Assembly results
-
త్రిపురలో సీఎం రేసులో ప్రతిమా బౌమిక్!
అగర్తలా: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ మార్కు దాటి ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బీజేపీ కూటమిలో కొత్త సమస్య ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏడాదికాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సాహాకు పోటీగా కేంద్ర సహాయ మహిళా మంత్రి ప్రతిమా బౌమిక్‌ను సీఎం రేసులో నిలపాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ భావిస్తుండటమే ఇందుకు కారణం. సీఎం అభ్యర్థిగా ఒక్కరినే ఎన్నుకునేలా, ఏకగ్రీవం కోసం ఒప్పించేందుకు ఈశాన్యభారతంలో బీజేపీ సమస్యల పరిష్కర్త, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. బిప్లవ్ వర్గాన్ని శాంతింపజేసేందుకు ప్రతిమా బౌమిక్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు శేఖర్ దత్తా అభిప్రాయపడ్డారు. 60 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 32 చోట్ల, దాని కూటమి పార్టీ ఐపీఎప్టీ ఒక చోట విజయం సాధించిన విషయం తెల్సిందే. మరోవైపు మార్చి ఎనిమిదో తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై బీజేపీ అగ్రనేత అమిత్ షాతో అస్సాం సీఎం హిమంత భేటీ అయ్యారు. భేటీలో నాగాలాండ్ సీఎంనేపియూ రియో సైతం పాల్గొన్నారు. -
By-poll Results 2022: ఏడింట్లో నాలుగు బీజేపీకి...
న్యూఢిల్లీ: ఈ నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరిగిన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. ఇందులో నాలుగు బీజేపీ గెలుచుకోగా, ఆర్జేడీ, శివసేన ఠాక్రే వర్గం, టీఆర్ఎస్ తలొకటి దక్కించుకున్నాయి. యూపీలోని గోలా గోరఖ్‌నాథ్ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. పార్టీకి చెందిన అమన్ గిరి సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని 34 వేల ఓట్ల తేడాతో ఓడించారు. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో బీజేపీకి చెందిన కుసుమ్ దేవి సమీప ప్రత్యర్థి ఆర్జేడీకి చెందిన మోహన్ గుప్తాపై 68 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. ఇదే రాష్ట్రంలోని మొకామాలో ఆర్జేడీ అభ్యర్థిని నీలం దేవి 16వేల ఓట్ల మెజారిటీ గెలిచారు. ఒడిశాలోని ధామ్‌నగర్‌లో బీజేడీకి చెందిన అవంతిదాస్‌పై బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ 4,845 ఓట్ల మెజారిటీ సాధించారు. తెలంగాణలోని మునుగోడు నుంచి టీఆర్ఎస్కు చెందిన కె.ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. ముంబైలోని అంధేరి (వెస్ట్)నియోజకవర్గం నుంచి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన రుతుజా లట్కే విజయం సాధించారు. ఎమ్మెల్యే రమేశ్ లట్కే గత మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రమేశ్ భార్య రుతుజకు పోటీగా బీజేపీ సహా ప్రధానపార్టీలు అభ్యర్థిని నిలబెట్టలేదు. రెండో స్థానంలో 14.79 శాతం మంది నోటాకు ఓటేశారు. భజన్‌లాల్ మనవడి విజయం హరియాణాలోని ఆదంపూర్‌లో బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన జై ప్రకాశ్‌పై 16 వేల మెజారిటీ సాధించారు. మాజీ సీఎం భజన్‌లాల్ కుటుంబానికి 1968 నుంచి ఇక్కడ వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. భజన్‌లాల్ 9 సార్లు, ఆయన భార్య ఒక పర్యాయం, కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్ 4 సార్లు ఇక్కడ విజయం సాధించారు. భజన్‌లాల్ మనవడే భవ్య బిష్ణోయ్. కుల్దీప్ బిష్ణోయ్ ఆగస్ట్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. -
బెంగాల్ అల్లర్లపై 9 సీబీఐ కేసులు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింస, అల్లర్లకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తొమ్మిది కేసులను నమోదుచేసింది. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు నిమిత్తం నాలుగు ప్రత్యేక బృందాలను సీబీఐ ఆయా చోట్లకు పంపినట్లు గురువారం విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ ప్రభుత్వం తమకు అప్పజెప్పిన కేసులతోపాటు మరికొన్ని కేసుల నమోదు ప్రక్రియను సీబీఐ కొనసాగిస్తోంది. పలు హత్యలు, అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణలపై ఐదుగురు జడ్జిల కలకత్తా హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు కేసుల విచారణ బాధ్యతలను సీబీఐ తీసుకుంది. మే 2న ఎన్నికల ఫలితాలొచ్చాక జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని హైకోర్టు గతంలో ఈ ఆదేశాలిచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీపై అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. పలు వినతుల నేపథ్యంలో కేసుల దర్యాప్తునకు బెంగాల్ పోలీసుల నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు హైకోర్టు గతంలో ఆదేశించింది. సీబీఐ, సిట్ వేర్వేరుగా 6 వారాల్లోగా దర్యాప్తు నివేదికలను సమర్పించాలని హైకోర్టు సూచించింది. కేసులు ఉపసంహరించుకోండంటూ బెదిరించారని, చాలా హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరించి కనీసం ఎఫ్ఐఆర్లు నమోదు చేయించలేదని హైకోర్టుకు బాధితులు గతంలో విన్నవించుకున్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించనందునే స్వతంత్ర దర్యాప్తు అవసరమనే నిర్ణయానికొచ్చామని కోర్టు వ్యాఖ్యానించింది. -
మూడోసారి బెంగాల్ పీఠంపై దీదీ
కోల్‌కతా: హోరాహోరీ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయఢంకా మోగించిన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వరసగా మూడోసారి బెంగాల్ సీఎంగా ప్రమాణం చేశారు. బుధవారం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆమెతో సీఎంగా ప్రమాణంచేయించారు. మమత కేబినెట్లో కొత్త మంత్రులంతా 9వ తేదీన ప్రమాణం చేయను న్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత హింస చెలరేగడానికి కారకులైన వారిని వదిలిపెట్టేదిలేదని ఈ సందర్భంగా ఆమె ప్రతిజ్ఞ చేశారు. బెంగాల్లో కోవిడ్ కట్టడే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మమత స్పష్టంచేశారు. కాగా, సీఎంగా ప్రమాణంచేసిన మమత దీదీకి అభినందనలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశంలోని పౌరులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తూ ప్రధాని మోదీకి మమత ఓ లేఖ రాశారు. అల్లర్లను చెల్లెలు మమత అదుపుచేయగలదు: గవర్నర్ ధన్కర్ ‘మూడోసారి సీఎం అయిన మమతకు ధన్య వాదాలు. అయితే, ప్రస్తుతం అల్లర్లు, హింసతో బెంగాల్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ హింసా త్మక ఘటనలకు నా సోదర సమానురాలైన మమతా బెనర్జీ అడ్డుకట్ట వేయగలదనే నమ్ముతున్నా. హింసకు గురౌతున్న మహిళలు, చిన్నారులను రక్షించి తక్షణమే శాంతిభద్రతలను ఆమె అదుపులోకి తెస్తారని భావిస్తున్నా’అని గవర్నర్ ధన్కర్ వ్యాఖ్యానించారు. -
మే 5న మమత ప్రమాణ స్వీకారం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఈ నెల 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమత వరుసగా మూడో విడత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్‌నుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆమె రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్ ట్విట్టర్లో తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆమె ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. మమతా బెనర్జీ మే 5వ తేదీన ఉదయం 10.45 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని గవర్నర్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరవుతారని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఈ నెల 6వ తేదీన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు.అంతకుముందు జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొంటామని తెలిపారు. దీనిపై అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికైతే కోవిడ్ సంక్షోభంపై పోరాటమే ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తనకు సంప్రదాయం ప్రకారం ప్రధాని మోదీ నుంచి ఫోన్ కాల్ రాలేదన్నారు. ‘ఇలాంటి సందర్భాల్లో ప్రధానమంత్రి ఫోన్ చేయకపోవడం ఇదే మొదటిసారి. అయినా సరే, ఆయన బిజీగా ఉండి ఉండవచ్చు. ఈ విషయాన్ని నేను పట్టించుకోను’అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్నాయి. ప్రాణభయంతోనే రిటర్నింగ్ ఆఫీసర్ రీకౌంటింగ్ పెట్టలేదు నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు వచ్చాక రీకౌంటింగ్ జరపాల్సిందేనని డిమాండ్లు వచ్చినప్పటికీ అక్కడి రిటర్నింగ్ అధికారి అందుకు ఒప్పుకోకపోవడానికి గల కారణాలు ఇవేనంటూ మమత కొన్ని విషయాలు చెప్పారు. ‘‘రీకౌంటింగ్ జరపండి అంటూ ఒకవేళ తాను ఆదేశిస్తే తీవ్రమైన పరిణామాలను తాను ఎదుర్కోవాల్సి రావచ్చు. తీవ్ర ‘ఒత్తిడి’కారణంగా ఒకవేళ ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తానేమో’’అని రిటర్నింగ్ అధికారి తీవ్ర ఆందోళనకు గురైనట్లు మమత మీడియా సమావేశంలో చెప్పారు. అందుకు సాక్ష్యంగా మమత ఒక ఎస్ఎంఎస్ను మీడియాకు చూపించారు. రిటర్నింగ్ అధికారి ఆ ఎస్ఎంఎస్ను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు పంపారని మమత చెప్పారు. ‘ముందుగా వెల్లడైన ఫలితాల ప్రకటన కేంద్ర ఎన్నికల సంఘం ఎలా మారుస్తుంది? ఈ అంశంలో మేం కోర్టుకు వెళ్తాం. నాలుగుగంటలపాటు సర్వర్ డౌన్ ఎందుకైంది? ప్రజాతీర్పును మేం గౌరవిస్తాం. కానీ ఒక అసెంబ్లీ స్థానంలోనే అవకతవకలు జరిగాయి. వాస్తవాలు మాకు తెలియాలి. రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు వార్తలొచ్చాయి. టీఎంసీ కార్యకర్తలంతా ప్రశాంతంగా ఉండాలి’ అని మమత మీడియా సమావేశంలో అన్నారు. -
మేఘాలయలో హంగ్
-
కర్ణాటకలో ‘ఈశాన్య’ ప్రకంపనలు
బెంగళూరు: ఈశాన్య రాష్ట్రాల్లో పరిణామాల ప్రభావం కర్ణాటక రాజకీయాలపై సాధారణంగా ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అసలే ఉండదు. కానీ, శనివారం నాటి పరిస్థితి వేరు. కర్ణాటక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు ఉదయం నుంచీ టీవీలకు అతుక్కుపోయారు. త్రిపురలో బీజేపీ ముందంజలో ఉందన్న వార్తలు రాగానే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి యడ్యూరప్ప సహా నేతల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది. ఢిల్లీలోని బీజేపీ పెద్దల చూపంతా ఇక కర్ణాటకపైనే ఉంటుందనీ, తమకు అధికారం ఖాయమనీ వారికి నమ్మకం కలిగినట్లుంది. అయితే, త్రిపుర, నాగాలాండ్‌లలో తుడిచి పెట్టుకు పోవటం కాంగ్రెస్‌ను షాక్‌కు గురిచేసింది. త్రిపురలో తమ పార్టీ అంతగా ప్రభావం చూపనప్పటికీ బీజేపీ దూకుడును మాణిక్‌సర్కార్ నిలువరిస్తారనీ, అదే మాదిరిగా కర్ణాటకలో పార్టీని తిరిగి అధికారంలో తెస్తామనే ఆశ ఇప్పటిదాకా కాంగ్రెస్ నేతల్లో ఉండింది. కానీ, తాజా ఫలితాలు వారి నమ్మకాన్ని వమ్ము చేశాయి. మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్..గోవా, మణిపూర్‌లో మాదిరి రాజకీయాలతో బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని భయపడుతోంది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ నేత ఒకరు విశ్లేషిస్తూ..ఈశాన్య రాష్ట్రాల్లో ఫలితాలను కర్ణాటకతో పోల్చి చూసుకోవటం సరికాదన్నారు. అయితే, ఈశాన్య రాష్ట్రాల ఫలితాల ప్రభావం కర్ణాటకపై ఎందుకు ఉండబోదో చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటకనే. పంజాబ్‌లో అధికారంలో ఉన్నా అక్కడ ఖజానా ఖాళీగా ఉండటంతో ఏమీ చేయలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో విజయం కాంగ్రెస్‌కు కీలకం. ఇక్కడ అధికారం కోల్పోతే జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం చేజారటం ఖాయం. బెంగాల్లో బీజేపీకి మార్గం సుగమం! న్యూఢిల్లీ .. త్రిపురలో ఫలితాల ప్రభావం 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, ఒడిశాల పైనా పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్రిపురలో రెండు లోక్‌సభ స్థానాలే ఉన్నప్పటికీ.. 25 ఏళ్ల వామపక్ష కూటమిని కూలదోయటం ఇతర బీజేపీయేతర ఈశాన్య రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది. పశ్చిమబెంగాల్లో సీపీఎంకు ఆదరణ తగ్గిపోతుండటంతో.. బీజేపీ ప్రధాన పోటీదారుగా ఎదుగుతోంది. అయితే బెంగాల్ గడ్డపై మమత ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఓటు శాతాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఇన్నాళ్లు ఎదగలేదు. త్రిపురలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం ఇప్పుడు పశ్చిమబెంగాల్, ఒడిశాలపై ప్రభావం చూపనుంది. ఈ రెండు రాష్ట్రాలపై బీజేపీ లుక్–ఈస్ట్ పాలసీతో వ్యూహాలు రచిస్తోంది. ఇంతవరకు ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్ నష్టపోతున్న ఓట్లు సీట్లు.. బీజేపీకి అదనపు బలంగా మారుతున్నాయి. ఇది మోదీ–షా ద్వయం అనుసరిస్తున్న వ్యూహం కారణంగానే. అయితే మేఘాలయాలో హంగ్ పరిస్థితులనుంచి తప్పించుకుని ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అహ్మద్ పటేల్, కమల్‌నాథ్‌ను రాహుల్ రంగంలోకి దించారు. -
నాగాలాండ్‌లో ఉత్కం‘టై’
కోహిమా: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ఫలితం. శనివారం ఉదయం నుంచి నువ్వా?నేనా? అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేకెత్తించి, చివరికి ప్రధాన పక్షాల మధ్య సమంగా ముగిసింది. ఏ పార్టీ, కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించక అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్), బీజేపీ–నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) కూటము లు చెరో 29 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసినా, అందులో బీజేపీ భాగస్వామిగా చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీపీపీతో ఎన్నికల ముందస్తు పొత్తు పెట్టుకున్న బీజేపీ..అంతకు ముందు ఎన్పీఎఫ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. ఎన్డీపీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నేఫియూ రియో ఉత్తర అంగామి 2 స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ఎన్పీఎఫ్ చీఫ్ టీఆర్ జెలియాంగ్ 5,432 ఓట్ల తేడాతో పెరెన్ స్థానం నుంచి గెలుపొందారు. బీజేపీ 20 స్థానాల్లో, మిత్ర పక్షం ఎన్డీపీపీ 40 స్థానాల్లో పోటీచేశాయి. 60 సీట్లున్న నాగాలాండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ 31 కాగా, ఆ మార్కును ఏ పార్టీ, కూటమి చేరుకోలేక పోయింది. బీజేపీకి ఎన్పీఎఫ్ ఆహ్వానం.. తమతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని బీజేపీని సీఎం టీఆర్ జెలియాంగ్ ఆహ్వానించారు. ఎన్నికలకు కొంతకాలం ముందే బీజేపీ ఎన్పీఎఫ్తో తెగతెంపులు చేసుకుని, నేఫియూ రియో నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీపీపీతో జట్టుకట్టింది. ఇతర పార్టీలతో కలసి నాగాలాండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ ఇన్చార్జ్ కిరణ్ రిజిజు వెల్లడించారు. నాగాలాండ్ అసెంబ్లీకి ఒక్క మహిళ కూడా ఎన్నికకాలేదు. బరిలో నిలిచిన ఐదుగురు మహిళా అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. -
మేఘాలయలో హంగ్
షిల్లాంగ్: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టలేదు. ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. 59 స్థానాలకుగాను అధికార కాంగ్రెస్ 21 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 47 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ రెండు చోట్ల మాత్రమే గెలిచింది. మేఘాలయ అసెంబ్లీలోని 60కి గాను 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బాంబు పేలుడులో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అభ్యర్థి మరణించడంతో ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. మేఘాలయలో ఏ పార్టీ లేదా సంకీర్ణ కూటమైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 30 స్థానాలు అవసరం. అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేయగా.. అటు ఎన్పీపీ, బీజేపీలు ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులతో సంకీర్ణ సర్కారు ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలే కీలకం ఈ ఎన్నికల్లో యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) ఆరు చోట్ల, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) నాలుగు, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ) రెండు చోట్ల గెలుపొందాయి. కేహెచ్ఎన్ఏఎం, ఎన్సీపీలు చెరొక స్థానంలో, స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలిచాయి. యూడీఎఫ్, హెచ్‌ఎస్‌పీడీపీలు పొత్తుపై ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. సంకీర్ణం ఏర్పాటుకు ప్రయత్నాలు ఇతర పార్టీలు, స్వతంత్రులతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పీఏ సంగ్మా కుమారుడు కొనార్డ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ పావులు కదుపుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ అటు కేంద్ర ప్రభుత్వంలో, ఇటు మణిపూర్‌లో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతోంది. కొనార్డ్ మాట్లాడుతూ..‘ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న నమ్మకంతో ఉన్నాం. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. మార్పు కోసం ఎదురుచూస్తున్నారు’ అని చెప్పారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీతో సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై మాత్రం స్పందించలేదు. బీజేపీ.. చిన్న పార్టీలు, స్వతంత్రులతో చర్చించేందుకు హిమంత శర్మను మేఘాలయకు పంపింది. గోవా, మణిపూర్ అనుభవంతో కాంగ్రెస్ అప్రమత్తం ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, ఇతర పార్టీలతో పొత్తు చర్చల కోసం సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కమల్ నాథ్‌లను కాంగ్రెస్ మేఘాలయకు పంపింది. గతేడాది గోవా, మణిపూర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటులో నిర్లిప్తంగా ఉంది. దీంతో మణిపూర్, గోవాల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈసారి కాంగ్రెస్ అప్రమత్తమైంది. ‘మేం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ద్వారా ప్రజల అభిమతం నెరవేరనుంది. మేం ప్రతి ఒక్కరితో చర్చిస్తున్నాం. ధనబలంతో వీలైనంత గందరగోళం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’ అని కమల్‌నాథ్ పేర్కొన్నారు. -
విజయంలో ఆ నలుగురు
న్యూఢిల్లీ: 2014కు ముందు ఈశాన్యరాష్ట్రాల్లో బీజేపీ జెండా పట్టుకునే వారే లేరు. 10–15 ఏళ్ల ముందునుంచి ఆరెస్సెస్ తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ రాజకీయంగా బీజేపీకి వార్డు మెంబర్లు కూడా లేని పరిస్థితి. కానీ ఈ మూడున్నరేళ్లలో పరిస్థితి చాలా మారింది. ఆరెస్సెస్ క్షేత్రస్థాయి పనికి బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాలు తోడవటంతో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటుచేసే స్థాయికి ఎదిగింది. అస్సాంలో అధికారంతో మొదలైన బీజేపీ ‘ఈశాన్య’ పయనం త్రిపుర విజయంతో మరింత విశ్వాసంగా ముందుకెళ్లేందుకు మార్గం సుగమం చేసింది. త్రిపురలో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టడం, నాగాలాండ్‌లోనూ బీజేపీకి విజయాన్ని అందించటంలో నలుగురు నేతలు అన్నీ తామై వ్యవహరించారు. వారే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, అస్సాం మంత్రి, బీజేపీ ఈశాన్య రాష్ట్రాల బాధ్యుడు హిమంత బిస్వా, త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్, ఆరెస్సెస్ వ్యూహకర్త సునీల్ దేవధర్. హిమంత బిస్వా శర్మ 2015లో బీజేపీలో చేరకముందు ఈయన కాంగ్రెస్ నేత. దశాబ్దానికి పైగా అస్సాం కాంగ్రెస్‌కు సేవలందించారు. అప్పటి సీఎం తరుణ్ గొగోయ్‌తో భేదాభిప్రాయా లతో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరారు. ఈయన సామర్థ్యాన్ని గుర్తించిన బీజేపీ.. పార్టీలోకి వస్తూనే 2015 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన వ్యూహకర్తగా అవకాశాన్నిచ్చింది. పలువురు బీజేపీ కేంద్ర నాయకులతో కలిసి బిస్వా రూపొందించిన వ్యూహాలు.. గొగోయ్ కోటను బద్దలు కొట్టి బీజేపీకి పట్టంగట్టాయి. ఈశాన్య రాష్ట్రాలపై మంచి అవగాహన ఉన్న హిమంతకు ఆ తర్వాత నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర పగ్గాలను పార్టీ అప్పగించింది. అవతలి పార్టీల నేతలను చేరుకుని కూటములు ఏర్పాటు చేయటం, బీజేపీలోకి ఆహ్వానించటంలో శర్మ రూటే సెపరేటు. వనరులను సృష్టించటంలోనూ ఈయన అందెవేసిన చేయి. త్రిపురలో ఐపీఎఫ్టీతో, నాగాలాండ్‌లో ఎన్డీపీపీతో పొత్తుల విషయంలో హిమంత కీలకంగా వ్యవహరించారు. సునీల్ దేవధర్ ఆరెస్సెస్ ముఖ్య నేత. పదేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. ఏడు రాష్ట్రాల్లో సంఘ్ ప్రభావం పెంచటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే దేవధర్‌ను.. అమిత్ షా త్రిపుర ప్రధాన వ్యూహకర్తగా నియమించారు. అదీ ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే. బీజేపీ ఇంటింటి ప్రచారం విజయవంతం కావటంలో ఈయన పాత్ర అత్యంత కీలకం. విప్లవ్ కుమార్ దేవ్ బీజేపీ త్రిపుర ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందువరసలో ఉన్నారు. బీజేపీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడు. మాజీ ఆరెస్సెస్ ప్రచారక్ కూడా. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనప్పటికీ.. బీజేపీ ఈయన్నే ముందుండి ప్రచారాన్ని నడిపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్‌రాయ్ బర్మన్ సహా పలువురు ముఖ్యమైన కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చటంలో కీలకంగా వ్యవహరించారు. రామ్‌మాధవ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. జమ్మూకశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీ కూటములు ఏర్పాటుచేయటంలో రామ్ మాధవ్ అసలైన వ్యూహకర్త. చాలా ఓపికగా వ్యవహరించటం. వ్యూహాలు రచించటంలో దిట్ట. ఎన్డీపీపీతో బీజేపీ పొత్తులోనూ హిమంతతో కలిసి పనిచేశారు. -
ఈ తీర్పు.. కేంద్రంలో తేనుందా మార్పు?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించినట్లే బీజేపీ విజయం సాధించింది. అయితే హిమాచల్ ప్రజలే కమలం పార్టీ వైపు దాదాపు ఏకపక్షంగా మొగ్గు చూపినట్లు కనిపించింది. గుజరాత్ మాత్రం కాషాయం పార్టీకి కషాయం లాంటి ఫలితాన్నిచ్చింది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం ఆయనకు నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. అభివృద్ధికి నమూనాగా చూపే ఆ రాష్ట్రంలో బొటాబొటి మెజారిటీ రావడంతో మోదీ మూడున్నరేళ్లుగా కేంద్రంలో అనుసరిస్తున్న విధానాలను, అందిస్తున్న పాలనను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే గుజరాత్లో బీజేపీకి వచ్చిన ఫలితాలు మోదీకి నైతిక ఓటమి కిందే లెక్క. ఎందుకంటే అక్కడి ఎన్నికల సంరంభం మొత్తాన్ని ఆయన తన భుజస్కంధాలపై వేసుకొని నడిపారు. ప్రధాని హోదాలో అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. పరిపూర్ణ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. కానీ ఉత్తరప్రదేశ్ మాదిరి గెలుపును అందించ లేకపోయారు. దీంతో పార్టీలో, ప్రభుత్వంలో ఇన్నాళ్లూ తిరుగులేని ఆయన ఏకపక్ష అధికారానికి బీటలు వారే ప్రమాదం లేకపోలేదు. భవిష్యత్‌లో ఆయన రక్షణాత్మక ధోరణిని అవలంబించాల్సి రావొచ్చు. గుజరాత్ పోరు ఒక దశలో మోదీకి, రాహుల్‌గాంధీకి మధ్య ప్రత్యక్ష పోరాటాన్ని తలపించింది. ఫలితాలను బట్టి చూస్తే ఒకరకంగా కాంగ్రెస్ అధ్యక్షుడిదే పైచేయి. రాహుల్ తన పార్టీని దాదాపు విజయం వరకు తీసుకెళ్లారు. ప్రజల తీర్పు ఆ పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. మోదీ సొంత గడ్డపైనే బీజేపీకి సవాల్ విసరడం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో మనోబలం రెట్టింపైంది. గుజరాత్ తీర్పు జాతీయ రాజకీ యాల్లో మార్పునకు సంకేతంగా భావించొచ్చు. ఎందుకంటే మే నెలలో వెలువడిన యూపీ అసెంబ్లీ ఫలితాలతో కుప్పకూలి ముక్కలు చెక్కలైన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు ఆ గడ్డు పరిస్థితుల నుంచి కోలుకొని ఇప్పుడు బీజేపీతో నువ్వా నేనా అనే స్థాయిలో పోరాడే స్థితికి చేరాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే: రానున్న ఏప్రిల్–మే నెలల్లో కర్ణాటకలో, ఆ తర్వాత మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌ల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు అంటే 2018 చివర్లో మూడు పెద్ద రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో) ప్రజా తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మరిన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఈ రాష్ట్రాల్లో కూడా చేదు అనుభవాలనే చూడాల్సి ఉంటుంది. పైగా ఎన్డీయేయేతర పార్టీలు (ఎన్సీపీ, ఆర్జేడీ, లెఫ్ట్ ఫ్రంట్, డీఎంకే, ఇతర ప్రాంతీయ పార్టీలు) నాలుగైదు నెలల్లో ఆ కూటమికి వ్యతిరేకంగా సంఘటితమయ్యే సూచనలున్నాయి. -
‘అసెంబ్లీ’ ఫలితాలు రాహుల్‌పై రిఫరెండం కాదు: దిగ్విజయ్
ఐదు రాష్ట్రాల్లో వెలువడిన అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై రిఫరెండం కాదని పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందుగా పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించినట్లయితే, ఫలితాలు కాంగ్రెస్‌కు సానుకూలంగా ఉండగలవని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన ఫలితాలు దేశ ఎన్నికల రాజకీయాలకు, ప్రజాస్వామ్యానికి మంచివన్నారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఒకరకంగా రాహుల్ నాయకత్వంపై రిఫరెండం వంటిదేనన్న వాదనను దిగ్విజయ్ తోసిపుచ్చారు. అయితే, పార్టీలో భారీ ఎత్తున పునర్నిర్మాణం చేపట్టాలంటూ జ్యోతిరాదిత్య సింధియా వ్యక్తం చేసిన అభిప్రాయంతో దిగ్విజయ్ ఏకీభవించారు. ప్రధాని లేదా ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎన్నికలకు ముందే ప్రకటించడం కాంగ్రెస్ ఆనవాయితీ కాదని ఇంతవరకు చెబుతూ వచ్చిన దిగ్విజయ్, తాజాగా మాట మార్చారు. ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తే, కాంగ్రెస్‌కు సానుకూల ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయన్నారు.