(భారత్ జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో 12 రోజుల పాదయాత్ర ముగించుకుని మహారాష్ట్రకు వెళ్లనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఘనంగా వీడ్కోలు పలకాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈనెల 7వ తేదీన రాహుల్ రాష్ట్ర సరిహద్దు దాటి డెగ్లూరు వద్ద మహారాష్ట్రలోకి ప్రవేశించనున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ సరిహద్దు గ్రామం మెనూరులో భారీ బహిరంగసభ నిర్వహించనుంది. యాత్ర తెలంగాణలో ప్రవేశించిన సమయంలో కర్ణాటక సరిహద్దులో పెద్ద ఎత్తున జనం స్వాగతం పలికిన విధంగానే వెళ్లేటప్పుడు కూడా మహారాష్ట్ర సరిహద్దులో భారీయెత్తున ప్రజలతో వీడ్కోలు పలకాలని, రాహుల్‌గాంధీకి గుర్తుండిపోయేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు.
6న కార్నర్ సభ ఉండదు
7వ తేదీన మెనూరులో నిర్వహించనున్న బహిరంగ సభ, మిగతా మూడురోజుల పాటు జరిగే పాదయాత్రను విజయవంతం చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్రవారం ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. జోడో యాత్ర మక్తల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచీ రాహుల్‌గాంధీకి తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారని, మునుగోడులో ఉప ఎన్నికలు ఉన్నప్పటికీ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ నేతలు పాదయాత్ర విజయవంతం కోసం కృషి చేశారనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రేవంత్ మాట్లాడుతూ..ఆరో తేదీన ఎలాంటి కార్నర్ మీటింగ్ ఉండదని, ఏడో తేదీన బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.
ఆ నియోజకవర్గాల నేతలకు అవకాశం
ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రాలేదని, ఈ మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలు పాల్గొనాలని రేవంత్ సూచించారు. అదే విధంగా 7వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల లోపే బహిరంగ సభను పూర్తి చేసుకోవాలని, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి కార్యకర్తలను ఈ సభకు తీసుకురావాలని చెప్పారు.
7వ తేదీన రాత్రి 9:30 గంటల సమయంలో రాహుల్‌గాంధీని మహారాష్ట్ర నేతలకు అప్పగిస్తామన్నారు. రాహుల్ పాదయాత్ర సమయంలో కవరేజీ రాకుండా కొన్ని అంశాలను తెరపైకి తేవడం ద్వారా కొందరు కుట్ర చేసినప్పటికీ, పత్రికలు, మీడియా మంచి కవరేజీయే ఇచ్చాయంటూ జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం అనంతరం జుక్కల్ నియోజకవర్గంలోని మెనూరులో బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాన్ని స్థానిక నేతలతో కలిసి రేవంత్ పరిశీలించారు. ఆ తర్వాత మహారాష్ట్ర సరిహద్దు వరకు వెళ్లి రూట్‌ను కూడా పరిశీలించారు. స్థానిక నేతలకు పలు సూచనలు చేశారు.
విశ్రాంతి..అటవిడుపు
శుక్రవారం పాదయాత్రలో విరామం తీసుకున్న రాహుల్‌గాంధీ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు తాను బస చేసిన గుడారంలోనే ఉన్నారు. సాయంత్రం బయటకు వచ్చిన ఆయన.. ఆ సమయంలో తనతో పాటు దేశమంతా కలిసి నడుస్తున్న భారత యాత్రీలు ఫుట్‌బాల్, క్రికెట్ ఆడుతుండడంతో కొంతసేపు ఆ మ్యాచ్‌లు చూశారు. వారిని ఉత్సాహపరిచారు. ఆ తర్వాత మళ్లీ తన గుడారంలోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో పనిచేసిన నాయకులు శుక్రవారం రాహుల్‌గాంధీని కలిసేలా షెడ్యూల్ ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment