సాక్షి, గుంటూరు: 2014 ఎన్నికల ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నిలువునా ముంచారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకుంటూ గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారు. ఇదిగో అదిగో అంటూ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలం వెళ్లదీసిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ కంటితుడుపు చర్యగా అరొకర పోస్టులు ప్రకటించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇటీవల విడుదల చేసిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం 1,051 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
మూడేళ్లుగా 7 లక్షల మంది ఎదురుచూపులు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులన్నింటినీ ప్రభుత్వం భర్తీ చేస్తుందనే ఆశతో సుమారు 7 లక్షల మంది నిరుద్యోగులు గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కోసం ఒక్కో విద్యార్థి లక్షలు ఖర్చుపెట్టుకుని పట్టణాలకు వెళ్లి కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం కేవలం 1051 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. తాజా నోటిఫికేషన్‌లో వైఎస్సార్ జిల్లాలో ఒక్క పోస్టు కూడా లేకపోవడం దారుణమని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెలలో ఇచ్చిన జీవోలో 104 ఖాళీలు చూపించి ఇప్పుడు ఒక్కటీ లేదనడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాల్లో పోస్టులను భారీగా కుదించారు. కొన్ని రిజర్వేషన్ కేటగిరిల్లోనూ ఒక్క పోస్టు కూడా లేకపోవడం గమనార్హం.
పూటకో మాట ఇలా...
- 2017 అక్టోబర్ 9న దీపావళి సందర్భంగా 5,800 పంచాయతీ కార్యదర్శి పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు.
- 2018 ఫిబ్రవరి 11న 4వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదానికి ప్రతిపాదన
- 2018 మార్చి 27న అవుట్‌సోర్సింగ్ విధానంలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి జీఓ నంబర్–38 జారీ
- ఆ జీవోపై నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో మే 2న జీఓ నెంబర్ 39 ద్వారా 1,511 పంచాయతీ కార్యదర్శి పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్టు వెల్లడి.
- అదే ఏడాది డిసెంబర్ 21న 1051 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. (ఇందులో 1000 మాత్రమే కొత్తవి కాగా, 51 బ్యాక్‌లాగ్ పోస్టులు)
ఇలా 2017 నుంచి పూటకో మాట చెబుతూ 2017లో 5,800 వేల ఖాళీలు చూపించిన ప్రభుత్వం, ఇప్పుడు 1051కి తగ్గించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
రెండేళ్లుగా కష్టపడి చదువుతున్నా..
పంచాయతీ కార్యదర్శి పోస్టుల నోటిఫికేషన్ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా. తీరా చూస్తే మా జిల్లాకు ఒక్క పోస్టూ లేదు. ప్రతిపక్ష నేత ఈ జిల్లాకు చెందిన వాడనే ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచిస్తూ మా జీవితాలతో ఆడుకుంటోంది. ఇది దారుణం.
– పి.జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్ జిల్లా
ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2017లో 5,800 ఖాళీలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వమే ఇప్పుడు 1;000 పోస్టులే చూపడం దారుణం. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు బుద్ధి చెబుతారు.
– బి.ఎస్.కె. అరుణ్‌కుమార్,నిరుద్యోగ ఐక్యవేదిక కో–కన్వీనర్, గుంటూరు
5,800 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి..
ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రూ.లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్‌లు తీసుకుని ఎదురు చూస్తున్నారు. మంత్రి గతంలో ప్రకటించినట్టుగా 5,800 పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం.
– కె.వెంకట సుబ్రమణ్యం,నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment