖర్చు కానుంది. వుడా పరిధిలో విద్యుత్ మెరుగుపరచడానికి రూ.1.80 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ లెక్కలన్నిటికీ జిల్లా కలెక్టర్ ఆమోదం లభించింది. -
10 మంది రైతుల ఆత్మహత్య
గుండెపోటుతో మరో ఇద్దరు మృతి నెట్వర్క్: ప్రకృతి వైపరీత్యం, పంటల సాగు కోసం చేసిన అప్పుల భారం తట్టుకోలేక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణ జిల్లా ల్లో బుధవారం వేర్వేరు చోట్ల 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు గుండెపోటుకు గురై మృతి చెందారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) రెండు బోర్లు తవ్వించినా చుక్కనీరు రాలేదు. అప్పులు మూడు లక్షకు చేరడంతో.. తీర్చే మార్గంలేక పొలంలోనే చెట్టుకు ఉరేసుకున్నాడు. కోహీర్ మండలం పైడిగుమ్మల్కు చెందిన గంగపురం చిన్న నర్సయ్య (38) బోర్లు వేయడానికి, సాగుకు తెచ్చిన అప్పులు తీర్చలేక చెట్టుకు ఉరివేసుకొన్నాడు. నిజామాబాద్ జిల్లా నవీ పేట మండలం జన్నెపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు చిన్నగారి నర్సింగరావు(54), ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసారలోని వడ్డరిగూడకు చెందిన జాదవ్ బాలాజీ(50), నల్లగొండ జిల్లా హాలియా మండలం అనుముల గ్రామానికి చెందిన ఒరికొప్పుల అంజయ్య(46), యాచారం గ్రామానికి చెం ది న అనుముల శివ(22), పెద్దవూర ఈదులగూడెంకు చెందిన జోగు శ్రీను(22), మహబూబ్‌నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన గుంపలి చెన్రాయుడు (36), వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం లింగముడుపల్లెకు చెందిన సూరపు విజేందర్(35), ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన రైతు బిల్ల శ్రీనివాస్ (50) బలవన్మరణాలకు పాల్పడ్డారు. గుండె ఆగి మరో ఇద్దరు రైతులు.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగ్యాతండాకు చెందిన భూక్య నార్య(52)కు రూ. 4 లక్షల అప్పులయ్యూరుు. అప్పులకుతోడు రెండు రోజుల క్రితం కురిసిన భారీవర్షానికి వుక్కజొన్న నేలవాలడంతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం భస్వన్న గ్రామానికి చెందిన రైతు కుమ్మరి రాములు (55) అప్పులు తేర్చే దారిలేక మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందాడు. -
ఇది ప్రకృతి వైపరీత్యం కాదా ?
న్యూఢిల్లీ: దేశంలో ఏటా వేలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న చండ ప్రచండ వడ గాలులు ప్రకృతి వైపరీత్యం కాదా ? చలి గాలులను ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చినప్పుడు, అదే కోవకు చెందిన వడ గాలులను మాత్రం ప్రకృతి వైపరీత్యాల జాబితాలో ఎందుకు చేర్చరు? 2012లో ఉత్తర భారతాన్ని అతి శీతల గాలులు గజగజ వణికించి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు భారత ప్రభుత్వం చలి గాలులను ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు వడ గాలులతో దేశంలో 1150 మందిని, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 900 మందిని బలితీసుకున్నాయి. 2004 నుంచి 2014 వరకు దేశంలో వడ గాలుల వల్ల చనిపోయిన వారి సంఖ్య 63 శాతం పెరిగిదంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయినా వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోంది? వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా ఈపాటికే గుర్తించినట్లయితే వందలాది మంది ప్రజల ప్రాణాలను పరిరక్షించి ఉండే వాళ్లమని జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంఘం (ఎన్డీఎంఏ) సీనియర్ సభ్యుడు కమల్ కిషోర్ తెలిపారు. ఇదే సంఘానికి చైర్మన్‌గా పని చేసిన తెలంగాణ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి తన హయాంలో వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా గుర్తించేందుకు తన వంతు కృషి తీవ్రంగానే చేశారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ గాలులకు దాదాపు 1150 మంది మరణించడంతో (ఆ ఏడాది దేశవ్యాప్తంగా 1450 మంది మరణించారు) చలించిన శశిధర్ రెడ్డి వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా గుర్తించాలనే ప్రతిపాదనను అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన చిదంబరం, శరద్ పవార్, సుశీల్ కుమార్ షిండే, హరీష్ రావత్, మాంటెక్ సింగ్ అహ్లువాలియాలతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం పలు సార్లు సమావేశమైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మర్రి శశిధర్ రెడ్డి ప్రతిపాదన అటకెక్కింది. ప్రస్తుతం జాతీయ ప్రకృతి వైపరీత్యాల జాబితాలో భూకంపాలు, తుఫాన్లు, కరువు కాటకాలు, కొండ చెరియలు విరిగి పడడం, వడగళ్ల వర్షాలు చోటుచేసుకున్నాయి. ఈ జాబితాలో ఉన్న ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణం సంభవిస్తే లక్షన్నర రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇక్కడ ప్రాణ నష్టానికి పరిహారం ముఖ్యం కాదని, ముందస్తు నివారణ చర్యలకు ఎంతో అవకాశం ఉంటుందని కమల్ కిషోర్ చెప్పారు. వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా ప్రభుత్వం గుర్తించినట్టయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం, సమన్వయంతో నష్ట నివారణ చర్యలు చేపడుతాయని అన్నారు. అన్ని ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో వడ గాలుల పట్ల ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, బాధితులకు సరైన వైద్య సహాయం అందించడం, వారికి సరైన సమ్మర్ షెల్టర్లు, చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం లాంటి చర్యలకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. -
మడ అడవుల పెంపకానికి ప్రణాళిక
సముద్ర తీరం వెంట 1,030 హెక్టార్లలో పెంపకం ఉపాధి హామీ పథకం రాష్ట్ర డెరైక్టర్ కరుణ పాలకాయతిప్ప సమీపంలో పరిశీలన కోడూరు : కృష్ణా, గోదావరి జిల్లాల్లో ప్రకృతి విపత్తుల సమయంలో తీరప్రాంతాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు 1,030 హెక్టార్లలో మడ అడవుల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఉపాధి హామీ పథకం రాష్ట్ర డెరైక్టర్ కరుణ తెలిపారు. కోడూరు మండల పరిధిలోని పాలకాయతిప్ప సమీపంలో సముద్రపు కరకట్ట లోపలి భాగంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద పెంచుతున్న మడ అడవులను సోమవారం అధికార యంత్రాంగంతో కలిసి ఆమె పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా కోరింగ సముద్ర తీరం నుంచి కృష్ణాజిల్లా నాగాయలంక మండలం నాచుగుంట వరకు ఉన్న 1,030 హెక్టార్ల భూమిని మడ అడవులు పెంచేందుకు ప్రభుత్వం తరఫున గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి అటవీ శాఖకు అప్పగించనున్నట్టు ఆమె తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ సంవత్సరం జూలై నుంచి ఇప్పటివరకు తీరం వెంట 30 హెక్టార్లలో మడ అడవుల పెంపకం చేపట్టినట్టు చెప్పారు. నాచుగుంట సమీపంలో 468, పాలకాయతిప్ప సమీపంలో 302, సంగమేశ్వరం సమీపంలో 268 హెక్టార్ల అటవీ శాఖ భూముల్లో ఇప్పటికే మడ అడవులు పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు కరుణ తెలిపారు. తొలి విడతలో 250 హెక్టార్లలో... తొలి విడతలో పాలకాయతిప్ప సమీపంలోని సముద్ర తీర భూముల్లో 250 హెక్టార్లలో ఈ మడ అడువుల పెంపకం సాగుతుందని కరుణ చెప్పారు. దీనికి సంబంధించి నెల రోజుల్లో ఉత్తర్వులు విడుదలవుతాయన్నారు. ఇప్పటి వరకు మడ అడవుల పెంపకం పనులు బయట ప్రాంతాలవారితో చేయిస్తున్నారని, ఈ పనులను తమ గ్రామస్తులతో చేయించాలని పాలకాయతిప్ప గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకురాగా, ఇకపై చేపట్టే పనుల్లో సమీప గ్రామ కూలీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కరుణ అధికారులకు సూచించారు. సముద్రంలో జీవించే జీవాలకు తీరం వెంట పెంచే మడ అడవులు నివాస స్థలాలుగా ఉండడంతో పాటు ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని కరుణ పేర్కొన్నారు. సముద్ర తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు మడ చెట్టు కిందకు వస్తాయని, వీటి ద్వారా తాబేళ్లకు రక్షణ ఇవ్వడంతో పాటు వాటి సంఖ్య పెంచేందుకు కూడా ఈ మడ అడవులు ఎంతో దోహదపడతాయని ఆమె తెలిపారు. ముందుగా పాలకాయతిప్ప సమీపంలోని సముద్ర తీర భూముల్లో మడ మొక్కలను పథకం జిల్లా పీడీ మాధవిలత ఆధ్వర్యంలో నాటారు. అనంతరం మడ మొక్కల పెంపకాన్ని పడవపై వెళ్లి పరిశీలించారు. హైదరాబాద్ కమిషనరేట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అధికారి ఎంవీవీఎస్ మూర్తి, డ్వామా అడిషనల్ పీడీ ఎ.సురేష్, ఏపీడీ దేవానందరావు, ఎంపీడీవో కె.మణికుమార్, అటవీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలకు వేతన భాగ్య
రూ.95 వేలకు పెరగనున్న జీతభత్యాలు బెంగళూరు: రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కుర్చున్నట్లుంది రాష్ట్రంలోని ప్రజాప్రతినిధుల వ్యవహారం. ఒక వైపు ప్రకృతి విపత్తుల వల్ల తీవ్రంగా పంట నష్ట పోయిన రైతులు, మరోవైపు ఏడాది క్రితం అమ్మిన చెరుకుకు సంబంధించిన రైతు బకాయిలు ఇప్పటికి అందక ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిధులు మాత్రం అవేమి పట్టనట్లు వేతన భత్యాల పెంపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఫలితం కూడా పొందబోతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ప్రస్తుతం బెళగావిలో జరుగుతున్న శీతాకాల శాసనసభ సమావేశాల చివరి రోజున ప్రజాప్రతినిధుల జీతభత్యాల పెంపునకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఉభయ సభల ఆమోదం లభించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం శాసనసభ్యులకు రూ.20వేల వేతనంతోపాటు నెలకు ఫోన్‌బిల్ కోసం రూ.15వేలు, క్షేత్రస్థాయి పర్యటనకు రూ.15 వేలు, పోస్టల్ ఖర్చులు రూ.5 వేలు, ఇతరత్రాలు రూ.10 వేలతో కలుపుకుని మొత్తంగా రూ. 65 వేలు అందుకుంటున్నారు. గత బెళగావి శాసనసభ సమావేశాల సందర్భంగా శాసనసభ్యుడు బి.ఆర్. పాటిల్ వేతన భత్యాల పెంపునకు సంబంధించి సభాసలహా సమితికి లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేసుకున్నారు. ఇందుకు కొంతమంది తమ మద్దతును కూడా తెలియజేశారు. ఈ మేరకు శాసనసభ్యుల జీతభత్యాల పెంపుకు సంబంధించిన దస్త్రం కూడా చకచకా తయారై పోయింది. అయితే స్పీకర్ కాగోడు తిమ్మప్ప అడ్డుపడి ఇలా హడావుడిగా వేతన పెంపుపై నిర్ణయం తీసుకోవడం సరికాదని సర్ది చెప్పారు. పొరుగురాష్ట్రాల్లో అక్కడి శాసనసభ్యులకు ఎంతెంత వేతనం ఇస్తున్నారో తెలియజేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసి వివరాలను తెప్పించుకున్న అధికారులు నివేదికను తయారు చేసి స్పీకర్‌కు అందజేశారు. రూ.95 వేలకు పెరగనున్న జీతభత్యాలు! ప్రస్తుతం గోవా రాష్ట్రంలో అక్కడి శాసనసభ్యులు రూ.1.2 లక్షలను వేతన భత్యాల రూపంలో అందుకుంటుండగా తమిళనాడులో రూ.55వేలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. లక్ష, కేరళలో రూ.39,500, ఢిల్లీలో రూ.40 వేలను జీతభత్యాల రూపంలో అందుకుంటున్నారు. వీటితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భౌగోళిక, జీవన వ్యయం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కర్ణాటక శాసన సభ్యుల జీత భత్యాలను రూ.65 వేల నుంచి రూ.95వేలకు పెంచాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయమై ప్రభుత్వ అదనపు కార్యదర్శి స్థాయి అధికారి ఒకరు మాట్లాడుతూ ‘శాసనసభ్యుల జీత భత్యాల పెంపునకు సంబంధించిన దస్త్రం ఇప్పటికే తయారైంది. శీతాకాల సమావేశాల చివరి రోజున ఉభయసభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి అనుమతి తీసుకుంటాం. ఏ పార్టీ నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించరని భావిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. -
పిడుగుపాటు మరణాలకూ ఇక పరిహారం
14వ ఆర్థిక సంఘానికి చేరిన ప్రతిపాదనలు న్యూఢిల్లీ: పిడుగుపాటును ప్రకృతి వైపరీత్యంగా పరగణించి, పిడుగుపాటుతో సంభవించే మరణాలకూ ప్రభుత్వం త్వరలో నష్టపరిహారం చెల్లించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి, కేంద్ర హోంమంత్రిత్వశాఖ 14వ ఆర్థిక సంఘానికి సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిన పక్షంలో పిడుగుపాటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం లభిస్తుంది. దేశవ్యాప్తంగా సంవత్సరానికి సగటున 400 మంది పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ వైపరీత్యాల సహాయ నిధినుంచి, వివిధ రాష్ట్రాల వైపరీత్యాల సహాయ నిధులనుంచి పిడుగుపాటు మరణాలకు పరిహారం అందే విధంగా, పిడుగుపాటు సంఘటనను వైపరీత్యాల జాబితాలో చేర్చాలన్న ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రిత్వశాఖ 14వ ఆర్థిక సంఘానికి సమర్పించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి పిడుగుపాటు దుర్ఘటన, పరిహారానికి అర్హమైన ప్రకృతి వైపరీత్యాల జాబితాలో లేదు. కాగా, తనకు అందిన ప్రతిపాదనలపై 14వ ఆర్థిక సంఘం ఈ నెల 31లోగా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయి. -
చెప్పింది ఒకటి..అమలు చేస్తున్నది ఇంకొకటి
ప్రకృతి వైపరీత్యం వల్ల పంటలు దెబ్బతింటే ప్రభుత్వం రైతులకు పరిహారం ప్రకటిస్తుంది. కానీ ఆ పరిహారాన్ని పొందాలంటే అంతోఇంతో పండిన పంటను పూర్తిగా తమకు జమ చేయాలని నిబంధన విధిస్తుందా!? లేదే!...కానీ మత్స్యకార మెకనైజ్డ్ బోట్లకు పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం అలాంటి అసంబద్ధ నిబంధన విధించింది. పరిహారం విషయంలో సీఎం చంద్రబాబు చెప్పింది ఒకటి... జీవోలో వచ్చింది మరొకటి... అమలు చేస్తున్న తీరు ఇంకొకటి... వెరసి అసలే తుపానుతో దెబ్బతిన్న బోట్ ఆపరేటర్లు ప్రభుత్వ వైఖరితో నిండామునుగుతున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మత్స్యకారులు, బోట్ ఆపరేటర్లకు పరిహారం విషయంలో సీఎం చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నా... పరిహారం మాత్రం ప్రభుత్వ ఖజానా దాటి బాధితులకు చేరడం లేదు. ‘తుపానుతో దెబ్బతిన్న ప్రతి బోటుకు పరిహారం చెల్లిస్తాం’ అని ఆయన ప్రకటించారు. దెబ్బతిన్న ప్రతి బోటుకు రూ.6 లక్షలు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. కానీ ఆయనమాటలకు ఏమాత్రం పొంతనలేకుండా ప్రభుత్వం జీవో 13ను జారీ చేసింది. దెబ్బతిన్న బోట్లకు పరిహారం విషయంలో అందులో మూడు కేటగిరీలుగా విభజించారు. నీటమునిగి పూర్తిగా దెబ్బతిన్న మెకనైజ్డ్ బోట్లకే రూ.6 లక్షలు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. తీవ్రంగా దెబ్బతిని మరమ్మతులు చేయాల్సిన మెకనైజ్డ్ బోట్లకు రూ.3 లక్షలు పరిహారం చెల్లిస్తామని... స్వల్పంగా దెబ్బతిన్న బోట్లకు రూ.50 వేలు పరిహారంగా ఇస్తామని జీవోలో పేర్కొన్నారు. ఈ జీవోపైనే బోట్ ఆపరేటర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దెబ్బతిన్న ప్రతి బోటుకు రూ.6 లక్షలు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.... కానీ అందుకు విరుద్ధంగా పరిహారాన్ని రూ.6 లక్షలు, రూ.3లక్షలు, రూ.50 వేలు చొప్పున కేటగిరీలుగా విభజించడమేమిటని ప్రశ్నించారు. పోనీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో అయినా యథాతథంగా అమలు చేస్తున్నారా అంటే అదీ లేదు. జీవో అమలు విషయం వచ్చేసరికి కొత్త షరతులు విధించడంతో బోట్ ఆపరేటర్లు హతాశులయ్యారు. పూర్తిగా దెబ్బతిన్న బోటుకు రూ.6లక్షలు పరిహారం చెల్లించాలంటే ఆ బోటును, దాని లెసైన్స్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని నిబంధన విధించారు. రూ.6 లక్షల కోసం రూ.30 లక్షల బోటు ఇవ్వాలా! బోట్లకు పరిహారం విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధనతో బోట్ ఆపరేటర్లు అవాక్కయ్యారు. ఎందుకంటే ఒక మెకనైజ్డ్ బోటు ధర రూ.30 లక్షలు నుంచి రూ.35 లక్షల వరకు ఉంది. కానీ ఎంత దెబ్బతిన్నప్పటికీ రూ.6 లక్షల కోసం ఆ బోటును, దాని లెసైన్స్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలనడం పూర్తిగా అసంబద్ధం. ప్రభుత్వం ఇస్తోంది నష్టపరిహారమే తప్ప... కొత్త బోటు కొనుగోలుకు డబ్బు చెల్లించడం లేదు. అలాంటప్పుడు దెబ్బతిన్న బోటును ప్రభుత్వానికి సరెండర్ చేయాలనడం పూర్తిగా అసమంజసం.ప్రభుత్వం రూ.6 లక్షలు ఇచ్చినా దెబ్బతిన్న బోటును మరమ్మతు చేసుకోవాలంటే బోట్ ఆపరేటర్ మరో రూ.8 లక్షలు వరకు ఖర్చు చేయాలి. ఏకంగా కొత్త బోటు కొనుగోలు చేయాలంటే మరో రూ.25 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే దెబ్బతిన్న బోట్లను సరెండర్ చేస్తేనే రూ.6 లక్షలు ఇస్తామని ప్రభుత్వం మెలికపెట్టడం బోట్ ఆపరేటర్లను విస్మయపరుస్తోంది. 10 వేల మంది జీవితాలతో చెలగాటం హుద్‌హుద్ తుపానుతో విశాఖపట్నం ఫిషింగ్‌హార్బర్‌లో 64 మెకనైజ్డ్ బోట్లు నీటమునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిలో 53 బోట్లను క్రేన్ల సహాయంతో వెలికితీశారు. ఆ బోట్లు బా గా దెబ్బతిన్నాయి. ఇంకా 11 బోట్లను వెలుపలికి తీయడం సాధ్యం కాలేదు. కాగా ఈ వెలుపలికి తీసిన ఈ బోట్లకు పరిహారం చెల్లించాలంటే వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. కానీ ఇందుకు బోట్ ఆపరేటర్లు ససేమిరా అంటున్నారు. ఒక్కో బోటు ఖరీదు రూ.30 లక్షలు కా గా మునిగిపోయిన సమయంలో ఒక్కో బోటు లో వీహెచ్ఎఫ్ సెట్, వలలు, ఇంజిన్, కనీసం 5వేల లీటర్ల డీజిల్, 15-20 రోజులకు సరిపడా వంటదినుసులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఇచ్చే రూ.6లక్షల పరిహారం కోసం ఆ బో ట్లను సరెండర్ చేస్తే ఇక తాము నిండామునిగిపోయినట్లేనని వాపోతున్నారు. ప్రభుత్వం రూ.6 లక్షలు ఇచ్చినా తా ము మరో రూ.8 లక్షలు వరకు వెచ్చిం చి బోట్లను మరమ్మతులు చేసుకోవా ల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి పరిహారం చెల్లించే ఉద్దేశం లేదని స్పష్టం కావడంతో బోట్ ఆపరేటర్లు ప్రైవే టు అప్పులు చేసి బోట్లకు మరమ్మతలు చే యించుకుంటున్నారు. ఇప్పటికే నెలరోజులై ఉపాధి లేకుండాపోయింది. దాంతో అప్పోస ప్పో చేసి బోట్లను బాగుచేసుకుని సముద్రంలో వేటకు వెళితే తప్పా జీవనం గడిచే పరిస్థితి లేదు. ఒక్కో బోటు ప్రత్యక్షంగా 8 మంది మత్స్యకారులకు, పరోక్షంగా కొన్ని వందలమంది జీవనోపాధి పొందుతున్నారు. విశాఖపట్నంలో మెకనైజ్డ్ బోట్ల పరిశ్రమ కనీసం 10వేలమందికి జీవనోపాధి కల్పిస్తోంది. అంతమంది జీవితాలతో ముడిపడిన పరిశ్రమకు పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం దొంగాట ఆడుతుండటం విస్మయపరుస్తోంది. -
ఆర్థిక సహకారానికి ఆర్బీఐ హామీ
ఏపీ ఆర్థిక మంత్రి యనమల వెల్లడి హైదరాబాద్: రాష్ట్ర విభజన, తుపాన్లు, ప్రకృతి విపత్తులతో నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారాన్ని అందించాలన్న తమ విన్నపానికి రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ సానుకూలంగా స్పందించారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారన్నారు. ఆర్బీఐ గవర్నర్ బుధవారం సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమలతో సమావేశమయ్యారు. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన భేటీ కావలసి ఉంది. కానీ విశాఖలో తుపాను సహాయక కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న సీఎం ఈ భేటీ కోసం యనమలను పంపారు. సమావేశంలో రుణమాఫీ నిధుల సమీకరణ కమిటీ చైర్మన్ సుజనాచౌదరి, ప్రభుత్వ సలహాదారు కుటుంబరావు, ఉన్నతాధికారులు పీవీ రమేష్, అజేయ కల్లం, అజయ్ సహాని పాల్గొన్నారు. సమావేశానంతరం యనమల తదితరులు మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి గవర్నర్‌కు చెప్పాం. కొన్ని జిల్లాలను కరువు పీడిస్తుంటే మరికొన్ని జిల్లాలపై తుపాన్ల ప్రభావం ఉంది. ఏటా ప్రకృతి విపత్తులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బ్యాంకుల నుంచి కూడా ఆర్థిక సహకార ం కావాలి’ అని కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్ పలు సలహాలిచ్చారని, రైతు సాధికారిత కార్పొరేషన్ ఏర్పాటును, రుణమాఫీకి ఆధార్ అనుసంధానాన్ని మెచ్చుకున్నారని యనమల చెప్పారు. రుణమాఫీ కింద 20 శాతం మొత్తాన్ని కార్పొరేషన్ ద్వారా ముందుగా బ్యాంకులకు చెల్లిస్తామని, మిగతా 80 శాతం మొత్తానికి రైతులకు సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు చెప్పామన్నారు. రైతు సాదికారత కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఒకటీ రెండురోజుల్లో పూర్తవుతుందని, ఆతర్వాత ఆర్థికశాఖ నుంచి మూలధనాన్ని డిపాజిట్ చేస్తామని తెలిపారు.నిధులు సేకరించి కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇది కేవలం రైతులను ఆదుకునేందుకు రాష్ట్రం అనుసరిస్తున్న పద్ధతి కనుక దీనికీ ఆర్బీఐకి సంబంధం లేదని మంత్రి వెల్లడించారు. స్థలం కేటాయిస్తే విజయవాడలో ఆర్బీఐ రీజినల్ బ్రాంచి ఏర్పాటుకు గవర్నర్ సుముఖత వ్యక్తం చేశారన్నారు. ఆర్బీఐ సెంట్రల్‌బోర్డు సమావేశం విజయవాడలో పెడతామన్నారని తెలిపారు. తుపాను బాదిత ప్రాంతాలకు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. కేంద్ర బీమా కంపెనీలుసానుకూలంగా స్పందిస్తే రైతులకు ఎక్కువ మేలు జరుగుతుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారని, పీఎం కూడా హామీ ఇచ్చిన విషయాన్ని ఆయనకు చెప్పామని మంత్రి తెలిపారు. -
పరిహారం రూ. 5 లక్షలకు పెంపు
ప్రకృతి విపత్తుల్లో మృతుల కుటుంబాలకు పెరిగిన ఎక్స్‌గ్రేషియూ పంటలకు పెట్టుబడి రాయితీ హెక్టారుకు రూ.15 వేలకు పెంపు హుదూద్ నేపథ్యంలో ఉత్తర్వులు హైదరాబాద్: ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 1.5 లక్షల పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల ని ర్వహణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తుల్లో వికలాంగులైన వారికిచ్చే పరిహారం రూ.62 వేల నుంచి రూ.లక్షకు పెరి గింది. పంట నష్టపోయిన రైతులకు ఇచ్చే పెట్టుబడి రాయితీ కూడా పెరిగింది. జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదికల మేరకు పరిహారం, పెట్టుబడి రాయితీ పెంచుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ ఎ.ఆర్.సుమార్ తెలి పారు. నిజమైన బాధితులకే పరిహారం అందేలా గ్రామాలు, రైతుల వారీ పంట నష్టం వివరాలను, వారి బ్యాంకు ఖాతాలతో సహా పంపించేం దుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. వివరాలిలా ఉన్నాయి.. ♦వరి, వేరుశనగ, పత్తి, చెరకు, మిరప, కూరగాయలు, ఉల్లి, బొప్పాయి, పుచ్చకాయ తోటలకు హెక్టారుకు ప్రస్తుతం రూ.10 వేలుగా ఉన్న పెట్టుబడి రాయితీ రూ.15 వేలకు పెరిగింది. ♦మొక్కజొన్నకు రూ.8,333 నుంచి రూ. 12,500కు, పెసర, మినుము తదితర పప్పులు, పొద్దు తిరుగుడు, సోయాబీన్, గోధుమ తదితర పంటలకు రూ.6,250 నుంచి రూ.10 వేలకు పెరిగింది. ♦మామిడి, నిమ్మ, జీడిమామిడి తదితర పండ్ల తోటలకు పెట్టుబడి రారుుతీ రూ.15 వేల నుంచి రూ.20 వేలకు, అరటికి రూ. 24 వేల నుంచి రూ.25 వేలకు చేరింది. ♦కూలిపోయిన కొబ్బరి చెట్టుకు ఇచ్చే పరి హారం రూ.500 నుంచి రూ.1,000కి పెరిగింది. ♦గాయపడిన వారికిచ్చే పరిహారం పెరిగింది. వారానికి మించి ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన వారికిచ్చే సాయం రూ.9,300 నుంచి రూ.50 వేలకు పెంచారు. వారంలోపు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన వారికిచ్చే సాయం రూ. 3,100 నుంచి రూ.15 వేలు చేశారు. ♦పాక్షికంగా ఇళ్లు దెబ్బతిని, నీట మునిగి పునరావాస కేంద్రాలకు వెళ్లిన వారికి దుస్తులు, ఇతర ఇంటి సామగ్రి కోసం ఇచ్చే సాయం రూ.2,700 నుంచి రూ.4 వేలకు పెరిగింది. ♦విపత్తు బాధితులకు తక్షణ సహాయం కింద ప్రస్తుతం పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.30 ఇస్తుండగా దీని స్థానే 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, 2 కిలోల పప్పు, లీటరు పామాయిల్, అర కిలో కారప్పొడి, అర కిలో ఉప్పు, కిలో చక్కెర, మూడు కిలోల బంగాళా దుపంలు, రెండు కిలోల ఉల్లిపాయలు ఇస్తారు. ♦చేనేత కార్మికులకు, మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులు అందిస్తారు. ♦పక్కా ఇల్లు కూలిపోయిన వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రస్తుతం రూ.70 వేలు ఇస్తుం డగా ఇక నుంచి ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద ఇచ్చే సొమ్ముతోపాటు రూ.50 వేలు ఇస్తారు. పూరిళ్లు కోల్పోయినవారికి రూ.15 వేల స్థానే రూ.25 వేలు ఇస్తారు. ఆవులు, గేదెలు చనిపోతే రూ.20 వేలు పరిహారం ఇస్తారు. పవర్లూమ్ కోల్పోయిన చేనేతలకు రూ.10 వేలు ఇస్తారు. పడవలు కోల్పోయిన, దెబ్బతిన్న వారికి ఇచ్చే పరిహారం కూడా కొంత మేరకు పెంచారు. -
పెట్టుబడి రాయితీగా రూ.137 కోట్లు విడుదల
{పకృతి వైపరీత్యాలబాధిత రైతులకు ఊరట 2.77 లక్షల మందికి ప్రయోజనం హైదరాబాద్: రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలవల్ల పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 137,76,58,120 విడుదల చేసింది. 2009 నుంచి గత ఏడాది వరకూ పలుమార్లు సంభవించిన భారీ వర్షాలు, వరదలు, వడగండ్ల వానలవల్ల 2.96 లక్షల ఎకరాల్లో 50 శాతం మించి పంట నష్టం జరిగింది. 2012లో నీలం తుపాను, కరువు వల్ల 50 శాతం మించి పంట దెబ్బతిన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చినెలల్లో వడగండ్ల వర్షం, పెనుగాలుల వల్ల 1.09 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇలా మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, అనంతపురం, విశాఖపట్నం, కడప, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం , కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 4.05 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీనివల్ల 2,77,019 మంది రైతులు నష్టపోయారు. వీరికి పెట్టుబడి రాయితీ కింద ప్రభుత్వం రూ. 137.76 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పెట్టుబడి రాయితీ మొత్తాన్ని వారి అకౌంట్లలో ఆన్లైన్ ద్వారా జమ చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేసే బాధ్యతను ఉద్యాన, వ్యవసాయ శాఖల కమిషనర్లకు అప్పగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
‘ఎవరెస్ట్’పై విరిగిపడ్డ మంచుచరియలు
12 మంది నేపాలీ షెర్పాల మృతి కఠ్మాండు: ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తై పర్వత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్‌పై శుక్రవారం భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. విదేశీ పర్వతారోహకులకు పోర్టర్లు, గైడ్లుగా వ్యవహరించే స్థానిక షెర్పాలు ఎవరెస్ట్ బేస్ క్యాంపు నుంచి మొదటి క్యాంపు వరకూ అధిరోహణ చేపడుతుండగా సుమారు 5,800 మీటర్ల (సుమారు 19 వేల అడుగులు) ఎత్తులో ఉదయం 6.45 గంటలకు ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 12 మంది షెర్పాలు మృతిచెందగా మరో 10 మంది గాయపడ్డారు. మరో నలుగురు గల్లంతయ్యారు. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రభుత్వం సుమారు రూ. 25 వేల చొప్పున తక్షణ సాయాన్ని ప్రకటించింది. -
విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి: మన్మోహన్సింగ్
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు, వాటిని ముందుగానే గుర్తించేందుకు తగినంత సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రకృతి సృష్టించిన బీభత్సంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి విపత్కర సమయాల్లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఎండీఏ) కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని చెప్పారు. సోమవారమిక్కడ ప్రధాని అధ్యక్షతన ఎన్ఎండీఏ ఐదో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘మనం ఇక్కడ సమావేశమయ్యాం కానీ ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ప్రజలు సతమతమవుతున్నారు. విపత్తు నిర్వహణ సామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని ఇటీవలి పరిణామాలు నొక్కి చెబుతున్నాయి. ఇందులో ఎన్ఎండీఏ కీలక పాత్ర పోషించాలి’’ అని అన్నారు. -
మొద్దు నిద్రలో ప్రభుత్వం: చంద్రబాబు నాయుడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రకృతి విపత్తులతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని.. పాలకులు మొద్దునిద్ర వీడటం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వరద బాధిత ప్రాంతాల పరిశీలనకు వచ్చిన ఆయన నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. శనివారం ఉదయం 11 గంటలకు జిల్లాకు చేరుకున్న ఆయన మొదట నరసన్నపేట మండలం కోమర్తి గ్రామం, వజ్రపుకొత్తూరు మండలం బెండి గేటు వద్ద ముంపునకు గురైన వరి పంటను పరిశీలించారు. అక్కడే పలాస ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆయన్ను కలుసుకుని రాష్ట్ర విభజన లేఖ వెనక్కి తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. అక్కడి నుంచి బాబు కంచిలి, కేసరపడ, కొజ్జీరియా జంక్షన్, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని రత్తకన్నకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. నిలదీసిన బాధితుడు: కంచిలి, కేసరపడ, కొజ్జీరియా జంక్షన్, లొద్దపుట్టిలో పర్యటించిన చంద్రబాబు ఇతర పార్టీలపై ఆరోపణలు చేస్తూ, టీడీపీ గురించి గొప్పలు చెప్పుకోవడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. అనపాన కుభేర్రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ వరద బాధిత ప్రాంతాల సందర్శనకు వచ్చి, రాజకీయాల గురించి మాట్లాడటమేమిటని నిలదీశాడు. మీరు గొప్పగా చెప్పుకొంటున్న జాతీయ రహదారి అభివృద్ధి కారణంగానే తమ గ్రామం పూర్తిగా ముంపునకు గురైందని గట్టిగా చెప్పడంతో బాబు కంగుతిన్నారు. బాధితులను ఆదుకోవటంలో విఫలం విశాఖపట్నం: పై-లీన్ తుపాను నుంచితేరుకోకముందే ప్రస్తుత వర్షాలు ఉత్తరాంధ్రను మ రింత కుంగదీశాయని, బాధితులకు సహాయ చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళుతూ ఆయన శనివారం విశాఖ విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు.