అవన్నీ వెనుకబడిన రాష్ట్రాలు.. ప్రతీ రాష్ట్రానికి అంతర్జాతీయ సరిహద్దులున్నాయి.. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్ ఇలా ఏదో ఒక దేశంతో సరిహద్దుల్ని పంచుకున్నాయి.. ఆరోగ్య సదుపాయాలు అంతంత మాత్రం అయినా కరోనాని కట్టడి చేశాయి.. ఎనిమిది రాష్ట్రాలకు గాను అయిదు రాష్ట్రాలు ఇప్పుడు కరోనా ఫ్రీ..
భారత్‌లో గోవా తర్వాత అందరూ ఈశాన్య రాష్ట్రాలవైపే చూస్తున్నారు. చైనా సహా అం తర్జాతీయ సరిహద్దులున్న అస్సాం, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని మొదట్లో ఆందోళన ఉండేది. కానీ సిక్కిం, నాగాలాండ్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అస్సాంలో నాగాలాండ్ వాసి ఒకరు కరోనా బారిన పడ్డారు. కానీ సిక్కింవాసులెవరికీ ఈ వైరస్ సోకలేదు.
ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించడం, ప్రజలు క్రమశిక్షణతో ప్రభుత్వం గీసిన గీత దాటకపోవడంతో అయిదు రాష్ట్రాలు కరోనా కొమ్ములు వంచాయి. అయితే ఇప్పు డు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఈ రాష్ట్రాలకు వస్తున్నాయి. దీనివల్ల ఎక్కడ కేసులు పెరుగుతాయా అన్న ఆందోళనైతే నెలకొంది. ఇక త్రిపురలో కేసులు పెరగడం, అస్సాంలో కూడా ప్రతీరోజూ కేసులు నమోదు అవుతూ ఉండడంతో తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి 100 కేసులకి చేరడానికి 40 రోజులు పడితే కేవలం నాలుగు రోజుల్లోనే రెట్టింపై 200 దాటేశాయి.
సిక్కిం కేసుల్లేవ్
ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. సిక్కింకి చైనాతో పాటు భూటాన్, నేపాల్ సరిహద్దులుగా ఉన్నాయి. జనవరిలో భారత్‌లో తొలి కేసు నమోదవగానే కేంద్రం ఆదేశాల గురించి సిక్కిం వేచి చూడలేదు. సరిహద్దుల వెంబడి నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విదేశాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్‌కి తరలించింది. మార్చి 5 నుంచే అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసేసింది.
విదేశీ పర్యాటకులెవరినీ రానివ్వలేదు. ముఖ్యంగా చైనాతో వాణిజ్యం జరిగే నాథులా మార్గాన్ని బంద్ చేసింది. మార్చి రెండోవారం నుంచి రద్దీ ఎక్కువగా ఉండే రెస్టారెంట్లు, థియేటర్లు, పార్కులు వంటివి మూసేసింది. ఇక పూర్తి స్థాయి లాక్‌డౌన్ మార్చి 25 నుంచి అమలు చేసింది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ స్వయంగా కోవిడ్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఒక్క కేసు నమోదు కాకుండా చూసుకున్నారు.
మిజోరం
మిజోరం రాష్ట్రానికి మయన్మార్‌తో 510 కి.మీ. సరిహద్దు, బంగ్లాదేశ్‌తో 318 కి.మీ. సరిహద్దు ఉంది. అయినా మిజోరంలో కేవలం ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది. 45 రోజుల పాటు కరోనాతో పోరాటం చేసిన కరోనా రోగిని శనివారం డిశ్చార్జ్ చేశారు. 50 ఏళ్ల వయసున్న చర్చి ఫాదర్ అయిన అతను ఆమ్‌స్టర్‌డ్యామ్‌కి వెళ్లి వచ్చారు. ఏప్రిల్ 27న ఆయనకి కరోనా పా జిటివ్ వచ్చింది. ఆయన కోలుకోవడంతో మిజోరం కరోనా ఫ్రీ రాష్ట్రంగా అవతరించింది.
సాధించింది ఇలా ..
► ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న భూభాగానికి 99శాతం చైనా, మయన్మార్, సహా వివిధ దేశాల సరిహద్దులున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తంగా ఉన్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల్ని దేశవ్యాప్త లాక్‌డౌన్‌కి చాలా రోజుల ముందే మూసేశాయి.
► ఈ ప్రాంత ప్రజల్లో క్రమశిక్షణ చాలా ఎక్కువ. ప్రభుత్వం నిర్దేశించిన లాక్‌డౌన్ నిబంధనల్ని ఎవరూ ఉల్లంఘించలేదు. ఇంటిపట్టునే ఉంటూ మరెక్కడ లేని విధంగా ప్రభుత్వాలకి ప్రజలు సహకరిస్తున్నారు.
► ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో ప్రకృతి విధ్వంసం జరగలేదు. ప్రజలంతా కాలుష్యం లేని గాలి పీలుస్తూ, కల్తీ లేని తిండి తింటూ ఆరోగ్యంగా ఉంటారు. సంప్రదాయాలను గౌరవిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటారు.
► ఎనిమిది రాష్ట్రాలకి కలిపి కేంద్రంలో డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్ అనే మంత్రిత్వ శాఖ ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్రం కూడా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటోంది.
► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కి తరలించడం వంటి చర్యలన్నీ అత్యంత పకడ్బందీగా అమ లు చేశారు. ఇతర రాష్ట్రాలన్నీ మొదట్లో 14 రోజుల క్వారంటైన్ అమలు చేస్తే ఈశాన్యంలో 21 రోజులు లాక్‌డౌన్‌ని అమలు చేశారు.
క్రమశిక్షణతో కొమ్ములు వంచారు
Published Mon, May 11 2020 3:20 AM | Last Updated on Mon, May 11 2020 5:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment