unemployed youth
-
Bharat Jodo Yatra: నిరుద్యోగులకు మొండిచెయ్యి
రాయచూరు రూరల్: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కర్నాటకలో ముగిసింది. రాష్ట్రంలో రాహుల్ గాంధీ 500 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారు. శనివారం రాయచూర్ పట్టణంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘కర్నాటకతో మా కుటుంబానికి సుదీర్ఘ అనుబంధముంది. నాన్నమ్మ ఇందిరా, అమ్మ సోనియా ఇక్కడి నుంచి గెలిచారు’’ అని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి కర్ణాటక ప్రజలు అందించిన విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. యువతకు ఉద్యోగాలిస్తామన్న హామీని ప్రధాని నరేంద్ర మోదీ తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపారని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ నేతలు అన్ని పనుల్లో ‘40 శాతం కమీషన్’ వసూలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశంలో హింస, ద్వేషాలను ప్రేరేపిస్తున్నాయని మండిపడ్డారు. 2023లో కర్ణాటక అసెంబ్లీ, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రూ.500కు వంటగ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం తెలంగాణలోకి ప్రవేశించనుంది. -
‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను ఉండలేకపోతున్నా’
జమ్మికుంట(హుజూరాబాద్): నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగు నెలల కిందట భర్త ఆత్మహత్య చేసుకుంటే.. నేడు అతని జ్ఞాపకాలు మరువలేక భార్య ఉరేసుకుంది. నిరుద్యోగి షబ్బీర్ కుటుంబాన్ని విధి వెక్కిరించడాన్ని తల్చుకుంటూ జమ్మికుంట వాసులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సీఐ రాంచందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన షబ్బీర్, జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన రేష్మ(26) 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన షబ్బీర్ అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో చేరాడు. చదవండి: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి, భార్యతో కలిసి జమ్మికుంట వచ్చాడు. స్థానిక హౌజింగ్‌బోర్డు కాలనీలో గది అద్దెకు తీసుకున్నారు. కానీ ఇక్కడా అతనికి పని దొరకలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే సన్నద్ధం అవుదామనుకుంటే రాలేదు. ప్రైవేటు ఉద్యోగాలకు ప్రయత్నించినా దొరకలేదు. గది అద్దె చెల్లించేందుకు, భార్యను పోషించుకునేందుకు డబ్బు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సూసైడ్ నోట్ రాసి, ఈ ఏడాది ఆగస్టు 1న జమ్మికుంట రైల్వేస్టేషన్లో రైలు కింద పడి, ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందినప్పటి నుంచీ రేష్మ అంబేద్కర్ కాలనీలోని తల్లిగారింట్లో ఉంటోంది. చదవండి: ప్రముఖ సింగర్ హరిణి కుటుంబం అదృశ్యం, ఏకే రావు మృతదేహం లభ్యం ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. సీఐ రాంచందర్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ సూసైడ్ నోట్ లభించింది. ‘అమ్మానాన్న.. నన్ను క్షమించండి.. నేను ఉండలేకపోతున్న.. షబ్బీర్ జ్ఞాపకాలు ప్రతీ క్షణం గుర్తుకు వస్తున్నాయి. ఇలా క్షణక్షణం చస్తూ బతకడం నా వల్ల కావట్లేదమ్మా.. అందుకే నేను చనిపోవాలని అనుకుంటున్నాను.. చింటు, పప్పుగా అమ్మను, నాన్నను జాగ్రత్తగా చూసుకోండి.. నన్ను క్షమించండి’ అని అందులో రాసిందని సీఐ పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు గోపీచంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉద్యోగం రాక కాదు.. మోసపోవడంతోనే ఆత్మహత్య
పెనుబల్లి: ఉద్యోగం రాక మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన సానిక నాగేశ్వరరావు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఉద్యోగం ఇప్పిస్తానన్న ఓ దళారీ చేతిలో మోసపోయాడని పోలీసులు వెల్లడించారు. నాగేశ్వరరావు దళారీని నమ్మి రూ.5.5 లక్షలు ఇవ్వగా.. అతను మోసం చేయడంతో ఇటు ప్రభుత్వ ఉద్యోగం రాక, అటు డబ్బులు పోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసులో సెక్షన్లు మార్చిన పోలీసులు సోమవారం వివరాలను వెల్లడించారు. ఏసీపీ వెంకటేశ్ కథనం ప్రకారం.. గంగదేవిపాడుకు చెందిన నాగేశ్వరరావు ఎంఏ పూర్తిచేశాక, 2018 నుంచి వివిధ వ్యాపారాలు చేసి లాభాలు రాక ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్దిశెట్టి సామేల్ అనే దళారీకి ఉద్యోగంకోసం రూ.5.5 లక్షలు ఇచ్చాడు. డబ్బు తీసుకున్నాక సామేల్ దాటవేత ధోరణితో వ్యవహరిస్తుండడంతో నాగేశ్వరరావు కొద్ది రోజుల కిందట తండ్రి వెంకట్రామయ్య, మధ్యవర్తి చెన్నారావుతో కలిసి వెళ్లి డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరాడు. అయినా అతను స్పందించకపోవడంతో తన వల్ల కుటుంబం బాధపడుతోందన్న ఆవేదనతో నాగేశ్వరరావు ఈనెల 13న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ 14వ తేదీన మృతి చెందాడు. ఈ విషయాన్ని చెన్నారావు ఫోన్లో సామేలుకు తెలియజేయగా.. ఉద్యోగం రాలేదనే బెంగతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం నుంచి డబ్బు వస్తుందని చెప్పగా అలాగే ఫిర్యాదు చేశారు. ఇంతలోనే పోలీసులు విచారణ చేపట్టడంతో సామేల్ భయపడి ఈనెల 15న రూ.5.5 లక్షలతో పాటు వడ్డీ కింద మరో రూ.60 వేలు చెన్నారావు అకౌంట్లో జమ చేశాడు. విచారణలో ఇవన్నీ వెల్లడి కావడంతో మద్దిశెట్టి సామేలు, చెన్నారావుపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెంకటేశ్ తెలిపారు. సామేల్ చేతిలో మోసపోయిన వారు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ టి.కరుణాకర్, ఎస్సైలు తోట నాగరాజు, తేజావత్ కవిత పాల్గొన్నారు. -
వర్సిటీల బాటలో కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై పోరులో భాగంగా వర్శిటీల బాటపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని వర్శిటీలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు సందర్శించి వసతి, బోధన సదుపాయాలు, అధ్యాపకుల ఖాళీలు తదితర అంశాలపై అధ్యయనం జరపనున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ సమాచారం ఆధారంగా నిరుద్యోగుల సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఒక్కో వర్శిటీ బాధ్యతను ఒక్కో సీనియర్ నాయకుడికి అప్పగించనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వ్యూహం, ప్రభుత్వ భూముల అమ్మకాలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు. ఘర్ వాపసీపై దృష్టి తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిన నేతలను తెరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఈ బాధ్యతను కూడా ఒక కీలక నేతకు అప్పగించాలని, ఆయన ఆధ్వర్యంలోనే చేరికలను ప్రోత్సహించి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో రెండు వారాల పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ క్రియాశీల కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి పోతురాజు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎ.మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, మహేష్‌కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్‌లు పాల్గొన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ గైర్హాజరయ్యారు. కాగా కాంగ్రెస్‌ను వీడిన నేతల్లో చాలామంది మళ్లీ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని మధుయాష్కీగౌడ్, మహేష్‌కుమార్‌గౌడ్‌లు సమావేశానంతరం విలేకరులకు తెలిపారు. -
మా దందా ఇంతే.. అడ్డొస్తే అంతే!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/కాశీబుగ్గ: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట వందలాది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.75 కోట్లు వసూలు చేసి.. నకిలీ అపాయింట్మెంట్ లేఖలిచ్చి మోసగిస్తున్న సుధాకర్ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్మార్ట్ విలేజ్, రూర్బన్ పేరుతో ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఎవరికీ ఎటువంటి ప్రాజెక్టు ఇవ్వలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. సుధాకర్ మాత్రం దర్జా వెలగబోస్తున్నాడు. అపాయింట్మెంట్ లేఖలు తీసుకున్న వారెవరూ ఆందోళన చెందొద్దని, ఉద్యోగం విషయమై నెలాఖరులోగా స్పష్టత ఇస్తానని డబ్బులు కట్టిన నిరుద్యోగ యువతను జూమ్ సమావేశాల ద్వారా మభ్యపెడుతున్నాడు. ఐదు జిల్లాల్లో సాగుతున్న ఈ నకిలీ బాగోతాన్ని బయటపెట్టిన ‘సాక్షి’ విలేకరులతోపాటు అతడి గుట్టురట్టు చేస్తున్న వారిని చంపుతానంటూ సుధాకర్ బెదిరింపులకు దిగుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడించిన వీడియోలు విడుదల చేయగా.. దీనిపై సోమవారం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌కు ‘సాక్షి’ విలేకరులు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు నిగ్గు తేల్చాలని కోరారు. కూర్చుంటే జీతమిస్తానంటూ.. సుధాకర్ ప్రతి మండలంలో చిన్న గదిని అద్దెకు తీసుకుని, తనకు డబ్బులిచ్చిన నిరుద్యోగులను అందులో ఉంచుతున్నాడు. వారెవరికీ ఎలాంటి విధులు అప్పగించలేదు. ‘ఆఫీసుకు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోతే చాలు. కొన్నాళ్ల దాటాక బాధ్యతలు అప్పగిస్తాను. అప్పటివరకు మీకు జీతం ఇచ్చేస్తా’ అంటూ నమ్మబలుకుతున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం అవుతుండటంతో అతడికి డబ్బు చెల్లించిన వారు ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ చేసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. సాక్షి కథనాలపై సుధాకర్‌ను ఫోన్లో సంప్రదిస్తుంటే.. ‘కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండండి. నెలాఖరులోగా క్లారిటీ ఇస్తాను. మీరిచ్చిన డబ్బుకు ఢోకా లేదు’ అని చెప్పుకొస్తున్నాడని కొందరు నిరుద్యోగులు ‘సాక్షి’కి చెప్పారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బాధితులూ.. ఫిర్యాదు చేయండి నిరుద్యోగులెవరూ ఎవరికీ డబ్బులు కట్టి మోసపోవద్దని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి యువతకు హితవు పలికారు. సోమవారం కాశీబుగ్గలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగాల పేరిట మోసపోయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. పోస్టుకు రూ.5 లక్షలు గ్రామీణ ప్రాంతాలోని ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు స్మార్ట్ విలేజ్, రూర్బన్ మిషన్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో ఎగ్జిక్యూటివ్, క్లస్టర్ అసిస్టెంట్ ఉద్యోగాలిప్పిస్తానంటూ సుధాకర్ తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన సుమారు 1,500 మంది నిరుద్యోగుల నుంచి రూ.5 లక్షల చొప్పున రూ.75 కోట్లు వసూలు చేశాడు. వారందరికీ స్మార్ట్ విలేజ్, రూర్బన్ పేరిట నకిలీ అపాయింట్మెంట్లు ఇచ్చి మోసగించాడు. నిజానికి రాష్ట్రంలో ఎక్కడా స్మార్ట్ విలేజ్, రూర్బన్ మిషన్ పేరిట అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎటువంటి నియామకాలు చేపట్టలేదు. వాటికింద ఏ సంస్థకూ ఎలాంటి ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. కానీ.. ఆ పేరుతో సుధాకర్ అనే వ్యక్తి ఇంకా నకిలీ అపాయింట్మెంట్లు జారీ చేస్తూనే ఉన్నారు. -
నిరుద్యోగులకు బాసటగా నేడు షర్మిల ఉద్యోగ దీక్ష
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు బాసటగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు షర్మిల మంగళవారం వనపర్తి జిల్లా తాడిపత్రిలో ఉద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ అడ్‌హక్ కమిటీ సభ్యురాలు ఇందిరాశోభన్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకులు బాగుపడతాయనుకుంటే నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇక్కడి లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆపార్టీ నేతలు సత్యవతి, విజయ్‌రెడ్డి, గౌతమ్ప్రసాద్లతో కలసి ఆమె మాట్లాడారు. పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఉద్యోగం కోసం వనపర్తి జిల్లాకు చెందిన నిరుద్యోగి కొండల్ మంత్రి నిరంజన్‌రెడ్డి చుట్టూ పదే పదే తిరిగి విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మంత్రి మొసలికన్నీరు కారుస్తూ కొండల్ కు టుంబాన్ని పరామర్శించడాన్ని ఆక్షేపించారు. షర్మిల మంగళవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉద్యోగదీక్ష చేపట్టనుండటంతో మంత్రి కి కొండల్ కుటుంబం గుర్తుకువచ్చిందన్నారు. -
మళ్లీ ఆకలి కేకలు!
ఖైరతాబాద్ లోని ఒక స్టార్ హోటల్‌కు కస్టమర్ల ఆదరణ లేక నిర్వహణ భారంతో సదరు యాజమాన్యం కొంతమంది ఉద్యోగులు, సిబ్బందికి ఉద్వాసన పలికింది. దీంతో ఇతర పనులూ లేక వారి కుటుంబ పోషణ భారంగా తయారైంది. దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. వారు స్వస్థలాలకు వెళ్లలేక... ఇక్కడ ఉండలేక తిండి గింజలకు తల్లడిల్లున్నారు. ఇలా కరోనా కష్ట కాలంలో ఉపాధి కోల్పోయి ఆకలి కేకలు పెడుతున్న కుటుంబాలు నగరంలో అనేకం. సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు ఆకలి కేకలు పెడుతున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కరువై తిండి గింజలు లభించక... సుమారు 20 లక్షల వలస కార్మికులు మహానగరం దాటి సొంతూళ్లకు వెళ్లిపోయారు. లాక్డౌన్ అన్‌లాక్‌గా మారినా.. కరోనా ప్రభావంతో వర్క్ ఆర్డర్స్, బిజినెస్ లేక సాఫ్ట్వేర్ ఉద్యోగులు మొదలుకొని స్థానిక కార్మికుల వరకు ఆయా వృత్తుల నుంచి ఉద్వాసనలకు గురవుతున్నారు. ఉపాధి కోల్పోయి ఇక్కడ ఉండి వేరే పని చేయలేక... సొంతూళ్లకు వెళ్లలేక తల్లడిల్లుతున్నారు. నెలసరి రూ. ఆరు వేలు మొదలుకొని రూ. లక్ష వరకు వేతనాలున్న ఎందరో ఉపాధి కోల్పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. సాఫ్ట్వేర్.. ఇటీ రంగాలకు వర్క్ ఆర్డర్లు లేక ఆయా రంగాలు దివాలా దిశగా పయనిస్తున్నాయి. ఇక పరిశ్రమలకు వర్క్ ఆర్డర్, ముడి సరుకు కొరతతో పరిస్థితి అంతంత మాత్రంగా మారగా, భవన నిర్మాణ రంగం పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అనే చందంగా తయారయ్యాయి. పర్యాటక రంగం, హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్స్‌కు కనీస ఆదరణ లేక షట్‌డౌన్ దిశవైపు అడుగులేస్తున్నాయి. రవాణా రంగానికి డిమాండ్ లేకుండా పోయింది. ప్యాకేజింగ్, ఆహార శుద్ధి, ఫుట్ వేర్, రబ్బర్, ప్లాస్టిక్, ఆటో మొబైల్, వస్త్రాలు, బ్యాంగిల్స్ తదితరాల వ్యాపారాలూ ముందుకు సాగడం లేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. దీంతో అన్ని రంగాల లావాదేవీలు పడిపోయాయి. ఇక బయట కొనుగోళ్లంటేనే హడలిపోతున్నారు. దీంతో కనీసం అద్దె కూడా సర్దుబాటు కాని పరిస్థితులు దాపురించాయి. హోటల్స్ షట్‌డౌన్... హోటల్ ఇండస్ట్రీ షట్‌డౌన్ దిశగా పరుగులు తీస్తోంది. కరోనా ధాటికి హోటల్ రంగం కుదేలైంది. లాక్డౌన్ సడలింపులో హోటల్స్ పునఃప్రారంభమైనా.. కస్టమర్ల నుంచి కనీస ఆదరణ లేకుండా పోయింది. పెద్ద పెద్ద హోటల్స్‌లో గదులకు ఎలాంటి డిమాండ్ లేక పోగా, ఫుడ్ పాయింట్స్‌లో కనీసం టేక్ అవేకి కూడా గిరాకీ లేకుండా పోయింది. నిర్వహణ తడిసిమోపెడవడంతో ఇప్పటికే పలు హోటల్స్ సిబ్బందిని ఉద్వాసన పలికి మూసి వేయగా, మరి కొన్నికూడా ఆ దిశగా పయనిస్తున్నాయి. కనీసం భోజనం, టిఫిన్ సెంటర్లు కూడా నడవని పరిస్థితి నెలకొంది. దీంతో హోటల్స్ కార్మికులందరూ ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఇక స్టార్ హోటల్స్ తాత్కాలిక ఉద్యోగులు, సిబ్బందిని తొలగించి రెగ్యులర్ ఉద్యోగులను వేతనం లేని సెలవులను ఆగస్టు 30 వరకు పొడిగించాయి. తగ్గిన వర్క్ ఆర్డర్లు... ఐటీ కంపెనీలకు కూడా వర్క్ ఆర్డర్లు లేక ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. ఇప్పటికే సగానికి పైగా ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించిన కంపెనీలు క్రమంగా ఉద్యోగులను వదిలించుకునే పనిలో పడ్డాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ పని తీరుపై మెమోలు కూడా జారీ చేస్తుండగా, మరికొన్ని ఏకంగా వేతనాలు కూడా తగ్గించేస్తున్నాయి. ఇక మరికొన్ని కంపెనీలు అదనపు సిబ్బందికి ఉద్వాసన పలికే పనిలో పడ్డాయి. ప్రస్తుతం వర్క్ ఆర్డర్లు లేని కారణంగా వేతనం లేని దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడమా లేక.. స్వచ్ఛంద రాజీనామా చేయడమా అనే విషయాన్ని ఉద్యోగుల నిర్ణయానికే వదిలిపెడుతున్నాయి. దీంతో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దివాలా దిశగా ఆటోమొబైల్ రంగం కరోనా ఆటోమొబైల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. నగరంలో పలు ఆటో మొబైల్ పరిశ్రమలు తాత్కాలిక మూసివేత దిశకు చేరుకున్నాయి. ఇప్పటికే పలు పరిశ్రమలు ఉద్యోగులకు వేతనాలతో పాటు పనిదినాలనూ తగ్గించాయి. నగరంలోని ఒక ఆటో మొబైల్ పరిశ్రమ ఏకంగా లక్ష రూపాయల నుంచి 10 వేల వరకు వేతనాలు తీసుకునే వారికి ఒకే స్లాబ్ కింద నామమాత్రపు వేతనాలు ప్రకటించింది. కరోనా సంక్షోభం నుంచి బయటపడే వరకు ఈ వేతనాలపై పని చేయాలని ఆదేశించింది. ఇష్టం లేకపోతే ఉద్యోగం వదులుకోవచ్చని, అలాంటి వారికి తిరిగి అవకాశం ఉండదని నోటీసు జారీ చేసింది. దీంతో మొక్కుబడి వేతనాలపై ఉద్యోగం చేస్తుండటంతో కుటుంబాలు నడవడం కష్టంగా మారింది. -
ఉద్యోగం పేరుతో మోసం; కారులో ఎక్కించి..
సాక్షి, విశాఖపట్నం : ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి యువకుల నుంచి డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడిన ఘటన విశాఖలోని గాజువాకలో చోటుచేసుకుంది. వివరాలు.. గాజువాకకు చెందిన అగస్త్యన్ అనే వ్యక్తి నిరుద్యోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపాడు. అయితే ఎప్పటికీ ఉద్యోగం రాకపోవడం.. తమ డబ్బులు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు అగస్త్యన్‌ను నిలదీశారు. అంతేగాక అతనిని ఇన్నోవా కారులో ఎక్కించి తీసుకెళ్తుండంతో తనను కిడ్నాప్ చేశారని అగస్త్యన్ పోలీసులకు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విశాఖ డైరీ వద్ద కారును పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో నిరుద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు విచారణ చేపట్టారు. (బాధితుడితో పాటు కిడ్నాపర్లూ నేరస్తులే..) కాకినాడ సీఎస్ఐ స్కూళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్క యువకుడి నుంచి 10 లక్షలు చొప్పున అగస్త్యన్ వసూలు చేసినట్లు పోలీసుల ప్రథమిక విచారణలో తేలింది. మొత్తం 50 లక్షలు పైనే వసూలు చేసినట్లు వెల్లడైంది. ఎంత కాలానికి ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు అగస్త్యన్ నుంచి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు అన్నారు. కాకినాడ నుంచి విశాఖ వచ్చిన అగస్త్యన్‌కు కారులో వెంబడించి, తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఛీటింగ్ కేసులో అరెస్టు అయ్యి జైలుకి వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై గాజువాక పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. (కరోనా వల్ల మహిళలకే సమస్యలు:) -
ఆ 3 రంగాలే కీలకం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పారిశ్రామిక పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్, ఇతర ప్రభుత్వ పాలసీల మూలంగా గత ఐదేళ్లలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 11,569 కంపెనీలకు అనుమతులు ఇవ్వగా, ఇందులో 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. తద్వారా సుమారు 13 లక్షల మందికి ఉపాధి లభించిందని కేటీఆర్ వెల్లడించారు. ఆ మూడు రంగాలకు ప్రాధాన్యత రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని టెక్స్టైల్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ వెల్లడించారు. దేశంలోనే అతిపెద్దదైన వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో కొరియా దిగ్గజ కంపెనీ యంగ్వాన్ భారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నదన్నా రు. మరోవైపు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో కూడా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయని, ఇటీవల బెంగళూరులో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ప్రతినిధులతో నిర్వహించిన భేటీ తరహాలో వివిధ నగరాల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. వన్‌ప్లస్, స్కైవర్త్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ముందుకు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టు పనుల పూర్తి, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యత తదితరాల నేపథ్యంలో వ్యవసాయ దిగుబడులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రైతులకు భరోసా దక్కడంతో పాటు, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ అన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక వ్యూహం టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు ఆయా రంగాలకు చెందిన కంపెనీలతో ప్రత్యేకంగా చర్చిస్తామని కేటీఆర్ వెల్ల డించారు.ఈ మూడు రంగాల్లో పెట్టుబడులతో దేశం లోకి కొత్తగా వచ్చే అంతర్జాతీయ కంపెనీలు, తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధంగా ఉన్న దేశీయ కంపెనీలు లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేయా లని అధికారులకు సూచించారు. ఈ 3 రంగాల పరిశ్రమల కోసం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్, ఇండస్ట్రియల్ పార్కుల సమగ్ర సమాచారాన్ని పెట్టుబడులతో వచ్చే వారి కోసం సిద్ధం చేయాలన్నారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా పనిచేయడంతో పాటు, రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీలకు ‘టాస్క్’తరహా సంస్థలతో శిక్షణ ఇవ్వాలని కేటీఆర్ ఆదేశించారు. సమావేశంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతకు ఊరట..
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగాల కోత, ప్రబలుతున్న నిరుద్యోగం ఆర్థిక మందగమనంపై భయాలను పెంచుతుంటే తాజాగా వెలువడిన ప్రభుత్వ గణాంకాలు కొంత ఊరట ఇచ్చాయి. ఈ ఏడాది జనవరి -మార్చిలో పట్టణ నిరుద్యోగ రేటు 9.3 శాతానికి దిగివచ్చింది. అంతకుముందు ఏడాది ఏప్రిల్-జూన్‌లో నిరుద్యోగ రేటు 9.8 శాతంగా నమోదైంది. అయితే 2018లో జనవరి-మార్చి కాలంలో నిరుద్యోగ రేటు వివరాలు ఈ గణాంకాల్లో లేకపోవడం గమనార్హం. గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ జనవరి-మార్చి 2019 కాలానికి త్రైమాసిక బులెటిన్‌లో పట్టణ ఉపాధి, ప్రామాణికాలపై అంచనాలతో ఈ గణాంకాలు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లోని పురుషుల్లో నిరుద్యోగ రేటు 8.7 శాతం ఉండగా గత ఏడాది ఏప్రిల్-జూన్‌లో 9 శాతంగా నమోదైంది. ఇక మహిళల్లో నిరుద్యోగ రేటు 11.6 శాతం కాగా గత ఏడాది 12.8 శాతంగా నమోదవడం గమనార్హం. కాగా, 2017-18లో 45 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా దేశంలో నిరుద్యోగ రేటు 6.1 శాతంగా నమోదవడంతో మోదీ సర్కార్‌పై విపక్షాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. -
ఒక రోజు కష్టం.. మరో రోజు సులభం
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2018 ఆన్లైన్ పరీక్షలను అస్తవ్యస్తంగా నిర్వహిస్తూ ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసి, లక్షలు వెచ్చించి కోచింగ్‌లు తీసుకుని, రాత్రింబవళ్లు కష్టపడినవారి జీవితాలతో చెలగాటమాడేలా డీఎస్సీ పరీక్షల తీరు నడుస్తోంది. గతేడాది డిసెంబర్ 24 నుంచి నిర్వహిస్తున్న డీఎస్సీ–2018 పరీక్షలు ఆన్లైన్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఆన్లైన్ విధానం ఉండడం, అభ్యర్థులు ఎక్కువమంది దరఖాస్తు చేయడంతో పరీక్షలు ఎక్కువ రోజులు జరుగుతున్నాయి. రోజూ రెండు సెషన్లలో ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలు పెడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్షను రెండు రోజులు పెట్టగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పరీక్షలను ఏకంగా 8 రోజుల పాటు 16 సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఇలా ఒకే సబ్జెక్ట్ పరీక్ష ఒకటికి మించి ఎక్కువ రోజులు, ఎక్కువ సెషన్లలో జరిగినప్పుడు కొన్ని రోజుల్లో ప్రశ్నలు సులువుగా ఉంటున్నాయని, మరికొన్ని రోజుల్లో చాలా కష్టంగా ఉంటున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. ఇలా రావడం పట్ల వారిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెట్‌లోనూ ఇదే పరిస్థితి గతంలో టెట్‌ను రెండుసార్లు ఆన్లైన్లో నిర్వహించినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఒక రోజు పరీక్ష రాసిన వారికి గరిష్టంగా 90 శాతం మార్కులు వస్తే మరో రోజు పరీక్ష రాసిన వారికి 50 శాతం లోపు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రశ్నలు సులభంగా ఉన్నరోజు పరీక్ష రాసిన వారికి లాభం చేకూరగా తక్కిన రోజుల్లో రాసిన వారు నష్టపోయారు. అప్పట్లో అభ్యర్థులు దీనిపై మొరపెట్టుకున్నా పాఠశాల విద్యా శాఖ అధికారులు పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తింది. డీఎస్సీలో అర మార్కు తేడాతో పోస్టులు కోల్పోయే ప్రమాదముందని, ఇలాంటి సమయంలో సెషన్‌కు, సెషన్‌కు మధ్య ఒక్కసారిగా 15 నుంచి 20 మార్కులు తేడా ఉండడం వల్ల తమకు తీరని నష్టం వాటిల్లుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పాఠశాల విద్యా శాఖకు తెలియచేసినా ఫలితం లేదని వాపోతున్నారు. నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించాలి.. ఈ నెల 18 నుంచి ఎస్జీటీ పోస్టులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. 18, 19వ తేదీల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాలు చాలా సులభంగా ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. తర్వాత రోజుల్లో రాసినవారికి చాలా కఠినంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఆన్లైన్లో నిర్వహిస్తుండటం, రోజూ రెండు సెషన్లలో ఎక్కువ రోజుల పాటు ఒకే సబ్జెక్టు పరీక్షలు జరుగుతుండడంతో ప్రశ్నలను వేర్వేరుగా రూపొందించి వాటిని పరీక్ష రోజు ఆయా సెషన్ల వారీగా అభ్యర్థులకు కేటాయించిన కంప్యూటర్లలో అప్లోడ్ చేయిస్తారు. ప్రశ్నల రూపకల్పన, వాటిని కంప్యూటర్ల ద్వారా అప్లోడ్ చేయించడంలో తాము నార్మలైజేషన్ పద్ధతిని పాటిస్తున్నామని అధికారులు చెబుతున్నా పరీక్షల్లోని ప్రశ్నపత్రాలు చూస్తే అలా ఉండడం లేదని నిపుణులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. మూల్యాంకనంలోనైనా జేఈఈ తదితర పరీక్షల్లో చేసినట్లు నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫిబ్రవరిలోపు నియామకాలు పూర్తయ్యేనా? డీఎస్సీ షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 10న స్కూల్ అసిస్టెంట్ పరీక్షల ఫలితాలు ప్రకటించి 13న మెరిట్ జాబితా, 17న ఎంపిక జాబితాను కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ పరీక్షల ఫైనల్ ‘కీ’లను విడుదల చేసినా వాటిపై స్పష్టత లేదు. ఫైనల్ ‘కీ’లు విడుదల చేసినప్పుడు వాటిలో ఏ ప్రశ్నల సమాధానాల్లో మార్పులు జరిగాయి? వేటిని తొలగించారు? రెండు సరైన సమాధానాలున్న ప్రశ్నలు ఏవి అన్నవి స్పష్టంగా వెబ్సైట్లో పెట్టాలి. ఆ తర్వాతే ఏ ప్రశ్నలకు మార్కులు కలపాలి? ఏ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల్లో తప్పులుంటే తొలగించాలి? అన్నది తేలి తుది ఫలితాలను, మెరిట్ జాబితాను విడుదల చేయడానికి వీలవుతుంది. ఇలా ఇప్పటివరకు స్పష్టత లేదు. అసలు ఏ ప్రశ్నలకు ఏ సమాధానం సరైందో, ఏది తప్పో తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి చివరిలోగా నియామక ప్రక్రియ ముగిసేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షలు ముగిసి షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వెల్లడవుతాయని ఎదురుచూస్తున్నవారికి పాఠశాల విద్యా శాఖ తీరని నిరాశను మిగులుస్తోంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే ఫైనల్ ‘కీ’ విడుదల టీచర్ పోస్టుల భర్తీని ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పూర్తిచేస్తామని ప్రభుత్వం కూడా కోర్టుకు తెలిపింది. డీఎస్సీ ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది. పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదలకే చాలా రోజులు తీసుకుంటున్నారు. మొదటి దశలో స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్), పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాళ్లు, పీఈడీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్, భాషా పండితుల పోస్టుల పరీక్షలు ముగిశాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే ప్రాథమిక, తుది ‘కీ’లు విడుదలయ్యాయి. పీజీటీ, టీజీటీ పోస్టులకు ప్రాథమిక ‘కీ’ ఇచ్చినా ఫైనల్ ‘కీ’లు విడుదల కాలేదు. మిగతా వాటికి ప్రాథమిక ‘కీ’నే విడుదల చేయలేదు. -
ఏ పరీక్ష రాయాలి దేవుడా?
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కోసం నిరుద్యోగులు ఏళ్లతరబడి చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటారు. కోచింగ్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొడుతూ పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ఉద్యోగం వచ్చేవరకూ ఒకదానివెంట మరొకటి పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతుంటారు. అటువంటి సమయంలో రెండుమూడు ఉద్యోగ నియామక పరీక్షలు ఒకే రోజు జరిగితే వారి ఆందోళన వర్ణణాతీతం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలకు పూనుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. మూడింటిలో ఏదో ఒకటి సాధించకపోమా అన్న ఆశతో ఉన్న అభ్యర్థుల ఆశలను ఆడియాసలు చేస్తూ అభ్యర్థులకు హాల్‌టికెట్లు అందాయి. ఒకే రోజు(జనవరి 6న) మూడు పరీక్షలు ఉన్నట్టు తేలడంతో ఏ పరీక్ష రాయాలిరా దేవుడా...అంటూ తలలు పట్టుకుంటున్నారు. మూడు పరీక్షలు ఒకే రోజే.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ నియామకాలకు వచ్చే ఏడాది జనవరి 6న దేశ వ్యాప్తంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పరీక్షలు నిర్వహిస్తోంది. ఒకటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్, మరొకటి డీఎస్సీ పీఈటీ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్ష. ఇలా ఒకే రోజు మూడు నియామక పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తున్న రోజు రాష్ట్ర ప్రభుత్వాలు మరే పరీక్షను నిర్వహించకూడదు. కానీ టీడీపీ ప్రభుత్వం అదేరోజు ఏకంగా రెండు పరీక్షలు నిర్వహిస్తోంది. ఎన్నికల హడావిడే కారణం.. ఎన్నికలు సమీపిస్తుండటం, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై రోజు రోజుకీ వ్యతిరేకత పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద తక్కువ పోస్టులతో కూడిన నోటిఫికేషన్లను ఒకటి అరా ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఎదో విధంగా నియామక పరీక్షలు జనవరి నెలలో నిర్వహించి మమ అనిపించేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక లేకుండా ఎడాపెడా తేదీలను ప్రకటించి అభ్యర్థులను సందిగ్ధంలోకి నెడుతోంది. అసలే నియామకాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలా ఒకే రోజు అన్ని పరీక్షలు నిర్వహించడం ఏమిటని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒకే రోజు ఏపీ, తెలంగాణలో పరీక్షలు.. జనవరి 6న నాకు హైదరాబాద్‌లో ఆర్పీఎఫ్ ఎగ్జామ్, అదే రోజు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఉన్నాయి. ఒకే రోజు ఏపీ, తెలంగాణలో ఎలా పరీక్ష రాయాలో అర్థం కావటం లేదు. ప్రభుత్వం కనీస అవగాహన లేకుండా పరీక్ష తేదీలను ప్రకటించడం తప్పు. రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ పరీక్షను వాయిదా వేయాలి. – చిప్పల వెంకటేశ్వరరావు, అభ్యర్థి, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా రెండు వారాలు వాయిదా వేయాలి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కానిస్టేబుల్ పరీక్షను రెండు వారాల పాట వాయిదా వేయాలి, అదే విధంగా జనవరి 6న డీఎస్సీ పీఈటీ దేహదారుఢ్య పరీక్షకు ఒక్క రోజు మినహాయింపు ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్నికల కోణంలో కాకుండా నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. – సమయం హేమంత్ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు -
రోజుకో మాట..పూటకో నిర్ణయం
సాక్షి, గుంటూరు: 2014 ఎన్నికల ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నిలువునా ముంచారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకుంటూ గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారు. ఇదిగో అదిగో అంటూ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలం వెళ్లదీసిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ కంటితుడుపు చర్యగా అరొకర పోస్టులు ప్రకటించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇటీవల విడుదల చేసిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం 1,051 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడేళ్లుగా 7 లక్షల మంది ఎదురుచూపులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులన్నింటినీ ప్రభుత్వం భర్తీ చేస్తుందనే ఆశతో సుమారు 7 లక్షల మంది నిరుద్యోగులు గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కోసం ఒక్కో విద్యార్థి లక్షలు ఖర్చుపెట్టుకుని పట్టణాలకు వెళ్లి కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం కేవలం 1051 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. తాజా నోటిఫికేషన్లో వైఎస్సార్ జిల్లాలో ఒక్క పోస్టు కూడా లేకపోవడం దారుణమని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెలలో ఇచ్చిన జీవోలో 104 ఖాళీలు చూపించి ఇప్పుడు ఒక్కటీ లేదనడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాల్లో పోస్టులను భారీగా కుదించారు. కొన్ని రిజర్వేషన్ కేటగిరిల్లోనూ ఒక్క పోస్టు కూడా లేకపోవడం గమనార్హం. పూటకో మాట ఇలా... - 2017 అక్టోబర్ 9న దీపావళి సందర్భంగా 5,800 పంచాయతీ కార్యదర్శి పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. - 2018 ఫిబ్రవరి 11న 4వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదానికి ప్రతిపాదన - 2018 మార్చి 27న అవుట్సోర్సింగ్ విధానంలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి జీఓ నంబర్–38 జారీ - ఆ జీవోపై నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో మే 2న జీఓ నెంబర్ 39 ద్వారా 1,511 పంచాయతీ కార్యదర్శి పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్టు వెల్లడి. - అదే ఏడాది డిసెంబర్ 21న 1051 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. (ఇందులో 1000 మాత్రమే కొత్తవి కాగా, 51 బ్యాక్లాగ్ పోస్టులు) ఇలా 2017 నుంచి పూటకో మాట చెబుతూ 2017లో 5,800 వేల ఖాళీలు చూపించిన ప్రభుత్వం, ఇప్పుడు 1051కి తగ్గించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. రెండేళ్లుగా కష్టపడి చదువుతున్నా.. పంచాయతీ కార్యదర్శి పోస్టుల నోటిఫికేషన్ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా. తీరా చూస్తే మా జిల్లాకు ఒక్క పోస్టూ లేదు. ప్రతిపక్ష నేత ఈ జిల్లాకు చెందిన వాడనే ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచిస్తూ మా జీవితాలతో ఆడుకుంటోంది. ఇది దారుణం. – పి.జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్ జిల్లా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2017లో 5,800 ఖాళీలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వమే ఇప్పుడు 1;000 పోస్టులే చూపడం దారుణం. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు బుద్ధి చెబుతారు. – బి.ఎస్.కె. అరుణ్‌కుమార్,నిరుద్యోగ ఐక్యవేదిక కో–కన్వీనర్, గుంటూరు 5,800 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రూ.లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్‌లు తీసుకుని ఎదురు చూస్తున్నారు. మంత్రి గతంలో ప్రకటించినట్టుగా 5,800 పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. – కె.వెంకట సుబ్రమణ్యం,నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ -
నిండా ముంచిన డీఎస్సీ రోస్టర్
సాక్షి, అమరావతి : టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ–2018లో పోస్టుల కేటాయింపు రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను పూర్తిగా దెబ్బతీసింది. నోటిఫికేషన్ అనంతరం జిల్లాల వారీగా టీచర్ పోస్టుల రోస్టర్ పాయింట్ల జాబితా వారిని ఒక్కసారిగా నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేసింది. టీచర్ పోస్టుల కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు భర్తీ చేయబోయే పోస్టులు, రోస్టర్ వారీగా కేటాయింపులు చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను పూర్తిగా దగా చేసిందని మండిపడుతున్నారు. ఖాళీ పోస్టులు వేలాదిగా ఉన్నా అరకొర మాత్రమే భర్తీకి నిర్ణయించి తమను తీవ్రంగా నష్ట పరిచిందంటున్నారు. 23 వేల నుంచి 30 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అటు విద్యా శాఖ, ఇటు సర్వశిక్ష అభియాన్ నివేదికలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం కేవలం 7,729 పోస్టులు మాత్రమే భర్తీ చేసేలా డీఎస్సీని కుదించింది. సీఎం జిల్లా చిత్తూరులో ఎస్జీటీ పోస్టులు రెండే ప్రభుత్వం గత నెల 26వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో పాఠశాల విద్యా శాఖలో 4,341 (4,334 ప్లస్ స్పెషల్ పోస్టులు 7), మున్సిపల్లో 1,100, గిరిజన గురుకులాల్లో 500, ఆశ్రమ స్కూళ్లలో 300, మోడల్ స్కూళ్లలో 909, రెసిడెన్షియల్ స్కూళ్లలో 175, బీసీ గురుకులాల్లో 404 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జిల్లాల వారీ రోస్టర్ పాయింట్లతో జాబితాను గత నెలాఖరున ప్రకటించింది. పలు సబ్జెక్టుల పోస్టులు కొన్ని జిల్లాలకు అసలు కేటాయించకపోగా, మరికొన్నిటికి నామమాత్రంగానే ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సొంత జిల్లా చిత్తూరులో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని స్కూళ్లకు ప్రభుత్వం ఇచ్చిన ఎస్జీటీ పోస్టులు కేవలం రెండు మాత్రమే. ఆ రెండింటిలో ఒకటి అంధ, బధిర దివ్యాంగ కోటాకు సంబంధించినది. అలాగే వేలాది మంది శిక్షణ తీసుకుని ఎదురు చూస్తున్న గుంటూరులో 19, నెల్లూరులో 16, కడపలో 36, కృష్ణాలో 43, విజయనగరంలో 58 మాత్రమే ఇచ్చారు. అన్ని జిల్లాల్లోనూ ఎస్జీటీ పోస్టులకు దాదాపు 5 లక్షల మంది పోటీపడుతున్నారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం దాదాపు 20 వేల మందికి పైగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కొన్ని నెలలుగా డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంటున్న జిల్లాల్లోని వేలాది మంది అభ్యర్థులు ఈ రోస్టర్ జాబితాను చూసి ఒక్కసారిగా షాక్‌తిన్నారు. మున్సిపల్ సహా ఇతర విభాగాల స్కూళ్లలోని పోస్టుల్లో కూడా ఇదే పరిస్థితి. ఈసారి ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులతో పాటు బీఈడీ వారు కూడా అర్హులేనని పేర్కొనడంతో ఒక్కో జిల్లాలో ఈ పోస్టుల కోసం లక్షలాదిగా పోటీ పడుతున్నారు. స్కూల్ అసిస్టెంటు, భాషా పండితులు, పీఈటీ, మ్యూజిక్ పోస్టులకూ పోటీపడుతున్న వారు వేలాదిగా ఉండగా పోస్టులు మాత్రం అరకొరే. అవి రోస్టర్ జాబితాలో ప్రత్యేక కేటగిరీల్లో ఉండడం, ఆయా కేటగిరీలకు చెందిన వారు అందుబాటులో లేని తరుణంలో అవన్నీ మిగిలిపోతాయే తప్ప తమకు ప్రయోజనం ఉండదని ఇతర కేటగిరీల వారు వాపోతున్నారు. మున్సిపల్, వివిధ సంక్షేమ శాఖలు, మోడల్ స్కూళ్ల పోస్టుల రోస్టర్ పాయింట్ల జాబితా కూడా నిరాశకు గురి చేసింది. మంత్రి గంటా ప్రకటనలతో మోసపోయిన అభ్యర్థులు డీఎస్సీని 2014లో ప్రకటించారు. ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు పలుమార్లు ప్రకటించారు. గత రెండేళ్లలో అయితే ఏకంగా షెడ్యూళ్లు కూడా ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒకసారి 22 వేల పోస్టులని, మరోసారి 14,300 అని, మరోసారి 10,351 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ప్రకటన చేసిన ప్రతిసారీ అభ్యర్థులు ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్లకు పరుగులు తీశారు. ఒకొక్కరు కోచింగ్ ఫీజు, అక్కడ హాస్టల్, ఇతర ఖర్చుల కోసం మొత్తంగా లక్షల్లో వెచ్చించాల్సి వచ్చింది. ఇలా రెండేళ్లుగా లక్షలాది మంది అవనిగడ్డ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందారు. ప్రభుత్వ టీచర్ పోస్టు వస్తే భవిష్యత్తు సాఫీగా సాగుతుందన్న ఆశతో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటున్న పలువురు వాటిని వదులుకుని అప్పులు చేసి ఆయా కోచింగ్ సెంటర్లలో చేరారు. రెండేళ్లుగా వీరంతా ఒకొక్కరు కనీసం రూ.50 వేలకు తక్కువ కాకుండా చెల్లించిన సొమ్ము రూ.కోట్లలోనే బడా కోచింగ్ సెంటర్లకు చేరింది. వీరికి మేలు జరిగేందుకే మంత్రి పలుమార్లు ప్రకటనలు చేశారని, దీనివెనుక పెద్ద ఎత్తున ముడుపుల బాగోతం ఉందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు చేయడం వృథా అనిపిస్తోంది నేను 2008లో హిందీ పండిట్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పటి వరకు అవకాశం రాలేదు. 2014లో కూడా పోస్టులు చాలా స్వల్పం. ఈసారి జెడ్పీ, ఎంపీపీల్లో పోస్టులు లేనేలేవు. మున్సిపాల్టీలో ఒకే ఒక్క పోస్టు వేశారు. ఒక్క పోస్టుకు 5 వేలకుపైగా అభ్యర్థులు పోటీ పడాల్సిన పరిస్థితి. దరఖాస్తు చేయడం కూడా వృధా అనిపిస్తోంది. – మహలక్ష్మి, విజయనగరం పోస్టే లేదు.. ఏం చేయాలి? ఎనిమిదేళ్లుగా స్కూల్ అసిస్టెంటు పోస్టు (బీఈడీ సోషల్) కోసం ఎదురు చూస్తున్నాను. ఒకసారి డీఎస్సీ వేసినా మా పోస్టులు వేయలేదు. ఈ డీఎస్సీలోనైనా అవకాశం వస్తుందనుకుంటే మా కేటగిరీలో ఒక్క పోస్టూ ఇవ్వలేదు. మూడు సార్లు టెట్ రాశాను. ఏం లాభం? – శాంతి శ్రీ, శ్రీకాకుళం ఒకే ఒక్క పోస్టు.. ఏం చేసేది? నేను 2014 డీఎస్సీలో 0.1 మార్కు తేడాతో స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పోస్టు అవకాశం కోల్పోయాను. డీఎస్సీ అని ప్రకటిస్తుండటంతో రెండేళ్లుగా అదే పనిగా కోచింగ్ తీసుకున్నాను. ఈసారి మాకు ఒకే ఒక్క పోస్టు ఇచ్చారు. అభ్యర్థులు వేలల్లో ఉన్నారు. ఖాళీ పోస్టులున్నా చూపించడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. – శిరీష, రాజాం ఫీజు కట్టినా దరఖాస్తుకు అవకాశం లేదు మూడేళ్లుగా టీచర్ పోస్టు కోసం ఎదురు చూస్తున్నా డీఎస్సీని ప్రకటించలేదు. బీటెక్ పూర్తిచేసి ఆపై బీఈడీ చేశా. ఇప్పుడు ఎస్ఏ మేథ్స్ పోస్టుకు దరఖాస్తుకు ఆన్లైన్లో ఫీజు కడితే స్వీకరించారు. తీరా ఆన్లైన్ దరఖాస్తు చేస్తే బీఏ, బీఎస్సీ ఆప్షన్లు మాత్రమే చూపిస్తున్నారు తప్ప బీటెక్ వారికి అవకాశం ఇవ్వడం లేదు. ఫీజు కట్టించుకొని దరఖాస్తుకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం. నాలుగేళ్లు బీఈడీ చేసి, టెట్లు రాసి లక్షలు ఖర్చు చేస్తే దరఖాస్తుకు అవకాశం లేకుండా చేశారు. – యమున, తిరుపతి, – రవీంద్ర, కడప మెగా డీఎస్సీ ప్రకటించాలి టెట్‌లో నాకు 143 మార్కులు వచ్చాయి. 23 వేల పోస్టులు ఖాళీలున్నాయని, కనీసం 12 వేలు భర్తీచేస్తారని పోస్టు గ్యారంటీ అనుకున్నాను. ఇప్పుడు ఎస్జీటీ పోస్టులు కుదించారు. బీఈడీ చేసిన వారికి కూడా అవకాశం ఇవ్వడంతో పోటీ ఎక్కువైంది. బీఈడీ వారికి అవకాశం ఇచ్చినందున మెగా డీఎస్సీ వేస్తే మాకు న్యాయం జరుగుతుంది. – తాళాడ సుకన్య, విజయనగరం -
కొలువులు ఇస్తారా? కడతేరి పొమ్మంటారా?
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: సర్కారు తీరుపై జిల్లాలోని నిరుద్యోగ వ్యాయామోపా«ధ్యాయులు ‘అంతెత్తున’ నిరసన వ్యక్తం చేశారు. తమను చిన్నచూపు చూస్తోందని, పోస్టుల భర్తీ ప్రకటనలో వివక్ష ప్రదర్శిస్తోందని వాపోతూ సోమవారం కాకినాడ కుళాయిచెరువు ఆవరణలోని ఓవర్‌హెడ్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యలు చేసుకుంటామని ఆక్రోశించారు. దాదాపు 100 మంది కుళాయి చెరువు ఆవరణలోకి రాగా 10 మంది ట్యాంకుపై భాగానికి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో కాకినాడలో ఉత్కంఠపూరితమైన పరిస్థితి నెలకొంది. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక అధికారులు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో అధికారులు చర్చలు జరిపారు. గతంలో ప్రకటిస్తానన్న 1056 పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలొస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నామని, ప్రభుత్వం జిల్లాకు ఒక పీఈటీ పోస్టు మాత్రమే ఉందంటూ ప్రకటించడం దారుణమని వాపోయారు. వారి ఆందోళనతో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉత్కంఠ నెలకొంది. డీఈఓకు మొర పెట్టుకుని.. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మంది నిరుద్యోగ వ్యాయామోపాధ్యాయులు తొలుత కాకినాడలో డీఈవో అబ్రహాంను కలసి సమస్యలను వివరించారు. అనంతరం కుళాయి చెరువు ఆవరణకు చేరుకుని 10 మంది ట్యాంకు పైభాగానికి చేరి ప్రభుత్వం న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మరో 90 మంది ట్యాంకు కింది భాగంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ముందు ప్రకటించినట్టు 1056 వ్యాయామోపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాలని, దీనిపై సమగ్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1056 వ్యాయామోపా«ధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివారావు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గతంలో ప్రకటించగా ప్రస్తుతం డీఎస్సీ ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో కేవలం 47 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామనడంపై మండిపడ్డారు. జిల్లాలో 2500 మంది వరకు పీఈటీలు శిక్షణ పొంది ఉన్నారన్నారు. పూర్తిస్థాయిలో ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఇప్పటికే జిల్లాలోని కలెక్టర్, ఆర్జేడీ, డీఈఓ తదితర అధికారులకు విన్నవించినా స్పందన లేకపోవడంతో గత్యంతరం లేక ఆత్మహత్యలకు సిద్ధమయ్యామన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని పీఈటీలుగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ప్రభుత్వం మోసం చేసిందని నిరసించారు. 1056 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చేవరకు ట్యాంకు నుంచి కిందికి రామని భీష్మించారు. సీఎం, మంత్రులు ప్రకటన చేయాలని డిమాండ్ అర్బన్ తహసీల్దార్ వరాలయ్య, టూటౌన్, ఒన్‌టౌన్, సర్పవరం సీఐలు ఎండీ ఉమర్, ఎ.సన్యాసిరావు, డీఎస్ చైతన్యకృష్ణ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ట్యాంకుపై ఎక్కిన వారు కిందికి రావాలని, కలెక్టర్, డీఈవోలతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పినా ఆందోళనకారులు దిగిరాలేదు. 1056 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు, మంత్రులు గంటా, యనమల తక్షణం ప్రకటన చేయాలని, పూర్తి స్థాయిలో జిల్లాలోని వ్యాయామోపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ట్యాంకు నుంచి దూకి చనిపోతామని హెచ్చరించారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది. ఎట్టకేలకు సాయంత్రం 4 గంటల సమయంలో అధికారులు డీఈఓతో ఫోన్లో ఆందోళనకారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నచ్చచెప్పడంతో ట్యాంకుపైకి ఎక్కిన నిరుద్యోగ వ్యాయామోపాధ్యాయులు కిందికి దిగి వచ్చారు. వారిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఉంగరాల రాము, ఎన్.కళ్యాణి, ఎస్వీవీ లక్ష్మి, కె.రమణ, అమీర్ సుహైల్, ఎ.శివ తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు. -
సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి..
జనగామ : రాష్ట్రంలో నిరుద్యోగ యువతీయువకులకు మంచి రోజులు వస్తాయని నమ్మబలికి.. గెలిచి గద్దెనెక్కిన తర్వాత మొడిచేయి చూపిన సీఎం కేసీఆర్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కె.అమృతాసాగర్ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట గురువారం ‘నిరుద్యోగ ధర్నా’ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నుంచి 500 మందితో ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకుని గేట్లు మూసి వేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అమృతాసాగర్ మాట్లాడుతూ లక్ష ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన కేసీఆర్.. నాలుగేళ్లలో 12 వేలు మాత్రమే భర్తీ చేశారని ఆరోపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున 2016లో గ్రూప్–2, గురుకుల నోటిఫికేషన్లను వేసినట్టే వేసి.. అభ్యర్థులను న్యాయస్థానాల చుట్టూ తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. మొక్కుబడి నోటిఫికేషన్లతో కాలయాపన తప్ప నిరుద్యోగులకు చేసింది శూన్యమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మొసలి కన్నీరు కార్చిన కేసీఆర్.. స్వరాష్ట్రంలో అంతకు రెట్టింపు వివక్ష చూపిస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి హయాంలో తెలంగాణ సుఖశాంతులతో ఉంటే, ఇప్పుడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో ముందున్న వారికి ఈ ప్రభుత్వంలో తీరని అన్యా యం జరుగుతోందన్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిరాశలో నిరుద్యోగులు : కళ్యాణ్ నిరుద్యోగులు నిరాశలో మునిగి పోయారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్యాణ్‌రాజ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ వివిధ కేటగిరీల్లో న్యాయపరమైన చిక్కులను తొలగించి, పోటీ పరీక్షలు రాసిన అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై 25న జిల్లా వ్యాప్తంగా అన్ని మం డల కేంద్రాల్లో ఉద్యోగ ధర్నా నిర్వహించామని చెప్పారు. అంతకుముందు పలు వురు కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎస్సై పరమేశ్వర్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. అంతకు ముందు సాక్షర భారత్ కోఆర్డినేటర్లు, గ్రామ పంచాయతీ కార్మికుల దీక్షలకు అమృతాసాగర్ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కేసరి సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరబోయిన సమ్మయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మానెగల్ల మంజుల, జిల్లా ప్రధాన కార్యదర్శి భిక్షపతి, జిల్లా సంయుక్త కార్యదర్శి కంతి చిరంజీవి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామిండ్ల ఐలయ్య, జిల్లా యూత్ అధ్యక్షుడు బక్క జంపన్న, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు చిన్నపాగ వెంకటరత్నం, కల్లెపు ప్రవీణ్ కుమార్, నోముల జయపాల్‌రెడ్డి, జనగామ మండల మహిళా అధ్యక్షురాలు వసంత, యూత్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండలానికి చెందిన యువకులు పార్టీలో చేరారు. అమృతాసాగర్ కండువా కప్పి స్వాగతం పలికారు. -
మలేషియా ఉద్యోగం మొదటికే మోసం
మందస: ఉద్యోగాల పేరిట మోసాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులను లక్ష్యం చేసుకుని, దళారులు రూ. కోట్లలో మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్దానం యువతకు విదేశీ, స్వదేశీ ఉద్యోగాల పేరిట గాలం వేస్తున్నారు. ఈ వలలో వందలాది మంది నిరుద్యోగులు చిక్కుంటున్నారు. ఆదాయం మాత్రం ఎలా ఉన్నా.. పీకల్లోతు అప్పులు పాలవుతున్నారు. కుటుంబాలకు, కుటుంబాలే నాశనమవుతున్నాయి. ఇటీవల వజ్రపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట, నందిగాం, కంచిలి, కవిటి తదితర మండలాల్లోని ఉద్దానం ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులను, యువకులను విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బ్రోకర్లు నిలువునా ముంచేశారు. ప్రస్తుతం బాధితులు మలేషియాలో ఏం చేయాలో పాలుపోక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం కేంద్రంగా సింగపూర్, మలేషియాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ సంస్థ ప్రచారం చేసింది. పలాస మండలంలో ఓ సబ్ బ్రోకర్‌తో మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కో నిరుద్యోగి నుంచి రూ. 60 వేలు నుంచి రూ. లక్ష వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 30 నుంచి 50 మంది వరకు ఉద్దానానికి చెందిన యువకులు ఈ వలలో చిక్కుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మందస మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఓ ఉద్యోగాల బ్రోకర్ ఈ ప్రాంతంలోని సుమారు 25 నుంచి 30 మందికి ఉద్యోగాల వల వేశాడు. విశాఖలోని ఉద్యోగాల సంస్థ, పలాస, మందస మండలాల్లోని బ్రోకర్లు అతి తెలివిగా, చక్కగా పన్నిన వ్యూహంలో చిక్కుకున్న యువకులు మలేషియాకు చేరుకున్నారు. వీరిలో డి.ఖగేశ్వరరావు, ఎన్.పాపారావు, టి.గణేశ్, నర్తు దానయ్య, కె.మోహనరావు, పి.బాలరాజు, జుత్తు చిరంజీవి, ఎన్.సోమేశ్వరరావు, బి.కృష్ణారావుతో పాటు 25 మంది ఉన్నారు. వీరంతా వజ్రపుకొత్తూరు, పలాస, మందస మండలాల్లోని కిడిసింగి, కాశీబుగ్గు, పలాస, నారాయణపురం, మొగిలిపాడు, కేసుపురం, చిన్నకేసుపురం తదితర ప్రాంతాలకు చెందినవారిగా తెలిసింది. ఉద్యోగాల బ్రోకర్లు వీరికి టూరిజం వీసా అందజేసి, ఉద్యోగాలకు మలేషియా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని బాధితులు గమనించలేదు. రెండు, మూడు నెలల పాటు చిన్న, చిన్న కంపెనీల్లో చిరు ఉద్యోగాలు చేసిన వీరి వీసా గడువు ముగిసిపోయింది. వాస్తవానికి మలేషియా టూరిజం వీసా మూడు నెలలు ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగానికి వెళ్లిన వీరంతా వీసా గడువు పూర్తి కావడంతో ఉద్యోగాలు పోయాయి. చేతిలో డబ్బులు కూడా చెల్లిపోయాయి. దీంతో మలేషియాలో బాధలు అనుభవిస్తున్న వారంతా కుటుంబసభ్యులకు తెలిపారు. ఉద్యోగానికి వెళ్లి, పైసా ఆదాయం లేకపోగా, తమ పిల్లలు నానా కష్టాలు పడుతున్నారని తెలియడంతో వారి కుటుంబాలు మందస పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. మలేషియా నుంచి తీసుకురావడానికి డబ్బు డిమాండ్ ఉద్యోగం పేరిట మలేషియా వెళ్లిన నిరుద్యోగులు తాము పడుతున్న కష్టాలు ఫోన్ల ద్వారా తెలియజేయడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. బ్రోకర్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, వారు దొరకడంలేదు. దొరికినా, మలేషియా నుంచి తిరిగి తీసుకురావడానికి రూ. 30 వేలు నుంచి రూ. 50 వేలు వరకు మళ్లీ డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చేతిలో చిల్లిగవ్వలేకుండా తమ పిల్లలు పడుతున్న కష్టాలు విని కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. అయోమయంలో బాధితులు ఓ బ్రోకరిది పలాస మండలం. మరో బ్రోకరిది మందస మండలం. వీరి ప్రధాన కార్యాలయం విశాఖపట్నం. బాధితులు సుమారు ఐదు మండలాలకు చెందిన వారు. దీంతో ఎవరిపై.. ఎలా.. ఏ స్టేషన్లో ఫిర్యాదు చేయాలో తెలియక బాధిత కుటుంబాలు మందస పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. పలాస పోలీసుల పరిధిలోకి కేసు వస్తుందని.. మందస మండలం పరిధిలోకి వస్తుందని చెబుతుండడంతో వాళ్లు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి, తమకు న్యాయం చేయాలని బాధితుల కుటుంబాలు కోరుతున్నాయి. -
టీఆర్ఎస్పై జేఏసీ ఉత్తరాల పోరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ముఖ్యమైన నియామకాలను పూర్తిచేయాలని తెలంగాణ జేఏసీ ఒత్తిడిని పెంచుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఆశతో ఉద్యమించామని, ఆకాంక్షల మేరకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగులతో లేఖలను రాయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చిరునామాకు పోస్టు చేయిస్తోంది. పోస్టు కార్డులో రాయాల్సిన అంశాలను కూడా రూపొందించింది. సీఎం కేసీఆర్‌కు నిరుద్యోగులు రాస్తున్న లేఖ ఇలా ఉంది.. గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్రాయునది.. నిరుద్యోగ సమస్య ప్రధానాంశంగా తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని వందలాది మంది యువతీ, యువకులు బలిదానాలు చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తరువాత పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. నిరుద్యోగ యువత పూర్తి నిర్లక్ష్యానికి గురవుతున్నారు. పట్టభద్రులైన నిరుద్యోగ రేటు విషయంలో దేశంలో అస్సాం, జమ్మూకశ్మీర్ తరువాత మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. సమస్య తీవ్రతను గుర్తించి పరిష్కారానికి దిగువ చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. - ప్రభుత్వంలో, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్న ఖాళీలు తక్షణం ప్రకటించాలి. - ఖాళీలను కుదించే ప్రయత్నాన్ని విడనాడాలి. - ఉద్యోగాల భర్తీకోసం క్యాలెండరు విడుదల చేయాలి. - స్థానిక పరిశ్రమలలో ఉద్యోగాలను స్థానికులకే రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. - నిరుద్యోగ భృతి కల్పించాలి. - సత్వరమే పై విషయాలపై కార్యాచరణ ప్రకటించాలని కోరుతున్నా - ఇది నా స్వదస్తూరితో రాసిన లేఖ. -
రూ.550 కోట్లతో ప్రీ ఆర్మీ ట్రైనింగ్
పాత శ్రీకాకుళం: నిరుద్యోగ యువతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం తండ్యాం వలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో యువజన సర్వీసు శాఖ ద్వారా జిల్లాలోని 300 మంది నిరుద్యోగ యువతకు ప్రీ ఆర్మీ ట్రైనింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో 300 మంది నిరుద్యోగ యువతకు నెల రోజులపాటు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉన్నత విద్య చదువుకున్న యువత కూడా రూ.5 వేల కనీస వేతనం కోసం నానా పాట్లు పడుతున్నారని మంత్రి తెలిపారు. రూ.5 కోట్లతో యువజన సర్వీసుల శిక్షణ కేంద్రం ప్రీ ఆర్మీ శిక్షణ కోసం ప్రభుత్వం రూ.550 కోట్లు కేటాయించిందని చెప్పారు. మొదటి విడతగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 4 వేల మందికి రక్షణ, పోలీసు రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణకు హాజరయ్యే ఒక్కో అభ్యర్థికి ప్రభుత్వం రూ.10,500 ఖర్చు చేస్తుందని చెప్పారు. జిల్లాలో రూ.5 కోట్లతో యువజన సర్వీసుల శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం పోలీసు శిక్షణ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. జిల్లా ఎస్పీ జె.బ్రహ్మరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, డీఎస్పీ భార్గవరావునాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి, పోలీసు అధికారులు, ఐతమ్, వెంకటేశ్వర, సిస్టమ్ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘అగ్లీ పోటీలో అన్యాయం’
హరారే: జింబాబ్వే రాజధాని హరారేలో పీజెంట్ అనే పబ్ అందవికారంగా ఉండే వాళ్లకూ పోటీలు నిర్వహించి ‘మిస్టర్ అగ్లీ’ టైటిల్‌తోపాటు 500 డాలర్లు (రూ.33వేలు) నగదు బహుమతి ఇస్తోంది. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు నిరుద్యోగులు, తాగుబోతులు పోటీపడుతుంటారు. ఎప్పటిలాగే ఈసారీ పోటీల్లో చూసేందుకు అందవికారంగా, చిరిగిపోయిన దుస్తులు వేసుకుని నోట్లో పళ్లు లేని 42 ఏళ్ల మైసన్ సెరె అనే నిరుద్యోగి 200 మందితో పోటీ పడి ‘మిస్టర్ అగ్లీ-2015’ కిరీటాన్ని దక్కించుకున్నాడు. ‘నిరుడు నాలుగో స్థానంలో నిలిచా.. ఈసారి టైటిల్ గెలుచుకున్నందుకు ఆనందంగా ఉంది’ అని మైసన్ చెప్పాడు. వరుసగా మూడేళ్లు టైటిల్ గెలుచుకున్న విలియమ్స్ అనే వ్యక్తి.. ఈ సారి రెండో స్థానంలో నిలిచి 100 డాలర్లు (రూ.6600) గెలుచుకున్నాడు. న్యాయనిర్ణేతల వివక్ష వల్లే ఈసారి కిరీటం మిస్సైందని ఆవేదన వ్యక్తం చేశాడు.