Northeast India
-
ఉగ్రవాదంపై రాజీలేని పోరు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్, ఈశాన్య భారతం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాపేక్షంగా శాంతిని నెలకొల్పినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఉగ్రవాదం, చొరబాట్లు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలపై పోరాటం కొనసాగుతుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసు అమరుల త్యాగం వృథా కాదన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ భద్రత కోసం 36,438 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. గతేడాదే 216 మంది ప్రాణాలు కోల్పోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. కొత్త నేర న్యాయ చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారిందన్నారు. పోలీసు సిబ్బంది, కుటుంబీకులు ఇక ఏ ఆయుష్మాన్ ఆసుపత్రిలోనైనా ఉచిత చికిత్స పొందవచ్చని హోం మంత్రి తెలిపారు. ‘‘సీఏపీఎఫ్ సిబ్బంది కోసం 13 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చాం. వచ్చే మార్చి నాటికి 11,276 ఇళ్లు సిద్ధమవుతాయి’’ అని వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. -
త్రిపురలో సీఎం రేసులో ప్రతిమా బౌమిక్!
అగర్తలా: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ మార్కు దాటి ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బీజేపీ కూటమిలో కొత్త సమస్య ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏడాదికాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సాహాకు పోటీగా కేంద్ర సహాయ మహిళా మంత్రి ప్రతిమా బౌమిక్‌ను సీఎం రేసులో నిలపాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ భావిస్తుండటమే ఇందుకు కారణం. సీఎం అభ్యర్థిగా ఒక్కరినే ఎన్నుకునేలా, ఏకగ్రీవం కోసం ఒప్పించేందుకు ఈశాన్యభారతంలో బీజేపీ సమస్యల పరిష్కర్త, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. బిప్లవ్ వర్గాన్ని శాంతింపజేసేందుకు ప్రతిమా బౌమిక్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు శేఖర్ దత్తా అభిప్రాయపడ్డారు. 60 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 32 చోట్ల, దాని కూటమి పార్టీ ఐపీఎప్టీ ఒక చోట విజయం సాధించిన విషయం తెల్సిందే. మరోవైపు మార్చి ఎనిమిదో తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై బీజేపీ అగ్రనేత అమిత్ షాతో అస్సాం సీఎం హిమంత భేటీ అయ్యారు. భేటీలో నాగాలాండ్ సీఎంనేపియూ రియో సైతం పాల్గొన్నారు. -
మేఘాలయలో ముక్కోణం
ఈశాన్య భారత్‌లో గిరిజన ప్రాబల్యం కలిగిన మేఘాలయాలో శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మేఘాలయలో ఫిబ్రవరి 27న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 2న ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పాత ప్రత్యర్థులైన కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా మళ్లీ హోరాహోరీగా తలపడుతున్నారు. 2018 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నేతృత్వం వహించి, 21 స్థానాల్లో పార్టీని గెలిపించిన మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నుంచి బరిలోకి దిగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. కిందటిసారి పోటీలో లేని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతుండడం విశేషం. 2018లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి, అధికార పీఠానికి దగ్గరగా వచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థులంటూ ఎవరూ లేకపోవడం గమనార్హం. ఎన్నికల్లో ఎన్పీపీకి కాన్రాడ్ సంగ్మా, తృణమూల్ కాంగ్రెస్‌కు ముకుల్ సంగ్మా, కాంగ్రెస్‌కు విన్సెంట్ పాలా, బీజేపీకి ఎర్నెస్ట్ మారీ నాయకత్వం వహిస్తున్నారు. ప్రధానంగా ఎన్పీపీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు సాగుతోంది. అంతర్గత లుకలుకలతో అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి(ఎండీఏ) కూటమి విచ్ఛిన్నమైంది. కూటమిలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ), యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ), పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. ఎండీఏలో అతిపెద్ద పార్టీ అయిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) నేత, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మరోసారి కుర్చీ దక్కించుకోవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే మేఘాలయలో 2013 తర్వాత వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న తొలి పార్టీగా ఎన్పీపీ రికార్డుకెక్కుంది. 18 మంది రాజీనామా 2018లో కేవలం 20 సీట్లు గెలుచుకున్న ఎన్పీపీ.. యూడీపీ(6 సీట్లు), హెచ్ఎస్పీడీపీ(2 సీట్లు), పీడీఎఫ్(4 సీట్లు), బీజేపీ(2 సీట్ల)తోపాటు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ఎమ్మెల్యేల గోడదూకుళ్లు తదితరాలతో బలాబలాలు మారుతూ వచ్చాయి. 2021 నవంబర్‌లో ముకుల్ సంగ్మా నేతృత్వంలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు సైతం పార్టీ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేకుండాపోయారు. ఇటీవలే 18 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు, సొంత పార్టీలకు రాజీనామా చేశారు. టిక్కెట్లపై హామీ ఇచ్చే పార్టీలో చేరి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తృణమూల్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ వీరిలో ఉన్నారు. గిరిజన రాష్ట్రమైన మేఘాలయకు ప్రత్యేక హోదా ఉంది. దాంతో రాష్ట్రంలో ఖర్చు చేసే నిధుల్లో 90 శాతానికిపైగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంటాయి. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడి రాజకీయాలను చాలావరకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. చిన్నాచితక పార్టీలు ఏదో ఒక నినాదంతో ఎన్నికల్లో పోటీ చేయడం, ఒకటో రెండో స్థానాలు గెలుచుకొని, ఫలితాల అనంతరం నెంబర్ గేమ్‌లో వీలైనంత మేరకు లబ్ధి పొందడం పరిపాటిగా మారింది. మళ్లీ మాదే అధికారం: ఎన్పీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టించిందని, అందుకే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నామని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తేల్చిచెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం లేదని, తాము మళ్లీ నెగ్గడం ఖాయమని ఎన్పీపీ రాష్ట్ర అధ్యక్షుడు డబ్ల్యూ.ఖార్లుఖీ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభావితం చేసే అంశాలేమిటి? ప్రభుత్వ వ్యతిరేకత: కాన్రాడ్ సంగ్మా సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవడం, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుండడం, నిధుల లేమితో ఆరోగ్య రంగం కునారిల్లుతుండడం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారింది. సరిహద్దు రగడ: మేఘాలయ–అస్సాం నడుమ సరిహద్దు వివాదం రగులుతోంది. రెండు రాష్ట్రాల్లో సరిహద్దులో ఉన్న పలు తెగల మధ్య హింసాకాండ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని జనం ఆరోపిస్తున్నారు. కూటమి విచ్ఛిన్నం: అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి(ఎండీఏ) కూటమి విచ్ఛిన్నమై, పార్టీలు సొంతంగా పోటీ చేస్తుండడం ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ కన్నీటిని ఆపేదెట్లా?
ఒకపక్కన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎండలు మంటెత్తుతుంటే, మరోపక్కన తూర్పు, ఈశాన్య ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్న విచిత్రమైన పరిస్థితి. వరదలు అలవాటే అయినా, మునుపెన్నడూ కనివిని ఎరుగని జలప్రళయంతో ఈశాన్య ప్రాంతం అతలాకుతలమవుతోంది. అస్సామ్, మేఘాలయల్లోని తాజా దృశ్యాలు ‘టైటానిక్’ చిత్రంలోని జలవిలయాన్ని తలపిస్తు న్నాయి. ఒక్క అస్సామ్‌లోనే ఈ నెల ఇప్పటి దాకా సాధారణం కన్నా 109 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. 35 జిల్లాలకు గాను 33 జిల్లాలు ముంపునకు గురి కాగా, 42 లక్షల మందికి పైగా ముంపు బారిన పడ్డారు. 70 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్యంలో ఆరెంజ్ అలర్ట్‌తో, సహాయక చర్యలకు సైన్యం బరిలోకి దిగాల్సివచ్చింది. అస్సామ్ వరదలను జాతీయ సమస్యగా ప్రకటించాలని కొన్నేళ్ళుగా కేంద్రానికి వస్తున్న వినతిపై మళ్ళీ చర్చ మొదలైంది. సహాయక చర్యల్లోని ఇద్దరు పోలీసులు వరదల్లో కొట్టుకుపోయారంటే, అస్సామ్‌లో వరదల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, అస్సామ్కు వరదలు కొత్త కావు. వరదలతో ఈశాన్యంలో అల్లకల్లోలం ఏటా ఆనవాయితీ. వందల సంఖ్యలో జననష్టం, పశునష్టం. వేలమంది జీవనోపాధి కోల్పోవడం. పంటలు నాశనం కావడం. ఈసారీ అదే జరిగింది. పంట భూములు తుడిచిపెట్టుకుపోయాయి. కీలక రవాణా మార్గాలు ధ్వంసమయ్యాయి. అస్సామ్ దక్షిణ భాగంలోని బరాక్ లోయలోని తేయాకు తోటల పరిస్థితి మరీ దయనీయం. దిగువ అస్సామ్ బాగా దెబ్బతింది. బర్పేట లాంటి పట్నాలు పూర్తిగా నీట మునిగాయి. అస్సామ్‌లోని మొత్తం 78.52 లక్షల హెక్టార్ల భూభాగంలో 40 శాతం (సుమారు 31.05 లక్షల హెక్టార్లు) ఏటేటా వరద ముంపునకు గురవుతోంది. అస్సామ్ ఇలా ఏటా వరదల బారిన పడడానికి అనేక కారణాలున్నాయి. ఆ రాష్ట్రంలోని నదుల వెంట, మరీ ముఖ్యంగా బ్రహ్మపుత్రలో పల్లపు ప్రాంతాలు చాలా ఎక్కువ. దాంతో, అస్తవ్యస్తంగా మట్టి పేరుకుపోతుంటుంది. నదీ భూతలాలలో ఇలా మట్టి పేరుకుపోయినకొద్దీ, వరదలు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. అలాగే, గౌహతి లాంటి ప్రాంతాల భౌగోళిక స్వరూపం సైతం తరచూ వరదల బారిన పడేలా చేస్తోంది. మన చేతిలో లేని ఈ ప్రకృతి సంబంధమైన కారణాలతో పాటు మానవ తప్పిదాలూ ఈ జల విలయానికి ప్రధాన కారణమవుతున్నాయి. మానవజోక్యంతో నదీతీరాలు క్షయమవుతున్నాయి. అస్సామ్ మొత్తం విస్తీర్ణంలో దాదాపు 8 శాతం మేర భూభాగం గడచిన ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో నదీక్షయంతో మనిషి చెరబట్టినదేనని ఓ లెక్క. ఫలితంగా నదీప్రవాహ దిశలు మారడం, కొత్త ప్రాంతాలకు వరదలు విస్తరించడం సర్వసాధారణం. వరదలతో పేరుకొనే ఒండ్రుమట్టి భూసారానికి ప్రయోజనకరమే. కానీ, ఈ జల విలయం తెచ్చి పెడుతున్న తీరని నష్టాలు నివారించి తీరాల్సినవి. నదీతీరాల్లో అడవుల నరికివేత, బ్రహ్మపుత్రా నది ప్రవాహ ఉరవడి జత కలసి ఏయేటికాయేడు పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. సాధారణంగా అధిక నీటిప్రవాహాన్ని నేలలోకి పీల్చుకొని, నష్టాన్ని నివారించేందుకు ప్రకృతి ఇచ్చిన వరంగా మాగాణి నేలలు ఉపకరిస్తాయి. కానీ, అత్యాశ ఎక్కువై మాగాణి నేలలను సైతం మానవ ఆవాసాలుగా మార్చేస్తున్నారు. అలా అస్సామ్‌లో మాగాణి తగ్గింది. వెరసి, ఆ రాష్ట్రం ప్రతిసారీ ముంపులో చిక్కుకు పోతోంది. కరకట్టల నిర్మాణంతో పాలకులు చేతులు దులుపుకుంటూ ఉంటే, అధిక వరదలతో అవీ కొట్టుకుపోతున్నాయి. పొంగిపొర్లే నీటిని కొంతైనా పీల్చుకొనేందుకు వీలుగా నదీ భూతలాల్లో అడదాదడపా పూడికలు తీస్తున్నా, బ్రహ్మపుత్ర లాంటి నదుల్లో త్వరితగతిన మట్టిపేరుకుపోతుంది గనక అదీ ఉపయోగం లేకుండా పోతోంది. భారీ ఆనకట్టల నిర్మాణంతో పర్యావరణ నష్టం సరేసరి. ఏమైనా, అస్సామ్ సహా ఈశాన్య రాష్ట్రాలకు వరదల ముప్పు తరచూ తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు, ప్రభుత్వాలు వ్యవహరించాలి. దీనిపై ఇవాళ్టికీ ఒక దీర్ఘకాలిక ప్రణాళికంటూ లేకపోవడమే విడ్డూరం. ప్రతి ఏటా వరదలు ముంచెత్తుతున్నా, పాలకులు క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన ఆచరణాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకోకపోవడం వరదను మించిన విషాదం. టిబెట్ నుంచి మన అస్సామ్ మీదుగా బంగ్లాదేశ్‌కు దాదాపు 800 కి.మీ ప్రవహించే బ్రహ్మపుత్రలో అడుసు తీయడానికి అయిదేళ్ళ క్రితం 2017లోనే కేంద్రం రూ. 400 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. పూడిక తీశాక రూ. 40 వేల కోట్లతో 725 కి.మీ పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ యోచనా చెప్పారు. కానీ వాటికి అతీగతీ లేదు. అధిక వ్యయమయ్యే కరకట్టలు, పూడికతీతలతో పెద్దగా ప్రయోజనం లేదు గనక ఇప్పటికైనా సమగ్ర ప్రణాళికకు శ్రీకారం చుట్టాలి. అస్సామ్‌తో పాటు వరద బీభత్సానికి గురవుతున్న పొరుగు రాష్ట్రాలు సైతం కలసికట్టుగా అడుగేయాలి. సమష్టిగా వనరుల సమీకరణ, సమాచార వినిమయంతో పరిష్కారం కనుగొనాలి. ఏటా కోట్లలో నష్టం తెస్తున్న వరద వైపరీత్యాన్ని అస్సామ్ ప్రభుత్వం ఎంతో కాలంగా కోరుతున్నట్టు జాతీయ సమస్యగా ప్రకటించే ఆలోచన కేంద్ర సర్కార్ చేయాలి. తక్షణ సాయం అందించడంతో పాటు రాష్ట్రాల మధ్య సమన్వయ బాధ్యతను చేపట్టాలి. సామాన్యులు సైతం మాగాణి నేలల ప్రాధాన్యాన్నీ, యథేచ్ఛగా అడవుల నరికివేతతో నష్టాన్నీ గ్రహించాలి. ప్రజానీకం, పార్టీలు, ప్రభుత్వాలు– అంతా కలసికట్టుగా ఈ వరద ముప్పుకు అడ్డుకట్ట వేయకపోతే ఏటా ఈ నష్టం తప్పదు. ప్రజల వినతులు, పార్టీల హామీలు నిష్ఫలమై, ప్రతిసారీ ఎన్నికల అజెండాలో అంశంగా అస్సామ్ వరదల సమస్య మిగిలిపోవడం ఇకనైనా మారాలి. -
పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం
సాక్షి, న్యూఢిల్లీ: ఏడేళ్లుగా ఈశాన్యభారతంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తులో సాధించబోయే మరిన్ని విజయాలకు బాటలు వేస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈశాన్య భారతం పునరుజ్జీవనం దిశగా అడుగులు వేస్తోందని, ఈ ప్రాంతాభివృద్ధిలో నవశకం ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రాంతంలో తిరుగుబాటు శక్తుల ప్రభావం తగ్గుతూ వస్తోందని ఆయన వెల్లడించారు. శనివారం అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. 2014 నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధితో పాటు ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా ఎంతో కృషి చేస్తున్నాయని ఆయన అభినందించారు. భారతదేశంలో ఇటీవలి కాలంలో చట్టసభల పనితీరును ప్రస్తావిస్తూ, పరిస్థితుల్లో మార్పు రావాలని, ప్రజల సమస్యలను ప్రస్తావించి, చర్చించి వాటికి పరిష్కారం సూచించే బదులు, అనవసర వాదులాటల ద్వారా సభా సమయాన్ని వ్యర్థం చేయడం సరికాదన్నారు. 2015–20 మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కనిష్టంగా ఒకరోజు, గరిష్టంగా ఆరు రోజులపాటు సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ధోరణి ఆందోళనకరమన్నారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాలన్నీ తమ సమావేశాల సమయాన్ని కాస్త పొడిగించుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. చట్టాల రూపకల్పనలో మహిళలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలన్నారు. ఈశాన్య భారతంలో మౌలిక సదుపాయాల కల్పన విస్తృతంగా జరుగుతోందని, తద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. 2014లో ప్రధానమంత్రి ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని తీసుకొచ్చే వరకూ ఈ ప్రాంతంలో ఆకాంక్షలకు, వాటిని పూర్తిచేయడానికి మధ్య స్పష్టమైన అంతరం ఉండేదన్నారు. అరుణా చల్ ప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలు ఇతర భాగస్వామ్య పక్షాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. -
క్రమశిక్షణతో కొమ్ములు వంచారు
అవన్నీ వెనుకబడిన రాష్ట్రాలు.. ప్రతీ రాష్ట్రానికి అంతర్జాతీయ సరిహద్దులున్నాయి.. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్ ఇలా ఏదో ఒక దేశంతో సరిహద్దుల్ని పంచుకున్నాయి.. ఆరోగ్య సదుపాయాలు అంతంత మాత్రం అయినా కరోనాని కట్టడి చేశాయి.. ఎనిమిది రాష్ట్రాలకు గాను అయిదు రాష్ట్రాలు ఇప్పుడు కరోనా ఫ్రీ.. భారత్‌లో గోవా తర్వాత అందరూ ఈశాన్య రాష్ట్రాలవైపే చూస్తున్నారు. చైనా సహా అం తర్జాతీయ సరిహద్దులున్న అస్సాం, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని మొదట్లో ఆందోళన ఉండేది. కానీ సిక్కిం, నాగాలాండ్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అస్సాంలో నాగాలాండ్ వాసి ఒకరు కరోనా బారిన పడ్డారు. కానీ సిక్కింవాసులెవరికీ ఈ వైరస్ సోకలేదు. ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించడం, ప్రజలు క్రమశిక్షణతో ప్రభుత్వం గీసిన గీత దాటకపోవడంతో అయిదు రాష్ట్రాలు కరోనా కొమ్ములు వంచాయి. అయితే ఇప్పు డు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఈ రాష్ట్రాలకు వస్తున్నాయి. దీనివల్ల ఎక్కడ కేసులు పెరుగుతాయా అన్న ఆందోళనైతే నెలకొంది. ఇక త్రిపురలో కేసులు పెరగడం, అస్సాంలో కూడా ప్రతీరోజూ కేసులు నమోదు అవుతూ ఉండడంతో తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి 100 కేసులకి చేరడానికి 40 రోజులు పడితే కేవలం నాలుగు రోజుల్లోనే రెట్టింపై 200 దాటేశాయి. సిక్కిం కేసుల్లేవ్ ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. సిక్కింకి చైనాతో పాటు భూటాన్, నేపాల్ సరిహద్దులుగా ఉన్నాయి. జనవరిలో భారత్‌లో తొలి కేసు నమోదవగానే కేంద్రం ఆదేశాల గురించి సిక్కిం వేచి చూడలేదు. సరిహద్దుల వెంబడి నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విదేశాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్‌కి తరలించింది. మార్చి 5 నుంచే అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసేసింది. విదేశీ పర్యాటకులెవరినీ రానివ్వలేదు. ముఖ్యంగా చైనాతో వాణిజ్యం జరిగే నాథులా మార్గాన్ని బంద్ చేసింది. మార్చి రెండోవారం నుంచి రద్దీ ఎక్కువగా ఉండే రెస్టారెంట్లు, థియేటర్లు, పార్కులు వంటివి మూసేసింది. ఇక పూర్తి స్థాయి లాక్డౌన్ మార్చి 25 నుంచి అమలు చేసింది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ స్వయంగా కోవిడ్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఒక్క కేసు నమోదు కాకుండా చూసుకున్నారు. మిజోరం మిజోరం రాష్ట్రానికి మయన్మార్‌తో 510 కి.మీ. సరిహద్దు, బంగ్లాదేశ్‌తో 318 కి.మీ. సరిహద్దు ఉంది. అయినా మిజోరంలో కేవలం ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది. 45 రోజుల పాటు కరోనాతో పోరాటం చేసిన కరోనా రోగిని శనివారం డిశ్చార్జ్ చేశారు. 50 ఏళ్ల వయసున్న చర్చి ఫాదర్ అయిన అతను ఆమ్‌స్టర్‌డ్యామ్‌కి వెళ్లి వచ్చారు. ఏప్రిల్ 27న ఆయనకి కరోనా పా జిటివ్ వచ్చింది. ఆయన కోలుకోవడంతో మిజోరం కరోనా ఫ్రీ రాష్ట్రంగా అవతరించింది. సాధించింది ఇలా .. ► ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న భూభాగానికి 99శాతం చైనా, మయన్మార్, సహా వివిధ దేశాల సరిహద్దులున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తంగా ఉన్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల్ని దేశవ్యాప్త లాక్‌డౌన్‌కి చాలా రోజుల ముందే మూసేశాయి. ► ఈ ప్రాంత ప్రజల్లో క్రమశిక్షణ చాలా ఎక్కువ. ప్రభుత్వం నిర్దేశించిన లాక్డౌన్ నిబంధనల్ని ఎవరూ ఉల్లంఘించలేదు. ఇంటిపట్టునే ఉంటూ మరెక్కడ లేని విధంగా ప్రభుత్వాలకి ప్రజలు సహకరిస్తున్నారు. ► ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో ప్రకృతి విధ్వంసం జరగలేదు. ప్రజలంతా కాలుష్యం లేని గాలి పీలుస్తూ, కల్తీ లేని తిండి తింటూ ఆరోగ్యంగా ఉంటారు. సంప్రదాయాలను గౌరవిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటారు. ► ఎనిమిది రాష్ట్రాలకి కలిపి కేంద్రంలో డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్ అనే మంత్రిత్వ శాఖ ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్రం కూడా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటోంది. ► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కి తరలించడం వంటి చర్యలన్నీ అత్యంత పకడ్బందీగా అమ లు చేశారు. ఇతర రాష్ట్రాలన్నీ మొదట్లో 14 రోజుల క్వారంటైన్ అమలు చేస్తే ఈశాన్యంలో 21 రోజులు లాక్‌డౌన్‌ని అమలు చేశారు. -
ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం..
కోల్‌కతా: అస్సాం, మేఘాలయ, బిహార్, జార్ఖండ్ సహా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది. ఉదయం 10.20 సమయంలో పలు ప్రాంతాల్లో 15 నుంచి 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. అస్సాంలోని కోక్రాఘర్ పట్టణానికి వాయవ్య దిశలో రెండు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూఉపరితలానికి 10 కి.మీ లోతులో భూమి కంపించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. -
11 సబ్డివిజన్లలో లోటు వర్షపాతం
న్యూఢిల్లీ: దేశంలోని 36 వాతావరణ సబ్డివిజన్లలో 11 సబ్డివిజన్లలో ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) తెలిపింది. అలాంటి ప్రాంతాలు ఎక్కువగా తూర్పు, ఈశాన్య భారత్‌లో ఉన్నాయంది. 23 సబ్డివిజన్లు సాధారణ వర్షపాతం పొందాయని, 2 సబ్డివిజన్లలో(కేరళ, కోస్తా ఏపీ) సాధారణం కన్నా అధిక వర్షపాతం కురిసిందని తెలిపింది. లోటువర్షపాతం నమోదైన తూర్పు, ఈశాన్య డివిజన్లలో అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం–మేఘాలయ, నాగాలాండ్–మిజోరాం–త్రిపుర, హిమాలయ బెంగాల్–సిక్కిం, గంగామైదానాల పశ్చిమ బెంగాల్, జార్ఖండ్–బిహార్ ఉన్నాయి. దక్షిణాదిలో రాయలసీమ, ఉత్తర కర్ణాటక, తెలంగాణ సబ్డివిజన్లు ఉన్నాయి. తెలంగాణలో 41 శాతం, లక్ష్యద్వీప్‌లో 44 శాతం లోటు ఏర్పడింది. వరదలతో అతలాకుతలమైన కేరళలో జూన్ 1 నుంచి 41 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. -
కర్ణాటకలో ‘ఈశాన్య’ ప్రకంపనలు
బెంగళూరు: ఈశాన్య రాష్ట్రాల్లో పరిణామాల ప్రభావం కర్ణాటక రాజకీయాలపై సాధారణంగా ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అసలే ఉండదు. కానీ, శనివారం నాటి పరిస్థితి వేరు. కర్ణాటక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు ఉదయం నుంచీ టీవీలకు అతుక్కుపోయారు. త్రిపురలో బీజేపీ ముందంజలో ఉందన్న వార్తలు రాగానే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి యడ్యూరప్ప సహా నేతల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది. ఢిల్లీలోని బీజేపీ పెద్దల చూపంతా ఇక కర్ణాటకపైనే ఉంటుందనీ, తమకు అధికారం ఖాయమనీ వారికి నమ్మకం కలిగినట్లుంది. అయితే, త్రిపుర, నాగాలాండ్‌లలో తుడిచి పెట్టుకు పోవటం కాంగ్రెస్‌ను షాక్‌కు గురిచేసింది. త్రిపురలో తమ పార్టీ అంతగా ప్రభావం చూపనప్పటికీ బీజేపీ దూకుడును మాణిక్‌సర్కార్ నిలువరిస్తారనీ, అదే మాదిరిగా కర్ణాటకలో పార్టీని తిరిగి అధికారంలో తెస్తామనే ఆశ ఇప్పటిదాకా కాంగ్రెస్ నేతల్లో ఉండింది. కానీ, తాజా ఫలితాలు వారి నమ్మకాన్ని వమ్ము చేశాయి. మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్..గోవా, మణిపూర్‌లో మాదిరి రాజకీయాలతో బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని భయపడుతోంది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ నేత ఒకరు విశ్లేషిస్తూ..ఈశాన్య రాష్ట్రాల్లో ఫలితాలను కర్ణాటకతో పోల్చి చూసుకోవటం సరికాదన్నారు. అయితే, ఈశాన్య రాష్ట్రాల ఫలితాల ప్రభావం కర్ణాటకపై ఎందుకు ఉండబోదో చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటకనే. పంజాబ్‌లో అధికారంలో ఉన్నా అక్కడ ఖజానా ఖాళీగా ఉండటంతో ఏమీ చేయలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో విజయం కాంగ్రెస్‌కు కీలకం. ఇక్కడ అధికారం కోల్పోతే జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం చేజారటం ఖాయం. బెంగాల్లో బీజేపీకి మార్గం సుగమం! న్యూఢిల్లీ .. త్రిపురలో ఫలితాల ప్రభావం 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, ఒడిశాల పైనా పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్రిపురలో రెండు లోక్‌సభ స్థానాలే ఉన్నప్పటికీ.. 25 ఏళ్ల వామపక్ష కూటమిని కూలదోయటం ఇతర బీజేపీయేతర ఈశాన్య రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది. పశ్చిమబెంగాల్లో సీపీఎంకు ఆదరణ తగ్గిపోతుండటంతో.. బీజేపీ ప్రధాన పోటీదారుగా ఎదుగుతోంది. అయితే బెంగాల్ గడ్డపై మమత ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఓటు శాతాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఇన్నాళ్లు ఎదగలేదు. త్రిపురలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం ఇప్పుడు పశ్చిమబెంగాల్, ఒడిశాలపై ప్రభావం చూపనుంది. ఈ రెండు రాష్ట్రాలపై బీజేపీ లుక్–ఈస్ట్ పాలసీతో వ్యూహాలు రచిస్తోంది. ఇంతవరకు ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్ నష్టపోతున్న ఓట్లు సీట్లు.. బీజేపీకి అదనపు బలంగా మారుతున్నాయి. ఇది మోదీ–షా ద్వయం అనుసరిస్తున్న వ్యూహం కారణంగానే. అయితే మేఘాలయాలో హంగ్ పరిస్థితులనుంచి తప్పించుకుని ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అహ్మద్ పటేల్, కమల్‌నాథ్‌ను రాహుల్ రంగంలోకి దించారు. -
విజయంలో ఆ నలుగురు
న్యూఢిల్లీ: 2014కు ముందు ఈశాన్యరాష్ట్రాల్లో బీజేపీ జెండా పట్టుకునే వారే లేరు. 10–15 ఏళ్ల ముందునుంచి ఆరెస్సెస్ తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ రాజకీయంగా బీజేపీకి వార్డు మెంబర్లు కూడా లేని పరిస్థితి. కానీ ఈ మూడున్నరేళ్లలో పరిస్థితి చాలా మారింది. ఆరెస్సెస్ క్షేత్రస్థాయి పనికి బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాలు తోడవటంతో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటుచేసే స్థాయికి ఎదిగింది. అస్సాంలో అధికారంతో మొదలైన బీజేపీ ‘ఈశాన్య’ పయనం త్రిపుర విజయంతో మరింత విశ్వాసంగా ముందుకెళ్లేందుకు మార్గం సుగమం చేసింది. త్రిపురలో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టడం, నాగాలాండ్‌లోనూ బీజేపీకి విజయాన్ని అందించటంలో నలుగురు నేతలు అన్నీ తామై వ్యవహరించారు. వారే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, అస్సాం మంత్రి, బీజేపీ ఈశాన్య రాష్ట్రాల బాధ్యుడు హిమంత బిస్వా, త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్, ఆరెస్సెస్ వ్యూహకర్త సునీల్ దేవధర్. హిమంత బిస్వా శర్మ 2015లో బీజేపీలో చేరకముందు ఈయన కాంగ్రెస్ నేత. దశాబ్దానికి పైగా అస్సాం కాంగ్రెస్‌కు సేవలందించారు. అప్పటి సీఎం తరుణ్ గొగోయ్‌తో భేదాభిప్రాయా లతో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరారు. ఈయన సామర్థ్యాన్ని గుర్తించిన బీజేపీ.. పార్టీలోకి వస్తూనే 2015 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన వ్యూహకర్తగా అవకాశాన్నిచ్చింది. పలువురు బీజేపీ కేంద్ర నాయకులతో కలిసి బిస్వా రూపొందించిన వ్యూహాలు.. గొగోయ్ కోటను బద్దలు కొట్టి బీజేపీకి పట్టంగట్టాయి. ఈశాన్య రాష్ట్రాలపై మంచి అవగాహన ఉన్న హిమంతకు ఆ తర్వాత నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర పగ్గాలను పార్టీ అప్పగించింది. అవతలి పార్టీల నేతలను చేరుకుని కూటములు ఏర్పాటు చేయటం, బీజేపీలోకి ఆహ్వానించటంలో శర్మ రూటే సెపరేటు. వనరులను సృష్టించటంలోనూ ఈయన అందెవేసిన చేయి. త్రిపురలో ఐపీఎఫ్టీతో, నాగాలాండ్‌లో ఎన్డీపీపీతో పొత్తుల విషయంలో హిమంత కీలకంగా వ్యవహరించారు. సునీల్ దేవధర్ ఆరెస్సెస్ ముఖ్య నేత. పదేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. ఏడు రాష్ట్రాల్లో సంఘ్ ప్రభావం పెంచటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే దేవధర్‌ను.. అమిత్ షా త్రిపుర ప్రధాన వ్యూహకర్తగా నియమించారు. అదీ ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే. బీజేపీ ఇంటింటి ప్రచారం విజయవంతం కావటంలో ఈయన పాత్ర అత్యంత కీలకం. విప్లవ్ కుమార్ దేవ్ బీజేపీ త్రిపుర ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందువరసలో ఉన్నారు. బీజేపీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడు. మాజీ ఆరెస్సెస్ ప్రచారక్ కూడా. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనప్పటికీ.. బీజేపీ ఈయన్నే ముందుండి ప్రచారాన్ని నడిపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్‌రాయ్ బర్మన్ సహా పలువురు ముఖ్యమైన కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చటంలో కీలకంగా వ్యవహరించారు. రామ్‌మాధవ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. జమ్మూకశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీ కూటములు ఏర్పాటుచేయటంలో రామ్ మాధవ్ అసలైన వ్యూహకర్త. చాలా ఓపికగా వ్యవహరించటం. వ్యూహాలు రచించటంలో దిట్ట. ఎన్డీపీపీతో బీజేపీ పొత్తులోనూ హిమంతతో కలిసి పనిచేశారు. -
‘ఎర్ర’కోటలో కాషాయం
న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలో బీజేపీ హవా పెరుగుతోంది. శనివారం వెల్లడైన మూడురాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఇప్పటికే అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో అధికారంలో ఉన్న బీజేపీ.. తాజాగా కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి త్రిపురలో భారీవిజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఒక్క కౌన్సిలర్ కూడా లేని త్రిపురలో 25 ఏళ్ల మాణిక్ ‘సర్కారు’ను గద్దెనుంచి కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. ‘శూన్యం నుంచి శిఖరానికి చేరుకున్నాం’ అని ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ పేర్కొన్నారు. అటు నాగాలాండ్ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యేలా కమలదళం వ్యూహాలు రచిస్తోంది. మేఘాలయలో హంగ్ ఏర్పడినప్పటికీ.. ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు, మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్.. త్రిపుర, నాగాలాండ్‌లలో ఖాతా తెరవలేదు. ఎలాగైనా ప్రభుత్వంలో.. నాగాలాండ్‌లో బీజేపీ–ఎన్డీపీపీ కూటమి మెజారిటీ సాధించలేకపోయింది. అటు అధికారంలో ఉన్న ఎన్పీఎఫ్కూ స్పష్టమైన మెజారిటీ లేదు. అయినా ఎన్పీపీ, జేడీయూ, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. అటు, బీజేపీ తమతో కలసిరావాలంటూ ఎన్పీఎఫ్ ఆహ్వానం పంపింది. ‘బీజేపీ నేతృత్వంలో ఈశాన్య ప్రజాస్వామ్య కూటమిలో ఎన్పీఎఫ్ భాగస్వామిగానే ఉంది. మాతో కలిసి వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు’ అని సీఎం, ఎన్పీఎఫ్ నేత టీఆర్ జెలియాంగ్ పేర్కొన్నారు. దీంతో నాగాలాండ్‌లో ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకం కానుంది. ఎన్నికల ముందు వరకు ఎన్పీఎఫ్–బీజేపీ అధికారంలో ఉన్నాయి. మేఘాలయ ఎవరిది? మేఘాలయ ప్రజలు ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు. 59 సీట్లున్న అసెంబ్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 21 సీట్లలో విజయం సాధించి.. మెజారిటీకి 9 సీట్ల దూరంలో నిలిచింది. బీజేపీ 2 చోట్ల గెలవగా.. నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏ పార్టీకి మద్దతు రాకపోవటం చిన్న పార్టీల పాత్ర కీలకంగా మారింది. దీంతో పరిస్థితి చేయి దాటకుండా కాంగ్రెస్‌పార్టీ అహ్మద్ పటేల్, కమల్‌నాథ్‌లను రంగంలోకి దించింది. అటు బీజేపీ కూడా ఎన్‌పీపీతో కలిసి సర్కారు ఏర్పాటుకు లోపాయకారిగా సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాలకు బీజేపీ అబ్జర్వర్లను నియమించింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జువల్ ఓరమ్లను త్రిపురకు, జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్‌లను నాగాలాండ్‌కు, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అల్ఫోన్స్ కన్నథాణంలను మేఘాలయకు పంపింది. 2019 ఎన్నికలకు.. తాజా ఫలితాలు బీజేపీ మరింత విశ్వాసంతో 2019 సార్వత్రిక ఎన్నికలు వెళ్లేందుకు బాటలు వేస్తున్నాయి. అసలు స్థానం లేని ఈశాన్య రాష్ట్రాల్లో మరీ ప్రత్యేకంగా పార్టీ జెండా ఎగరలేని త్రిపురలో అధికారాన్ని సంపాదించటం దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచాయి. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. పశ్చిమబెంగాల్, ఒడిశాలో పార్టీ పట్టును పెంచుకుంటున్న కమలదళం.. దక్షిణాదినుంచి మరిన్ని సీట్లను ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మొత్తంగా 2019లో తిరిగి అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీల జోరునూ అడ్డుకునేందుకు షా–మోదీ ద్వయం వ్యూహాలు రచిస్తోంది. ఒక్కోరాష్ట్రం కమలమయం 2014కు ముందు దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు కేవలం ఏడు మాత్రమే. గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవా, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్లు మాత్రమే బీజేపీ ఖాతాలో ఉన్నాయి. కానీ మోదీ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాక బీజేపీ జోరు పెరిగింది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, యూపీ, మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టింది. తాజా ఫలితాలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో (కర్ణాటక, పంజాబ్, మిజోరం) మాత్రమే ఉంది. -
‘చైనా సాయంతో పాక్ పక్కా ప్లాన్’
న్యూఢిల్లీ: చైనా సాయంతో పాకిస్తానే పక్కా ప్రణాళికతో బంగ్లాదేశీయులు ఈశాన్య రాష్ట్రాల్లోకి వలస వచ్చేలా చేస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం అన్నారు. ఈ ప్రాంతంలో అస్థిరత నెలకొనేలా చూడటమే వారి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోకి బంగ్లాదేశీయుల వలసలు పెరిగిపోతున్న అంశంపై ఆయన ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. అస్సాంలో ముస్లింల జనాభా పెరిగిపోతుండటాన్ని రావత్ ప్రస్తావిస్తూ అక్కడ ఏఐయూడీఎఫ్ అనే ముస్లిం పార్టీ బీజేపీ కన్నా చాల వేగంగా ఎదుగుతోందని అన్నారు. ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలోనే ఈ సమస్యకు పరిష్కారం దాగుందని రావత్ సూచించారు. -
ఈశాన్య భారతాన్ని కుదిపేసిన భూకంపం
-
భార్యలకు ఆ అలవాటు చేస్తున్నది భర్తలే!
ఈటానగర్: ఆలుమగలు పాలు, తేనెలా కలిసుండాలంటారు. కానీ అరుణాచల్ ప్రదేశ్ లో ఆలుమగలు మరో అడుగు ముందుకేసి మత్తుపదార్ధాలు కలిసి సేవిస్తున్నారు. జాయింటుగా నల్లమందు నంజుకుంటున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే తమ భార్యలకు స్వయంగా భర్తలే నల్లమందు అలవాటు చేస్తున్నారని ఇంటింటి సమగ్ర సర్వేలో వెల్లడైంది. ఈశాన్య రాష్ట్రాల్లో 2.1 శాతం మంది మహిళలు నల్లమందు సేవిస్తున్నారని, వీరిలో ఎక్కువమందికి పెళ్లై తర్వాత భర్తలే ఈ అలవాటు చేసినట్టు తేలింది. ప్రతి 100 మందిలో 6.4 శాతం మంది కనీసం ఒక్కసారైనా నల్లమందు తీసుకున్నట్టు సర్వేలో వెల్లడైంది. మత్తుపదార్థాల సేవనంలో మణిపూర్ మహిళలు(28.2 శాతం) ముందున్నారు. మిజోరం(17.4), నాగాలాండ్(14.9), మేఘలయ(12.1), అస్సాం(10.2), సిక్కిం(9.8) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని డడ్రగ్స్ అండ్ క్రైమ్ విభాగం ఈ సర్వే నిర్వహించింది. ఈశాన్య భారత్ లోని 8 రాష్ట్రాల్లో సమగ్ర సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి.