రాయచూరు రూరల్: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కర్నాటకలో ముగిసింది. రాష్ట్రంలో రాహుల్ గాంధీ 500 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారు. శనివారం రాయచూర్ పట్టణంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘కర్నాటకతో మా కుటుంబానికి సుదీర్ఘ అనుబంధముంది. నాన్నమ్మ ఇందిరా, అమ్మ సోనియా ఇక్కడి నుంచి గెలిచారు’’ అని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి కర్ణాటక ప్రజలు అందించిన విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.
యువతకు ఉద్యోగాలిస్తామన్న హామీని ప్రధాని నరేంద్ర మోదీ తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపారని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ నేతలు అన్ని పనుల్లో ‘40 శాతం కమీషన్’ వసూలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలో హింస, ద్వేషాలను ప్రేరేపిస్తున్నాయని మండిపడ్డారు. 2023లో కర్ణాటక అసెంబ్లీ, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రూ.500కు వంటగ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం తెలంగాణలోకి ప్రవేశించనుంది.
Comments
Please login to add a commentAdd a comment