ఒకపక్కన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎండలు మంటెత్తుతుంటే, మరోపక్కన తూర్పు, ఈశాన్య ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్న విచిత్రమైన పరిస్థితి. వరదలు అలవాటే అయినా, మునుపెన్నడూ కనివిని ఎరుగని జలప్రళయంతో ఈశాన్య ప్రాంతం అతలాకుతలమవుతోంది. అస్సామ్, మేఘాలయల్లోని తాజా దృశ్యాలు ‘టైటానిక్’ చిత్రంలోని జలవిలయాన్ని తలపిస్తు న్నాయి.
ఒక్క అస్సామ్‌లోనే ఈ నెల ఇప్పటి దాకా సాధారణం కన్నా 109 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. 35 జిల్లాలకు గాను 33 జిల్లాలు ముంపునకు గురి కాగా, 42 లక్షల మందికి పైగా ముంపు బారిన పడ్డారు. 70 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్యంలో ఆరెంజ్ అలర్ట్‌తో, సహాయక చర్యలకు సైన్యం బరిలోకి దిగాల్సివచ్చింది. అస్సామ్ వరదలను జాతీయ సమస్యగా ప్రకటించాలని కొన్నేళ్ళుగా కేంద్రానికి వస్తున్న వినతిపై మళ్ళీ చర్చ మొదలైంది.
సహాయక చర్యల్లోని ఇద్దరు పోలీసులు వరదల్లో కొట్టుకుపోయారంటే, అస్సామ్‌లో వరదల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, అస్సామ్‌కు వరదలు కొత్త కావు. వరదలతో ఈశాన్యంలో అల్లకల్లోలం ఏటా ఆనవాయితీ. వందల సంఖ్యలో జననష్టం, పశునష్టం. వేలమంది జీవనోపాధి కోల్పోవడం. పంటలు నాశనం కావడం. ఈసారీ అదే జరిగింది. పంట భూములు తుడిచిపెట్టుకుపోయాయి.
కీలక రవాణా మార్గాలు ధ్వంసమయ్యాయి. అస్సామ్ దక్షిణ భాగంలోని బరాక్ లోయలోని తేయాకు తోటల పరిస్థితి మరీ దయనీయం. దిగువ అస్సామ్ బాగా దెబ్బతింది. బర్‌పేట లాంటి పట్నాలు పూర్తిగా నీట మునిగాయి. అస్సామ్‌లోని మొత్తం 78.52 లక్షల హెక్టార్ల భూభాగంలో 40 శాతం (సుమారు 31.05 లక్షల హెక్టార్లు) ఏటేటా వరద ముంపునకు గురవుతోంది.
అస్సామ్ ఇలా ఏటా వరదల బారిన పడడానికి అనేక కారణాలున్నాయి. ఆ రాష్ట్రంలోని నదుల వెంట, మరీ ముఖ్యంగా బ్రహ్మపుత్రలో పల్లపు ప్రాంతాలు చాలా ఎక్కువ. దాంతో, అస్తవ్యస్తంగా మట్టి పేరుకుపోతుంటుంది. నదీ భూతలాలలో ఇలా మట్టి పేరుకుపోయినకొద్దీ, వరదలు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. అలాగే, గౌహతి లాంటి ప్రాంతాల భౌగోళిక స్వరూపం సైతం తరచూ వరదల బారిన పడేలా చేస్తోంది.
మన చేతిలో లేని ఈ ప్రకృతి సంబంధమైన కారణాలతో పాటు మానవ తప్పిదాలూ ఈ జల విలయానికి ప్రధాన కారణమవుతున్నాయి. మానవజోక్యంతో నదీతీరాలు క్షయమవుతున్నాయి. అస్సామ్ మొత్తం విస్తీర్ణంలో దాదాపు 8 శాతం మేర భూభాగం గడచిన ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో నదీక్షయంతో మనిషి చెరబట్టినదేనని ఓ లెక్క. ఫలితంగా నదీప్రవాహ దిశలు మారడం, కొత్త ప్రాంతాలకు వరదలు విస్తరించడం సర్వసాధారణం.
వరదలతో పేరుకొనే ఒండ్రుమట్టి భూసారానికి ప్రయోజనకరమే. కానీ, ఈ జల విలయం తెచ్చి పెడుతున్న తీరని నష్టాలు నివారించి తీరాల్సినవి. నదీతీరాల్లో అడవుల నరికివేత, బ్రహ్మపుత్రా నది ప్రవాహ ఉరవడి జత కలసి ఏయేటికాయేడు పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. సాధారణంగా అధిక నీటిప్రవాహాన్ని నేలలోకి పీల్చుకొని, నష్టాన్ని నివారించేందుకు ప్రకృతి ఇచ్చిన వరంగా మాగాణి నేలలు ఉపకరిస్తాయి. కానీ, అత్యాశ ఎక్కువై మాగాణి నేలలను సైతం మానవ ఆవాసాలుగా మార్చేస్తున్నారు.
అలా అస్సామ్‌లో మాగాణి తగ్గింది. వెరసి, ఆ రాష్ట్రం ప్రతిసారీ ముంపులో చిక్కుకు పోతోంది. కరకట్టల నిర్మాణంతో పాలకులు చేతులు దులుపుకుంటూ ఉంటే, అధిక వరదలతో అవీ కొట్టుకుపోతున్నాయి. పొంగిపొర్లే నీటిని కొంతైనా పీల్చుకొనేందుకు వీలుగా నదీ భూతలాల్లో అడదాదడపా పూడికలు తీస్తున్నా, బ్రహ్మపుత్ర లాంటి నదుల్లో త్వరితగతిన మట్టిపేరుకుపోతుంది గనక అదీ ఉపయోగం లేకుండా పోతోంది. భారీ ఆనకట్టల నిర్మాణంతో పర్యావరణ నష్టం సరేసరి.
ఏమైనా, అస్సామ్ సహా ఈశాన్య రాష్ట్రాలకు వరదల ముప్పు తరచూ తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు, ప్రభుత్వాలు వ్యవహరించాలి. దీనిపై ఇవాళ్టికీ ఒక దీర్ఘకాలిక ప్రణాళికంటూ లేకపోవడమే విడ్డూరం. ప్రతి ఏటా వరదలు ముంచెత్తుతున్నా, పాలకులు క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన ఆచరణాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకోకపోవడం వరదను మించిన విషాదం.
టిబెట్ నుంచి మన అస్సామ్ మీదుగా బంగ్లాదేశ్‌కు దాదాపు 800 కి.మీ ప్రవహించే బ్రహ్మపుత్రలో అడుసు తీయడానికి అయిదేళ్ళ క్రితం 2017లోనే కేంద్రం రూ. 400 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. పూడిక తీశాక రూ. 40 వేల కోట్లతో 725 కి.మీ పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ యోచనా చెప్పారు. కానీ వాటికి అతీగతీ లేదు.
అధిక వ్యయమయ్యే కరకట్టలు, పూడికతీతలతో పెద్దగా ప్రయోజనం లేదు గనక ఇప్పటికైనా సమగ్ర ప్రణాళికకు శ్రీకారం చుట్టాలి. అస్సామ్‌తో పాటు వరద బీభత్సానికి గురవుతున్న పొరుగు రాష్ట్రాలు సైతం కలసికట్టుగా అడుగేయాలి. సమష్టిగా వనరుల సమీకరణ, సమాచార వినిమయంతో పరిష్కారం కనుగొనాలి. ఏటా కోట్లలో నష్టం తెస్తున్న వరద వైపరీత్యాన్ని అస్సామ్ ప్రభుత్వం ఎంతో కాలంగా కోరుతున్నట్టు జాతీయ సమస్యగా ప్రకటించే ఆలోచన కేంద్ర సర్కార్ చేయాలి.
తక్షణ సాయం అందించడంతో పాటు రాష్ట్రాల మధ్య సమన్వయ బాధ్యతను చేపట్టాలి. సామాన్యులు సైతం మాగాణి నేలల ప్రాధాన్యాన్నీ, యథేచ్ఛగా అడవుల నరికివేతతో నష్టాన్నీ గ్రహించాలి. ప్రజానీకం, పార్టీలు, ప్రభుత్వాలు– అంతా కలసికట్టుగా ఈ వరద ముప్పుకు అడ్డుకట్ట వేయకపోతే ఏటా ఈ నష్టం తప్పదు. ప్రజల వినతులు, పార్టీల హామీలు నిష్ఫలమై, ప్రతిసారీ ఎన్నికల అజెండాలో అంశంగా అస్సామ్ వరదల సమస్య మిగిలిపోవడం ఇకనైనా మారాలి.
ఈ కన్నీటిని ఆపేదెట్లా?
Published Tue, Jun 21 2022 12:11 AM | Last Updated on Tue, Jun 21 2022 12:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment