తురువుకెరె(కర్ణాటక): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐక్య భారతానికి ప్రతీకగా మారారని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అభివర్ణించారు. ఆదివారం దిగ్విజయ్ పీటీఐకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖాముఖిలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా కొనసాగే భారత్ జోడో యాత్ర సమాప్తమయ్యాక మరింత పటిష్టమైన నాయకత్వ లక్షణాలను సంతరించుకున్న రాహుల్‌ను చూస్తారు. ఆయన కొత్త అవతారం మొదలుకానుంది.
యావత్ ప్రజానీకంలో కాంగ్రెస్ పట్ల మరింత సానుకూల వైఖరిని పాదయాత్ర పెంచుతుందనడంలో సందేహమే లేదు. చాన్నాళ్ల తర్వాత దేశంలోని ప్రతి పల్లెలోనూ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. తొలి నుంచీ కడదాకా యాత్రలో రాహుల్ మమేకమైన విధానం చూసి జనం బాగా మెచ్చుకుంటున్నారు. యాత్రతో పార్టీ మరింత బలాన్ని పుంజుకుంటుంది. మన దేశంలో త్యాగధనులందరికీ సరైన మన్నన దక్కుతుంది.
ప్రధాని పదవిని సోనియా గాంధీ త్యజించారు. ఇప్పుడు రాహుల్ మండుటెండలో చెమటోడుస్తూ, హోరు వానలో తడుస్తూ, అబద్ధపు వార్తలు, ప్రతిష్ట దిగజార్చే వ్యాఖ్యలను ఎదుర్కొంటూ జనం కోసం ముందుకు సాగుతున్నారు. భారత్ జోడోకు సిసలైన సంకేతంగా నిలిచారు. యాత్ర తర్వాత కొత్త రాహుల్‌ను చూడటం ఖాయం. అనుకున్న లక్ష్యంగా కోసం రాహుల్ అవిశ్రాంతంగా కృషిచేస్తారు. సానుకూల దృక్పథమే స్ఫూర్తిగా పనిచేస్తారు’ అని దిగ్విజయ్ అన్నారు.
‘‘ క్రియాశీలక కార్యకర్తల సంఖ్య పరంగా చూస్తే బీజేపీ ‘ఆర్గనైజేషన్’ కంటే కాంగ్రెస్ కాస్త వెనుకబడిందనే చెప్పాలి. కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య సమన్వయం తగ్గింది. అయితే, ఇప్పుడు భారత్ జోడో యాత్ర ద్వారా లక్షలాది మంది స్వస్థలాలను వదిలి మరీ పాదయాత్రలో కదం తొక్కుతున్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. ఇలాంటి జనోద్యమాల ద్వారానే నాయకులు పుట్టుకొస్తారు’ అని వ్యాఖ్యానించారు. ‘‘పార్టీ ఘన గత చరిత్రతో పోలిస్తే ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలహీనంగా తయారై సమస్యలను ఎదుర్కొంటోంది.
యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నాం. గ్రామాలు, పట్టణాలు ఇలా ప్రతిస్థాయిలో యాత్రలో సమన్వయం కోసం ప్రతీ రాష్ట్రంలో, జిల్లాలో సమన్వయకర్తలను నియమించాం. యాత్రలో కార్యకర్తలు మొదలుకొని నేతలంతా భాగస్వాములయ్యేలా చేశాం. ఇది పార్టీ క్షేత్రస్థాయి పటిష్టతకు బాటలుపరుస్తుంది. ఇంటింటికీ వెళ్లి అభిప్రాయాలు సేకరించాలని స్థానిక నేతలకు సూచించాం. యాత్రతో చేకూరిన మేలు ఏంటంటే.. అది మీడియా దృష్టిలో పడటం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment