బెంగళూరు: ఈశాన్య రాష్ట్రాల్లో పరిణామాల ప్రభావం కర్ణాటక రాజకీయాలపై సాధారణంగా ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అసలే ఉండదు. కానీ, శనివారం నాటి పరిస్థితి వేరు. కర్ణాటక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు ఉదయం నుంచీ టీవీలకు అతుక్కుపోయారు. త్రిపురలో బీజేపీ ముందంజలో ఉందన్న వార్తలు రాగానే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి యడ్యూరప్ప సహా నేతల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది. ఢిల్లీలోని బీజేపీ పెద్దల చూపంతా ఇక కర్ణాటకపైనే ఉంటుందనీ, తమకు అధికారం ఖాయమనీ వారికి నమ్మకం కలిగినట్లుంది. అయితే, త్రిపుర, నాగాలాండ్‌లలో తుడిచి పెట్టుకు పోవటం కాంగ్రెస్‌ను షాక్‌కు గురిచేసింది.
త్రిపురలో తమ పార్టీ అంతగా ప్రభావం చూపనప్పటికీ బీజేపీ దూకుడును మాణిక్‌సర్కార్ నిలువరిస్తారనీ, అదే మాదిరిగా కర్ణాటకలో పార్టీని తిరిగి అధికారంలో తెస్తామనే ఆశ ఇప్పటిదాకా కాంగ్రెస్ నేతల్లో ఉండింది. కానీ, తాజా ఫలితాలు వారి నమ్మకాన్ని వమ్ము చేశాయి. మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్..గోవా, మణిపూర్‌లో మాదిరి రాజకీయాలతో బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని భయపడుతోంది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ నేత ఒకరు విశ్లేషిస్తూ..ఈశాన్య రాష్ట్రాల్లో ఫలితాలను కర్ణాటకతో పోల్చి చూసుకోవటం సరికాదన్నారు. అయితే, ఈశాన్య రాష్ట్రాల ఫలితాల ప్రభావం కర్ణాటకపై ఎందుకు ఉండబోదో చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటకనే. పంజాబ్‌లో అధికారంలో ఉన్నా అక్కడ ఖజానా ఖాళీగా ఉండటంతో ఏమీ చేయలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో విజయం కాంగ్రెస్‌కు కీలకం. ఇక్కడ అధికారం కోల్పోతే జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం చేజారటం ఖాయం.
బెంగాల్‌లో బీజేపీకి మార్గం సుగమం!
న్యూఢిల్లీ .. త్రిపురలో ఫలితాల ప్రభావం 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, ఒడిశాల పైనా పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్రిపురలో రెండు లోక్‌సభ స్థానాలే ఉన్నప్పటికీ.. 25 ఏళ్ల వామపక్ష కూటమిని కూలదోయటం ఇతర బీజేపీయేతర ఈశాన్య రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది. పశ్చిమబెంగాల్‌లో సీపీఎంకు ఆదరణ తగ్గిపోతుండటంతో.. బీజేపీ ప్రధాన పోటీదారుగా ఎదుగుతోంది. అయితే బెంగాల్ గడ్డపై మమత ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఓటు శాతాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఇన్నాళ్లు ఎదగలేదు.
త్రిపురలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం ఇప్పుడు పశ్చిమబెంగాల్, ఒడిశాలపై ప్రభావం చూపనుంది. ఈ రెండు రాష్ట్రాలపై బీజేపీ లుక్–ఈస్ట్ పాలసీతో వ్యూహాలు రచిస్తోంది. ఇంతవరకు ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్ నష్టపోతున్న ఓట్లు సీట్లు.. బీజేపీకి అదనపు బలంగా మారుతున్నాయి. ఇది మోదీ–షా ద్వయం అనుసరిస్తున్న వ్యూహం కారణంగానే. అయితే మేఘాలయాలో హంగ్ పరిస్థితులనుంచి తప్పించుకుని ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అహ్మద్ పటేల్, కమల్‌నాథ్‌ను రాహుల్ రంగంలోకి దించారు.
Comments
Please login to add a commentAdd a comment