ఐదు రాష్ట్రాల్లో వెలువడిన అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై రిఫరెండం కాదని పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందుగా పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించినట్లయితే, ఫలితాలు కాంగ్రెస్‌కు సానుకూలంగా ఉండగలవని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన ఫలితాలు దేశ ఎన్నికల రాజకీయాలకు, ప్రజాస్వామ్యానికి మంచివన్నారు.
ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఒకరకంగా రాహుల్ నాయకత్వంపై రిఫరెండం వంటిదేనన్న వాదనను దిగ్విజయ్ తోసిపుచ్చారు. అయితే, పార్టీలో భారీ ఎత్తున పునర్నిర్మాణం చేపట్టాలంటూ జ్యోతిరాదిత్య సింధియా వ్యక్తం చేసిన అభిప్రాయంతో దిగ్విజయ్ ఏకీభవించారు. ప్రధాని లేదా ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎన్నికలకు ముందే ప్రకటించడం కాంగ్రెస్ ఆనవాయితీ కాదని ఇంతవరకు చెబుతూ వచ్చిన దిగ్విజయ్, తాజాగా మాట మార్చారు. ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తే, కాంగ్రెస్‌కు సానుకూల ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయన్నారు.